మరో మంచి తీర్పు

Mar 6,2024 07:15 #Editorial

రాజకీయ పార్టీల నిధుల సమీకరణలో పారదర్శకతకు పాతరేసిన ఎలక్టొరల్‌ బాండ్ల స్కీమ్‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు తాజాగా 1998 జెఎంఎం ఎంపీల ముడుపుల కేసులో తీర్పును కొట్టివేస్తూ మరో మంచి తీర్పు ఇచ్చింది. ఈ రెండు తీర్పులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేవేననడంలో సందేహం లేదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు మోడీ అండ్‌ కో బరితెగిస్తున్న ఈ తరుణంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ముడుపులు తీసుకుని చట్టసభల్లో ఓటేయడం, మాట్లాడడం వంటివి చేస్తే బోనెక్కాల్సిందేనని, ఈ విషయంలో వారికి ఎలాంటి పార్లమెంటరీ ప్రత్యేక రక్షణలు ఉండవని ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పు ముమ్మాటికీ సరైనదే. ఇంతవరకు జెఎంఎం ఎంపీల ముడుపుల కేసులో అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును రక్షా కవచంగా చేసుకుని సభలో ఓటు వేయడానికి లేదా మాట్లాడడానికి ముడుపులు తీసుకుని దర్జాగా దొరల మాదిరిగా తిరిగే అవినీతిపరులైన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఈ తీర్పు ఓ గట్టి హెచ్చరిక అనే చెప్పాలి. రాజకీయాల్లో వికృత సంస్కృతి ఊడలు వేయడానికి ఆస్కారమిస్తున్న ఆ తీర్పు చెల్లదని తాజాగా ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇవ్వడం హర్షణీయం.

1993లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు నేతృత్వంలో మైనారీటీ కాంగ్రెస్‌ ప్రభుత్వం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కడానికి జెఎంఎం ఎంపీలకు ముడుపులు ముట్టజెప్పారన్న కేసులో నిందితులు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 105, 194ను ఉటంకిస్తూ, చట్టసభల్లో చేసే సభ్యుల చర్యలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావని వాదించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు నిర్భయంగా, స్వేచ్ఛగా సభలో మాట్లాడేందుకు, ఓటు వేసేందుకు ఈ అధికరణలు ప్రత్యేక రక్షణ కల్సిస్తున్నాయి. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చట్ట సభలో సభ్యులు నిర్భీతిగా, నిస్సంకోచంగా మాట్లాడడానికి, ఓటింగ్‌లో పాల్గొనే వాతావరణం కల్పించేందుకు ఈ రక్షణలు ఉద్దేశించినవే తప్ప, సభ్యుల అవినీతికర ప్రవర్తనకు రక్షా కవచాలు కావు అని సుప్రీం కోర్టు తాజా తీర్పు స్పష్టం చేసింది. ఇటీవల హిమాచల్‌ ప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికల్లో తగినంత బలం లేకున్నా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా అక్కడ బిజెపి ఎలా గెలిచిందీ అందరికీ ఎరుకే. ఇదొక్కటే కాదు, అదానీ అక్రమాల గురించి సభలో ప్రశ్నించినందుకు ఎంపీల ఇళ్లపైకి ఇడిని పంపి బెదిరించిన ఉదాహరణలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం చట్ట సభల్లో సభ్యుల భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రాధాన్యతను నొక్కి చెబుతూనే, అవినీతికర చర్యలకు పాల్పడినప్పుడు వారెంతటివారైనా బోనెక్కక తప్పదని స్పష్టం చేసింది. ముడుపులు తీసుకుని ఓటు వేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలను అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూట్‌ చేయడానికి ఇది వీలు కల్పించింది. ఆ విధంగా శాసన నిర్ణాయక ప్రక్రియలో ధనబలం పాత్రను నిరోధించేందుకు ఈ తీర్పు ఉపయోగపడుతుంది. జెఎంఎం వ్యవస్థాపకుడు షిబు సోరెన్‌ కోడలు, జెఎంఎం మాజీ ఎమ్మెల్యే సీతాసోరెన్‌ 2012 రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి నుంచి లంచం తీసుకుని, ఓటు వేశారన్న కేసులో ఆర్టికల్‌ 105, 194ను ప్రస్తావించి, నిందితులు ఈ కేసు నుంచి బయటపడాలని చూడడంతో సుప్రీం కోర్టు దీనిలో జోక్యం చేసుకుని లోపభూయిష్టమైన పాత తీర్పును కొట్టేసింది. తాము ఎన్నుకున్న ప్రతినిధులు ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడతారని ప్రజలు ఆశిస్తారు. వారి విశ్వాసాన్ని వమ్ము చేసి డబ్బులకు అమ్ముడుపోయే ప్రజా ప్రతినిధులను బోనులో నిలబెట్టాల్సిన అవసరాన్ని ఈ తీర్పు నొక్కి చెబుతోంది. మొత్తంగా ఈ తీర్ప శాసన నిర్మాణ ప్రక్రియ స్వచ్ఛంగా ఉండేందుకు, బేరసారాలు, వంటి తప్పుడు పనులకు పాల్పడకుండా సభ్యులను కట్టడి చేసే దిశగా వేసిన ఒక గొప్ప ముందడుగుగా నిలిచిపోతుంది.

➡️