అలుపెరుగని పోరాట యోధుడు

Dec 26,2023 07:17 #Editorial
  • ఎన్‌ ఎం సుందరం ఆరవ వర్థంతి నేడు

లిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఎఐఐఇఎ) అగ్ర నాయకులు, ఐదు దశాబ్దాల పైగా ఇన్సూరెన్స్‌ ఉద్యోగుల పోరాటాలలో, దేశ కార్మికోద్యమంలో ప్రత్యేక స్థానాన్ని సముపార్జించుకున్న ఎఐఐఇఎ మాజీ ప్రధాన కార్యదర్శి ఎన్‌.ఎమ్‌. సుందరం ఆరవ వర్థంతి నేడు. ఎఐఐఇఎ దిగ్గజం ఎన్‌.ఎమ్‌. సుందరం 1938 జనవరి8న జన్మించారు. 1957లో ఎల్‌ఐసి లో ప్రొబేషనరీ అసిస్టెంట్‌గా చేరారు. ఆయన తండ్రి టి.ఆర్‌. నారాయణన్‌ డెపలప్‌మెంట్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌ఎఫ్‌ఐఎఫ్‌డబ్ల్యుఐ) ప్రముఖ నాయకులు. సుందరం 1961లో సౌత్‌ జోన్‌ (ఎస్‌జెడ్‌ఐఇఎఫ్‌) కు జాయింట్‌ సెక్రటరీగా, 1963లో అతిచిన్న వయసులోనే ప్రధాన కార్యదర్శిగా, 1972లో ఎఐఐఇఎ జాయింట్‌ సెక్రటరీగా, 1988 నుండి 2003 వరకు ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2007 వరకు ఎఐఐఇఎ అధ్యక్షులుగా వివిధ బాధ్యతలలో అయిదు దశాబ్దాలకు పైగా ఆయన యూనియన్‌ ప్రస్థానం కొనసాగింది.

సరోజ్‌ చౌధురి, చంద్రశేఖర్‌ బోస్‌, సునీల్‌ మైత్రా వంటి హేమాహేమీల మార్గదర్శకత్వంలో సుందరం తీర్చిదిద్ద బడ్డారు. ఆయన వాక్‌చాతుర్యం, వాదనాపటిమ, రచనా సామర్థ్యం, నిర్మాణ దక్షత, తాత్వికత, విశ్లేషణా నైపుణ్యం, మానవతావాద దృక్పథం ఆయనను సమున్నత శిఖరాలు చేరుకోడానికి దోహదం చేశాయి. ఇన్సూరెన్స్‌ ఉద్యోగుల ఉద్యమం కేవలం జీతభత్యాల పెంపుదల కోసమే పరిమితం కాకుండా సంస్థ పురోగతి కోసం, జాతీయ బీమా రంగ పరిరక్షణ కోసం, సామాజిక లక్ష్యాల సాధన కోసం, విశాల ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ ఐక్యత కోసం పోరాట పంథాను నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకువెళ్ళటంలో ఆయన పాత్ర అమోఘం.

బీమారంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, మల్హోత్రా సిఫార్సులను వ్యతిరేకిస్తూ ప్రజానీకం నుంచి 1.54 కోట్ల సంతకాలను సేకరించి పార్లమెంట్‌కు సమర్పించటంలో చురుకైన పాత్ర పోషించారు. ఆయన ఉద్యమ నిర్మాణ దక్షతకు ఇదొక నిదర్శనం.ఈ ఉద్యమం ద్వారా ప్రజాచైతన్యంతో ప్రైవేటీకరణ విధానాలను నిలువరించవచ్చని ప్రపంచానికి చాటిచెప్పారు. వేతన సాధన కమిటీకి కన్వీనర్‌గా బేసిక్‌ పే, డిఎ ఫార్ములా, ప్రమోషన్స్‌ రూల్స్‌లో ప్రముఖ రూపశిల్పిగా, మేనేజ్‌మెంట్‌ పేయింగ్‌ కెపాసిటిని బట్టి ఉద్యోగస్తుల యొక్క ఆర్థిక ఆకాంక్షలను సాకారం చేయడంలో, రిక్రూట్‌మెంట్‌, సిజిఐటి, ఎన్‌ఐటి వంటి అంశాలలో ఎల్‌ఐసిని ప్రభుత్వరంగ సంస్థగా కాపాడటంలో, దానిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో సుందరం అద్వితీయమైన పాత్ర పోషించారు. ఆయన నేతృత్వంలో జరిగిన ప్రచార, పోరాట, ఆందోళనా ఉద్యమాలే ఈరోజు ఇండిస్టీలో మనం అనుభవిస్తున్న వివిధ సదుపాయాలు, సౌకర్యాలకు ప్రాతిపదిక.

ఎన్‌ఎం సుందరం నాయకత్వంలో, ఫైనాన్షియల్‌ సెక్టార్‌లో కీలకమైన బ్యాంకింగ్‌, బీమా రంగాల ఉద్యోగులను జాయింట్‌ యాక్షన్‌ కమిటీ జెఎసిగా ఏర్పాటుచేసి పెన్షన్‌ సాధనకోసం సాగించిన పోరాటం, బీమా ఉద్యోగులకు పెన్షన్‌ సాధించటం లో ఆయన కృషి ఎనలేనిది.. కా|| ఎన్‌ ఎం సుందరం భారత కార్మికోద్యమంలో చేస్తున్న అవిశ్రాంత కృషిని, ఆయన అపారమైన మేథోసంపత్తిని గుర్తించిన ప్రపంచ కార్మిక వర్గం ఆయనను అనేక అంతర్జాతీయ సదస్సులకు ఆహ్వానించింది. బల్గేరియా, క్యూబా వంటి దేశాలలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సదస్సులలో సుందరం పాల్గొని ఎఐఐఇఎవాణిని గట్టిగా వినిపించారు. ‘వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌’ (డబ్ల్యుఎఫ్‌టియు) లో ఎఐఐఇఎ కు ప్రత్యేక గుర్తింపుతేవడంలో సుందరం ప్రత్యేక పాత్ర వహించారు. ‘ఏషియన్‌ సోషల్‌ ఫోరమ్‌’, ‘వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం’ వంటి వేదికలమీద ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలతో కూడిన ప్రసంగాలతో యావత్‌ ప్రపంచ కార్మికవర్గాన్ని ఆకట్టుకున్న విజ్ఞాన గని సుందరం.

గ్లోబలైజేషన్‌, కమ్యూనలైజేషన్‌ విధానాల విపత్తును దూరదృష్టితో అంచనావేసి ఈ విధానాలను ప్రతిఘటించేందుకు మేథావులు, అభ్యుదయవాదులు, ప్రగతికాముకులతో ‘పీపుల్‌ ఫర్‌ ఇండియా’ వంటి విశాల వేదికలను రూపొందించాలనే ఆలోచనకు ఆద్యులు ఆయనే. లక్షలాదిమంది ఇన్సూరెన్స్‌ ఉద్యోగుల పత్రిక ‘ఇన్సూరెన్స్‌ వర్కర్‌’కు సుధీర్ఘకాలంపాటు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ‘లెటజ్‌ ప్లే పాలిటిక్స్‌’ శీర్షికతో సమకాలీన జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, ఆర్థిక అంశాలపై వందకుపైగా విశ్లేషణాత్మక వ్యాసాలను రాశారు.

వివిధ యూనివర్శిటీలు, కాలేజీలు, ట్రేడ్‌ యూనియన్లు, జాతీయ, అంతర్జాతీయ వేదికలు నిర్వహించిన వందలాది సెమినార్లలో సుందరం పాల్గొన్నారు. కళలు, సంస్కృతి, క్రీడా రంగాలతో పాటు ఆర్థికశాస్త్రంలో ప్రావీణ్యత కలిగిన సుందరం రాసిన పుస్తకాలు బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. “Fragility of Global Finance Capital”, “Politics of Anti-development”, “Global Finance Capital on Rampage”, “Imperialism – Yesterday and Today”, “In Defence of Public Sector LIC and GIC” వంటివి వాటిలో ప్రముఖమైనవి.చురుకైన కార్యకర్తల్ని గుర్తించి, వారిని ప్రోత్సహించి అనేకమందిని నాయకత్వ బాధ్యతలు చేపట్టేలా తీర్చిదిద్దారు. బ్యాంకింగ్‌, మెడికల్‌, టెలికమ్‌, సెంట్రల్‌ గవర్నమెంట్‌, సంఘటిత, అసంఘటిత రంగాల కార్మిక వర్గాన్ని ఐక్యం చేయటానికి, ఫైనాన్షియల్‌ సెక్టార్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటి, నేషనల్‌ ఫ్లాట్‌ఫామ్‌ ఆఫ్‌ మాస్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎన్‌పిఎంఓ) జాతీయ కార్మిక సంఘాలతో కలిసి దేశవ్యాప్త ఐక్య ఉద్యమాల నిర్మాణానికి, విశాల ట్రేడ్‌ యూనియన్‌ ఐక్యతకు, జాతీయ సమ్మెలు విజయవంతం చేయడానికి విశేషమైనటువంటి కృషిచేసిన విశిష్ట వ్యక్తిత్వం సుందరం సొంతం. ఆయన ఆశయాలకు పునరంకితం కావడమే ఆ మహనీయునికి అర్పించే నిజమైన నివాళి.

వ్యాస రచయిత ఎస్‌సిజెడ్‌ఐఇఎఫ్‌ (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఎల్‌ఐసి ఉద్యోగ సంఘం) జాయింట్‌ సెక్రటరీ. 9440905501జి. కిషోర్‌ కుమార్‌
వ్యాస రచయిత ఎస్‌సిజెడ్‌ఐఇఎఫ్‌ (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఎల్‌ఐసి ఉద్యోగ సంఘం) జాయింట్‌ సెక్రటరీ. 9440905501జి. కిషోర్‌ కుమార్‌
➡️