అచ్ఛే దిన్‌, వికసిత భారత్‌…!

Jan 10,2024 07:18 #Editorial

వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా బిజెపి 2004 ఎన్నికల్లో ఇచ్చిన నినాదం ‘వెలిగిపోతున్న భారత్‌’. తరువాత అదే బిజెపి 2014లో ముందుకు తెచ్చిన నినాదం ‘అచ్ఛే దిన్‌’, తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబరు రెండవ వారంలో ‘వికసిత భారత్‌’ ప్రభుత్వ సంకల్పమని ప్రకటించారు. మూడు నినాదాలకు తేడా ఉంది. మొదటిది తమ విఫలమైన పాలనను కప్పిపుచ్చుకొనేందుకు భారత్‌ వెలిగిపోతోంది అన్నారు. కాంగ్రెస్‌ పాలన మీద ధ్వజమెత్తేందుకు తాము అధికారానికి వస్తే అచ్ఛే దిన్‌ (మంచి రోజులు) తెస్తామని ఆశ చూపారు. పదేళ్ల తరువాత వాటి జాడ కనిపించటం లేదు. దీంతో మరో పాతికేళ్లలో 2047 నాటికి అభివృద్ధి చెందిన వికసిత భారత్‌గా దేశాన్ని మారుస్తామని నమ్మబలుకుతున్నారు.

            సంకీర్ణ ప్రభుత్వాలతో మూడు దశాబ్దాల కాలం వృధా అయిందని, పాలన లేకపోవటాన్ని, సంతుష్టీకరణ రాజ కీయాలను జనం చూశారని ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. ఈ కారణంగానే బిజెపిని సహజ ఎంపికగా జనం పరిగణిస్తున్నారని, 2024లో తాము ఎవరి మీదా ఆధారపడని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ‘ఇండియా టుడే’ మాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పదేళ్ల క్రితంతో పోల్చితే ఇప్పుడు అన్ని రంగాలు మెరుగైన పని తీరు కనపరుస్తున్నాయని ఉద్ఘాటించారు. ఇలాంటి ముఖాముఖిలో మోడీ చెప్పింది రాసుకోవటం తప్ప విమర్శనాత్మక ప్రశ్నలు అడిగే అవకాశం ఉండదన్నది తెలిసిందే. ‘మోడీ-హిజ్‌ మాస్టర్స్‌ వాయిస్‌’ మీడియా ఆడుతున్న మైండ్‌ గేమ్‌లో ఇలాంటివి కొత్త కాదు. ఎప్పుడైనా విలేకర్ల సమావేశం పెట్టి ఎదురయ్యే ప్రశ్నలకు జవాబు చెబితే జనానికి నాణానికి మరోవైపు ఏముందో తెలుస్తుంది. 2014 ఎన్నికల సమయంలో సెలవిచ్చిన అచ్ఛే దిన్‌, నల్లధనం వెలికితీత, గుజరాత్‌ తరహా అభివృద్ధి వంటి అంశాలను ఏ మేరకు సాధించారో ఎక్కడా చెప్పటం లేదు. జనాలను మార్కెటింగ్‌ మాయాజాలంలో ముంచి తమ ఉత్పత్తులను అమ్ముకొనేందుకు వ్యాపార సంస్థలు విడుదల చేసే వాణిజ్య ప్రకటనల గురించి తెలిసిందే. దేశంలో పలు పార్టీలు ఇప్పుడు ఇస్తున్న నినాదాలు, చేసే ప్రసంగాలు, ప్రదర్శించే హావభావాల వెనుక అలాంటి మార్కెటింగ్‌ నిపుణులు ఉన్నారన్నది బహిరంగ రహస్యం. గతంలో ప్రజా ఉద్యమాల నుంచి నినాదాలు పుట్టేవి. ఇప్పుడు అనేక పార్టీలకు వాటితో పనిలేదు.

వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా బిజెపి 2004 ఎన్నికల్లో ఇచ్చిన నినాదం ”వెలిగిపోతున్న భారత్‌”. తరువాత అదే బిజెపి 2014లో ముందుకు తెచ్చిన నినాదం ”అచ్ఛే దిన్‌”, తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబరు రెండవ వారంలో ”వికసిత భారత్‌” ప్రభుత్వ సంకల్పమని ప్రకటించారు. 2024లో ఎన్నికల్లోపు ఎలాంటి అనూహ్య ఉదంతాలు జరగక లేదా జరపకపోతే దాన్నే బిజెపి స్వీకరించి ఎన్నికల గోదాలోకి దిగనుంది. మూడు నినాదాలకు తేడా ఉంది. మొదటిది తమ విఫలమైన పాలనను కప్పిపుచ్చుకొనేందుకు భారత్‌ వెలిగిపోతోంది అన్నారు. కాంగ్రెస్‌ పాలన మీద ధ్వజమెత్తేందుకు తాము అధికారానికి వస్తే అచ్ఛే దిన్‌ (మంచి రోజులు) తెస్తామని ఆశ చూపారు. పదేళ్ల తరువాత వాటి జాడ కనిపించటం లేదు. దీంతో మరో పాతికేళ్లలో 2047 నాటికి అభివృద్ధి చెందిన వికసిత భారత్‌గా దేశాన్ని మారుస్తామని నమ్మబలుకుతున్నారు.

వికసిత భారత్‌ 2047 రోడ్‌ మాప్‌ ప్రకారం ఆ సంవత్సరానికి మన దేశం అభివృద్ధి చెందిన జాబితాలో చేరుతుందని చెబుతున్న దాన్ని జనం నమ్మేదెలా? అభివృద్ధి లక్షణాలలో అధిక తలసరి రాబడి ఒకటి. దాన్లో ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ప్రపంచబ్యాంకు రూపొందించిన అట్లాస్‌ పద్ధతి ప్రకారం 2022 సంవత్సర వివరాల మేరకు 190 దేశాల జాబితాలో జిఎన్‌ఐ తలసరి ఆదాయంలో ముందున్న తొలి 59 దేశాల్లో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాకే చోటు లేదు. ఎగువ మధ్య తరగతి ఆదాయ జాబితాలో రెండవదిగా, మొత్తం దేశాలలో 61వ స్థానంలో ఉంది. మన దేశం దిగువ మధ్య తరగతి జాబితాలో 26వ స్థానంలో మొత్తం దేశాల్లో 140వదిగా ఉంది. సంకీర్ణ ప్రభుత్వాలతో దేశం వెనుకబడిందని మోడీ అన్నారు. జనానికి సమాచారం అందుబాటులో ఉన్నా చూసే ఓపిక, ఆసక్తి కూడా లేని బలహీనతను పాలకులు సొమ్ము చేసుకుంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఉన్న 2004లో భారత జిఎన్‌ఐ 600 డాలర్లు 2013 నాటికి 1,500కు చేరింది. వార్షిక సగటు రేటు 11.48 శాతం. కాగా స్థిరమైన, స్పష్టమైన విధానాలు అమలు జరిపినట్లు చెప్పుకున్న నరేంద్ర మోడీ పాలనలో 2022 నాటికి అది 2,380 డాలర్లకు, వార్షిక వృద్ధి రేటు 5.44 శాతమే పెరిగింది. సంతోష సూచికలో 146 దేశాలకు గాను మనదేశం 137వ స్థానంలో ఉంది. కొంత మంది అంగీకరించినా లేకున్నా మన కంటే ఎగువన చైనా 82, నేపాల్‌ 85, బంగ్లాదేశ్‌ 99, పాకిస్తాన్‌ 103, శ్రీలంక 126వ స్థానాల్లో ఉన్నాయి. అయినప్పటికీ భారత్‌ను వికసింప చేస్తామని చెప్పటం నరేంద్ర మోడీకే చెల్లింది.

భారత్‌ అప్పుల పాలు కానుందని సరిగ్గా వికసిత భారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన సమయంలోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) రూపొందించిన నివేదిక హెచ్చరించింది. ప్రపంచంలో మన దేశ స్థానం గురించి వివిధ సంస్థలు వెల్లడిస్తున్న సూచికలను అధికార బిజెపి, అది నడుపుతున్న కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించదు. తప్పుల తడకలని, వారికి లెక్కలు వేయటం రాదని బుకాయించటం తెలిసిందే. పోనీ వారు నమ్మే వేదగణితం ప్రకారం మనం నిజంగా ఎక్కడున్నామో, ఎలా ఉన్నామో ఎప్పుడైనా చెప్పారా? ఇప్పుడు ఐఎంఎఫ్‌ చెప్పిందాన్ని కూడా తాము అంగీకరించటం లేదని, అవన్నీ ఊహాగానాలు తప్ప వాస్తవం కాదని కేంద్ర ప్రభుత్వం గింజుకుంది. నెరవేరని ఐదు లక్షల కోట్ల డాలర్ల జిడిపి కబుర్లు కూడా ఊహాగానమే. వర్తమాన వికసిత భారత్‌ కూడా అదే, వాస్తవం కాదు. వికసిత భారత్‌, తమ విజయం నల్లేరు మీద బండిలా సాగుతుందని చెప్పుకుంటున్న పూర్వరంగంలో ఐఎంఎఫ్‌ విశ్లేషణ గొంతులో పచ్చి వెలక్కాయ వంటిదే. ఇంతకీ అదేమి చెప్పింది? ప్రతికూల దెబ్బలు తగిలితే 2028 నాటికి జిడిపి ఎంత ఉంటుందో ప్రభుత్వ అప్పు అంతకు (వంద శాతం) చేరుతుందని హెచ్చరించింది. ఒక శతాబ్దిలో ఒకసారి వచ్చే కరోనా-19 మాదిరి విపరీత పరిణామాలు సంభవిస్తే అని ఐఎంఎఫ్‌ చెప్పిందని, అలాంటివేమీ జరిగే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం అన్నది.

తమ నేత అధికారానికి వచ్చిన తరువాత విదేశీ అప్పులేమీ చేయటం లేదని ప్రచారం చేస్తున్న భక్తులను సంతుష్టీకరించలేము. మాక్రో ట్రెండ్స్‌ నెట్‌ సమాచారం ప్రకారం 1970లో ఎనిమిది బిలియన్‌ డాలర్లుగా ఉన్న విదేశీ అప్పు నూతన ఆర్థిక విధానాలను అమల్లోకి తెచ్చిన 1990నాటికి 83కి చేరింది. తరువాత పదేళ్లకు 101, 2010 నాటికి 290, నరేంద్రమోడీ అధికారానికి వచ్చేనాటికి 457 బి.డాలర్లకు చేరింది. ఐఎంఎఫ్‌ తాజా విశ్లేషణ ప్రకారం 2024 మార్చి నాటికి 681, మరుసటి ఏడాది మార్చికి 748 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. వార్షిక అప్పు పెరుగుదల శాతాల్లో ఎగుడుదిగుళ్లు ఉండవచ్చు తప్ప మొత్తంగా చూసినపుడు పెరుగుదల ధోరణే ఉంది. ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వ దేశీయ రుణ భారం 58.6 లక్షల కోట్ల నుంచి 156.6 లక్షల కోట్లకు 174 శాతం పెరిగింది. కరోనా కారణంగా ఇంత అప్పు చేశాము, ఉచితంగా వాక్సిన్లు వేశాము అని బిజెపి పెద్దలు చెప్పవచ్చు. ఇన్ని లక్షల కోట్లు దానికే తెచ్చారా? బడ్జెట్‌ పత్రాల్లో పేర్కొన్నదాని ప్రకారం 2024 మార్చి నాటికి దేశీయ అప్పు రూ.164 లక్షల కోట్లు, విదేశీ అప్పు 5 లక్షల కోట్లు మొత్తం కలిపితే రూ.169 లక్షల కోట్లకు చేరనుంది.ఐఎంఎఫ్‌ ఒక్క రుణం గురించి మాత్రమే చెప్పలేదు. నవంబరు 20 నాటికి సంస్థ సిబ్బంది మన దేశ ఆర్థిక అంశాల గురించి రూపొందించిన 142 పేజీల నివేదికను డిసెంబరు మూడవ వారంలో బహిర్గతం చేశారు. దానిలో గత పది సంవత్సరాల పాలన డొల్లతనం, వైఫల్యాల గురించి పేర్కొన్నారు. నివేదిక పదజాలంలో ఆ మాటలు లేకపోవచ్చు గానీ అచ్ఛే దిన్‌ పాలనలో అంకెలు చెబుతున్న అంశాల సారమిదే. వస్తు ఎగుమతులు 2019-20లో 320 బిలియన్‌ డాలర్లు ఉంటే తదుపరి రెండు సంవత్సరాల్లో వరుసగా 296, 429 బి.డాలర్లుగా ఖరారు చేసిన లెక్కలు చెబుతున్నాయి. తరువాత 2022-23లో 456, వర్తమాన సంవత్సరంలో 436, వచ్చే ఏడాది 460 బిలియన్‌ డాలర్ల అంచనాలుగా ఐఎంఎఫ్‌ పేర్కొన్నది. ఎగుమతుల ప్రోత్సాహకం పేరుతో పక్కన పెట్టిన రెండు లక్షల కోట్ల రూపాయల వలన అదనంగా పెరిగిందేముంది? మేకిన్‌, మేడిన్‌ ఇండియాల జాడ ఎక్కడీ పిఐబి 2022 జులై 29న విడుదల చేసిన సమాచారం ప్రకారం 2017-18లో జిడిపిలో వస్తు ఎగుమతుల శాతం 11.4 కాగా 2021-22లో 13.3 శాతంగా పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల సగటు 11.78 శాతం ఉంది. వస్తువులు, సేవల ఎగుమతులు ఈ కాలంలోనే 18.8 శాతం నుంచి 21.4 శాతం మధ్య ఉన్నాయి. సగటు 19.5 శాతమే ఉంది. అందువలన వాటిలో కూడా పెద్దగా పెరుగుదల లేదు. మాక్రో ట్రెండ్స్‌ అనే పోర్టల్‌ నిర్వహిస్తున్న సమాచారం ప్రకారం 2004 నుంచి 2013 వరకు ఏటా సగటున 22.1 శాతం ఎగుమతులు జరిగాయి. ఈ లెక్కన మోడీ ఏలుబడిలో దిగుమతులు పడిపోయినట్లా పెరిగినట్లా? దేశ ప్రతిష్టను, మార్కెట్లను పెంచేందుకు నరేంద్ర మోడీ విదేశాలు తిరిగినట్లు, విశ్వగురువుగా మారినట్లు ఎంతగా చెప్పుకున్నా మోడీని చూసి ఎవరూ ఇబ్బడి ముబ్బడిగా దిగుమతులు చేసుకోవటం లేదు. యుపిఏ హయాంలో దేశ దిగుమతులు జిడిపిలో వార్షిక సగటు 26.4 శాతం ఉంది. నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తరువాత తొమ్మిది సంవత్సరాలలో సగటున 22.9 శాతం చొప్పున ఉన్నాయి. మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఎందుకు ఉన్నాయంటే తాము చేసిన ఆర్థికవృద్ధి కారణంగా జనంలో కొనుగోలు శక్తి పెరిగి దిగుమతులకు గిరాకీ ఏర్పడిందంటారు బిజెపి నేతలు. ఒకవేళ అదే వాస్తవమైతే జిడిపిలో దిగుమతుల శాతం యుపిఏ హయాంలోనే ఎక్కువ ఉంది, అంటే బిజెపి కంటే మెరుగైన పాలన అందించినట్లుగా భావించాలి. విదేశీ వాణిజ్యలోటు యుపిఏ పాలనా కాలంలో సగటున ఏటా జిడిపిలో 2.26 శాతం ఉంది. 2004లో 0.3 శాతం నుంచి మధ్యలో 4.8 శాతానికి పెరిగి 2013 నాటికి 1.7 శాతానికి తగ్గింది. నరేంద్ర మోడీ ఏలుబడిలో ఎనిమిది సంవత్సరాలలో వార్షిక సగటు 1.45 శాతం ఉండగా మధ్యలో ఒక ఏడాది 0.9 శాతం మిగులు ఉంది. 2014లో 1.3 శాతంగా ఉన్న లోటు 2022లో 2.6 శాతానికి పెరిగింది. సూచిక పైకి చూస్తున్నది తప్ప కిందికి రావటం లేదు. మొత్తంగా చూసినపుడు వికసిత భారత్‌ కనుచూపు మేరలో కనిపించకపోయినా పట్టపగలు అరుంధతి నక్షత్రాన్ని చూపిన మాదిరి చెబుతున్నారు. ఒకసారి చెప్పినదాన్ని మరొకసారి మాట్లాడకుండా కొత్త పాట అందుకుంటున్నారు, అదే బిజెపి, నరేంద్ర మోడీ ప్రత్యేకత !

ఎం. కోటేశ్వరరావు
ఎం. కోటేశ్వరరావు
➡️