కనీవినీ ఎరుగని అసమానతల ప్రపంచం !

Jan 24,2024 07:13 #Editorial

గుత్తాధిపత్యం పెరుగుతున్నదని, అది అసమానతలకు దారి తీస్తున్నదని ఐఎంఎఫ్‌ వంటి సంస్థలు అంగీకరించినా నివారణకు ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు. ప్రపంచంలో నిజ వేతనాలు తగ్గుతున్నట్లు, దీంతో అసమానతలు పెరుగుతున్నట్లు ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) పేర్కొన్నది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెరగని కారణంగా గడచిన రెండు సంవత్సరాల్లో 79.1 కోట్ల మంది కార్మికులు 1.5 లక్షల కోట్ల డాలర్లు నష్టపోయినట్లు పేర్కొన్నది. ఉమ్మడి రాష్ట్రంలో సవరించటం తప్ప తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడివడిన పది సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కనీస వేతనాలను సవరించకపోవటం లేదా ముసాయిదా పేరుతో అడ్డుకోవటం తెలిసిందే. ప్రపంచమంతటా ఇదే వైఖరి.

              ‘ఇక్కడ తిరుగులేని ఆర్థిక వాస్తవం ఉంది. దాన్ని మనం తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిందే. ఇంత ఆదాయ, సంపద అసమానతను, సంపదల కేంద్రీకణను చరిత్ర చూడలేదు’ అమెరికా డెమొక్రటిక్‌ సోషలిస్టు బెర్నీ శాండర్స్‌ ఆక్స్‌ఫామ్‌ 2024 అసమానతల నివేదికకు రాసిన ముందు మాటలో చెప్పిన మాటలివి. దావోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక 54వ వార్షిక సమావేశాల సందర్భంగా దీన్ని విడుదల చేశారు. దీనిలో పేర్కొన్న వివరాలు కొందరికి నమ్మశక్యం కానంతగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అమెరికా సమాజంలో దిగువన ఉన్న సగం మంది కంటే ముగ్గురు ఎక్కువ సంపదలను కలిగి ఉన్నారు. అరవై శాతం మంది కార్మికులు చాలీచాలని వేతనాలతో జీవిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కార్మికుల ఉత్పాదకత భారీ ఎత్తున పెరిగినప్పటికీ యాభై సంవత్సరాల నాటి కంటే అమెరికా కార్మికుల సగటు వేతనాలు నేడు తక్కువగా ఉన్నాయని శాండర్స్‌ పేర్కొన్నాడు. ఆక్స్‌ఫామ్‌ చెప్పినట్లు ఇది ఒక్క అమెరికా సమస్య మాత్రమే కాదు అన్నాడు. 2020 తరువాత ఐదు వందల కోట్ల మంది జనం పేదలుగా మారితే ఐదుగురు కుబేరుల సంపద రెండు రెట్లు పెరిగింది. ఇది ప్రపంచానికి చెడువార్త అన్నాడు.

ఈ ప్రపంచం కొద్ది మందికి భూతల స్వర్గం అయితే అత్యధికులకు భూతాల నిలయం. 2020 నాటికి ఉన్న సంపదతో పోలిస్తే బిలియనీర్లు మూడు సంవత్సరాల్లో 34 శాతం లేదా 3.3 లక్షల కోట్ల డాలర్ల మేర పెంచుకున్నారు. ద్రవ్యోల్బణం వీరికి మూడు రెట్ల సంపదను పెంచింది. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే ఆ మేరకు సామాన్యుల జేబుల నుంచి మాయమైంది. సంపద అంతా జనాభాలో కేవలం 21 శాతం మంది ఉండే ధనిక దేశాల్లోనే కేంద్రీకృతమైంది. ప్రయివేటు సంపదల్లో 69 శాతం, ప్రపంచ బిలియనీర్లలో 74 శాతం మంది ఇక్కడే ఉన్నారు. ద్రవ్య సంబంధ ఆస్తులలో ప్రపంచంలోని ఒకశాతం మంది వద్ద 43 శాతం, ఐరోపాలో 47, ఆసియాలో 50 శాతం ఉన్నాయి. గుత్తాధిపత్యం పెరుగుతున్నదని, అది అసమానతలకు దారి తీస్తున్నదని ఐఎంఎఫ్‌ వంటి సంస్థలు అంగీకరించినా నివారణకు ఎలాంటి చర్యలూ తీసుకో వటం లేదు.ప్రపంచంలో నిజవేతనాలు తగ్గుతున్న ట్లు, దీంతో అసమానతలు పెరుగుతున్నట్లు ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) పేర్కొన్నది. ద్రవ్యోల్బణానికి అనుగుణం గా వేతనాలు పెరగని కారణంగా గడచిన రెండు సంవత్స రాల్లో 79.1 కోట్ల మంది కార్మికులు 1.5 లక్షల కోట్ల డాలర్లు నష్టపోయినట్లు పేర్కొన్నది. ఉమ్మడి రాష్ట్రంలో సవరించటం తప్ప తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడివడిన పది సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కనీస వేత నాలను సవరించకపోవటం లేదా ముసాయిదా పేరుతో అడ్డుకోవటం తెలిసిందే. ప్రపంచమంతటా ఇదే వైఖరి.

విద్య, వైద్యం వంటి సేవలను వస్తువులుగా మార్చి వాటిని ప్రభుత్వం రంగం నుంచి తప్పించి ప్రయివేటు కార్పొరేట్‌లు స్వంతం చేసుకొని లాభాలు దండుకోవటం కూడా అసమానతలకు దారితీస్తున్నది. కాలుష్యాల నిరోధక చర్యలు తీసుకోకుండా గతంలో లబ్ధి పొందిన కార్పొరేట్లే ఇప్పుడు వాటి నివారణ పేరుతో ప్రభుత్వాల నుంచి పెద్ద ఎత్తున రాయితీలు, సబ్సిడీలు పొందుతున్నాయి. పేద, మధ్య తరగతి దేశాలు రుణ భారంతో సతమతం కావటంతో పాటు తీవ్ర అసమానతలు పెరుగుతున్నాయి. ప్రపంచ మొత్తం పేదల్లో 57 శాతం (240 కోట్ల) మంది పేద దేశాల్లో ఉన్నారు. జీవన పరిస్థితి దిగజారటంతో ప్రపంచమంతటా సమ్మెలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. అమెజాన్‌ కంపెనీలో పని చేస్తున్నవారు 30దేశాల్లో 2022లో ఆందోళనలు చేశారు. జీవన వ్యయాల పెరుగుదలకు నిరసనగా 2023లో 122 దేశాల్లో ఆందోళనలు జరిగాయి. కరోనా తరువాత కోట్లాది మంది పౌరుల పరిస్థితి పూర్వపు స్థితికి చేరుకోలేదు. 2017-2020తో పోలిస్తే ప్రపంచ అతి పెద్ద కార్పొరేట్‌ సంస్థలు 2021-2022లో 89 శాతం లాభాలను పెంచుకున్నాయి. 2023 తొలి ఆరు నెలల వివరాలను పరిశీలిస్తే గత రికార్డు లాభాల చరిత్రను బద్దలుకొడుతున్నట్లు కనిపిస్తున్నది. చమురు, విలాసవస్తువులు, విత్త సంబంధ కంపెనీలకు లాభాలు విపరీతంగా పెరిగాయి. ప్రపంచంలోని 0.001 శాతం కార్పొరేట్లు అన్ని కార్పొరేట్ల లాభాల్లో మూడోవంతు పొందాయంటే సంపదల కేంద్రీకరణ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అమెరికా కంపెనీల్లో 89 శాతం వాటాలు తెల్లవారి చేతుల్లో ఉండగా ఆఫ్రికన్లకు 1.1, హిస్పానిక్‌లకు 0.5 శాతం ఉన్నాయి. పదకొండుశాతం మంది ప్రపంచ బిలియనీర్లు అధికారంలో లేదా రాజకీయ నేతలుగా ఉన్నారు.గడచిన నాలుగు దశాబ్దాలకాలంలో 30 ఐరోపా దేశాలలో మూడు వేల విధానపరమైన ప్రతిపాదనలను పరిశీలించగా ధనికులు మద్దతు ఇచ్చిన వాటినే అమలు జరిపారు తప్ప పేదల వాటిని పట్టించుకోలేదు.

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) జరిపిన పరిశోధనలో కార్పొరేట్‌ శక్తుల గుత్తాధిపత్యం పెరగటం వలన అమెరికాలోని వస్తు ఉత్పాదక రంగంలో 76 శాతం మంది కార్మికుల ఆదాయాలు తగ్గాయని తేలింది. ఈ సంస్థలు, కార్మికుల వేతనాలనే కాదు మార్కెట్లను అదుపు చేస్తాయి. అవసరమైన వస్తువులు, సేవలను అందుబాటులో లేకుండా చేస్తాయి. నవకల్పనలు, కొత్త సంస్థలను ఎదగనివ్వకుండా చూస్తాయి. తమ లాభాల కోసం ప్రభుత్వ సేవలను ప్రైవేటీకరించేట్లు చూస్తాయి. తమ లాభాలకు ముప్పురాకుండా ధరలను కూడా పెంచుతాయి. వీటికి ప్రభుత్వాలు ఎల్లవేళలా మద్దతు ఇస్తాయి. అందుకే కొన్ని కార్పొరేట్లు దేశాల జిడిపి కంటే ఎక్కువ సంపదలను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు యాపిల్‌ కంపెనీ విలువ మూడు లక్షల కోట్ల డాలర్లనుకుంటే 2023లో మన దేశ జిడిపి 3.7 లక్షల కోట్లని అంచనా. ప్రపంచంలోని ఇలాంటి ఐదు పెద్ద కంపెనీల సంపదలు మొత్తం ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల మొత్తం జిడిపి కంటే ఎక్కువ. మొత్తం బహుళజాతి కంపెనీల లాభాల్లో 1975లో పెద్ద కంపెనీల వాటా నాలుగుశాతం కాగా 2019 నాటికి పద్దెనిమిది శాతానికి పెరిగింది.

ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నది ద్రవ్య పెట్టుబడి అన్న సంగతి తెలిసిందే. 2009 నుంచి ఈ రంగంలో ఉన్న కొన్ని కంపెనీలు ప్రస్తుతం 5.8 లక్షల కోట్ల డాలర్ల ప్రైవేటు పెట్టుబడిదారుల ఆస్తులను నిర్వహిస్తున్నాయి. ఇవిగాక బ్లాక్‌ రాక్‌, స్టేట్‌స్ట్రీట్‌, వాన్‌గార్డ్‌ అనే ఫండ్స్‌ సంస్థలు 20లక్షల కోట్ల డాలర్ల మేర ద్రవ్య ఆస్తులను నిర్వహిస్తున్నాయి. ఇంత పెద్ద సంస్థలు ప్రభుత్వ విధానాలను, దేశాధినేతలను శాసించటంలో ఆశ్చర్యం ఏముంది. గుత్త సంస్థలు ప్రపంచానికి కొత్త కాదు. ఇంగ్లీష్‌ ఈస్టిండియా కంపెనీ ప్రారంభమైన 1,600 సంవత్సరం నుంచి ఎన్ని దేశాలను ఆక్రమించుకొని దోచుకున్నదీ ఎరిగిందే. వర్తమానంలో రాక్‌ఫెల్లర్‌ కంపెనీ ప్రపంచ చమురు సామ్రాజ్యం, సిసిల్‌ రోడెస్‌ ప్రపంచ వజ్రాల మార్కెట్‌ను శాసిస్తున్న సంగతీ తెలిసిందే. ఒక దశను దాటిన తరువాత ప్రజాస్వామిక రాజ్యం కంటే ప్రైవేట్‌ అధికారం పెరిగితే స్వేచ్ఛకు హామీ ఉండదని అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డి రూజ్‌వెల్ట్‌ చెప్పాడు. గుత్త సంస్థలను అడ్డుకున్నందుకే అవి కుట్రచేసి మిలిటరీ తిరుగుబాటుద్వారా చిలీ కమ్యూనిస్టు నేత సాల్వెడార్‌ అలెండీని అధికారం నుంచి కూల్చివేసిన సంగతి తెలిసిందే. పదహారు వందల బడాకంపెనీల మీద ఒక సర్వే నిర్వహించగా కేవలం 0.4 శాతం మాత్రమే కార్మికులకు జీవన వ్యయ వేతనం ఇస్తున్నట్లు అంగీకరించాయి. కార్మిక సంఘాలను ఏర్పాటు కానివ్వకుండా అడ్డుకోవటం, అణచివేతల కారణంగా యూనియన్లలో చేరుతున్నవారి సంఖ్య తగ్గుతోంది. ఓయిసిడి దేశాలలో 1985లో 30 శాతం మంది చేరగా 2017 నాటికి 17 శాతానికి పడిపోయింది.

మహిళలకు జరుగుతున్న అన్యాయం, వేతనాల చెల్లింపు కూడా దారుణంగా ఉంది. మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో ఒక పురుషుడు ఎలాంటి చెల్లింపులు లేని సంరక్షణ పనిలో వారానికి ఒకటి నుంచి ఐదు గంటల వరకు ఉంటుండగా అదే మహిళలు 17 నుంచి 34 గంటలు పని చేస్తున్నారు. ప్రపంచమంతటా వీరి పని విలువను నగదు రూపంలో లెక్కిస్తే ఏటా 10.8 లక్షల కోట్ల డాలర్లుగా తేలింది. అధిక వేతనాలు ఉన్నాయని అనుకుంటున్న ప్రపంచ టెక్నాలజీ కంపెనీల్లో చెల్లిస్తున్నదాని కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. ఐరోపా సూపర్‌ మార్కెట్లకు సరఫరా చేసే పండ్లు, ద్రాక్ష క్షేత్రాల్లో పని చేసే కోస్టారికా, దక్షిణాఫ్రికా మహిళలకు ఒక సీసా వైన్‌ విక్రయించే ధరలో కేవలం 1.2 శాతమే వేతనాల రూపంలో లభిస్తుండగా సూపర్‌ మార్కెట్లకు 50 శాతం పైగా దక్కుతున్నది. సంపదలు కార్పొరేట్ల వద్ద పేరుకు పోవటానికి, అసమానతలు పెరగటానికి పన్నుల తగ్గింపు కూడా ఒక ప్రధాన కారణం. ఓయిసిడి దేశాలలో 1980లో కార్పొరేట్‌ ఆదాయపన్ను 48 శాతం ఉండగా 2022 నాటికి 23.1 శాతానికి తగ్గింది. ప్రపంచవ్యాపితంగా ఇదే ధోరణి. నూట నలభై ఒక్క దేశాలలో 111 చోట్ల 2020-2023 కాలంలో తగ్గాయి. ప్రపంచమంతటినీ చూస్తే 23 నుంచి 17 శాతానికి పడిపోయాయి. విదేశాల్లో పొందిన లాభాల్లో 35 శాతం ఎలాంటి పన్నులు లేని ప్రాంతాలకు చేరాయి. పన్ను విధానాలపై కార్పొరేట్ల ప్రభావానికి ఇది నిదర్శనం. ఈ మేరకు ప్రభుత్వాలకు రాబడి తగ్గటంతో సంక్షేమ కార్యక్రమాలకు కోత విధిస్తున్న కారణంగా ప్రపంచమంతటా అశాంతి పెరుగుతున్నది.

- ఎం. కోటేశ్వరరావు
– ఎం. కోటేశ్వరరావు
➡️