గుడారాల్లో సంక్రాంతి

anganwadi workers strike 33rd protest akp

తెలుగింటి పెద్ద పండుగ సంక్రాంతి. పాఠశాలలు, కళాశాలలకు సెలవులివ్వడంతో హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లలు, దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారు కూడా ఇళ్లకు చేరుకున్నారు. ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండివంటలతో సందడి సందడిగా జరుపుకునే పండుగ సంక్రాంతి… ఈ దఫా వెలవెలబోతోంది. ఒకవైపు ఆకాశాన్నంటే ధరలు… మరోవైపు అమలుకు నోచని కనీస వేతనాలతో శ్రమజీవులు సతమతమౌతున్నారు. అన్నీ తానై కుటుంబమంతటినీ చక్కదిద్దుకునే మహిళల్లో ఎక్కువమంది అంగన్వాడీలు పండుగపూట కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి కల్పించింది ప్రభుత్వం. ఉదయం నుంచి రాత్రి వరకు నిరసన శిబిరాల్లోనే గడుపుతున్నారు. రకరకాల రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘స్త్రీని గౌరవించు దేశమే స్వర్గము/ పడతి యేడ్చు యిల్లు వల్లకాడు’ అంటాడు నార్ల చిరంజీవి. పొట్ట కూటి కోసం రోజంతా కష్టపడే అంగన్వాడీ మహిళలు…పండుగ పూట పిల్లలను, కుటుంబాన్ని వదిలి…దీక్షా శిబిరాల్లో గడుపుతున్నారు. ‘ఆడుది తిరుగబడిన తరువాత నెంత మేధావంతుడైన ‘మెమె..మె’ యనవలసినదే కదా’… అంటారు పానుగంటి లక్ష్మీనరసింహం. రాష్ట్రంలో గ్రామాలకు గ్రామాలే వలసపోతున్నాయి. పొట్ట కూటి కోసం పట్టణాలు, నగరాల బాట పడుతున్నారు. అక్కడ కూడా పనులు దొరక్క గ్రామాలకు రివర్స్‌ వలసలు కూడా వున్నాయి. ముఖ్యమంత్రి మాత్రం సంక్రాంతి సంబరాలు చేసుకోవాలని భారీ ఎత్తున పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు.

anganwadi workers strike 32nd day in konaseema

anganwadi workers strike 32nd day in tpt

పండుగ పూట మా కుటుంబాల్లో సంతోషం లేకుండా చేసిందీ ప్రభుత్వం. జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే అంటుంటే…నిజమేనని సంబరపడ్డాం. మా ఆశలు అడియాసలయ్యాయి, మా నమ్మకం వమ్మయ్యింది. పిల్లలకు మేనమామనన్నాడు. అక్క చెల్లెమ్మలకు అండగా వుంటానన్నాడు. సంక్రాంతి కానుకగా ఎస్మా, షోకాజ్‌ నోటీసులు అందించారు అని అంగన్వాడీలు వాపోతున్నారు. సమ్మె శిబిరాల్లోనే ముగ్గులు వేస్తున్నారు. గొబ్బెమ్మలు పెడుతున్నారు. పిండివంటలు వండి నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే క్రిస్మస్‌, నూతన సంవత్సరం వేడుకలు కూడా రోడ్లపైన, శిబిరాల వద్దే జరుపుకున్నారు. ఇప్పుడు సంక్రాంతి కూడా గుడారాల్లోనే జరుపుకుంటాం…అంతేగాని మా సమస్యలు పరిష్కారమయ్యే వరకూ తగ్గేదే లేదంటున్నారు. ‘స్త్రీ అనే అక్షరంలో విశ్వశక్తి సౌందర్యం, కవిత్వం, మాతత్వం, మమకారం, వీరత్వం, వాత్సల్యం, సంగీతం- వంటి విభిన్న భావానుభూతులు అనేకం వున్నాయ’ని అంటారు శిలాలోలిత. మహిళలు ఎంత సుకుమారంగా వుంటారో…అంత ధీరత్వాన్నీ ప్రదర్శిస్తారు. దానికి నిదర్శనమే… గత నెల రోజులుగా మొక్కవోని దీక్షతో అంగన్వాడీలు సాగిస్తున్న పోరాటం. వీరు ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా నిరసన గళం విప్పారు. ‘ఓ దేశ మహిళ స్థితిగతుల్ని చూసి ఆ దేశ పరిస్థితిని ఇట్టే చెప్పేయవచ్చు’నని జవహర్‌లాల్‌ నెహ్రూ చెబుతారు. సమాజం ఎంత నాగరికమైనది, మానవీయమైనది అన్నది తెలుసుకోవాలంటే మహిళల జీవితమే ప్రమాణం-అని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. రాష్ట్రంలోని వనరులను అదానీలు, అంబానీలకు ఉచితంగా కట్టబెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…ప్రజల కనీస అవసరాలను తీర్చడానికి మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నాయి. అధికార బలంతో ప్రజల హక్కులను, కోర్కెలను నిరంకుశంగా అణచివేస్తున్నాయి.

ఏ వ్యక్తికైనా నమ్మకం చాలా అవసరం. నమ్మకం లేని వ్యక్తులు చెప్పే మాటలు నీటి మీద రాతలాంటివే. మనిషి జీవితం నమ్మకంతోనే ముడిపడి ఉంటుంది. నమ్మకం వుంటే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు. కాబట్టే నెపోలియన్‌ అసాధ్యం అనే పదాన్ని డిక్షనరీలోంచి తీసివేయాలన్నాడు. మనం చేసే పనిపై నమ్మకం వుంటే అసాధ్యం అనేది ప్రపంచంలోనే లేదు. ఆ నమ్మకమే 33 రోజులుగా నిరంతరాయంగా సమ్మె కొనసాగించడానికి కారణమైంది. అదే నమ్మకం సమ్మెను మరింత ముందుకు తీసుకెళ్లడానికి, కనీస వేతనాలు సాధించుకోడానికి ఊతమిస్తుంది. ‘నువ్వు అందరినీ కొంత కాలం, కొంతమందిని ఎల్లకాలం మోసం చేయవచ్చు. కాని అందరినీ ఎల్లకాలం మోసం చేయజాలవు’ అంటాడు అబ్రహం లింకన్‌. ఏ నాయకుడైనా నమ్మికతో ప్రజల మనసులను గెలుచుకోవాలే తప్ప… కుయుక్తులతో ఓట్ల రాజకీయానికే పరిమితం కారాదు. నమ్మకాన్ని కోల్పోయిన వారికి బుద్ధి చెప్పడానికి రేపనేది వుంటుందని మర్చిపోకూడదు. ‘ఆడువారి అడుగుల రాపిళ్లలో/ పుడుతుంది ఆరని చైతన్యం’ అంటారు కవయిత్రి వాకా ప్రభావతి. ఆ చైతన్యం నిరసన గళమెత్తితే… నిలువరించడం అసాధ్యం. సమస్య పరిష్కారమే ఏకైక మార్గం.

 

➡️