పెన్షన్ల గురించి …

Jan 17,2024 07:18 #Editorial

ప్రస్తుతం నయా ఉదారవాద వ్యవస్థ అధికోత్పత్తి సంక్షోభంలో తీవ్రంగా కూరుకుపోతున్న పరిస్థితుల్లో… ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ద్వారా ఆ సంక్షోభాన్ని నివారించడానికి పూనుకోవచ్చు. అలా చేసినందువలన సామాన్య ప్రజలకు కాస్తంత గౌరవప్రదమైన జీవన పరిస్థితులను కల్పించినట్టూ ఔతుంది. కాని నయా ఉదారవాదం సంపన్నుల మీద పన్నులను పెంచడానికి ఒప్పుకోదు. అటు ద్రవ్య లోటును పెంచి ప్రభుత్వం ఖర్చు చేయడానికీ ఒప్పుకోదు. అందుచేత ఈ నయా ఉదారవాద చట్రంలో ఆర్థిక వ్యవస్థ కొనసాగుతున్నంత కాలమూ పెన్షన్‌ సమస్యకు పరిష్కారం లభించదు. సంక్షోభాన్ని, దాని భారాలను ఎదిరించి పోరాడే క్రమంలో నూతన వ్యవస్థను నిర్మించుకోవడమే పరిష్కారం.

నకిప్పుడు ఒక వింత దృశ్యం కనిపిస్తోంది. ప్రపంచం లోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలోకెల్లా మనది అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ప్రధానమంత్రి మొదలు ప్రభుత్వ అధికార ప్రతినిధులందరూ అదే పనిగా విసుగెత్తి పోయేలా ప్రచారం చేస్తూనే వున్నారు. త్వరలోనే అది 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ కానుందని, జిడిపి వృద్ధి రేటులో చైనానే మించిపోతుందని గొప్పలు పోతున్నారు. అదే ప్రభుత్వ ప్రతినిధులు, నాయకులు పాత పెన్షన్‌ విధానం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్‌ చెల్లించే విషయం వచ్చేసరికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవని ప్రకటిస్తున్నారు. ఇక అసంఘటిత రంగంలో పని చేస్తూ, ఎటువంటి పెన్షన్‌ సదుపాయమూ లేని కోట్లాదిమంది కార్మికులకు సార్వత్రిక పెన్షన్‌ చెల్లించే సంగతి గురించి చెప్పేదేముంది? ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ తన దేశంలోని వృద్ధులకు పెన్షన్లు చెల్లించే పరిస్థితిలో లేదు. అంతే కాదు, తన దేశంలోని మాతృమూర్తులకు కడుపు నిండా తిండి పెట్టలేని స్థితిలో ఉంది. 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయస్కులైన స్త్రీలలో 57 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య, సంక్షేమ సర్వే వెల్లడించింది. ఇది 2019-20 నాటి సర్వే. ఇక ప్రపంచంలోనే అతి వేగంగా పెరుగుతున్న మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆకలి సూచికలో 125 దేశాలకు గాను 111వ స్థానంలో ఉంది. అంటే తన ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించలేని స్థితిలో ఉంది. కనీసం 2200 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని రోజూ పొందలేకపోతే అలాంటివారు నిష్టదరిద్రంలో ఉన్నట్టేనని పాత ప్లానింగ్‌ కమిషన్‌ నిర్ధారించింది. ఆ విధంగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 80 శాతం మంది నిష్టదరిద్రులు ఉన్నారు. 2017-18 జాతీయ శాంపిల్‌ సర్వేలో ఈ విషయం బైటపడింది.

కొత్త పెన్షన్‌ స్కీములో పెన్షన్‌ కోసం ఉద్యోగుల జీతాల నుండి ప్రతీ నెలా మినహాయిస్తున్నారు. పాత పెన్షన్‌ విధానం అటువంటిది కాదు. ఆ విధానం ప్రకారం పెన్షన్‌ అనేది ఉద్యోగి హక్కు. దానిని చెల్లించే బాధ్యత యజమాని అయిన ప్రభుత్వానిదే. ఐతే ఆ పాత పెన్షన్‌ విధానాన్ని ఎందుకు అమలు చేయడం లేదని అడుగుతున్న వారందరికీ ప్రభుత్వ అధికార ప్రతినిధులు, మంత్రులు అందరూ చెప్తున్న సమాధానం ఒక్కటే. ”ప్రభుత్వం దగ్గర అంత స్తోమత లేదు”. పాత పెన్షన్‌ విధానంలో ఉద్యోగి రిటైర్‌ అయ్యేనాటికి అతనికి, లేదా ఆమెకు వచ్చే నెల జీతంలో బేసిక్‌ పే, కరువు భత్యం లెక్కించి, అందులో సగం పెన్షన్‌గా చెల్లించడం జరుగుతుంది. ఆ తర్వాత పెరిగే ధరలకు అనుగుణంగా ఆ పెన్షన్‌ను సవరిస్తారు. ధరల పెరుగుదల ప్రభావాన్ని పరిగణించి, నిజ పెన్షన్‌ విలువను అందుకు అనుగుణంగా లెక్కిస్తే ఆ పెన్షన్‌లో నిజానికి ఏ పెరుగుదలా లేనట్టే.

ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ 6-7 శాతం చొప్పున ప్రతీ ఏడూ పెరుగుతోంది. కాని పెన్షనర్ల సంఖ్య అంత వేగంగా పెరగడం లేదు. అంటే జిడిపిలో పెన్షన్‌ కోసం చెల్లించే మొత్తం శాతం (జిడిపికి పెన్షన్‌ మొత్తానికి మధ్య నిష్పత్తి) ఏటికేడూ పడిపోతోందన్నమాట. అలా పడిపోతున్నప్పుడు ఆ పెన్షన్‌ చెల్లించడం ప్రభుత్వానికి ఏళ్ళు గడుస్తున్న కొద్దీ తేలిక కావాలి. ప్రభుత్వం చెప్పే లెక్కల్ని బట్టే ఇది నిర్ధారణ అవుతోంది. కాని, ఇందుకు పూర్తి విరుద్ధంగా పాత పెన్షన్‌ విధానాన్ని అందరికీ వర్తింపజేయడం మోయలేని భారం అవుతుందని ఎందుకు ప్రభుత్వ ప్రతినిధులు చెప్తున్నారు? అంటే జిడిపి వృద్ధి వేగంగా ఉన్నకాలంలో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బలహీనపడుతున్నట్టు అనుకోవాలి. ఏ విధంగా చూసినా, అలా అనుకోలేము. అసలు కారణం ఏమంటే, ఈ ప్రభుత్వం జిడిపిలో మరింత ఎక్కువ వాటా పెట్టుబడిదారులకు దక్కేలా చేయాలని భావిస్తోంది. అలా చేయడాన్ని సమర్ధించుకోడానికి ఈ ప్రభుత్వం దగ్గర ఒక వాదన ఉండనే వుంది. పెట్టుబడిదారులకు ఎంత ఎక్కువ వాటా దక్కితే అంత ఎక్కువగా వాళ్ళు పెట్టుబడులు పెట్టి జిడిపి మరింత ఎక్కువగా వృద్ధి చెందడానికి తోడ్పడతారు అన్నదే ఆ వాదన.

ఈ వాదన ఏ మాత్రమూ సమర్ధనీయం కాదు. పెట్టుబడిదారులకు ఎక్కువ ధనాన్ని ఇస్తే వాళ్ళు ఎక్కువ పెట్టుబడులు పెడతారు అనే వాదన ఎంత పసలేనిదో దాదాపు ఒక శతాబ్దం క్రితమే బూర్జువా ఆర్థిక శాస్త్రవేత్త అయిన కీన్స్‌, పోలిష్‌ ఆర్థికవేత్త, మార్క్సిస్టు అయిన మైకేల్‌ కాలెక్కీ నిరూపించారు. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో సప్లైకి తగిన స్థాయిలో డిమాండ్‌ లేని పరిస్థితే సాధారణంగా కొనసాగుతూ వుంటుంది. అటువంటి వ్యవస్థలో ఉత్పత్తి, పెట్టుబడి, వృద్ధి పెరగాలంటే దానికి ముందు పెరగవలసినది మొత్తం డిమాండ్‌. అంతే కాని, పెట్టుబడిదారులకు ధనాన్ని ఎక్కువ ధారపోస్తే దానివలన ప్రయోజనం ఉండదు. ఈ సంగతి మోడీ ప్రభుత్వానికి కూడా తెలుసు. కాని, పాత పెన్షన్‌ విధానాన్ని అముల చేయడానికి తిరస్కరిస్తోంది. దానిని బట్టి ఈ ప్రభుత్వం పెట్టుబడిదారుల పక్షాన వ్యవహరిస్తున్న ప్రభుత్వం అని స్పష్టం అవుతోంది.

ప్రభుత్వం జిడిపి వృద్ధి రేటు పెరుగుదల పట్ల ప్రదర్శిస్తున్న ఈ వ్యామోహం, ఆ వృద్ధిరేటు గురించి ప్రచారం చేసుకుంటున్న తీరు అర్ధరహితం. ఇటువంటి ధోరణినే గతంలో కొందరు మహారాజులు ప్రదర్శించారు. ప్రజలకి ఉపాధి లేకుండా చేసి, వాళ్ళు అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నప్పుడు బలవంతంగా వాళ్ళతో చాకిరీ చేయించి పెద్ద పెద్ద కోటలను, రాజ హర్మ్యాలను నిర్మించారు. తమ పాలనలో ఎంతో అభివృద్ధి జరిగిందంటూ గొప్పలు పోయేవారు. అందుకు తార్కాణంగా ఆ కోటలను, భవంతులను చూపించేవారు. ఈ క్రమంలో ప్రజల పట్ల తమ ప్రవర్తన ఎంత అమానవీయంగా ఉన్నా అది వాళ్ళకేమీ పట్టేదే కాదు. బహుశా అడుక్కు తినే స్థితిలో ప్రజలు ఉండడం గర్వకారణంగా వాళ్ళు పరిగణించి వుండాలి. అదే మాదిరిగా ఇప్పుడు కూడా కోట్లాదిమంది వృద్ధులు అత్యంత దయనీయ స్థితిలో జీవించేటందుకు నెట్టబడుతున్నారు. వారిలో చాలా తక్కువ మందికి ప్రభుత్వం నెలనెలా ఇచ్చే రూ.200 దక్కుతోంది. అది చాలా స్వల్పం. ఇలా జరగడానికి కారణం ప్రభుత్వం దగ్గర ఆర్థిక వనరులు లేకపోవడం ఎంత మాత్రమూ కానే కాదు. వనరులను పెట్టుబడిదారులకు కట్టబెట్టడమే కారణం. ఆ విధంగా కట్టబెట్టడాన్ని సమర్ధించుకోడానికి ప్రభుత్వం చేస్తున్న వాదన బొత్తిగా అర్ధం లేనిది.

ఈ వనరుల సమస్యను మరికాస్త వివరంగా పరిశీలిద్దాం. 2018-19 నాటికి దేశంలో 60 ఏళ్ళు పైబడినవారు సుమారు 13 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు జీవించడానికి నెలకు తలా రూ.3000 కావాలి. ఆ ఏడాది స్థూల జాతీయ ఆదాయం రూ.187 లక్షల కోట్లు, లేదా రూ.187 ట్రిలియన్లు. వృద్ధులకు గనుక నెలకు తలా రూ.3000 చొప్పున చెల్లించాలంటే అందుకు కావలసిన మొత్తం స్థూల జాతీయాదాయంలో 2.5 శాతం మాత్రమే. ఈ మొత్తాన్ని చెల్లించాక దానిని అందుకున్న పెన్షనర్లు తిరిగి దానిని ఖర్చు చేస్తారు. ఆ ఖర్చులో పన్నుల రూపంలో ప్రభుత్వానికి తిరిగి కనీసం 30 శాతం వెనక్కి వచ్చేస్తుంది. అంటే నికరంగా ప్రభుత్వం పెన్షన్ల కోసం తన స్థూల జాతీయా దాయంలో 1.75 శాతం కేటాయిస్తే సరిపోతుంది.

ఈ మొత్తాన్ని సమకూర్చుకోడానికి సంపన్నుల మీద 1 శాతం సంపద పన్ను విధిస్తే చాలు. అలా ఒక శాతం పన్ను అదనంగా విధించినంత మాత్రాన ఆ సంపన్నుల వినిమయం ఏమీ తగ్గిపోదు. అందుచేత ఇతరత్రా పెన్షన్‌ సదుపాయం లేని వృద్ధులకు నెలకు రూ.3000 చొప్పున సార్వత్రిక పెన్షన్‌ విధానాన్ని అమలు చేయడానికి వనరుల కొరత ఏమీ లేదు. 2018-19తో పోల్చితే ఇప్పటికి పెన్షన్‌ పొందే అర్హత గలవారి సంఖ్య ఇంకా పెరిగివుంటుంది కదా అన్న సందేహం రావచ్చు. అలాగే 2018 నాటి రూ. 3000 ఇప్పటి ధరలకు అనుగుణంగా సవరిస్తే ఇంకా ఎక్కువ అవుతుంది కదా? అటువంటప్పుడు ఆర్థిక భారం ఇంకా ఎక్కువ అవుతుంది కదా? అని సందేహం వస్తుంది కూడా. ఆ సందేహానికి ఆస్కారం లేదు. ఈ కాలంలో జాతీయ ఆదాయం కూడా పెరిగింది గనుక పెన్షనర్లకు చెల్లించే మొత్తం కూడా అందులో ఒకానొక శాతంగా ఉంటుంది గనుక అది కూడా పెరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు కూడా రూ.3000 చొప్పున మాత్రమే చెల్లించాలనుకుంటే ఆ శాతం తగ్గుతుంది కూడా.

ప్రస్తుతం నయా ఉదారవాద వ్యవస్థ అధికోత్పత్తి సంక్షోభంలో తీవ్రంగా కూరుకుపోతున్న పరిస్థితుల్లో. ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ద్వారా ఆ సంక్షోభాన్ని నివారించడానికి పూనుకోవచ్చు. అలా చేసినందువలన సామాన్య ప్రజలకు కాస్తంత గౌరవప్రదమైన జీవన పరిస్థితులను కల్పించినట్టూ ఔతుంది. కాని నయా ఉదారవాదం సంపన్నుల మీద పన్నులను పెంచడానికి ఒప్పుకోదు. అటు ద్రవ్య లోటును పెంచి ప్రభుత్వం ఖర్చు చేయడానికీ ఒప్పుకోదు. అందుచేత ఈ నయా ఉదారవాద చట్రంలో ఆర్థిక వ్యవస్థ కొనసాగుతున్నంత కాలమూ పెన్షన్‌ సమస్యకు పరిష్కారం లభించదు. సంక్షోభాన్ని, దాని భారాలను ఎదిరించి పోరాడే క్రమంలో నూతన వ్యవస్థను నిర్మించుకోవడమే పరిష్కారం.

( స్వేచ్ఛానుసరణ ) ప్రభాత్‌ పట్నాయక్‌
( స్వేచ్ఛానుసరణ ) ప్రభాత్‌ పట్నాయక్‌
➡️