అయ్యో పింఛనుదార్లు!

Apr 6,2024 06:18 #edite page, #Pension

రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు పింఛనుదార్లను తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం క్షంతవ్యం కాదు. పింఛను తీసుకుందామని పండు ముదుసలులు మండుటెండల్లో క్యూ లైన్లలో నిలబడి ఆ సొమ్ము పొందకుండానే రాష్ట్రంలో ఏడుగురు తనువు చాలించడం అత్యంత విచారకరం. ప్రతి నెలా ఒకటో తారీఖున లబ్ధిదార్ల ఇంటివద్దకే పింఛను సొమ్మును గడచిన నాలుగేళ్లకు పైగా గ్రామ/ వార్డు సచివాలయ వలంటీర్లు అందజేస్తూవున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో వున్నందున వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయరాదంటూ సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సంస్థ రాష్ట్ర హైకోర్టు లో వ్యాజ్యం దాఖలు చేయడంతో ఈ సమస్య ముందుకొచ్చింది. పింఛను వలంటీర్లు కాకుండా ప్రభుత్వోద్యోగులే అందజేయాలని ఎన్నికల కమిషన్‌ మార్చి 30న ఉత్తర్వులిచ్చింది. సచివాలయ ఉద్యోగులతోనే వికలాంగులు, అనారోగ్యంతో వున్నవారు, వీల్‌ఛైర్‌కు పరిమితమైనవారు వగైరాలకు ఇంటివద్దనే అందజేస్తామని మిగతా వారంతా సచివాలయాలకు వెళ్లి సొమ్ము తీసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. నాలుగేళ్లకు పైగా ఇంటివద్దనే పింఛను పొందుతున్న పేదలు మండుటెండలో సచివాలయాలవద్ద రోజుల తరబడి పడిగాపులు పడవలసిరావడం బాధాకరం. ఆ రెండు పార్టీల ప్రయోజనాల కోసం మంట రాజేసి వికలాంగులు, వృద్ధులు మహిళలను సమిధలు గావించడం దారుణం.
గ్రామాల్లో సచివాలయ, పంచాయతీరాజ్‌ శాఖ ఉద్యోగులు, పట్టణాల్లో మునిసిపల్‌ ఇంకా ఇతర శాఖల ఉద్యోగులు తగినంత సంఖ్యలో ఉన్నారు. వారికి బాధ్యతనిచ్చి వివిధ ప్రభుత్వ పథకాలు అమలు చేసే స్కీం వర్కర్ల సహాయం తీసుకుంటే లబ్ధిదార్ల ఇంటికి వెళ్లి పింఛన్లు ఒక్క రోజులోనే అందజేయవచ్చు. కానీ ప్రభుత్వం అలాగాకుండా కేవలం వికలాంగులు, రోగులకే ఇంటివద్ద పింఛనులనీ మిగతా వారంతా సచివాలయాలకు వెళ్లవలసిందేనని నిర్ణయించింది. దాంతో వృద్ధులు ఎండల్లో కష్టాలు పడడం, కొందరు ఆసుపత్రులపాలు కాగా ఏడుగురు మరణించారు. ఆయా సచివాలయాల పరిధిలో చెల్లించవలసిన సొమ్ము కూడా సంబంధిత ఉద్యోగుల ఖాతాలకు సకాలంలో జమ కాకపోవడం, అయినచోట కూడా అవసరమైనంత కాకుండా కొంత కొరవ పడడం మరిన్ని ఇబ్బందులకు కారణమైంది. మొత్తంగా చూస్తే హైకోర్టు ఉత్తర్వులిచ్చిన వెంటనే తగు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నది స్పష్టం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదార్ల ఇంటివద్దకు చేర్చడం గ్రామ/ వార్డు సచివాలయ వలంటీర్ల ప్రధాన బాధ్యత. పథకాలకయ్యే ఖర్చు, వలంటీర్ల పారితోషికం అంతా సర్కారు ఖజానాదే. ప్రభుత్వాన్ని ఏ పార్టీ నడిపినా వలంటీర్‌ వ్యవస్థ తటస్థంగా, పక్షపాత రహితంగా ఉండాలి. కాని ప్రభుత్వం ఆది నుండీ వారిని రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం తగని పని. ప్రభుత్వంలో భాగమైన వలంటీర్ల వ్యవస్థను తటస్థంగా ఉంచేలా ఇప్పటికైనా తగు చర్యలు చేపట్టడం అవసరం. రెండు ప్రధాన పక్షాలూ వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తా మనే చెబుతున్నాయి కనుక భవిష్యత్తులో అది పటిష్టంగా అమలు కావాలంటే తటస్థ స్వభావం ఒక తప్పనిసరి లక్షణంగా ఉండాలి.
రాష్ట్రంలో ప్రతి అంశాన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం, ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం అటు ఎన్‌డిఎ కూటమి, ఇటు వైఎస్‌ఆర్‌సిపిలకు నిత్యకృత్యంగా ఉంది. రాజకీయ పార్టీలు ప్రజల ప్రయోజనాలు రక్షించాలి తప్ప తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఈ విధంగా వాడుకోవడం తగని పని. ఇంకా ఇవ్వవలసిన లబ్ధిదార్లకు పింఛన్లు ఇంటివద్దనే అందజేసేందుకు తగు చర్యలు చేపట్టాలి. ఎన్నికల ఫలితాలు జూన్‌ 4న వెలువడనున్నందున అప్పటి వరకు ఎన్నికల కోడ్‌ అమలులో వుంటుంది కనుక వచ్చే రెండు నెలల పింఛన్లు అందరు లబ్ధిదార్లకు ఇంటివద్దనే అందజేసేందుకు ప్రభుత్వం ఇప్పుడే నిర్ణయించాలి. అందుకు ఎన్నికల కమిషన్‌తో సహా ఏయే సంస్థల అనుమతులు, సమ్మతులు అవసరమో వాటిని ఇప్పుడే పొందాలి. పేదలు మళ్లీ మళ్లీ బాధలనుభవించే పరిస్థితి రాకూడదు.

➡️