అమెరికా మరింత ఒంటరి !

Dec 15,2023 07:10 #Editorial

అమెరికా పాటకు అనుగుణ్యంగా నృత్యం చేసేందుకు నిరాకరిస్తూ అత్యంత సన్నిహిత దేశాలైన కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వ్యతిరేకంగా ఓటేశాయి. పాలస్తీనా సమస్య మీద ఇజ్రాయిల్‌ ఇప్పటికే ప్రపంచం నుంచి వేరుపడింది. దాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న అమెరికా సైతం చివరికి స్నేహితుల నుంచి కూడా దూరం అవుతుందా అన్నట్లుగా ఉంది. ఆ దేశాలు పూర్తిగా తెగతెంపులు చేసుకుంటాయని అనుకోనవసరం లేదు గానీ అమాయక పౌరుల ప్రాణాలు తీస్తున్న ఇజ్రాయిల్‌ పట్ల అమెరికాతో కలసి నడిచేందుకు అవి సిగ్గుపడుతున్నాయి.

              ‘ఒక వేళనేను మరణించాల్సి వస్తే నా గురించి చెప్పటానికి మీరు జీవించి ఉండాలి’ అని చెప్పిన కొద్ది రోజులకే కవి, ఫ్రొఫెసర్‌ రిఫాత్‌ అలారిర్‌తో సహా ఆరుగురు కుటుంబ సభ్యులు తలదాచుకున్న ఇంటిని ఇజ్రాయిల్‌ మిలిటరీ కూల్చివేసి హత్య చేసింది. ఇలాంటి వారెందరో! పిల్లలను కోల్పోయిన తలిదండ్రులు, తల్లో, తండ్రో ఎవరో ఒకరిని కోల్పోయిన పిల్లలు పాతిక వేలమంది ఉన్నారన్న వార్తలు మానవత్వం ఏ కాస్త మిగిలి ఉన్నా కలచివేసేవే. అక్టోబరు ఏడు నుంచి పాలస్తీనియన్లపై అత్యంత పాశవిక మారణకాండకు పాల్పడుతున్న యూదు దురహంకార దాడులను విరమించాలని కోరుతూ ఐరాస సాధారణ అసెంబ్లీ మంగళవారం నాడు ఒక తీర్మాన్నాన్ని ఆమోదించింది. ఇది ఒక హెచ్చరిక తప్ప ఉల్లంఘించిన ఇజ్రాయెల్‌ మీద చర్య తీసుకొనేందుకు అవకాశం లేదు. యూదు దురహంకారుల మీద రోజు రోజుకూ వ్యతిరేకత, ప్రత్యేకించి విశ్వ విద్యాలయాల్లో పెరగటంతో జో బైడెన్‌కు సెగ తగిలింది. దాంతో స్వరంలో తేడా వచ్చింది.అనుసరిస్తున్న విధానాలు, చేపడుతున్న ప్రజా, ప్రజాస్వామిక వ్యతిరేక చర్యలు, దుర్మార్గానికి ఇస్తున్న మద్దతు వంటి తీరు తెన్నులతో ప్రపంచంలో అమెరికా మరింతగా ఒంటరి అవుతోంది.

అమెరికా పాటకు అనుగుణ్యంగా నృత్యం చేసేందుకు నిరాకరిస్తూ అత్యంత సన్నిహిత దేశాలైన కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వ్యతిరేకంగా ఓటేశాయి. పాలస్తీనా సమస్య మీద ఇజ్రాయిల్‌ ఇప్పటికే ప్రపంచం నుంచి వేరుపడింది.దాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న అమెరికా సైతం చివరికి స్నేహితుల నుంచి కూడా దూరం అవుతుందా అన్నట్లుగా ఉంది. ఆ దేశాలు పూర్తిగా తెగతెంపులు చేసుకుంటాయని అనుకోనవసరం లేదు గానీ అమాయక పౌరుల ప్రాణాలు తీస్తున్న ఇజ్రాయిల్‌ పట్ల అమెరికాతో కలసి నడిచేందుకు అవి సిగ్గుపడుతున్నాయి. పైన పేర్కొన్న మూడు దేశాలు, బ్రిటన్‌, అమెరికా కలసి ” ఐదు నేత్రాల ” పేరుతో గూఢచార సంస్థల సమాచారాన్ని పంచుకుంటున్నాయి. బహుశా దానిలో ఇజ్రాయిల్‌ను సమర్ధించే అంశం ఒక్కటి కూడా దొరికి ఉండదు. అందుకే అన్నింటా తోడుండే బ్రిటన్‌, జర్మనీ చివరికి అమెరికా సాయం కోసం అర్రులు చాస్తున్న ఉక్రెయిన్‌ కూడా ఐరాస ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. గాజాలో తక్షణమే దాడులను విరమించాలన్న తీర్మానాన్ని భద్రతామండలిలో గత శుక్రవారం నాడు అమెరికా వీటో చేసిన తరువాత ఐరాస సాధారణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా 153, వ్యతిరేకంగా పది, ఓటింగ్‌కు దూరంగా 23 ఉన్నాయి. ఇదే అంశంపై అక్టోబరు 26న జరిగిన ఓటింగ్‌లో 120-14-45 చొప్పున వచ్చాయి. తాజా ఓటింగ్‌ తీరు దేశాల వైఖరిలో వచ్చిన మార్పుకు నిదర్శనం. నాటి ఓటింగ్‌లో తటస్థంగా ఉన్న మన దేశం ఈ సారి అనుకూలంగా ఓటు వేయాల్సి వచ్చిందంటే అంతర్గతంగా ఇజ్రాయిల్‌ను బల పరచాలని ఎంతగా ఉన్నప్పటికీ వ్యక్తం చేయలేని స్థితి, సభ్య సమాజం వేలెత్తి చూపుతుందన్న భయం అన్నది స్పష్టం.

గాజాలో దాదాపు నివాస ప్రాంతాలన్నింటినీ కూల్చివేయట మో, ఉండటానికి పనికిరాకుండా చేయటమో చేశారు. పద్దెమినిది వేలు దాటిన మృతుల్లో సగం మంది పిల్లలే ఉన్నారు. హమాస్‌ తీవ్రవాదులు దాక్కున్నారంటూ కూల్చివేసిన ఆసుపత్రుల, విద్యా సంస్థల గురించి చెప్పనవసరం లేదు. ఇంత చేసినా బందీలుగా ఉన్న మిగతావారి ఆచూకీ గానీ, హమాస్‌ సాయుధులు ఎంత మందిని చంపివేసిందీ చెప్పలేని స్థితి ఒకవైపు. మరోవైపు అనేక చోట్ల ఎదురవుతున్న ప్రతిఘటనలో వేలాది మంది ఇజ్రాయెలీ సైనికులు మరణించటమో, కాళ్లు చేతులు పోగొట్టుకోవటమో జరిగిందనే వార్తలు. ఇజ్రాయిల్‌కు మద్దతు ప్రకటిస్తూనే గాజాలో అమాయకుల, పౌరుల ప్రాణాలు పోతున్నాయంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమైన సందర్భంగా జో బైడెన్‌ మంగళవారం నాడు మొసలి కన్నీరు కార్చాడు. వచ్చే ఏడాది ఎన్నికల్లో తనకు విరాళాలు ఇచ్చే వారితో జరిపిన సమావేశంలో విచక్షణా రహితంగా బాంబుదాడులు చేస్తున్నందున ప్రపంచమంతటా ఇజ్రాయిల్‌ మద్దతు కోల్పోతున్నదని కూడా అన్నాడు. మానవ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు ఇంతకాలం చెప్పిన అమెరికా ఇప్పుడు ఈ విధంగా మాట్లాడటం విధిలేక తప్ప మరొకటి కాదు. ప్రధాని నెతన్యాహు మంచివాడే గానీ అక్కడి ప్రభుత్వం ఆ దిశగా కదిలేందుకు ఆటంకంగా ఉందని, భద్రతా మంత్రి బెన్‌ గువిర్‌ మరికొందరు రెండు దేశాలు ఏర్పడాలన్న పరిష్కారాన్ని కోరుకోవటం లేదని బైడెన్‌ చెప్పటం నయవంచన. పార్టీ ఏదైనా నిజానికి అక్కడి పాలకులు, అధికార యంత్రాంగంలోని వారు దుర్మార్గంలో ఎవరూ ఎవరికి తీసిపోరు, అందరూ అందరే. అలాంటి వారిని బలపరుస్తున్న అమెరికా అధికార, ప్రతిపక్ష నేతలూ వారికేమీ తక్కువకాదు.

– ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌

➡️