చీకటి పర్వం

Dec 23,2023 07:20 #Editorial

                పార్లమెంటు శీతాకాల సమావేశాలు షెడ్యూలు కంటే ఒక రోజు ముందుగానే గురువారం ముగిశాయి. హంగులతో అధునాతనంగా నిర్మించిన పార్లమెంటు నూతన భవన సముదాయంలో ఈ నెల 4న ప్రారంభమై 21 వరకు సమావేశమయ్యాయి. మూడు క్రిమినల్‌ బిల్లులు సహా మొత్తం 19 బిల్లులు ఉభయ సభల్లో ఆమోదం పొందాయి. లోక్‌సభ 74 శాతం, రాజ్యసభ 79 శాతం ఉత్పాదకత సాధించినట్లుగా ప్రభుత్వం ప్రకటించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో మొట్ట మొదటి సారిగా భారతీయత జోడించిన క్రిమినల్‌ చట్ట బిల్లులను ఆమోదింపజేసుకున్నామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి స్వీయభుజకీర్తులు తగిలించుకొని బాకాలూదారు. కానీ వాస్తవంలో జరిగిందేమిటో దేశమంతా చూసింది. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండగానే 2001 డిసెంబరు 13న పార్లమెంటు పాత భవనంపై ఉగ్రవాదులు దాడి జరిగింది. నాటి దాడిలో అమరులైనవారిని స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్న రోజే పార్లమెంటు కొత్త భవనంలోకి చొరబడి దుండగులు ఎంతటి భయాత్పోతానికి గురి చేశారో చూశాం. బాంబులతో రంగుల పొగ వదిలి అధునాతన భవనమని మోడీ సర్కార్‌ చెబుతున్న పార్లమెంటు భద్రతా ప్రమాణాల డొల్ల తనాన్ని ఈ ఘటన రట్టు చేసింది. చొరబడిన దుండగులకు పాసులిచ్చిన బిజెపి ఎంపీని కనీసం ప్రశ్నించేందుకు కూడా మోడీ సర్కార్‌ ఉపక్రమించడం లేదు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రాపై అనర్హత వేటు వేయడంతో మొదలైన బిజెపి అప్రజాస్వామిక ఎత్తుగడలు శీతాకాల సమావేశాల చివరి రోజు వరకు కొనసాగాయి. భారత పార్లమెంటు చరిత్రలోనే ఒకే సెషన్‌లో 146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేసి మోడీ సర్కార్‌ ఒక చీకటి పర్వాన్ని లిఖించుకుంది. నూతన పార్లమెంటు భవనం గాండ్రించే సింహతలాటం, రాజదండాలతో నిరంకుశ రాచరికానికి ప్రతిబింబంగా ఉందని, దాని ఆకారమే ‘శవ పేటిక’ను తలపిస్తోందంటూ విమర్శకులు సంధించిన వ్యంగాస్త్రాలను రుజువు చేసేలా నిరంకుశ చర్యలతో ప్రజాస్వామ్య విలువలకు బిజెపి ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాల్లో సమాధి కట్టేసింది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో కాంగ్రెస్‌, మిజోరంలో జోరాం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ అధికారంలోకి రాగా మిగిలిన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో బిజెపి విజయం సాధించిన నేపథ్యంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడీవేడీగా జరుగుతాయని భావించినవారికి ఈ సెషన్‌ తీవ్ర అసంతృప్తిని మిగిల్చిందనే చెప్పాలి. భద్రతా వైఫల్యం, గంపగుత్తగా ప్రతిపక్షాల సభ్యులపై వేటు, క్రిమినల్‌ చట్టాలకు సంబంధించిన బిల్లులపై మాట్లాడేందుకు తమకు తగినంత సమయం ఇవ్వలేదని అధికార పార్టీ మహిళా ఎంపీలే నిట్టూర్చడం వంటి ఘటనలతో శీతాకాల సమావేశాలు వాస్తవరూపు దాల్చిన పీడకలగా నిలిచిపోయాయి. ప్రభుత్వ దుర్మార్గపు చర్యలను నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలోనే ప్రతిపక్షాల సభ్యులు నిరసన తెలియజేస్తే దానికి కూడా వక్రభాష్యాలు అల్లేసి, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కడ్‌కు అన్యాయం జరిగిపోయిందహో అంటూ పార్లమెంటులో బిజెపి నేతలు చేసిన చేష్టలు విరక్తి పుట్టించే నాటకాన్ని తలపించాయి.

భారత శిక్షాస్మృతి, భారత నేర ప్రక్రియా స్మృతి, భారత సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య సంహిత తీసుకొచ్చేందుకు ఉద్దేశించి మూడు బిల్లులను, టెలికమ్యూనికేషన్ల బిల్లును, భారత ఎన్నికల ప్రధాన కమిషనరు, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన సవరణ బిల్లును ఈ సెషన్‌లో ఆమోదింపజేసుకున్నారు. ఇవన్నీ కూడా భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలను, ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే బిల్లులే. ప్రతిపక్షమంటే ప్రజల గొంతుక. ప్రజల సమస్యలను ప్రస్తావించేలా చట్ట సభల అధిపతులు ప్రతిపక్షాల హక్కులను కాపాడి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ పార్లమెంటు ఉభయ సభల అధిపతులూ ఈ బాధ్యతను నిర్వహించకపోవడమే గాకుండా ప్రభుత్వానికి వంత పాడి సభాసాంప్రదాయాలను సైతం మంటగల్పారన్న విమర్శలకు శీతాకాల సమావేశాలే తార్కాణం. ఈ నిరంకుశ చర్యలకు చరమగీతం పాడాలంటే మోడీ సర్కార్‌ను సాగనంపడమే మార్గం. ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఇదే లక్ష్యంతోనే ఐక్యం అవ్వాలి.

➡️