గవర్నర్ల నియంతృత్వ పోకడలు

Dec 15,2023 07:13 #Editorial

మహారాష్ట్రలో వివిధ కేసులు నమోదు చేయడం ద్వారా బిజెపి…అజిత్‌ పవార్‌ను తమ కాషాయ గూటికి చేర్చింది. కానీ కేరళ, తమిళనాడులో అది కుదరలేదు. అందుకే తమిళనాడు, కేరళలో గవర్నర్ల ద్వారా పాలనాపరమైన సంక్షోభాన్ని సృష్టించే పనిలో పడింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను కేంద్రం నియమించిన గవర్నర్‌ అడ్డుకుంటున్నారు. రాష్ట్రాల సామాజిక-ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగించే విధంగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో రాష్ట్ర ప్రగతికి ఆటంకం కలిగిస్తుంది. కేరళలో మూడేళ్లకు పైగా రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ ఆమోదించలేదు. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 12 బిల్లులను గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి ఆమోదించలేదు.

             మానవ వనరుల అభివృద్ధిలో కేరళ మొదటి స్థానంలో, తమిళనాడు రెండో స్థానంలో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బిజెపి ఒంటరిగా శాసనసభకు లేదా పార్లమెంటుకు పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలవదని వారికి, ప్రజలకు బాగా తెలుసు. చాలా ఏళ్లుగా బిజెపి పరిస్థితి ఇదే. ఇది బిజెపి నాయకత్వాన్ని కలవరపెడుతోంది.

కేరళ, తమిళనాడు లోని రెండు ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. అందుకోసం ఎన్‌ఐఏ, సిబిఐ, ఇ.డి తదితర కేంద్ర ఏజెన్సీలను ఇరు రాష్ట్రాల్లోనూ రప్పించి తమకు ఏమైనా ప్రయోజనం చేకూరుతుందా అని చూస్తున్నారు. అక్కడి నాయకులను అవినీతిపరులుగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు.

కేరళలో బంగారం స్మగ్లింగ్‌ కేసును కేంద్ర ఏజెన్సీలు నెలల తరబడి దర్యాప్తు చేస్తున్నాయి. దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఈ కేసులో ఇరికించలేకపోయారు. చార్జిషీటు దాఖలైన తర్వాత కూడా ముఖ్యమంత్రిని ఎలాగైనా ఇరికించాలనే చూస్తున్నది.

తమిళనాడు లోని మంత్రుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేసి కేసు నమోదు చేయవచ్చా లేదా అనేదానిపైనే ఇ.డి దృష్టి వుంది. తమిళనాడు, కేరళతో పాటు ఢిల్లీ, పంజాబ్‌ సహా బిజెపి యేతర రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలను నాశనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏజెన్సీలను ఉపయోగించు కుంటోంది.

మహారాష్ట్రలో వివిధ కేసులు నమోదు చేయడం ద్వారా బిజెపి…అజిత్‌ పవార్‌ను తమ కాషాయ గూటికి చేర్చింది. కానీ కేరళ, తమిళనాడులో అది కుదరలేదు. అందుకే తమిళనాడు, కేరళలో గవర్నర్ల ద్వారా పాలనాపరమైన సంక్షోభాన్ని సృష్టించే పనిలో పడింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను కేంద్రం నియమించిన గవర్నర్‌ అడ్డుకుంటున్నారు. రాష్ట్రాల సామాజిక-ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగించే విధంగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో రాష్ట్ర ప్రగతికి ఆటంకం కలిగిస్తుంది.

కేరళలో మూడేళ్లకు పైగా రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులలను గవర్నర్‌ ఆమోదించలేదు. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 12 బిల్లులను గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి ఆమోదించలేదు. గవర్నర్ల నియంతృత్వ చర్యలకు వ్యతిరేకంగా కేరళ, తమిళనాడు, పంజాబ్‌ రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

శాసనసభ ఆమోదించిన బిల్లులు, చట్టాలపై సంతకం చేయకుండా ఆపరాదని, బిల్లులపై సంతకం చేయకపోవ డానికి కారణం ఉంటే దానిపై నోట్‌ రాసి బిల్లులను వెనక్కి పంపాలని పంజాబ్‌ గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌కు సుప్రీంకోర్టు సూచించింది. అదే బిల్లును మళ్లీ అసెంబ్లీ ఆమోదించినట్లయితే, ఆ బిల్లులపై గవర్నర్‌ సంతకం చేయాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు చెప్పింది.

కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ చేసే గవర్నర్లకు ప్రజలచే ఎన్నుకోబడిన శాసనసభ కంటే ఎక్కువ అధికారం లేదని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు, గత మూడేళ్లలో తమిళనాడు గవర్నర్‌ ఏం చేస్తున్నారని కూడా కోర్టు ప్రశ్నించింది. బిల్లులను ఆమోదించి సంతకాలు ఎందుకు చేయలేదని కోర్టు ప్రశ్నించింది. ఈలోగా ఎలాంటి నోట్లు రాయకుండానే గవర్నర్‌ బిల్లులను శాసనసభకు తిప్పి పంపారు.

ఆ తర్వాత 2023 నవంబర్‌ 18న ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి గవర్నర్‌ వెనక్కి పంపిన బిల్లులను మళ్లీ ఆమోదించి గవర్నర్‌కు పంపారు. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ… ”జ్వరం, జలుబు కారణంగా కొన్ని రోజులు సెలవులో ఉన్నాను. కానీ నా ఆరోగ్యం కంటే నా రాష్ట్ర ప్రజల మేలు గొప్పది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ శాసనసభ మేలు కంటే మన మాతృభూమి అయిన తమిళనాడు సంక్షేమమే గొప్పది కాబట్టి నేను మీ ముందు నిలబడతాను”.

”కోట్ల మంది ప్రజలు మనకు ఇచ్చిన అధికార కేంద్రంగా శాసనాలు చేసే ఈ సభను అడ్డుకునేందుకు ఏ శక్తి ప్రయత్నించినా అది భారత ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అవుతుంది. అందుకే నేను మీ ముందు నిల్చొని ఉన్నాను. శాసనసభ ఆమోదించిన బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలపకపోవడమంటే ఆ చట్టసభను అవమానించడమే.” అన్నారు.

నవంబర్‌ 10వ తేదీన ఆర్‌.ఎన్‌.రవికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ఆయన నవంబర్‌ 13న అన్ని బిల్లులను తిరిగి పంపారు. 18వ తేదీన మరోసారి బిల్లులను శాసనసభ ఆమోదించి గవర్నర్‌ సమ్మతికి పంపింది. 20న సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు…తిరిగి వచ్చిన బిల్లులను అసెంబ్లీ మళ్లీ ఆమోదించి పంపితే గవర్నర్‌ సంతకం చేయక తప్పదని కోర్టు పేర్కొంది. కానీ ఆర్‌.ఎన్‌.రవి సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా ఒక్కటి తప్ప మిగతా బిల్లులన్నిటినీ రాష్ట్రపతికి పంపారు.

అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ రాష్ట్రపతికి పంపినట్లు తమిళనాడు ప్రభుత్వం డిసెంబర్‌ 1న సుప్రీంకోర్టుకు తెలియజేసింది. నిబంధన 200 ప్రకారం గవర్నర్‌ చర్య తప్పని, అలా చేసే అధికారం గవర్నర్‌కు లేదని కోర్టు బదులిచ్చింది. గవర్నర్‌ కూడా ముఖ్యమంత్రిని పిలిచి సమస్యను పరిష్కరించాలని ప్రతిపాదించారు. అయితే గవర్నర్‌కు ముఖ్యమంత్రితో ఫోన్‌ చేసి మాట్లాడేంత సంబంధాలు లేవని గవర్నర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు.

బిజెపి యేతర రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలను, బిజెపి మద్దతుదారులను గవర్నర్లుగా నియమిస్తోంది. రాష్ట్ర పరిపాలనను అనిశ్చితిలో పడవేయడమే గవర్నర్ల కర్తవ్యమని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు భావిస్తున్నాయి. దీనిప్రకారమే తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి రాజ్యాంగ సూత్రాలను గాలికొదిలేసి ఆర్‌ఎస్‌ఎస్‌ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారు.

నవంబర్‌ 26న తమిళనాడు అంబేద్కర్‌ న్యాయ విశ్వ విద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రవి మాట్లాడారు. ‘స్వాతంత్య్రం కోసం పోరాడినప్పుడు, అందరూ కలిసి ఒకటిగా నిలిచారు. ఆ తర్వాత భాషా ప్రాతిపదికన రాష్ట్రాలుగా విడిపోయారు. నిపుణుల కమిటీల లోతైన అధ్యయనాల తర్వాత మన రాజ్యాంగం ఆమోదించబడింది. అయినా, ఇది ఇంకా అసంపూర్ణంగానే ఉంది.’ అన్నారు.

భాషా ప్రయుక్త రాష్ట్రాలను, సంకీర్ణ పాలనను ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడు ఆర్‌.ఎన్‌.రవి అంగీకరించరని పైన పేర్కొన్న ప్రసంగాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. బిజెపి యేతర రాష్ట్రాల్లో గవర్నర్లు మోడీ, అమిత్‌ షాల నియంత్రణలో ఉన్నారు. సంకీర్ణ పాలన, లౌకికవాదానికి వ్యతిరేకంగా చోటుచేసుకొంటున్న నియంతృత్వ పోకడలపై పోరాటాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ గవర్నర్ల చర్యలు మనకు గుర్తు చేస్తున్నాయి.

( వ్యాసకర్త సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు) జి. రామకృష్ణన్‌
( వ్యాసకర్త సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు) జి. రామకృష్ణన్‌
➡️