అక్షర తోరణం!

‘పుస్తకం నాకు గాఢనిద్రలో నుండి వెలుతురు తోటలోకి/ దారి చూపే వెన్నెల పూదోట/ మామూలు మనిషిని కావడానికీ బుద్ధుడు కావడానికీ/ ఎన్నెన్నో బోధనల్ని చేసేది పుస్తకమే/ మనిషిగా మనగలగడానికీ/ పదిమందిని మానవతా స్పర్శతో అక్కున చేర్చుకోవడానికీ/ పుస్తకం ఒక జీవన మార్గం/ పుస్తకమే ఒక జీవన గమ్యం’ అంటారు గ్రంథాలయ యాత్రికుడు మంచికంటి. రాతి యుగం నుంచి రాకెట్‌ యుగం వరకూ సమాజ అభివృద్ధి యానానికి పుస్తకాలే నిచ్చెన మెట్లు. ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా… మానవాభివృద్ధిలో అత్యంత కీలకం పుస్తకం. అందుకే అంటాడు ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌- ‘మానవుడు సృష్టించిన వాటిలో గొప్పది పుస్తకం’ అని. మనిషి జీవితాన్ని తీర్చిదిద్దేది పుస్తకమే. సమాజ మార్పులోనూ ముఖ్యపాత్ర పోషిస్తుంది పుస్తకం. కాగితాల్లో నిక్షిప్తం చేయబడిన దశాబ్దాల చరిత్ర పుస్తకాల్లో అమృతంలా ప్రవహిస్తూంటుంది. ఏ కాలం పుస్తకం చదివితే… ఆ కాలంలోని చారిత్రక, భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక వికాసంలోకి పఠితులను తోడ్కొని పోతుంది. ఒక సమాజపు అత్యున్నత స్థితిని కొలవగలిగే ప్రమాణాలే పుస్తకాలు. చదవడం అలవాటున్న వ్యక్తిని పరిపూర్ణమైన మనిషిగా మార్చేస్తుంది పుస్తకం.

ప్రతియేటా నూతన సంవత్సరాన్ని వెంటబెట్టుకొని, సంక్రాంతికి ముందే వచ్చే మరో పెద్ద పండుగ విజయవాడ పుస్తక మహౌత్సవం. ఒకటి కాదు, రెండు కాదు, వేలాది పుస్తకాలు ఒకేచోట బొమ్మల కొలువులా… హేమంతంలో విరబూసిన చామంతుల్లా… విద్యుద్దీపాల కాంతిలో విజ్ఞానజ్యోతులై ప్రకాశిస్తుంటాయి. విజయవాడ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న 34వ పుస్తక మహౌత్సవం… డిసెంబర్‌ 28 నుంచి జనవరి 7వ తేదీ వరకూ కొనసాగుతుంది. పుస్తకాలు మనకు అత్యంత ప్రియమైన సహచరులు, ప్రియనేస్తాలు. మనం ఎదగడానికి, నేర్చుకోడానికి… మన ఊహలను, ప్రపంచం గురించిన అవగాహనను పెంచడానికీ పుస్తకాలు దోహదపడతాయి. సాహిత్యంలోని అన్నిరకాల ప్రక్రియలను నింపుకొన్న పాత, కొత్త పుస్తకాల మేలు కలయిక ఈ పుస్తక మహౌత్సవం. ముఖ్యంగా ఈ పుస్తక ప్రదర్శనకు పిల్లలను తీసుకురావడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చొరవ చూపాలి. వారితో ఒక్క పుస్తకమైనా కొనిపించాలి… చదివించాలి. ఒక్కో చిత్రంలో నటించాక తనకు వచ్చిన పారితోషికంతో మొదట 100 డాలర్లకు పుస్తకాలు కొనేవాడట చార్లీ చాప్లిన్‌. పుస్తకాన్ని మించిన స్నేహితుడు, సన్నిహితుడు మరొకరులేరు. ‘నేను ఇంతవరకూ చదవని పుస్తకాన్ని తీసుకువచ్చి నన్ను కలిసిన వ్యక్తి నా ప్రాణ స్నేహితుడవుతాడు’ అంటాడు అబ్రహాం లింకన్‌.

నేటి ఆధునిక సమాజంలో ఎన్ని సాంకేతిక మార్పులు వచ్చినా, ఏఐ వంటి చాట్‌ బాట్‌లు ఎన్ని వున్నా… పుస్తక పఠనాన్ని మించినది లేదు. ట్యాబ్స్‌, ఈబుక్స్‌, యాప్స్‌ వంటివి అందుబాటులోకి వచ్చినా… పుస్తకం చదివిన అనుభూతి వాటితో కలుగదు. పైగా ఆ ఎలక్ట్రానిక్‌ పరికరాల నుంచి వెలువడే రేడియేషన్‌ కళ్లకు హాని కలిగిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఫ్యూ రీసెర్చ్‌ అంచనా ప్రకారం… ప్రపంచవ్యాప్తంగా 61శాతం పట్టణవాసులు, 58 శాతం గ్రామీణ ప్రాంత వాసులు పుస్తకాలు చదువుతున్నారు. భారత్‌లో 47 శాతం మంది పట్టణ, 53 శాతం మంది గ్రామీణ ప్రాంత చదువరులున్నారు. కాగా, తెలుగులో 14శాతం మంది పుస్తకాలు చదువుతున్నారు. మొత్తంగా భారతీయులు వారానికి 10.42 గంటలు చదువుతున్నారు. అమెరికన్‌ పుస్తకాల మార్కెట్‌ని పరిశీలిస్తే… గతేడాది అమ్ముడైన ప్రతి ఐదు ప్రతుల్లోనూ నాలుగు అచ్చు పుస్తకాలేనట. స్మార్ట్‌ఫోన్‌ అరచేతిలో వున్నా… పుస్తకం హస్తభూషణం అన్న మాట ఇంకా మసకబారలేదని ఈ లెక్కలే చెబుతున్నాయి. మంచి పుస్తకాలు చదవడం వల్ల ఎలాంటి చెడు ప్రభావాలూ వుండవు. ‘పుస్తకమే ఆత్మ వంటిది/ చదివితే కమ్మగుంటది/ ప్రతి మాట ప్రతి పుట/ నోటి కూడవుతది/ మెదడుకి పదును పెడతది’- అంటాడో కవి. పఠనం మనసును వికసింపజేస్తుంది, విస్తరింపజేస్తుంది. సత్‌ సాహిత్యం, సత్‌ సాంగత్యం మనో వికాసాన్ని పెంచుతుంది. పుస్తక పఠనాన్ని మహౌద్యమంగా ముందుకు తీసుకెళ్లాలి. భావితరానికి విజ్ఞాన బాంఢాగారాన్ని అందించాలి.

➡️