దక్షిణాదిన బిజెపి విస్తరణను అడ్డుకోవాలి

Jun 15,2024 04:45 #editpage

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చూస్తే మొత్తంమీద బిజెపికి ఎదురుదెబ్బ తగిలిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. అది కేవలం 240 స్థానాలు మాత్రమే తెచ్చుకోగలిగింది. 2014, 2019 ఎన్నికలలో వచ్చిన ఫలితాలను చేరుకోలేకపోయింది. నరేంద్ర మోడీ ఇప్పుడు నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్‌డిఎ) మిశ్రమ ప్రభుత్వానికి నాయకత్వం వహించాల్సిన స్థితి. మెజార్టీ కోసం తెలుగుదేశం, జనతా దళ్‌ (యునైటెడ్‌) వంటి పార్టీలపై ఆధారపడవలసిన స్థితి. ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి తీవ్రంగా నష్టపోయింది. మహారాష్ట్ర, రాజస్థాన్‌, హర్యానా, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలలోనూ దెబ్బతిన్నది. ఏమైనా ఫలితాలను అంచనా వేసేప్పుడు బిజెపి కొత్తగా లబ్ధి పొందిన విషయాన్ని కూడా విస్మరించకూడదు. ఒడిషాలో బిజెపి మున్నెన్నడూ లేని విజయాలు సాధించింది. 21 లోక్‌సభ స్థానాలలో 20 తెచ్చుకోవడమే గాక మొట్టమొదటి సారిగా శాసనసభ లోనూ సంపూర్ణమైన ఆధిక్యత సాధించింది. దక్షిణ భారత రాష్ట్రాలలో బిజెపి క్రమానుగతంగా ముందుకుపోతున్న స్థితి ప్రత్యేకంగా ఆందోళన చెందాల్సిన అంశం.

సీట్ల వారీగా చూసినప్పుడు బిజెపి ఈ ప్రాంతంలో పెద్ద పురోగతి సాధించినట్టు కనిపించకపోవచ్చు. ఎందుకంటే అయిదు దక్షిణాది రాష్ట్రాలలో కలిపి దానికి 2019లో 29 సీట్లు వస్తే ఇప్పుడు 2024 లోనూ ఆ సంఖ్య పెరిగింది లేదు. కానీ రాష్ట్రాల వారీ పరిస్థితులు, ఓట్ల వాటా బాగా లోతుగా విశ్లేషిస్తే ఒక్కో రాష్ట్రంలో ఓట్ల వాటా పెంచుకోవడంలో అది లాభపడిన తీరు భిన్నంగా కనిపిస్తుంది.
రాష్ట్రాలలో ఫలితాల తీరు
తెలంగాణలో బిజెపికి 2019లో నాలుగు సీట్లు, 19.45 శాతం ఓట్లు రాగా 2024 ఎన్నికలలో ఆ సంఖ్య రెట్టింపై 8 సీట్లు గెలవగలిగింది. ఓట్ల వాటా కూడా గణనీయంగా 35.19 శాతానికి పెరిగింది. బిఆర్‌ఎస్‌ ఓట్ల వాటా దారుణంగా పడిపోవడం బిజెపికే మేలు చేసింది. కర్ణాటకను తీసుకుంటే బిజెపికి కొంత బలం పోగొట్టుకున్నది. 2019 ఎన్నికలలో అది 25 సీట్లు 51.38 శాతం ఓట్లు తెచ్చుకుంటే ఇప్పుడు 17 సీట్లకు పరిమితమై 46.09 శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగింది. అయితే జత కలిసిన జనతాదళ్‌ (ఎస్‌) 5.64 శాతం ఓట్లు తెచ్చుకోవడంతో మొత్తం ఎన్‌డిఎ ఓట్ల శాతం 51.73గా వుంది. ఈ కలయిక వల్ల సీట్ల తగ్గుదలను కూడా నిలవరించగలిగింది. ఇక కేరళలోనైతే బిజెపి త్రిసూర్‌ సీటు గెలిచి మొదటిసారి ఒక లోక్‌సభ స్థానం పొందగలిగింది. ఓట్లలో దాని వాటా కూడా 2019లో 12.9 శాతం వుంటే ఇప్పుడు 16.67 శాతానికి పెరిగింది. మొత్తం ఎన్‌డిఎ వాటా 19.2 శాతానికి అంటే కేరళలో ఎన్నడూ రానంత అధికంగా పెరిగింది. ఈ ఫలితం ఇస్తున్న హెచ్చరికను వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు చాలా తీవ్రంగా తీసుకోవలసి వుంది.
తమిళనాడులో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్నో గొప్పలు చెప్పుకున్నప్పటికీ బిజెపి ఒక్క సీటు కూడా తెచ్చుకోలేకపోయింది. 2019లో అన్నాడిఎంకెతో కలసి పోటీ చేసిన ఆ పార్టీ ఈ సారి పిఎంకె వంటి కొన్ని చిన్న పార్టీలతో అన్నాడిఎంకె చీలిక వర్గాలతో కలసి విడిగా పోటీ చేసింది. 2019లో అయిదు సీట్లకు పోటీ చేసిన బిజెపి ఓట్ల శాతం 3.66 శాతం అయితే ఇప్పుడు 11.24 శాతానికి పెరిగింది. పది నియోజక వర్గాలలో బిజెపి రెండవ స్థానంలో రావడం గమనించవలసి వుంది. అంటే కొన్ని సీట్లలో అది ఎఐడిఎంకె ఓట్లను తెచ్చుకోగలిగిందని అర్థమవుతుంది. ఇక బిజెపి చాలా బలహీనంగా వున్న ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పొత్తు వల్ల లాభపడింది. 2019లో కేవలం 0.96 శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకున్న ఆ పార్టీ ఇప్పుడు మూడు పార్లమెంటు సీట్లు, 11.29 శాతం ఓట్లు తెచ్చుకోగలిగింది. 2024లో దానికి ఓట్ల పరంగా 2.83 శాతంతో తక్కువగానే తెచ్చుకున్న ఎనిమిది అసెంబ్లీ సీట్లు పొందగలిగింది. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఆ పార్టీ మంత్రి చేరారు. టిడిపి భుజం పైకెక్కి బిజెపి విస్తరించాలని ఆశపడుతున్నది.
విస్తరణను నిరోధించాలి
అయిదు దక్షిణాది రాష్ట్రాలలో బిజెపి సాధించిన ఫలితాలపై ఈ క్లుప్త చిత్రం ఒక విషయం వెల్లడిస్తున్నది. గతంలో అది కర్ణాటకలో రెండు దశాబ్దాల కిందటే బిజెపి బలమైన పునాది ఏర్పర్చుకుంది. మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో కూడా నెమ్మదిగా అప్పుడప్పుడూ ఆగుతూనైనా బిజెపి ముందుకు సాగుతున్నది. దీన్నిబట్టి స్పష్టమయ్యేదేమంటే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమి తాము పోగొట్టుకున్న జాగాలను మళ్లీ కొత్తగా సమకూర్చుకోగల సత్తా పోగొట్టుకోలేదు.
మోడీ నాయకత్వంలో కొత్త మంత్రివర్గం కూర్పును బట్టి చూస్తే హోం, రక్షణ, ఆర్థికం, విదేశీ వ్యవహారాలతో పాటు కీలక శాఖలన్నీ బిజెపినే అట్టిపెట్టుకుంది. అటు ప్రభుత్వ యంత్రాంగం ద్వారానూ ఇటు తమ సంస్థాగత వనరులతోనూ బిజెపి ఆరెస్సెస్‌ కూటమి తన పట్టు విస్తరించుకోవడానికి, పెంచుకోవడానికి పని చేస్తుంది. వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు అఖిల భారత స్థాయిలోనూ రాష్ట్రాల వారీగానూ హిందూత్వ భావజాలాన్ని, రాజకీయ కార్యకలాపాలను నిరోధించడానికి తగిన విధానాలు, పద్ధతులు రూపొందించుకోవలసి వుంటుంది.
( జూన్‌12 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం )

➡️