అసమానతల వికాసం !

Feb 3,2024 07:20 #Editorial

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి ‘వికసిత భారత్‌’ లక్ష్యమంటూ గురువారంనాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2024-25 మధ్యంతర బడ్జెట్‌ సంపన్నులకు వికాసాన్ని సామాన్యులకు విఘాతాన్ని కలిగించేదిగా ఉంది. గత బడ్జెట్‌ అంచనాతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవిన్యూ రాబడి 13.3 శాతం పెరిగినప్పటికీ ద్రవ్యలోటు తగ్గించే పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలపై భారీగా కోత పెట్టింది. అందువల్ల సాధారణ ప్రజల ఆదాయాలు కుదించుకుపోయి వారి కొనుగోలు శక్తి క్షీణించడంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుంది. మూలధన వ్యయం కూడా తగ్గడంవల్ల భవిష్య వృద్ధి, ఆర్థిక మూల సూత్రాలపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. కొద్ది మంది లాభాలను గరిష్టంగా పెంచడానికి వీలుగా అసంఖ్యాక శ్రామికుల జీవనోపాధులను పీల్చి పిప్పి చేస్తున్న దుర్మార్గపు అభివృద్ధి నమూనాకు ప్రతిరూపం ఈ బడ్జెట్‌. ఇది ఇంగ్లీషు అక్షరం కె మాదిరి అభివృద్ధి అంటే సంపన్నులు మరింత పైకెగబాకితే సామాన్యుల బతుకులు మరింత కిందికి దిగజారుతాయి. కాబట్టి ఈ బడ్జెట్‌తో జరిగేది మరింతగా అసమానతల వికాసమే!

వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం, నీటిపారుదల, షెడ్యూల్డ్‌ కులాలు, తెగల అభివద్ధికి గత బడ్జెట్‌లో ప్రతిపాదించినదాని కంటే తక్కువ ఖర్చు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖర్చు గత కేటాయింపుల కంటే తక్కువగా ఉండటమే కాకుండా 2022-23 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ వ్యయం కన్నా కూడా తక్కువగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆహార సబ్సిడీ రూ.60,470 కోట్ల రూపాయలు తగ్గింది. అదే సమయంలో ఎరువులపై సబ్సిడీ రూ.62,445 కోట్లు, ఉపాధి హామీ పనులకు కేటాయింపు రూ.4806 కోట్ల మేర కోత పడింది. రాష్ట్రాలకు నిధుల బదలాయింపులో స్తబ్ధత నెలకొంది. మహిళా, శిశు సంక్షేమ పథకాల కేటాయింపుల్లో కూడా భారీగా కోత విధించడం అమానుషం. 2023-24లో వాస్తవ వద్ధి రేటు 7.3 శాతంగా ఉందని కేంద్రం చెప్పడం పూర్తిగా కల్పితం. ధరలు మండిపోయి ప్రజలు అల్లాడతుంటే 2023-24లో ద్రవ్యోల్బణం 1.6 శాతం మేర తగ్గిందనేది మరో కొండంత అబద్ధం. కార్పొరేట్‌ పన్ను, ఆదాయపు పన్ను ద్వారా ఆదాయం పెరిగిన మాట నిజమే! అయితే అందుకు కారణం పన్ను రేట్లు పెరగడం గాక సంపన్నుల ఆదాయంలో మరింత పెరుగుదల ఫలితంగా జరిగిందన్న విషయం గమనించాలి.

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మళ్లీ మొండి చెయ్యి చూపారు. ప్రత్యేక హోదా, అమరావతి రాజధానికి నిధులు, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో కొనసాగించే విషయం, పోలవరం నిర్వాసితులకు పునరావాసం, కడప ఉక్కు ఫ్యాక్టరీ వంటి ముఖ్యాంశాలు లేకపోవడం మరొకసారి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను వంచించడమే! రాష్ట్రం నుండి జిఎస్‌టి వసూళ్లు పెరిగినా రాష్ట్రం వాటా మాత్రం పెరగలేదు. అయినప్పటికీ రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్ర బడ్జెట్‌ను శ్లాఘించడం దారుణం. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బిజెపి కేంద్ర పాలకులకు వారెందుకింత లొంగుబాటుగా వ్యవహరిస్తున్నారో ప్రజలకు వివరించాలి. కేంద్రం చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలి. వైసిపి, టిడిపి, జనసేన సహా రాష్ట్రంలోని అన్ని పార్టీలూ ఆ ఉద్యమాల్లో భాగస్వాములు కావాలి. అయితే, దేశ ప్రజల అసంతృప్తిని పక్కదారి పట్టించడానికి అధికారంలోని పరివార్‌ శక్తులు మత విద్వేషాలను రాజేస్తున్నాయి. దేశాన్ని మత రాజ్యంగా మార్చడం కోసం రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నాయి. ఒకవైపు ఆర్థిక భారాలు ప్రజలపై వేసి కార్పొరేట్లకు దేశ సంపదను కట్టబెడుతూ మరోవైపు మతోన్మాద భావోద్వేగాలను రెచ్చగొట్టి దేశాన్ని బలహీనపరిచే పాలకుల కుట్రలను మేధావులు, లౌకికవాదులు ఎండగట్టాలి. ఈ ప్రజావ్యతిరేక బడ్జెట్‌ను దేశ ప్రజలు వ్యతిరేకించాలి. ప్రజలపై పెను భారాలు మోపే బడ్జెట్‌ మరోసారి పెట్టకుండా బిజెపిని ఇంటికి సాగనంపాలి. అందుకు ప్రజలంతా సన్నద్ధం కావాలి.

➡️