దిద్దుబాటు !

Mar 2,2024 07:10 #Editorial

               కేరళ లోకాయుక్త (సవరణ) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారంనాడు ఆమోద ముద్ర వేయడం హర్షణీయం. కేరళ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై సంతకం చేయడానికి మొండిగా నిరాకరించి మోకాలడ్డిన గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ వైఖరికి ఇది చెంపపెట్టుగా భావించవచ్చు. ప్రజలెన్నుకున్న అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం కోసం సుప్రీం కోర్టు గడపతొక్కి న్యాయ పోరాటం సాగించిన కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వానికిది ఘన విజయం. ఈ కేసు విచారణ సందర్భంగా గవర్నర్‌ తీరును సుప్రీం ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించడం, ”రెండేళ్లుగా గవర్నర్‌ ఏం చేస్తున్నారు? బిల్లులు ఎందుకు నిలిపి ఉంచారు? ఇంతకాలం పాటు బిల్లులను తొక్కిపట్టడానికి కారణం ఎందుకు చెప్పలేదు? చట్టాలను రూపొందించే శాసనసభల అధికారాల్లో జోక్యం చేసుకునే విధంగా గవర్నర్‌ అధికారాలను దుర్వినియోగం చేయరాదు.” అని సాక్షాత్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాల తరువాత కూడా గవర్నర్‌ ఖాన్‌ బిల్లులను ఆమోదించకుండా వాటిని రాష్ట్రపతికి పంపారు. మార్చి మూడోవారంలో సుప్రీం కోర్టులో ఆ కేసు విచారించనుండగా లోకాయుక్త బిల్లును రాష్ట్రపతి ఇప్పుడు ఆమోదించారు. కేంద్ర న్యాయ శాఖ క్లియరెన్స్‌ ఇవ్వడం ద్వారా ఆ బిల్లు రాజ్యాంగ విరుద్ధమన్న గవర్నర్‌ వాదన అసంబద్ధమని తేలిపోయింది. గవర్నర్‌ అపచారాన్ని రాష్ట్రపతి సరిదిద్దినట్టు అనుకోవచ్చు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200 ప్రకారం శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ద్రవ్య బిల్లులు మినహా మిగతావాటిని నిలుపుదల (విత్‌హోల్డ్‌) చేయడం, లేదా రాష్ట్రపతికి పంపడం చేయవచ్చు. నిలుపుదల చేస్తే ఏవైనా సెక్షన్లను సవరించడం గురించి లేదా బిల్లు మొత్తాన్ని పున:పరిశీలించాలంటూ వీలైనంత త్వరగా శాసనసభకు పంపాలి. శాసన సభ అదే బిల్లును తిరిగి ఆమోదించి పంపితే గవర్నర్‌ తప్పక ఆమోద ముద్ర వేయాలని ఈ ఆర్టికల్‌ స్పష్టంగా పేర్కొంది. అంటే ప్రజల చేత ఎన్నికైన శాసనసభ చేసిన బిల్లులను చట్ట రూపం దాల్చకుండా చేసే హక్కు, అధికారం గవర్నర్‌కు లేవని రాజ్యాంగం తేల్చి చెప్పింది. రాజ్యాంగ నిర్ణాయక సభ చర్చలను పరిశీలించినా రాష్ట్ర పాలనలో గవర్నర్‌ పాత్ర అలంకార ప్రాయమైనదనీ, ప్రజలెన్నుకున్న అసెంబ్లీ, ఆ ప్రాతిపదికన ఏర్పడిన ప్రభుత్వానిదే నిర్ణయాత్మక పాత్ర అని తేటతెల్లమవుతుంది. పంజాబ్‌, కేరళ, తమిళనాడు ప్రభుత్వాల కేసు విచారణ సందర్భంగా గవర్నర్లు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కారంటూ భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య ఎంతో అర్ధవంతమైనది. తెలంగాణ గవర్నర్‌పై ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ‘సాధ్యమైనంత త్వరగా’ అనేది రాజ్యాంగపరంగా చాలా ముఖ్యమైనదనీ, రాజ్యాంగబద్ధ పదవుల్లో వున్నవారు ఆ విషయాన్ని మరచిపోకూడదని పేర్కొన్న విషయం తెలిసిందే.

శాసనసభల ఎన్నికల్లో బిజెపియేతర పార్టీలకు మెజార్టీ వచ్చినా డబ్బు సంచులతో ఫిరాయింపులను ప్రోత్సహించి లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొలిపి బెదిరించడం, మరో అస్త్రంగా గవర్నర్లను ప్రయోగించి దొడ్డిదారిన తమ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం కాషాయ పాలనలో సర్వసాధారణమైపోతోంది. ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలకు గవర్నర్ల ద్వారా అడ్డంకులు కల్పించి, పాలన సాగనీయకుండా చేయడం మరో దుర్నీతి. రాజ్యాంగబద్దంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి ప్రజలకందించాల్సిన అభివృద్ధి, సంక్షేమ చర్యలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే! రాజ్‌భవన్‌ ద్వారా రాజకీయాలు నడిపే విధానాలను బిజెపి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా విడనాడాలి. బరితెగించి వ్యవహరిస్తున్న కేరళ, తమిళనాడు, పంజాబ్‌, తెలంగాణ తదితర రాష్ట్రాల గవర్నర్లకు ముకుతాడు వెయ్యాలి. వారు చేసిన తప్పులను సరిదిద్దడం ఎంతో అవసరం. అలాగాకుండా ఏదో కంటి తుడుపు చర్యగానో లేక సుప్రీం ఆదేశాల నేపథ్యంలోనో ఈ బిల్లును మాత్రమే ఆమోదించి మిగతావాటిని తొక్కిపడితే ప్రజాస్వామ్య ప్రియులైన భారత ప్రజలు సహించబోరు కనుక అన్ని బిల్లులనూ త్వరగా ఆమోదించాలి.

➡️