జనరిక్‌ మందులపై అవగాహన ముఖ్యం

Mar 12,2024 06:10 #edite page, #generic drugs, #medical

అనారోగ్యానికి గురైనప్పుడు వైద్యుల సూచనల ప్రకారం ఔషధాలు (టాబ్లెట్లు, ఇంజక్షన్లు, టానిక్కులు) తీసుకుంటుంటాం. ప్రస్తుతం మార్కెట్లో బ్రాండెడ్‌ ఔషధాల ధరలు ఎక్కువగా ఉండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు వాటిని కొనలేక సతమతమవుతున్నారు. అయితే మరోవైపు మార్కెట్లో ‘జనరిక్‌’ పేరుతో తక్కువ ధరకే నాణ్యమైన మందులు లభిస్తున్నప్పటికీ వాటి వినియోగానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
ఒక బ్రాండెడ్‌ కంపెనీ ఒక మందును తయారుచేసి మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. ఆ మందుపై పెట్టిన ఖర్చులు రాబట్టుకునేందుకు సుమారు 20 సంవత్సరాలు పడుతుంది. దానిని బట్టే ఆ కంపెనీ తయారుచేసిన మందుల ధర ఉంటుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సదరు కంపెనీకి పేటెంట్‌ హక్కులు 20 సంవత్సరాలకు ఇస్తుంది. అప్పటివరకు ఆ మందును ఏ ఇతర ఫార్మా కంపెనీ తయారు చేయడానికి వీలు లేదు. 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఏ ఇతర ఫార్మా కంపెనీ అయినా, ఆ మందును తయారు చేయవచ్చు. ఈ మందులనే జనరిక్‌ మందులు అంటారు. వీటికి ఖర్చు 30 నుండి 60 శాతం వరకు తగ్గుతుంది. అందుకనే మార్కెట్లో జనరిక్‌ మందులు, బ్రాండెడ్‌ మందుల కంటే మూడు నుండి ఐదు రెట్లు తక్కువకు లభిస్తాయి.
మన దేశంలో జనరిక్‌ మందులను ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉన్న కొన్ని పేరు మోసిన కంపెనీలు కూడా తయారు చేస్తున్నాయి. కరోనా సమయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో తయారుచేసిన జనరిక్‌ మందులను కరోనా కిట్ల రూపంలో ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. అయితే ప్రైవేట్‌ రంగంలో ఉన్న ఫార్మా కంపెనీలు కూడా జనరిక్‌ మందులు తయారుచేసి ప్రైవేట్‌ ఆసుపత్రులకు, వాటి ఆధ్వర్యంలో విక్రయించే విక్రయశాలలకు సరఫరా చేస్తాయి. అయితే ప్రభుత్వ, ప్రవేటు రంగాలలో జనరిక్‌ మందులు తక్కువ ధరకే తయారవుతున్నప్పటికీ ప్రైవేటు రంగంలో తయారవుతున్న మందులను ప్రభుత్వ జనరిక్‌ మందుల కంటే కొంచెం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు లభించే జనరిక్‌ మందులు ఏ మాత్రం ప్రభావం చూపవని మానసికంగా ముద్ర వేస్తున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ రంగాలలో మందులు తయారు చేయాలంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్‌.ఓ), నేషనల్‌ అక్రిడిటెడ్‌ బోర్డ్‌ ఫర్‌ లాబరేటరీస్‌ (ఎన్‌. ఎ. బి.ఎల్‌) పరీక్షలు నిర్వహించిన తర్వాత వాటి నాణ్యతను పరీక్షించి ఆమోదం ఇస్తాయి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో తయారైన మందులు ఒకే నాణ్యత కలిగినవిగా ఉంటాయి. ఒకేలా పనిచేస్తాయి. అందువల్ల తక్కువ ధరకు లభించే జనరిక్‌ మందులు కూడా మంచి నాణ్యమైనవని మనం గమనించాలి.
ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికాలో ఎక్కువగా జనరిక్‌ మందులనే వినియోగిస్తారు. అమెరికాలో 10 మంది రోగులలో ఎనిమిది మంది రోగులకు జనరిక్‌ మందులను అక్కడి వైద్యులు మందుల చీటీలో రాస్తారు. కానీ మన దేశంలో పది మంది రోగులలో 8 మందికి డాక్టర్లు ప్రైవేటు కంపెనీలు తయారు చేస్తున్న బ్రాండెడ్‌ మందులనే రాస్తున్నారు. ఇందుకు కారణాలు పరిశీలిస్తే ప్రైవేటు కంపెనీలు చేస్తున్న మాయాజాలమని చెప్పుకోవచ్చు.
జనరిక్‌ మందులపై ప్రజలకు తగినంత అవగాహన లేదు. దీంతో పాటు వీటి ధరలు తక్కువగా ఉండటంతో బ్రాండెడ్‌ మందుల కంపెనీలు జనరిక్‌ మందులపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. అందుకే జనరిక్‌ మందులు చాలా ప్రభావవవంతమైనవన్న వాస్తవాన్ని ప్రభుత్వాలు ప్రజలకు తెలియచెప్పాలి. అప్పుడే జనరిక్‌ మందులకు మంచి జనాదరణ లభిస్తుందనటంలో సందేహం లేదు.

– సి.ఎన్‌.మూర్తి,

సెల్‌ : 8328143489

➡️