నీతిబాహ్య రాజకీయాలు

Jan 31,2024 07:20 #Editorial

           నీతిబాహ్య రాజకీయాలకు నిలువెత్తురూపంగా నితీష్‌కుమార్‌ చరిత్రలో చెరగని స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆయారాం, గయారాంలను ప్రోత్స హిస్తూ అధికారం చేజిక్కించుకోవడం ఒక్కటే ధ్యేయంగా రాజకీయాలను నడుపుతున్న కమలం పార్టీ పాటలీపుత్రం ఫల్తూ కుమార్‌.. ఫల్తూ రామ్‌గా పేరొందిన ఈ పెద్దమనిషిని ఆలింగనం చేసుకుని, మద్దతు ప్రకటించేసింది. చచ్చినా బిజెపి పంచన చేరేది లేదన్న నితీష్‌, ఈ ఫల్తూ రామ్‌కు శాశ్వతంగా తలుపులు మూసేశామన్న అమిత్‌ షా మాటలన్నీ మట్టి కొట్టుకుపోయాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ స్థానాల్లో పాగా వేయడమే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలతో చేయించిన బెదిరింపులు, సిఎం పదవికి ఢోకా లేదన్న భరోసా ఈ విశ్వాస ఘాతుకానికి నితీష్‌ను పురికొల్పింది.

పుల్వామా ఘటనతో ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి 2019లో 303 స్థానాల్లో పాగా వేసిన కాషాయ పార్టీకి ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని ఇప్పటికే చాలా సర్వేలు విడమరిచాయి. అయోధ్యలో రామప్రతిష్ఠ చుట్టూ ప్రజల దృష్టి కేంద్రీకృతమయ్యేలా చేసి, మతభావాలు రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలని బిజెపి చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టే పరిస్థితే ఉంది. మరో వైపు ఇండియా వేదికగా 28కిపైగా పార్టీలు మోడీ సర్కారును ఢకొీట్టేందుకు కసరత్తు ముమ్మరం చేశాయి. దేశంలో 55 శాతానికి పైగా ఓట్లు పొందిన ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి, సమరశంఖం పూరిస్తే తమ పరిస్థితేంటన్న కలవరం కాషాయ పార్టీని కుదిపేస్తోంది. ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మూడింటిని బిజెపి గెలుచుకున్నా, ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఓటింగ్‌లో స్వల్ప తేడా మాత్రమే ఉండటం, దేశవ్యాప్తంగా గతంలో గెలిచిన స్థానాల్లో చాలాచోట్ల ఓడిపోయే పరిస్థితే ఉందన్న సర్వేలు ఆ పార్టీకి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను మరోసారి రంగంలోకి దింపి ప్రతిపక్ష పార్టీలను బెదిరించి, తనతో సయోధ్య కుదుర్చుకునేలా చేసి లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తోంది.

సోషలిస్టుగా రాజకీయాలు ప్రారంభించిన నితీష్‌… సమతా పార్టీ పెట్టి, ఆ తరువాత ఎన్‌డిఎలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2005లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి 2013 వరకూ బిజెపితో దోస్తీ చేసిన ఆయన మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆ కూటమి నుంచి తప్పుకుని, కాంగ్రెస్‌, సిపిఐ మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 2015లో ఆర్‌జెడి, కాంగ్రెస్‌, వామపక్షాలతో కలిసి పోటీ చేసి సిఎం కుర్చీని చేపట్టిన ఆయన 2017లో మళ్లీ కమలం గూటికి చేరారు. ఈయన చలవతో ఇక్కడ కాలుమోపిన కాషాయ పార్టీ జెడి(యు) అంతానికి ప్రయత్నిస్తూనే ఉంది. 2020 ఎన్నికల్లో రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తనయుడు చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌ జనశక్తి పార్టీ జెడియు పోటీ చేసిన స్థానాల్లో పోటీ చేసేలా చేసి, నితీష్‌ పార్టీని చావుదెబ్బ తీసింది. 2010లో 115 స్థానాలున్న నితీష్‌ పార్టీ 2020 ఎన్నికల్లో 43 స్థానాలకు దిగజారడంతో పెత్తనమంతా తన చేతిలోనే బిజెపి కేంద్రీకృతం చేసుకుంది. బహిరంగంగా పరువు తీయడంతోపాటు పార్టీ చీలికకు యత్నించిందని స్వయానా నితీష్‌ వాపోయారు. 2022లో బిజెపికి కటీఫ్‌ చెప్పి, మహా కూటమిలో చేరారు. 243 స్థానాలున్న అసెంబ్లీలో 75 స్థానాలతో అతి పెద్ద పార్టీగా ఉన్న ఆర్‌జెడి తరపున తేజస్వి యాదవ్‌ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. దాదాపు 17 ఏళ్ల జెడి(యు)-బిజెపి పాలనకన్నా మెరుగైన రీతిలో మహా కూటమి పాలన సాగింది. దాదాపు నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. బిజెపిని ఎదిరించి కులగణన చేపట్టి దేశానికి ఒక నమూనాగా నిలిచింది. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో నితీష్‌, ఇతర మిత్రులతో కలిసి దాదాపు క్వీన్‌ స్వీప్‌ చేసిన బిజెపి ఈసారి రివర్స్‌ అయ్యే పరిస్థితి ఉండటంతో కలవరపాటుకు గురైంది. వెనుకబడిన వర్గాల నేతగా గుర్తింపు పొందిన మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ఇచ్చింది. ‘ఇండియా’ వేదికలో కీలక నేతగా ఉన్న నితీష్‌కుమార్‌ మళ్లీ తన పంచన చేరేలా అన్ని ఎత్తులూ వేసింది. ఐదు నెలల క్రితం మనీ లాండరింగ్‌ కేసులో ఆ పార్టీ ఎంఎల్‌సిని, ఆయన కుమారుడిని అరెస్టు చేయడంసహా బెదిరింపులకు పాల్పడింది. దశాబ్దాలుగా అక్రమ కేసుల్లో వేధిస్తున్నా, జైలులో పెట్టినా నిబ్బరంగా ఎదిరించి నిలబడిన ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌లా చేవలేక చేవచచ్చిన నితీష్‌ అదే పార్టీ పంచన చేరారు. ఆయన కూటములు మారడం గత పదేళ్లలో ఇది ఐదోసారి. అవకాశవాదానికి పరాకాష్టగా ఏర్పడిన బిజెపి-జెడి(యు)కు బుద్ధి చెప్పేందుకు మహా కూటమి సమాయత్తమవుతోంది. ఆయన బిజెపి వద్దకు వెళ్తే మేం ప్రజల వద్దకు వెళ్తాం…లోక్‌సభ ఎన్నికల తరువాత జెడి(యు) కథ ముగుస్తుందంటూ తేజస్వి యాదవ్‌ చేసిన వ్యాఖ్య ఏ మాత్రం అతిశయోక్తి లేదు. నితీష్‌, బిజెపి అవకాశవాద పొత్తుపై సోషల్‌ మీడియాలో సెటైర్లే సెటైర్లు. లోక్‌సభ ఎన్నికల తరువాత జెడి(యు) కనుమరుగైనా ఆశ్చర్యపోనవసరం లేదు.

➡️