చైనాపై సామ్రాజ్యవాద నిరంతర వక్రీకరణలు !

Dec 21,2023 06:55 #Articles, #China, #false, #propaganda
false propadaga on china economy article m koteswarao

సంస్కరణల బాట పట్టిన నాటి (1978) నుంచీ చైనా పరిణామాల గురించి ప్రతికూలంగా స్పందించక పోతే ప్రపంచ మీడియాకు రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. ఆ ప్రచారం వారికి ఒక సినిమాలో చెప్పినట్లు అదో తుత్తి (తృప్తి)నిస్తోంది. కరోనా నిరోధానికి విపరీత కట్టుబాట్లతో చైనా కుప్పకూలి పోయిందని చెప్పి కొందరు సంతోషించారు. నమ్మినవారిని వెర్రి వెంగళప్పలను చేశారు. ప్రపంచ వాణిజ్య సంస్థ నమోదు చేసిన సమాచారాన్ని విశ్లేషిస్తే ప్రపంచ వస్తువుల ఎగుమతుల విలువ 2022లో 25 లక్షల కోట్ల డాలర్లు. దానిలో కేవలం పదకొండు పెద్ద ఎగుమతి దేశాల వాటా 12.8లక్షల కోట్లు. మిగతా దేశాలన్నింటిదీ 12.1 లక్షల కోట్లే. కరోనా నుంచి పూర్తిగా బయటపడ్డామని, దేశాన్ని తిరిగి అభివృద్ధి పట్టాల మీదకు ఎక్కించామని మన కేంద్ర ప్రభుత్వం, బిజెపి ఎంతగా చెప్పుకున్నా తొలి పదకొండు దేశాల జాబితాలో లేదు. చివరికి పదో స్థానంలో ఉన్న హాంకాంగ్‌ (చైనా) ప్రాంత ఎగుమతులు 609.9 బి.డాలర్లు కాగా మనవి 453.5 బి.డాలర్లు మాత్రమే. ప్రథమ స్థానంలో ఉన్న చైనా 3.6 లక్షల కోట్ల డాలర్ల మేర ఎగుమతి చేసింది. అంటే 14.4 శాతం వాటా కలిగి ఉంది. తరువాత ఉన్న అమెరికా 8.4 శాతం కలిగి ఉంది.2009 నుంచి చైనా తన ప్రథమ స్థానాన్ని కొనసాగిస్తూనే ఉంది. దాన్ని అధిగమించి తెల్లవారేసరికి మన దేశాన్ని ముందుకు తీసుకుపోతామని నరేంద్ర మోడీ అండ్‌కో చెబుతున్నారు మరి!

 

ఇటీవలి కాలంలో తమ విదేశీ వాణిజ్యం తిరిగి పట్టాలకు ఎక్కటం ప్రారంభమైందని చైనా ప్రకటించింది. ఆగస్టు నుంచి తిరోగమనంలో ఉన్నది గతేడాది నవంబరుతో పోలిస్తే ఈ ఏడాది 1.2శాతం పెరిగిందని అధికారులు ప్రకటించారు. అమెరికాకు గత పద్నాలుగు నెలలుగా తగ్గుముఖం పట్టిన ఎగుమతులు కూడా 9.6శాతం అధికంగా ఉన్నాయి. డిసెంబరు పద్నాలుగవ తేదీన ఎకానమిస్ట్‌ పత్రిక ”తన ఎగుమతి విజయాన్ని చైనా తక్కువ చేసి చూపుతోందా ” అంటూ ఒక విశ్లేషణను ప్రచురించింది. గడచిన రెండు దశాబ్దాలలో తన వాణిజ్య మిగులును సబ్సిడీలుగా ఇచ్చి ఎగుమతులతో ఇతర దేశాల్లో ఉపాధిని హరించిందని, ఇప్పుడు విద్యుత్‌ కార్లను వేగంగా ఉత్పత్తి చేసిన తన వాణిజ్య భాగస్వాములను ఆందోళనకు గురి చేస్తోందని కూడా దానిలో పేర్కొన్నారు. చైనా వాణిజ్య మిగులు ఇప్పుడు 312 బిలియన్‌ డాలర్లుగా ఉందని చైనా విదేశీ మారక ద్రవ్య యంత్రాంగం (సేఫ్‌) పేర్కొన్న అంకెలు నిజమేనా అన్న సందేహాన్ని వెలిబుచ్చారు. అమెరికా విదేశీ సంబంధాల మండలికి చెందిన బ్రాడ్‌ సెట్సర్‌, ఆర్థిక వ్యవహారాల వ్యాఖ్యాత మాథ్యూ కెలిన్‌ అభిప్రాయాలను దానిలో ఉటంకించారు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చూసినపుడు చైనా మిగులు ఎక్కువగా ఉన్నప్పటికీ నాటకీయంగా తక్కువ చేసి చూపుతున్నారని, విదేశీ ఆస్తుల నుంచి వచ్చిన రాబడి, ఎగుమతులను తక్కువగా చూపుతున్నారని వారు పేర్కొన్నారు. ప్రకటించిన మిగులు కంటే రెండువందల బిలియన్‌ డాలర్లు ఎక్కువగా ఉంటాయని సెట్సర్‌ చెప్పాడు. చైనా నుంచి లెక్కల్లో చూపకుండా విదేశాలకు తరలుతున్న పెట్టుబడులను దాచి పెట్టేందుకు చూస్తున్న కారణంగానే తక్కువ చేసి చూపుతున్నారని వారు ఆరోపించారు. తక్కువ-ఎక్కువ ఏది చెప్పినా ఇతరులకు నష్టం ఏమిటి ? గడచిన ఆరు నెలల్లో తొలిసారిగా చైనా ఎగుమతులు పెరిగినందున అక్కడి ఫ్యాక్టరీలకు ఎంతో ఉపశమనం కలిగించిందని రాయిటర్స్‌ పేర్కొన్నది. ధరలు తగ్గించిన కారణంగా ఎగుమతులు పెరిగాయని, ఇలా ఎంతకాలం కొనసాగిస్తారని కొందరు అనుమానాలు వెల్లడించారు. ఎక్కువగా ఎగుమతులు ఎలక్ట్రానిక్‌ యంత్రాలు, కార్లు ఉన్నాయని, ఐరోపా, రష్యాలో ఉన్న గిరాకీ కారణంగా ఎగుమతులు ఇంకా పెరగవచ్చని భావిస్తున్నారు.

 

చైనా జిడిపి వృద్ధి రేటు 2024లో 4.8 నుంచి 4.4 శాతానికి తగ్గుతుందని ప్రపంచ బ్యాంకు తాజాగా పేర్కొన్నది. అక్కడి ఆర్థిక వ్యవస్థ బాగు చేయలేనంత దుస్థితిలో లేదని అమెరికా లోని నార్త్‌ వెస్ట్రన్‌ యూనివర్సిటీ ఫ్రొఫెసర్‌ నాన్సీ క్వియాన్‌ చెప్పారు. ఓయిసిడి దేశాలైన స్వీడెన్‌, స్పెయిన్‌, ఇటలీ వంటి వాటితో పోలిస్తే యువతీ యువకుల్లో నిరుద్యోగం పెరుగుదల చైనాలో తక్కువ అని ఆమె అన్నారు. ఇటీవలి దశాబ్దాలలో సాధించిన ప్రగతితో పోల్చిచూస్తే తాజాగా చిన్నబోయినట్లు కనిపించవచ్చు తప్ప మరింకేమీ కాదని చెప్పారు.  చైనా వాణిజ్య మిగులు పెరిగితే విదేశాల్లో ప్రతిగా రక్షణాత్మక చర్యలు పెరిగే అవకాశం ఉందని బాకోని విశ్వవిద్యాలయానికి చెందిన డేనియల్‌ గ్రోస్‌ చెప్పాడు. చైనా అనుసరిస్తున్న విధానాల కారణంగానే అక్కడ రియలెస్టేట్‌ బుడగ ఎప్పటి నుంచో తయారవుతున్నదని, ఇప్పుడు పేలిందని కొందరు చెబుతున్నారు. దానిలో భాగంగానే ఎవర్‌గ్రాండే కంపెనీ చెల్లింపుల సంక్షోభంతో అమెరికాలో దివాలా రక్షణ కోరింది. దీన్ని చూసి ఇంకేముంది చైనా మొత్తం దివాలా తీయనుందని ఊదరగొట్టారు. ఒక నిర్మాణ కంపెనీ చేతులెత్తేస్తే దానిలో లాభాల కోసం పెట్టుబడులు పెట్టిన వారు దెబ్బతింటారు. దాని దగ్గర ఉన్న భూములు, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు ఎక్కడకూ పోవు. ప్రభుత్వం లేదా మరొక సంస్థ వాటిని పూర్తి చేస్తుంది. దేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు చైనా నిపుణులు అనేక ప్రయోగాలు చేశారు. పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న పూర్వరంగంలో నిర్మాణ రంగంలో భారీ పెట్టుబడులను చైనా ప్రోత్సహించింది. ఇప్పుడు తలెత్తిన సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకుంటున్నది. 2010లో అక్కడ ఇళ్లు కొనే వయస్సులో ఉన్న జనాభా 20 కోట్ల మంది ఉంటే అది 2020 నాటికి 22 కోట్లకు చేరి అప్పటి నుంచి తగ్గుతున్నది. ఎవర్‌ గ్రాండే సమస్యలు కూడా ప్రారంభం అప్పుడే. 2030 నాటికి పదిహేను కోట్లకు తగ్గి తరువాత 2040 నాటికి 16 కోట్లకు పెరుగుతుందన్నది ఒక అంచనా కాగా 12 కోట్లకు తగ్గవచ్చన్నది మరొక అభిప్రాయం. ఒక కుటుంబంలో ఇల్లు కొంటే అది తరువాత తరాలకూ ఉంటుంది, అందువలన గిరాకీ ఎప్పుడూ ఒకేమాదిరి ఉండదు.

 

చైనా ఆర్థిక వృద్ధి గురించి ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్తగా పని చేసిన డేవిడ్‌ దావోకుయి లీ, చైనా ఆర్థికవేత్త జస్టిన్‌ ఇఫు లిన్‌ వంటి వారు చెప్పిన అంచనాలు తప్పాయి. వారు చెప్పిందేమిటి? 2025 వరకు ఎనిమిది, అప్పటి నుంచి 2050 వరకు ఆరుశాతం చొప్పున ఆర్థిక వృద్ధి ఉంటుందని, అమెరికాకు మూడు రెట్లు అవుతుందన్నారు. కానీ జరిగిందేమిటి? 2011లో 9.6 శాతంగా ఉన్న వృద్ధి రేటు 2019 నాటికి ఆరుకు, తరువాత 4.5 శాతానికి తగ్గింది. యువ నిరుద్యోగుల పెరుగుదల గురించి వార్తలు రావటంతో ఇంకేముంది చైనా ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోతున్నదంటూ వాటికి ప్రతికూల భాష్యాలు వెలువడటంతో ప్రభుత్వం నెలవారీ సమాచార విడుదల నిలిపివేసింది. నిజానికి కూలిపోవాల్సి వస్తే ఐఎంఎఫ్‌ చెప్పినట్లుగా 2024లో అమెరికాలో ఈ ఏడాది 1.6, వచ్చే ఏడాది 1.1, అలాగే బ్రిటన్‌లో మైనస్‌ 0.3 -1, జర్మనీలో మైనస్‌ 0.1 -1.1 శాతాలుగా ఉంటాయని చెప్పగా చైనాలో అవి 5.2-4.5 శాతాలుగా ఉన్నాయి. అందువలన ఓయిసిడి దేశాలలో ఏళ్ల తరబడి 20 శాతంగా ఉన్న యువ నిరుద్యోగంతో పోలిస్తే చైనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. అన్ని దేశాల్లో పరిస్థితులు మారుతున్నాయి. మన దేశంలో ఒకనాడు బిఏ, బికాం, బిఎస్‌సి వంటి డిగ్రీలకు ఎంతో విలువ, తరువాత ఇంజనీరింగ్‌, ఇప్పుడు అదే ఇంజనీర్ల పరిస్థితి ఏమిటో, ఉపాధి దొరికిన వారికి ఇస్తున్న వేతనాలెంతో చూస్తున్నాము. నిరుద్యోగ సమస్యను పాలకుల దృష్టికి తెచ్చేందుకే తాము లోక్‌సభలో పొగబాంబులు వేసినట్లు దాడికి పాల్పడిన యువకులు చెప్పినట్లు వార్తలు. అదే నిజమైతే మనదేశంలో పరిస్థితి గురించి ఆలోచించాలి. ఐదు సంవత్సరాల నాటి కంటే నేడు యువ నిరుద్యోగుల సంఖ్య ఎక్కువ అన్నది వాస్తవం. సరైన లెక్కలు లేవు. ఉన్నవాటిని ప్రకటించకుండా మూసిపెడుతున్నారు గనుక వాస్తవాలు తెలియటం లేదు. ప్రస్తుతం చైనా ఉపాధి ఎక్కువగా ఉండే పరిశ్రమల నుంచి ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం ఉండే సంస్థలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సర్దుబాటుకు కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం చైనా మీద అనేక దేశాలు వాణిజ్య యుద్ధం ప్రకటించి అమలు జరుపుతున్నాయి. అలాంటి పరిస్థితి మనకు గానీ, అమెరికా, ఐరోపా దేశాలకు లేదు. చైనా ఎదుర్కొంటున్న సవాళ్లు లేవు.

 

koteswarao

  • ఎం. కోటేశ్వరరావు
➡️