కేజ్రీవాల్‌ అరెస్ట్‌ : సమైక్యంగా నిరసన తెలియచేయాలి !

Mar 30,2024 04:35 #editpage

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి) అరెస్టు చేసి అదుపులోకి తీసుకోవడమనేది భారతదేశంలో ప్రజాస్వామ్యం నెమ్మదిగా తుడిచిపెట్టుకుపోవడంలో కీలకమైన మలుపు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ దారుణమైన దాడి అనేక కోణాల్లో మొదటిదిగా భావించబడుతోంది. సిట్టింగ్‌ ముఖ్యమంత్రిని, పైగా అసెంబ్లీలో ఐదింట నాలుగు వంతుల కంటే ఎక్కువ మెజారిటీ కలిగిన పార్టీకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తిని అరెస్టు చేయడం తొలిసారి. జాతీయ పార్టీ అధినేతను కటకటాల వెనక్కి నెట్టడం కూడా ఇదే మొదటిసారి. లోక్‌సభ ఎన్నికలు ప్రకటించిన తర్వాత, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత ఇలా అరెస్టు ప్రహసనం జరగడం కూడా ఇదే ప్రథమం.
ప్రభుత్వ సాధనాలన్నింటినీ ఉపయోగించి ప్రతిపక్షాన్ని మొత్తంగా లేకుండా చేయాలన్నది పాలక పార్టీ ఉద్దేశంగా వుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను కీలకమైన ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. కేజ్రీవాల్‌ అరెస్టుకు ముందుగా, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను ఇ.డి అదుపులోకి తీసుకుంది. ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేసిన వెంటనే ఈ అరెస్టు చోటు చేసుకుంది. అంతకు ముందు, ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్‌ శిసోడియా కూడా అరెస్టయ్యారు. దాదాపు ఏడాది నుండి జైల్లో వున్నారు. ఇంకా అనేకమంది ప్రతిపక్ష నేతలు, మంత్రులు ఇలాగే జైల్లో వుండడమో లేదా కేంద్ర సంస్థల దర్యాప్తులను ఎదుర్కొనడమో చేస్తున్నారు. వీరందరూ కూడా బిజెపి యేతర రాష్ట్ర ప్రభుత్వాల్లోని మంత్రులు, నేతలే.
ప్రతిపక్ష నేతలను, చట్టసభల సభ్యులను బెదరించడానికి, వారు బిజెపి లోకి ఫిరాయించేలా చేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తున్నారు. ఎన్నికల బాండ్ల పథకం వివరాలన్నీ బహిర్గతమైన తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి) మోసపూరితమైన పాత్ర బయటపడింది. మద్యం విధానం కేసులో కేజ్రీవాల్‌ను ఇరికించారు. ఫార్మాస్యూటికల్‌ కంపెనీ ‘అరబిందో ఫార్మా’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శరత్‌చంద్ర రెడ్డిని ఇ.డి అరెస్టు చేసింది. 2022 నవంబరులో ఈ అరెస్టు జరిగిన ఐదు రోజుల తర్వాత ఆయన కంపెనీ రూ.5 కోట్లను ఎన్నికల బాండ్ల ద్వారా బిజెపికి విరాళంగా ఇచ్చింది. ఆ తర్వాత ఆయనకు బెయిల్‌ లభించింది, అప్రూవర్‌గా మారారు. నాలుగు మాసాల తర్వాత బాండ్ల ద్వారా బిజెపికి రూ.25 కోట్లు అందచేశారు. కేజ్రీవాల్‌ మీద, ఆప్‌ నేతల మీద కేసులు ఎలా మోపారో దీన్ని బట్టి తెలుస్తోంది.
ప్రతిపక్ష పార్టీలు ఇ.డి, సిబిఐల వేధింపులు, దాడులతో పాటుగా ఆదాయపన్ను అధికారుల దాడులను కూడా ఎదుర్కొంటున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.135 కోట్ల మేరకు పన్నులు చెల్లించాలంటూ పంపిన నోటీసులను ఎదుర్కొంటోంది. ఈ మొత్తాన్ని ఐ.టి విభాగం రికవరీ చేసుకోవడానికి ముందుగానే ఆ పార్టీ బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపచేశారు. ఇతర పార్టీలు కూడా ఇలాంటి చర్యలనే ఎదుర్కొంటున్నాయి. ఉదాహరణకు, 2016-17 సంవత్సరానికి సిపిఎం పన్ను మినహాయింపును ఉపసంహరించుకుంది. దేశవ్యాప్తంగా పార్టీకి గల వందలాది బ్యాంక్‌ ఖాతాల్లో కేవలం ఒక ఖాతాను లిస్ట్‌ చేయని సాంకేతికపరమైన లోపానికి గాను రూ.15.59 కోట్లను పన్నుగా చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ అవాంఛనీయ చర్యకు నిరసనగా సిపిఎం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ విషయం న్యాయస్థానం పరిధిలో వుంది.
ఎన్నికల బాండ్ల పథకం ద్వారా ప్రతిపక్షాలకు చట్టపరమైన నిధులను నిలిపివేసిన తర్వాత, ఎన్నికల ట్రస్టుల ద్వారా కార్పొరేట్ల విరాళాలను గుత్తాధిపత్యం చేసిన తర్వాత, శిక్షాత్మకమైన పన్ను విధింపు చర్యల ద్వారా ప్రతిపక్షాలను ఆర్థికంగా ఇరుకున పెట్టడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వ అధికారాలపై వ్యవస్థాగతమైన దాడులకు పాల్పడిన తర్వాత కేజ్రీవాల్‌ అరెస్టు చోటు చేసుకుంది. ప్రతిపక్ష పార్టీల మాదిరిగానే ప్రతిపక్షాల పాలనలో వున్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాడులను ఎదుర్కొంటున్నాయి. సమాఖ్యవాద సూత్రాలపైనే దాడులకు తెగబడడంతో ఇవన్నీ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ అరెస్టును భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పొంచి వున్న ముప్పుగా చూడాలి. ఇక ఎలాంటి సాకులు లేవు, వున్న ముసుగు కూడా తొలగించబడింది. నియంతృత్వ పాలన ఎన్నికల నిరంకుశత్వాన్ని స్థాపించింది. ఎన్నికల కమిషన్‌, కార్యనిర్వాహక వర్గం అధీనంలో వుంది. విరుచుకుపడుతున్న ప్రభుత్వంతో ఘర్షణ పడేందుకు ఉన్నత న్యాయవ్యవస్థ నిరాకరిస్తోంది.
ఇటువంటి పరిస్థితుల్లో లౌకిక, ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసి ప్రజల వద్దకు వెళ్ళడం, ప్రజాస్వామ్యానికి, పౌరుల హక్కులకు కలుగుతున్న ముప్పుకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడం తప్ప మరో మార్గం లేదు. ప్రజల నిరసనలు కేవలం ఢిల్లీకే పరిమితం కారాదు. దేశవ్యాప్తంగా ప్రతి చోటా వ్యాపించాలి, జరగాలి. మార్చి 31న ఢిల్లీలో ‘ఇండియా’ బ్లాక్‌ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తోంది. కేరళ ఈ విషయంలో ఇప్పటికే మార్గనిర్దేశనం చేసింది. అక్కడ రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రజా నిరసనలు, ప్రచారాలు, ఆందోళనలు చేపట్టడం, జరగడం అత్యంత ముఖ్యం. ప్రజా సమీకరణ ఈ రీతిలో చోటు చేసుకుంటే కచ్చితంగా ఎన్నికల్లో అది బిజెపిని దెబ్బతీస్తుంది.
(మార్చి 27 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

➡️