శాస్త్రీయ దృక్పథంతోనే అభివృద్ధి

Jan 11,2024 06:38 #edite page

ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో మూఢనమ్మకాలు ఎంత తక్కువగా ఉంటే, ఆ దేశం అంతగా అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది. మన దేశంలో ముఖ్యంగా తరతరాలుగా పెద్దల నుండి వస్తున్న ఆచారాలు, సాంప్రదాయాల పేరుతో చాందసభావాలను ప్రజలు వదులుకోలేకపోతున్నారు. సైన్సు ఎంతగా అభివృద్ధి చెందినా కుడా మన మెదళ్లలో మన తాతయ్యలు, అమ్మమ్మలు నూరిపోసిన దేవుడూ, దెయ్యం, అడుగో బూచోడు లాంటి మాటలు, పుక్కిటి పురాణాల, మంత్రాలు శాపాలూ బారి నుండి బయటపడలేకపోతున్నాం. ఎంత చదువుకున్నా శాస్త్రీయ దృక్పథం లోపించిన కారణంగా డాక్టర్లు సైతం మృత్యుంజయ యాగాలు చేస్తున్నారు.

విద్యార్థులకు శాస్త్రీయ విద్య అందించాల్సిన అనంతపురం కె.డి. యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్లు యూనివర్శిటీలలో మృత్యుంజయ యాగాలు చేస్తున్నారు. వారణాశి లోని బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో భూతవైద్యాన్ని కొర్సులుగా పెడుతున్నారు. ఇప్పటికే కొన్ని యూనివర్శిటీలలో వాస్తు, జ్యోతిష్యాలను కోర్సులుగా పెట్టి, జనాన్ని మోసం చేసి బతకండని సర్టిఫికెట్లు ఇస్తున్నారు.

‘పదార్ధం సృష్టించబడదు, నాశనం కాదు, మార్పు చెందుతుంది’ అని విద్యార్ధులకు బోధించే ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌, ఎవడో ఒక బాబా నోట్లోంచి లింగం తీస్తే, అమాంతం వెళ్లి అతగాడికి సాష్టాంగ పడుతున్నాడు. సూర్యుడు చంద్రుడు భూమి ఒకదాని చుట్టూ ఒకటి తిరిగే క్రమంలో సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం ఏర్పడతాయని పాఠాలు చేప్పే సైన్సు పంతులు గ్రహణం రోజున గ్రహణ సమయంలో కదిల్తే అరిష్టమని దుప్పటి కప్పుకుని ముసుగు పెడుతున్నారు.

అర్టికల్‌ 51 ఏ (హెచ్‌)లో రాసుకున్న ప్రశ్నించేతత్వం, శాస్త్రీయ అలోచన, మానవ వాదాన్ని పెంచటం ప్రతి పౌరుని బాధ్యత అన్న సూత్రాలను అమలుపరుస్తామని ప్రమాణం చేసిన మోడీ గారు ఒక సైన్సు కాంగ్రెసు సభలో, పురాణాలలో వినాయకునికి ఏనుగు తల అతికించడాన్ని ఈరోజు జరిగే సర్జరీలతో పోల్చి చెప్పారంటే పాలకులు ఎంత అజ్ఞానంతో కూరుకుపోయారో ఉహించుకోవచ్చు. ప్రధానులకు సైతం సైన్సు తెలియదనుకోవాలా !!

ప్రభుత్వ భూములు ఆక్రమించి ఆశ్రమాల పేరుతో మోసం చేస్తున్న బాబాల దగ్గరకు అధికారికంగా వెళ్లి సాష్టాంగపడుతున్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, గవర్నర్లు, ప్రజాప్రతినిధులు రాజ్యాంగంలోని లౌకికవాదాన్ని మంటగలుపుతున్నా ఫరక్‌ వుండడంలేదు.

ఆధునిక విజ్ఞానంతో తయారుచేసిన ప్రచార సాధనాలు టీవీ, రేడియోలలో రంగురాళ్లు మీ జీవితాలు మారుస్తాయని, పేరు మార్చుకుంటే మీ జీవితాలు మారతాయని, పలానా రుద్రాక్షలు ధరిస్తే జీవితాలు మారతాయని, అశాస్త్రీయమైన వాస్తు జ్యోతిష్యాలను బోధించటం, అష్టలక్ష్మి యంత్రాలు ధరిస్తే లక్ష్మీ అమ్మవారు మీ ఇంట తిష్ట వేస్తుందని ప్రచారంచేసే ప్రకటనల వలన అమాయక ప్రజలు తమ ధన మాన ప్రాణాలను పోగొట్టుకుంటున్నా కూడా ప్రభుత్వాలకు పట్టడం లేదు. 2019లో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప సంఖ్యా శాస్త్రజ్ఞుడు చెప్పాడని తన పేరుని యడియారప్పగా మార్చుకున్నారు.

ఆ మధ్య మదనపల్లిలో ఒక బాబా బోధనలకు లోనై తల్లిదండ్రులు తమ ఇద్దరు కుమార్తెలను అత్యంత కిరాతకంగా చంపారు. గోదావరి జిల్లాలో యేసు ప్రభు పిలుస్తున్నాడంటూ ముగ్గురు మహిళలు ఉరివేసుకుని చనిపోయారు. కేరళలో ఒక ముస్లిం మహిళ ఆరు సంవత్సరాల కొడుకుని దైవం పేర బలి ఇచ్చింది.

ఈ రకంగా దేశంలో మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయి. అరికట్టాల్సిన అధికారులు సైతం మూఢనమ్మకాలతో మునిగిపోతున్నారు. వీటికి విరుగుడు ఒక్కటే. మూఢనమ్మకాల నిర్మూలన చట్టం. మూఢ నమ్మకాలను ప్రచారం చేసేవారిపైనా, వాటిని ప్రచారం చేసే ప్రసార సాధనాలపైనా చట్టం ఉండాలి. కర్ణాటక, మహారాష్ట్ర, మరికొన్ని రాష్ట్రాలలో ఉన్నట్లుగా మన రాష్ట్రంలో కూడా మూఢనమ్మకాల నిర్మూలన చట్టం ఆవశ్యకత ఎంతో ఉంది. అందుకోసం రాష్ట్రాల్లోని అన్ని హేతువాద నాస్తిక సంఘాలూ జెవివి, ఇతర అభ్యుదయ సంఘాలు కలసి పోరాడవలసిన అవసరం ఉంది.

– నార్నె వెంకట సుబ్బయ్య,

ఎ.పి హేతువాద సంఘం అధ్యక్షుడు.

➡️