పెట్టుబడిదారీ వ్యవస్థలో పేదరికం-ప్రత్యేకతలు

ఆర్థిక వ్యవస్థ అనేది ఏ కాలం నాటిదైనా, పేదరికం అనేది ఒకే విధంగా ఉంటుంది అనే అభిప్రాయం కొందరికి ఉంది. కొంతమంది పేరుగడించిన ఆర్థికవేత్తలు సైతం ఇదే అభిప్రాయంతో ఉంటారు. కాని అంతకు మునుపు ఉన్న వ్యవస్థలతో పోల్చితే పెట్టుబడిదారీ వ్యవస్థలో పేదరికం పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఉత్పత్తి విధానం ఏదైనప్పటికీ, కొన్ని కనీస అవసరాలను పొందగలిగే స్తోమత గనుక లేకుంటే దానిని పేదరికంగా గణాంకవేత్తలు పరిగణిస్తారు. ఐతే, పెట్టుబడిదారీ వ్యవస్థకు స్వత:సిద్ధమైన సామాజిక సంబంధాల ఫలితంగా కేవలం కనీస అవసరాలను పొందలేని పరిస్థితి మాత్రమే గాక తీవ్రమైన అభద్రత, ఆత్మగౌరవాన్ని సైతం కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఇదంతా కలిసి ఆ పేదరికపు స్థితిని దుర్భరం చేస్తాయి.
పెట్టుబడిదారీ వ్యవస్థలోని పేదరికానికి నాలుగు లక్షణాలు ఉంటాయి. మొదటిది: వారి పరిస్థితులతో నిమిత్తం లేకుండా ప్రభుత్వానికి వారు చెల్లించవలసినది తప్పనిసరిగా చెల్లించితీరాలి. దీని వలన వాళ్ళు తమకున్న ఆస్తులను పోగొట్టుకుని, మరింత పేదరికంలోకి దిగజారి చివరికి దిక్కు లేనివారుగా అయిపోతారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు మునుపు ఉన్న వ్యవస్థలో, ఉదాహరణకు, మొఘల్‌ చక్రవర్తుల కాలంలో రైతులు ప్రభుత్వానికి తాము పండించిన పంటలో ఒకానొక భాగాన్ని శిస్తుగా చెల్లించవలసి వుండేది. అంటే పంటలు సరిగా పండని కాలంలో వాళ్ళు తక్కువ మొత్తంలో శిస్తు చెల్లించేవారు. పంటల దిగుబడి తగ్గినందువలన పడే భారాన్ని రైతులు కొంత, రాజు కొంత పంచుకునేవారు. కాని బ్రిటిష్‌ హయాంలో నెలకొన్న పెట్టుబడిదారీ విధానంలో పండిన పంటతో నిమిత్తం లేకుండా కేవలం కొంత భూభాగాన్ని ఉపయోగించి వ్యవసాయం చేయడానికి అనుమతి పొందినందుకుగాను, భూమిశిస్తు చెల్లించవలసిన విధానం అమలులోకి వచ్చింది. పంటలు పండినా, పండకపోయినా, ఈ శిస్తు మాత్రం తప్పదు. అంటే కరువు, కాటకాల భారాన్ని ప్రభుత్వం పంచుకోదు. పేదలే భరించాలి. ప్రభుత్వానికి రావలసిన ఆదాయం తగ్గదు. ఆ శిస్తులు చెల్లించలేక క్రమంగా రైతులు అప్పులపాలై, తమ భూములను వడ్డీ వ్యాపారులకు కోల్పోయి మరింత దిగజారిపోయేవారు. ఆ విధంగా పేదలు తమకుండే కొద్దిపాటి భూమినీ కోల్పోయి దిక్కూ మొక్కూ లేని స్థితికి దిగజారడం పెట్టుబడిదారీ విధానంలో ఒక లక్షణంగా మనకి కనిపిస్తుంది. జరిగిన ఉత్పత్తిలో ఒక భాగాన్ని చెల్లించే పద్ధతి బదులు దానితో నిమిత్తం లేకుండా, ఉత్పత్తి జరిగినా, జరగకపోయినా ఒక నిర్ణీత మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సిందే. ఈ సూత్రం కారణంగా పేద రైతులు తమ భూములను వడ్డీ వ్యాపారుల పరం చేసి నిరాధారంగా మరింత దారిద్య్రంలోకి దిగజారిపోవడం జరుగుతుంది. అంటే పెట్టుబడిదారీ విధానం పేదలను దరిద్రం లోంచి బైటకు లాగేందుకు కాక, వారిని మరింత దారిద్య్రం లోకి నెడుతుంది. పేదరికంలో ఉన్నవారి వినియోగ శక్తిని పెంచే బదులు, వారి దగ్గర మిగిలి వున్న కొద్దిపాటి సంపదను సైతం హరిస్తుంది. ఇది ఏదో యథాలాపంగా జరిగే ప్రక్రియగా కాకుండా, పెట్టుబడిదారీ వ్యవస్థలో నిబిడీకృతమై ఉండే ప్రక్రియగా మనం చూడాలి.
ఇక రెండవ లక్షణం: పెట్టుబడిదారీ దశలో పేదలు వ్యక్తులుగానో, వ్యక్తిగత కుటుంబాలుగానో ఆ పేదరికపు ఈతి బాధల్ని భరిస్తారు. అదే అంతకు ముందున్న సమాజాలలో ఏదైనా కష్టం వస్తే ఒక సమూహంగా-అది కుల సమూహంగా కాని, లేదా మొత్తం గ్రామ ప్రజలంతా కాని- దానిని భరించే పరిస్థితి ఉండేది. ముఖ్యంగా కరువు కాటకాల సమయంలో ఇది వ్యక్తం అయేది. పెట్టుబడిదారీ సమాజంలో వ్యక్తి లేదా వ్యక్తిగత కుటుంబం ఒక స్వతంత్ర ఆర్థిక యూనిట్‌గా పరిగణించబడుతుంది. అందుచేత ఈ సమాజంలో పేదలు ఆ పేదరికపు కష్టాలను వ్యక్తులుగా, తమ సమూహంతో సంబంధం లేకుండా ఎవరికి వారుగా అనుభవించాల్సి వుంటుంది.
మార్క్సిస్టులు తప్ప తక్కిన ఆర్థికశాస్త్ర నిపుణులు ఎవరూ ఈ తేడాలను చూడలేరు. ఎందుకంటే వారికి చారిత్రక పరిశీలన ఉండదు. చరిత్ర పట్ల గుడ్డితనాన్ని ప్రదర్శించే సాంప్రదాయ ఆర్థికవేత్తలను మార్క్స్‌ నిశితంగా విమర్శించాడు. ఒక వ్యక్తిని అతడు లేదా ఆమె జీవించివున్న కాలంతో, అప్పటి పరిస్థితులతో నిమిత్తం లేకుండా చూడడం, ఏ కాలంలోనైనా వ్యక్తి అదే వ్యక్తిగా మార్పు లేకుండా ఉంటాడని అనుకోవడం సాంప్రదాయ ఆర్థికవేత్తల విధానం. నయా సాంప్రదాయ ఆర్థికవేత్తలైన కార్ల్‌ మెంజెర్‌, స్టాన్లీ జివోన్స్‌ వంటి వారు కూడా వ్యక్తిని అతడి చుట్టూ ఉండే సామాజిక పరిస్థితుల నుండి విడదీసి కాలానికి అతీతమైన ”వ్యక్తి” చుట్టూ తమ ఆర్థిక విశ్లేషణలను అల్లేవారు. ఆ కారణంగా వీరంతా పెట్టుబడిదారీ వ్యవస్థలోని పేదరికానికి, అంతకు పూర్వపు దశలలోని పేదరికానికి గల తేడాను చూడలేకపోయారు. వ్యక్తిగా పేదరికపు ఈతిబాధలను ఒంటరిగా భరించడానికి, సామూహికంగా అంతకు ముందుకాలంలో భరించినదానికి తేడా వారి పరిగణనలో లేదు.
సమూహం నుండి విడిపోయిన, పరాయీకరణ చెందిన వ్యక్తులుగా పెట్టుబడిదారీ దశలో పేదలు ఉంటారు. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడడానికి వారు మళ్ళీ సంఘాల రూపంలో సామూహిక ప్రతిఘటనలకు పూనుకునే వరకూ ఇదే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఒంటరిగా మిగిలిపోవడం వలన పేదరికపు ఈతిబాధలనే గాక, వాటి పర్యవసానంగా కలిగే తీవ్ర మానసిక ఒత్తిళ్ళకు కూడా వారు లోనవుతారు.
ఇక మూడో లక్షణం గురించి చూద్దాం. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఒకవైపు హీనమైన వేతనాలతో పనులు చేసేవాళ్ళు, మరోవైపు ఉద్యోగ అవకాశాలే లేనివాళ్ళు ఉంటారు. ఇలా అవకాశాలు లేనివాళ్ళనే రిజర్వు సైన్యం అంటాం. ఈ రిజర్వు సైన్యానికి పేదరికపు కష్టాలు మరీ ఎక్కువగా ఉంటాయి. భారతదేశంలోనైతే ఉపాధి పొందుతున్న వాళ్ళకి, రిజర్వు సైన్యానికి మధ్య విభజనరేఖ స్పష్టంగా ఉండదు. కొద్దిమంది తప్ప తక్కినవారందరూ కొన్ని రోజులు పనుల్లో ఉంటారు, మరికొన్ని రోజుల్లో వాళ్ళకి పనులు దొరకవు. దొరికిన రోజుల్లో కూడా పూర్తి గంటలపాటు పనులు దొరకవు. పనులు దొరకకపోవడం వలన కలిగే మానసిక ఒత్తిడులు వారందరి మీదా తీవ్ర ప్రభావం చూపుతాయి. ఎవరికైనా పని దొరకలేదంటే అది అతడి లేదా ఆమె వ్యక్తిగత వైఫల్యంగా కనిపిస్తుంది. అందుచేత ఆ పరిస్థితి వారి ఆత్మగౌరవాన్ని బలంగా దెబ్బ తీస్తుంది. పేదరికం వలన కలిగే కష్టాలకు ఇది అదనం.
నాలుగో లక్షణం: తాము ఎందువలన పేదరికంలో మగ్గవలసి వచ్చిందో ఆ కారణాలు పేదలకు స్పష్టంగా తెలియకపోవడం. అంతకు ముందున్న సమాజాల్లో జరిగిన ఉత్పత్తి ఎంతో, దానిలో భూస్వామి లేదా రాజు ఎంత వాటా పట్టుకుపోతున్నాడో స్పష్టంగా కళ్ళ ముందు కనపడేది. ఒకవేళ ఉత్పత్తి తగ్గితే దానివలన తమ అవసరాలను ఏమేరకు కుదించుకోవలసి వస్తుందో వారికి స్పష్టంగా తెలిసేది. కాని పెట్టుబడిదారీ వ్యవస్థలో తమకు ఎందుకు ఉపాధి దొరకడం లేదో అందులో జీవించే పేదలకు తెలియదు. అలాగే ఉన్నట్టుండి ధరలు ఎందుకు పెరుగుతాయో, దాని ఫలితంగా అనేకమంది పేదరికపు ఊబిలో ఎందుకు దిగబడిపోతారో ఆ పేదలకే అంతుబట్టని ఒక రహస్యంగా మిగిలిపోతుంది.
1943లో బెంగాల్‌లో సంభవించిన కరువు మీద సత్యజిత్‌ రే ‘దూరపు ఉరుము’ అనే చిత్రాన్ని తీశారు. కరువు విజృంభించక మునుపే, జపాను సైన్యాలు సింగపూర్‌ ను ఆక్రమించిన అనంతరం, బెంగాల్‌లో ధరలు ఎలా పెరిగాయో అందులో వివరించారు. ఇప్పుడు కూడా ఉక్రెయిన్‌ యుద్ధం ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఆహారధాన్యాల ధరలు పెరుగుతున్నాయి. దాని పర్యవసానాలు ఆఫ్రికాలోనో, ఇండియాలోనో మారుమూల ప్రాంతాల్లో నివసించే పేదలు అనుభవిస్తున్నారు. పెట్టుబడిదారీ విధానంలో పేదరికం ఎందుకు కలుగుతుందో, దాని మూలాలు ఎక్కడున్నాయో పైకి కనపడవు. కాని ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగే పరిణామాల పర్యవసానాలు వేరే ఎక్కడో మారుమూల జీవించే ప్రజల మీద పడుతున్నాయి. దీనికి కారణం పెట్టుబడి ప్రపంచవ్యాప్తంగా మూల మూలకూ విస్తరించి సంబంధాలు నెలకొల్పుకోవడం. ఇది అంతకు పూర్వం ఉన్న సమాజాల్లో లేదు.
నేను పైన పేర్కొన్న నాలుగు ప్రత్యేక లక్షణాల కారణంగా ఎటువంటి పర్యవసానాలు ఉంటాయి అన్నది చూడాలి. ఇక్కడ నేను ఒక్కదాని గురించి మాత్రమే ప్రస్తావిస్తాను. చాలామంది సదుద్దేశం ఉన్నవాళ్ళు దేశంలో పేదరికం తగ్గాలన్నా, లేకపోతే పూర్తిగా నిర్మూలించబడాలన్నా, అందుకోసం ప్రభుత్వం బడ్జెట్‌లో పేదలకు కేటాయింపులు పెంచి వారి అందేట్టు చూడాలని అంటారు. తద్వారా అందరికీ సార్వత్రిక కనీస ఆదాయం వచ్చేట్టు చేయగలుగుతామని అంటారు. కాని ఈ విధంగా పూర్తి స్థాయిలో ఎక్కడా ఇంతవరకూ జరగలేదు. అందుచేత ఒక సామాజిక సమస్యగా పేదరికం కొనసాగుతూనే వుంది. పైగా ఇటీవల మరింత పెరుగుతోంది కూడా. నయా ఉదారవాద విధానాల ఫలితంగా ఆహారధాన్యాల ధరలు పెరగడం, అదే సమయంలో ఆర్థికమాంద్యం నెలకొనడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పేదలకు తోడ్పాటు అందించే విధానాన్ని ఎక్కడైనా అమలు చేసినా, అది చాలా స్వల్పంగానే ఉంది. ఐతే ఈ పరిష్కారం ఏ సమాజంలోని పేదరికానికైనా ఒకేవిధంగా వర్తించేటటువంటిది. సహాయం అందించడం ద్వారా పేదలకు ఊరట కలిగించడం అనేది పెట్టుబడిదారీ సమాజంలోనే కాదు, అంతకు పూర్వపు సమాజాలలో కూడా అదే ఫలితాన్ని ఇస్తుంది. మరి పెట్టుబడిదారీ సమాజానికి సంబంధించిన పేదరికపు ప్రత్యేక లక్షణాలను ఈ చర్య (ప్రభుత్వం సహాయపడడం) ఏ విధంగా పరిష్కరిస్తుంది? వ్యక్తిగత ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే నిరుద్యోగం ఫలితంగా కలిగే మానసిక వేదనను ఈ విధమైన సహాయ చర్యలు ఏ విధంగా పరిష్కరించగలుగుతాయి? అందుచేత పెట్టుబడిదారీ వ్యవస్థ కారణంగా ఏర్పడే పేదరికాన్ని తొలగించడానికి ఒకే పరిష్కారం సార్వత్రికంగా ఉపాధిని కల్పించడం. కీన్స్‌ మహాశయుడు పెట్టుబడిదారీ వ్యవస్థ లోపలే అందరికీ ఉపాధి కల్పించడం సాధ్యం అనే అభిప్రాయాన్ని కలిగి వుండేవాడు. కాని అతడి అభిప్రాయం తప్పు అని తేలిపోయింది. నేనీ విధంగా చర్చిస్తున్నానంటే దానర్ధం ప్రభుత్వం నుండి ఏ ఆర్థిక సహాయమూ పేదలకు అందించకూడదని ఎంతమాత్రమూ కాదు. అటువంటి సహాయం ఎంత అందించినా, అది ఈ సమాజంలో పేదరికానికి మూలం ఏమిటో దానిని పరిష్కరించలేదు అని నేను చెప్పదలిచాను.
ఇప్పుడు మన దేశంలో దాదాపు 80 కోట్ల మంది ప్రజానీకానికి నెలకు తలా 5 కిలోల చొప్పున ఆహారధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇందులో ఎంతమేరకు కింది దాకా సవ్యంగా అందుతోంది అన్న విషయంగాని, ఎంతకాలం ఈ పథకాన్ని కొనసాగిస్తారు అన్న విషయంగాని చూడాల్సిందే. అదలా ఉంచితే ఇటువంటి స్కీముని శాశ్వతంగా కొనసాగిస్తే అదే పేదరికాన్ని పరిష్కరిస్తుంది అని భావించడం పొరపాటు. పేదరికాన్ని ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో లేకుండా చేయాలంటే, అందరికీ ఉపాధిని కల్పించడం, విద్య, వైద్యం, వృద్ధాప్యంలో భద్రత, ఆహారం కల్పించడం జరగాలి. అప్పుడే పేదలు కోల్పోయిన తమ ఆత్మగౌరవాన్ని తిరిగి పొందగలుగుతారు. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో తామూ సమాన భాగస్వాములమేనని అనుకోగలుగుతారు. కాని ఈ పనులు జరగాలంటే అది నయా ఉదారవాద పెట్టుబడిదారీ చట్రాన్ని అధిగమించి బైటపడాల్సిందే.
నయా ఉదారవాద విధానాలు అమలులో ఉన్నంత కాలమూ ఎన్ని సహాయ కార్యక్రమాలు చేసినా, వాటి ద్వారా పేదరికాన్ని నిర్మూలించడం మాత్రం సాధ్యం కాదు.

ప్రభాత్‌ పట్నాయక్‌

( స్వేచ్ఛానుసరణ )

➡️