ఇదా సహకార ఫెడరలిజం?

coordinate federalism three states tableau rejects to republic parade

 

ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ఢిల్లీ, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, హిమాచల్‌ప్రదేశ్‌ తదితర ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల శకటాలను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడవటమే! ‘ఇండియా అనగా భారత్‌ రాష్ట్రాల సమాహారం’గా ఉంటుందంటూ రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య సూత్రాలకు, సమానత్వానికి ఈ చర్య విఘాతం. రాజ్యాంగానికి, దాని విలువలకు పునరంకితమౌతామని ప్రతినబూనడానికి గణతంత్ర దినోత్సవాలను నిర్వహించుకుంటాం. 75 సంవత్సరాల స్వాతంత్య్రోద్యమ అమృత ఉత్సవాలను జరుపుకుంటుండటంతో ఈ ఏడాది ఉత్సవాలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మత రాజ్యంగా మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న మోడీ సర్కారు అందుకు ఆటంకంగా ఉన్న రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేందుకు అన్ని యత్నాలు చేస్తోంది. ఈ ఏడాది రిపబ్లిక్‌ డే వేడుకలకు ఎంపికైన శకటాల తుది జాబితా ఇప్పటివరకూ ఖరారు కానప్పటికీ ప్రతిపక్షాల పాలనలో ఉన్న మూడు రాష్ట్రాల శకటాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి, సాధించిన ప్రగతికి, సాధించబోయే లక్ష్యాలకు ప్రతీకలుగా శకటాలను రాష్ట్రాలు రూపొందిస్తాయి. ఏటా జనవరి 26న రాజ్‌పథ్‌ (ప్రస్తుత కర్తవ్యపథ్‌)లో రాష్ట్రాలు ప్రత్యేక శకటాలను ప్రదర్శించడం 1953 నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది 30 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు రిపబ్లిక్‌ డే పరేడ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపాయి. ఏటా 15 నుంచి 16 రాష్ట్రాలకే అవకాశం లభిస్తోంది. 2017 నుంచి గత ఎనిమిదేళ్లలో ఆరు సార్లు పంజాబ్‌, ఐదుసార్లు పశ్చిమబెంగాల్‌, మూడుసార్లు ఢిల్లీ శకటాలు తిరస్కరణకు గురయ్యాయి. ‘ప్రజాస్వామ్యానికి తల్లి – ఇండియా’ ‘వికసిత భారత్‌’ ఈ ఏడాది రిపబ్లిక్‌ డే దినోత్సవ కీలక అంశాలుగా కేంద్రం సెప్టెంబర్‌లో ప్రకటించింది. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌, లాలా లజపతిరారు వంటి స్వాతంత్య్ర సమరయోధుల త్యాగనిరతిని చాటేలా పంజాబ్‌, విద్య, వైద్య రంగాల్లో ప్రగతిపై ఢిల్లీ, కన్యాశ్రీ పథకాన్ని పరిచయం చేస్తూ పశ్చిమ బెంగాల్‌ శకటాలను రూపొందించాయి. ఏటా మాదిరిగానే కేంద్రం చెప్పేదొకటే… ఆయా రాష్ట్రాల శకటాలు తమ ఇతివృత్తాలకు అనుగుణంగా లేవని.గత ఏడాదిసైతం ఇదే తంతు చోటుచేసుకుంది. బిజెపి ఏలుబడిలోని ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, హర్యానా, మేఘాలయ, జమ్ముకాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, గోవాతోపాటు ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మరో రెండు మూడు రాష్ట్రాల శకటాలకే అనుమతించారు. కేరళ ప్రభుత్వం రూపొందించిన నారాయణ గురు శకటాన్ని, తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన తొలి స్వాతంత్య్ర సమరయోధురాలు వేనాచయ్యర్‌ శకటాన్ని, మన రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య శకటాన్ని, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం రూపొందించిన సుభాష్‌ చంద్రబోస్‌ శకటాన్ని తిరస్కరించారు. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని చాటిచెప్పేలా శకటాలు రూపొందించాలంటూ…అలాంటి త్యాగశీలుర శకటాలను తిరస్కరించడం బిజెపి కపటత్వానికి నిదర్శనం. ఇవన్నీ ప్రదర్శనకు నోచుకుంటే దేశ ప్రజలను ఏకతాటిపై నిలిపిన మహోజ్వల చరితను కళ్ల ముందు సాక్షాత్కరింపజేయడమే. ఆ మహత్తర పోరాటంలో ఎటువంటి భాగస్వామ్యం లేకపోగా, నీరుగార్చేందుకు శాయశక్తులా ప్రయత్నించిన ఆర్‌ఎస్‌ఎస్‌ అసత్య ప్రచారం సాగిస్తోంది. నాటి ఉద్యమ ఘట్టాలు వెలుగుచూస్తే.. తమ బాగోతం బయటపడుతుందనే గత ఏడాది తిరస్కరింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పాల్సిన గణతంత్ర వేడుకల్లో లౌకిక విలువలకు, రాష్ట్రాల హక్కులకు విఘాతం కలిగించడం రాజ్యాంగంపై దాడే. ఈ ఏడాది ప్రదర్శనకు ఎంపికైన శకటాల్లో 90 శాతం బిజెపి పాలనలోనివేనని పంజాబ్‌ సిఎం పేర్కొన్నారు. రాజకీయ కారణాల వల్ల రాష్ట్రాల శకటాలను తిరస్కరించారన్న విమర్శలపై పూర్తిస్థాయిలో స్పందించి, వాటిని సరిచేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఇప్పటికైనా కేంద్రం ప్రకటించిన ఇతివృత్తానికి అనుగుణంగా రూపొందించిన శకటాలను అనుమతించాలి. భారత రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి వ్యవహరించాలి. అందుకు కేంద్రంపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజాతంత్ర వాదులు ఒత్తిడి తేవాలి.

➡️