సుదీర్ఘ ఉద్యమం

Jan 27,2024 07:20 #Editorial

                 అమరావతిని ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా కొనసాగించాల్సిందేనంటూ సుదీర్ఘ కాలంపాటు ఉద్యమం నిర్వహిస్తున్నవారందరూ అభినందనీయులు. గురువారం ‘అమరావతి రైతుల సమర శంఖారావం’ పేరుతో సభ జరపడంతోపాటు రాజధాని గ్రామాల్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. తుళ్లూరులో రైతులు, చిన్నారులు 1500 రోజులను సూచించే ప్లకార్డులు పట్టుకొని జై అమరావతి అంటూ నినదించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. రాజధాని అమరావతి గ్రామాల ప్రజలు యావత్‌ కుటుంబ సభ్యులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం స్ఫూర్తిదాయకం. ఏకైక నినాదంతో నాలుగు సంవత్సరాలకు పైబడి సాగుతున్న ఉద్యమం అందులోనూ తీవ్ర నిర్బంధాలకు గురి చేసినా పోలీసులు అవమానించినా వాటన్నిటినీ అధిగమిస్తూ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం శ్లాఘనీయం. వందల కిలోమీటర్ల పొడవునా సాగిన యాత్రల్లో పాలుపంచుకోవడం అభినందనీయం. మహిళలలో ఓర్పుతో పాటు పట్టుదల మెండుగా ఉంటుందని ఇటీవల వీరోచితంగా సాగిన చారిత్రాత్మక అంగన్‌వాడీల పోరాటం రుజువు చేసింది. ప్రజల సమస్యలపై సకాలంలో స్పందించి వాటి పరిష్కారానికి తగు చర్యలు చేపట్టని ఈనాటి పాలకులను దారికి తేవడానికి సుదీర్ఘ ఉద్యమాలు, పోరాటలు అవసరమవుతున్నాయి. ఢిల్లీ రైతు ఉద్యమం దేశానికిచ్చిన సందేశమిదే! అదే పోరాట శక్తులకు ఆదర్శం.

అవశేష ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధానిగా ఉండాలన్న రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ నిర్ణయంలో భాగస్వామిగా ఉండిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారానికి వచ్చాక మాట మార్చి మూడు రాజధానుల పల్లవి లంకించుకోవడం పెద్ద విషాదం. పాలనా రాజధాని పేరిట విశాఖను అభివృద్ధి చేస్తామంటూ భారీ ప్రకటనలు చేసింది కానీ వాస్తవంగా జరిగిందేమీ లేదన్నది నిష్టుర సత్యం. క్యాంపు కార్యాలయాల పేరిట హడావుడి తప్ప ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రజలకు పాలన చేరువయ్యిందేమీ లేదు. ప్రచారార్భాటమే తప్ప ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పెండింగ్‌ ప్రాజెక్టులేవీ పూర్తి కాలేదు సరికదా వాటికి ఖర్చు కూడా లేదు. మాటల్లోనే గిరిజనాభివృద్ధి కావడంతో నేటికీ డోలీ మోతలు త్పడంలేదు. అయితే రాజధాని, క్యాంపు కార్యాలయాల పేరుతో అక్కడి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మాత్రం భారీగా లాభాలు పొందారు. అవసరానికి మించి భారీ భూ సమీకరణ చేపట్టిన టిడిపి సర్కారు గ్రాఫిక్స్‌లో రాజధాని చూపింది కానీ ఆచరణాత్మక నిర్మాణాలు తగు రీతిలో జరగలేదు. నాటి నుండి నేటి వరకూ రాజధాని విషయంలో సిపిఐ(ఎం) ఒక్కటే సూత్రబద్ధమైన వైఖరి చేపట్టడం గమనార్హం. వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల పేరిట గందరగోళం సృష్టించడంతో అమరావతి అభివృద్ధి ఆగిపోయింది. భూములిచ్చిన రైతులకు అప్పగించాల్సిన అభివృద్ధి చేసిన ప్లాట్లు, ఉపాధి కోల్పోయిన పేదలకు చట్ట ప్రకారం చెల్లించాల్సిన పింఛన్లు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఉవ్వెత్తున ప్రారంభమైన ప్రజా ఉద్యమం దశలవారీగా సాగింది. ఇందుకు వారు న్యాయపోరాటాన్నీ నిర్వహించారు. రైతులు సర్వోన్నత న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించాల్సి వచ్చింది. ఎన్నో ఆటంకాలను అధిగమిస్తూ ముందడుగు వేస్తూనే ఉన్నారు.

ఢిల్లీని తలదన్నే రాజధాని ఆంధ్ర ప్రదేశ్‌కు నిర్మిస్తామని 2014 ఎన్నికల్లో చెప్పిన నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో అమరావతి శంకుస్థాపనకు హాజరై పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు చల్లిపోయారు తప్ప కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. పైపెచ్చు ఎ.పి కి రాజధాని ఏదో తమకు తెలియదని, నిర్ణయించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టులో అఫిడవిట్‌ వేయడం మరింత దారుణం. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం అమరావతిలో చేపట్టవలసిన కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణం కూడా జరగకపోవడం బిజెపి మోసకారితనానికి నిదర్శనం. కనుక రాజధాని అమరావతికి ఈ దుస్థితి కల్పించినవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే! పోరాటం వల్లనే అమరావతి ఉద్యమం నిలిచింది. ఆ ఉద్యమం రాజకీయ పోరాటంగా రూపొందితేనే సత్ఫలితాలొస్తాయి. మోసగించినవారిని, గందరగోళం సృష్టించినవారిని, భ్రమలు కల్పించినవారిని ప్రజలు గుర్తించాలి. కీలెరిగి వాత పెట్టడమే మార్గం.

➡️