పరమత ద్వేషం రాజ్యాంగ విలువలకు విరుద్ధం

Mar 9,2024 07:17 #Editorial

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి హిందూ రాజ్య స్థాపనకు సంబంధించిన ఎజెండాను అది రెట్టింపు వేగంతో కొనసాగిస్తున్నది. మతపరమైన అంశాలు, రామ మందిరం, ఆవు-గొడ్డు మాంసం, లవ్‌ జీహాద్‌ ఇంకా ఇతర సమస్యల్ని తీవ్రతరం చేయడం ద్వారా బిజెపి ఎన్నికల రణరంగంలోకి దూకుతోంది. బిజెపి, ఎన్నికల్లో తన బలాన్ని పెంచుకోవడంలో మత హింస ప్రధానమైన అంశంగా పని చేస్తున్నది. ఆ హింస కూడా ‘మైనార్టీలను ద్వేషించండి’ అనే ప్రాతిపదికన జరుగుతున్న ప్రచారంతో నిర్మితమైనది. ద్వేషాన్ని సృష్టించడానికి వారికి అనుకూలమైన యంత్రాంగాలు ఉన్నాయి. అవి-శాఖలు, పాఠశాలలు, గోడీ మీడియా, సోషల్‌ మీడియా, ఐటీ సెల్స్‌…మొదలైనవి. రాష్ట్రాల్లో, కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నప్పుడు శిక్షార్హమైన నేరంగా పరిగణించబడే ద్వేషపూరిత ప్రసంగాలను మరింత ఉత్సాహంగా ఉపయోగిస్తారు.

డచిన దశాబ్ద కాలంగా భారతదేశాన్ని హిందూ జాతీయవాద బిజెపి పాలిస్తున్నది. హిందూ రాష్ట్ర స్థాపన లక్ష్యం కలిగిన ‘రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు’ సంతతికి చెందినదే బిజెపి. ఆర్‌ఎస్‌ఎస్‌కు వందల అనుబంధ సంస్థలు, లక్షల వాలంటీర్లు (స్వయం సేవకులు), వేల సంఖ్యలో ప్రచారక్‌లుగా పిలువబడే సీనియర్‌ కార్యకర్తలు వున్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి హిందూ రాజ్య స్థాపనకు సంబంధించిన ఎజెండాను అది రెట్టింపు వేగంతో కొనసాగిస్తున్నది. మతపరమైన అంశాలు, రామ మందిరం, ఆవు-గొడ్డు మాంసం, లవ్‌ జీహాద్‌ ఇంకా ఇతర సమస్యల్ని తీవ్రతరం చేయడం ద్వారా బిజెపి ఎన్నికల రణరంగంలోకి దూకుతోంది. బిజెపి, ఎన్నికల్లో తన బలాన్ని పెంచుకోవడంలో మత హింస ప్రధానమైన అంశంగా పని చేస్తున్నది. ఆ హింస కూడా ‘మైనార్టీలను ద్వేషించండి’ అనే ప్రాతిపదికన జరుగుతున్న ప్రచారంతో నిర్మితమైనది. ద్వేషాన్ని సృష్టించడానికి వారికి అనుకూలమైన యంత్రాంగాలు ఉన్నాయి. అవి-శాఖలు, పాఠశాలలు, గోడీ మీడియా, సోషల్‌ మీడియా, ఐటీ సెల్స్‌…మొదలైనవి. రాష్ట్రాల్లో, కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నప్పుడు శిక్షార్హమైన నేరంగా పరిగణించబడే ద్వేషపూరిత ప్రసంగాలను మరింత ఉత్సాహంగా ఉపయోగిస్తారు. ఈ ద్వేషపూరిత ప్రసంగాల్లో తేలియాడే వారికి శిక్ష మినహాయింపు ఆనందాన్ని ఆస్వాదించడం ఎలాగో బాగా తెలుసు.

భారతదేశంలో మతపరమైన మైనార్టీలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి వాషింగ్టన్‌ డిసి ఆధారిత గ్రూప్‌ ‘ఇండియా హేట్‌ ల్యాబ్‌’ విడుదల చేసిన తాజా నివేదికలో ఇదంతా ధ్రువీకరించబడింది. ‘భారతదేశంలో ద్వేష పూరిత ప్రసంగాల సంఘటనలు’ శీర్షికతో ఈ నివేదిక వెలువడింది. 2023 మొదటి అర్ధ సంవత్సరంలో 255 సంఘటనలు జరుగగా, రెండవ అర్ధ సంవత్సరంలో ఆ సంఖ్య 413కు పెరిగిందని నివేదిక చెప్తోంది. అంటే 63 శాతం పెరుగుదల.

నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం, మొత్తం 498 సంఘటనల్లో 75 శాతం సంఘటనలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో (బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాలన), ఢిల్లీ (ఇక్కడ పోలీస్‌ వ్యవస్థ, పబ్లిక్‌ ఆర్డర్‌ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది)లోనే చోటుచేసుకున్నాయి. వాటిలో 36 శాతం (239) సంఘటనలు ముస్లింలకు వ్యతిరేకంగా ఇచ్చిన హింసాత్మక పిలుపుల్లో భాగంగా జరిగాయి. 63 శాతం (420) సంఘటనలు లవ్‌ జీహాద్‌, ల్యాండ్‌ జీహాద్‌, జనాభా జీహాద్‌ల పిలుపుల్లో భాగంగా జరిగాయి. దాదాపు 25 శాతం (169) సంఘటనలు ప్రార్థనా స్థలాల్లో ముస్లింలను లక్ష్యం చేస్తూ, వారికి వ్యతిరేకంగా ఇచ్చిన పిలుపులో భాగంగా జరిగాయి.

ఇప్పటికే ఈ సంఘటనల ఫలితాలు ఎలా వుంటాయో అందరికీ తెలిసినదే. బిజెపి పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్‌ కూల్చివేతల్ని అదనంగా ఉపయోగించిన విషయం మనకు ఇంకా గుర్తే. ఇలాంటి చర్యలన్నీ ముస్లింల ఆస్తుల్ని ధ్వంసం చేయడానికి చేపట్టారు. అక్కడక్కడ మసీదు కూల్చివేతలు వారికి పెద్ద లెక్కలోని విషయం కాదు! ప్రేరేపిత పాలనా యంత్రాంగం చూపించే పక్షపాతం నిత్యకృత్యంగా మారింది. ముస్లిం సమాజంపై పడుతున్న ప్రభావం, అభద్రతా భావాన్ని, వెలివేతను పెంచుతుంది. ద్వేషపూరిత గోడలు పగటిపూట బలోపేతం అవుతున్నాయి. కాషాయబృందంతో శ్రీమహావిష్ణువుకు పునర్జన్మగా పిలువబడుతున్న ప్రధాన మంత్రి… వారి బట్టలు, శంషాన్‌-కబ్రస్థాన్‌, గులాబీ విప్లవం లాంటి వాటితో వారిని గుర్తించవచ్చని…కొన్ని చిన్న సూచనలు చేసినప్పుడు, ద్వేషపూరిత ప్రసంగాల సంకేతాలు పైస్థాయి నుంచే మొదలవుతాయి.

ఇది, పార్లమెంటులో చాలా స్పష్టంగా కనిపించింది. దనీష్‌ అలీకి వ్యతిరేకంగా రమేష్‌ బిధూరీ చాలా దారుణమైన దూషణలకు దిగాడు. అలీని ‘ముల్లా’, ‘తీవ్రవాది’, ‘జాతి వ్యతిరేకి’, ‘తార్పుడు గాడు’, ‘కత్వా’ (ముస్లింలకు వ్యతిరేకమైన కళంకం) అన్నాడు. దీనికి ప్రతిఫలంగా బిధూరీకి అదనపు బాధ్యతలతో కూడిన ఉన్నత పదవిని కట్టబెట్టారు. బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ కలయికలో శ్రేణీగత వ్యవస్థ పైకి వెళ్లే మార్గం ద్వేషపూరిత ప్రసంగమేనని ఇది స్పష్టం చేసింది. బిధూరీ మళ్ళీ ఇదే విధంగా సభలో వ్యవహరిస్తే, ఆయనపై చర్యను తీసు కుంటామని లోక్‌సభ స్పీకర్‌ అనడం ద్వారా ఆయన బిధూరీని ఏమీ అనకుండా వదిలివేశాడు.

నేరం మోపబడిన వారు ఎలాంటి కఠినమైన శిక్షలు పడకుండానే తప్పించుకుంటున్నారు. హల్ద్‌వానీ మసీదు సమస్య కూడా క్షేత్ర స్థాయిలో ప్రశాంతతను భగం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో నిష్పక్షపాతంగా ఉండే మీడియా బలంగా లేకపోవడం చాలా దారుణమైన విషయం.

ప్రస్తుతం చోటు చేసుకుంటున్న ఘటనలు ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా హింసాత్మక చర్యలకు దారితీయడంతో పాటు, నెమ్మదిగా ఇస్లామోఫోబియాను తీవ్రం చేస్తాయి. హోంవర్క్‌ చేయనటువంటి ఒక ముస్లిం విద్యార్థిని, క్లాస్‌లో విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరితో చెంప దెబ్బ కొట్టాలని తృప్త త్యాగి అనే టీచర్‌ చెప్పడం మనకు తెలిసిన విషయమే. మంజులా దేవి అనే మరొక ఉపాధ్యాయురాలు, ఒక చిన్న సమస్యపై వాదులాడుకుంటున్న ఇద్దరు ముస్లిం విద్యార్థులతో ”ఇది మీ దేశం కాదు” అని చెప్పారు. కొంతమంది ప్రయాణీకులు ఉపశమనం పొందడానికి, కొంతమంది ముస్లింలు నమాజ్‌ చేసుకోవడానికి బస్సును ఆపినందుకు మోహన్‌ యాదవ్‌ అనే బస్సు కండక్టర్‌ను ఉద్యోగం నుండి తొలగించడం మనం చూశాం.

ద్వేషపూరిత ప్రసంగాలను మన సమాజానికి శాపంగా గుర్తించారు మన నాయకులు. ఒక ముస్లిం చేతిలో స్వామి సహజానంద హత్య చేయబడిన తరువాత ఈ సమస్యను గాంధీ సరిగానే గుర్తించాడు. ద్వేషపూరిత భావాల్ని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే పత్రికలను బహిష్కరించడం ద్వారా పరస్పర ద్వేషభావాన్ని, అపకీర్తిని ప్రక్షాళన చేసుకోవాలని పిలుపునిస్తూ ”యంగ్‌ ఇండియా” పత్రికలో రాశాడాయన. ఇక్కడ గాంధీ, ఆ సమయంలో వార్తాపత్రికలు పోషిస్తున్న ప్రతికూలమైన పాత్ర గురించి మాట్లాడుతున్నాడు. తరువాత కాలంలో గాంధీజీ హత్య తర్వాత కూడా సర్దార్‌ వల్లభారు పటేల్‌ గోల్వాల్కర్‌కు రాసిన లేఖలో, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యక్షంగా ద్వేషభావాన్ని వ్యాప్తి చేస్తున్నదని ఆరోపిస్తూ…వారి ప్రసంగాలన్నీ మతపరమైన విషంతో నిండిపోయాయనీ, హిందువుల రక్షణ కోసం హిందువుల్ని ప్రేరేపించి విషాన్ని వ్యాపింప చేయాల్సిన అవసరం లేదనీ, ఆ గరళం ఫలితంగానే మన దేశం ఎంతో విలువైన గాంధీజీ జీవితాన్ని త్యాగం చేయాల్సి వచ్చిందని-ఆయన పేర్కొన్నాడు.

రోజులు గడిచిపోతున్నాయి. అదే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు ద్వేషాన్ని సృష్టించే యంత్రాంగాలను తయారుచేస్తున్నది. తన సొంత స్వయంసేవకుల విస్తృతమైన సైన్యంతో సహా ప్రచారక్‌లు, పాఠశాలల నెట్‌వర్క్‌, మీడియాలోని ఒక పెద్ద విభాగం అధికారంలో ఉన్న వారికి లొంగిపోయి, ద్వేష భావాన్ని తీవ్రతరం చేయడానికి వారి పలుకుబడిని యథేచ్ఛగా ఉపయోగించుకుంటున్నది. ఈ యంత్రాంగాలు చేసిన ప్రచారాన్నే తృప్త త్యాగీ, మంజులా దేవీలు పిల్లల దాకా తీసుకెళ్ళారు. మిశ్రమ పాఠశాలల్లో ముస్లిం పిల్లలకు పరిస్థితులు చాలా క్లిష్టంగా మారుతున్నాయి.

నేడు, ఇతరులను ద్వేషించడమనేది మన రాజ్యాంగంలో పేర్కొన్న సౌభ్రాతృత్వ విలువకు విరుద్ధమైనది. ఇది, గాంధీజీ ఆచరించిన హిందూ మతం యొక్క నైతిక విలువల సహనానికి కూడా వ్యతిరేకం. ఇది, ”వసుధైవ కుటుంబం” (ప్రపంచం ఒక కుటుంబం) అనే వేద వచనంపై అత్యంత దూకుడుగా చేస్తున్న దాడి కూడా. ఇది మతపరమైన మైనార్టీల్ని భయపెట్టడమే కాకుండా, మన రాజ్యాంగ విలువలపై కూడా దాడికి పూను కుంటున్నది. ఈ ద్వేషపూరిత ప్రసంగాన్ని ఎదుర్కోవాలంటే… వసుధైవ కుటుంబం, భారత రాజ్యాంగ సౌభ్రాతృత్వాలు, ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు వాటి అవసరం ఎక్కువగా వుంది.

('ద వైర్‌' సౌజన్యంతో) /వ్యాసకర్త బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ విశ్రాంత ఆచార్యుడు/రామ్‌ పునియానీ
(‘ద వైర్‌’ సౌజన్యంతో) /వ్యాసకర్త బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ విశ్రాంత ఆచార్యుడు/రామ్‌ పునియానీ
➡️