మత్స్యకార మహిళలకేది భరోసా?

Jun 16,2024 05:16 #editpage

రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 14వ తేదీ నుండి సముద్రంలో చేపల వేటపై నిషేధం తొలగిపోయింది. దీంతో తీర ప్రాంతానికి మళ్లీ కళ వచ్చింది. లక్షలాదిమంది మత్స్యకారులు చేపల వేటలో నిమగమైనారు. 2022 నాటి మత్స్యశాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సుమారుగా 8.75 లక్షల మత్స్యకారులు ఉన్నారు. వీరిలో 4.13 లక్షల మంది మహిళలు. అంటే, దాదాపుగా 47 శాతం! రాష్ట్ర జిఎస్‌డిపిలో మత్స్యకార రంగం వాటా 6.01 శాతం! దీనిలో మహిళల శ్రమ వాటా గణనీయంగా ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సముద్రం మీద వేటను మినహాయిస్తే, ఆ తరువాత అన్ని దశల్లోనూ మత్స్యకార మహిళల ఈ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరి ప్రమేయం లేకుండా మత్స్య సంపద వినియోగదారుల వద్దకు చేరే అవకాశమే లేదు. అయితే, ప్రభుత్వం నుండి వీరికి ఎటువంటి మద్దతు లభించడం లేదు. చేపల వేట అనగానే పురుషులకే పరిమితమైన రంగంగా చూడటం అలవాటు కావడంతో ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున చేస్తున్న శ్రమకు ఎటువంటి గుర్తింపు లభించడం లేదు. 2011 లెక్కల ప్రకారం 12,747 మోటరైజ్డ్‌, 1771 మెకనైజ్డ్‌, 14,677 సాంద్రాయ బోట్లు రాష్ట్రంలో ఉండేవి. గడిచిన పదేళ్ల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాల కారణంగా మత్స్యకారుల జీవన విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. సాంప్రదాయ, మోటరైజ్డ్‌ బోట్ల సంఖ్య భారీగా తగ్గింది. వాటి స్థానంలో మెకనైజ్డ్‌ బోట్లు పెరిగాయి. వెజెల్స్‌ అత్యంత ఆధునిక నౌకలు చేపల వేటకు అందుబాటులోకి వచ్చాయి. కార్పొరేట్లు రంగ ప్రవేశం చేస్తున్నారు. తరతరాలుగా జీవనోపాధిగా ఉన్న చేపల వేట మత్స్య పరిశ్రమగా మారింది. స్వేచ్ఛా జీవులను వేతన జీవులుగా మార్చేసింది. ఈ మార్పుల ప్రభావం మత్స్యకార కుటుంబాల్లోని మహిళలపైనా పడుతోంది. గతంలో ఇష్టమున్న వారే పని చేసేవారు. ఇప్పుడు ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా పని చేయాల్సి వస్తోంది. గతంతో పోలిస్తే చాకిరి పెరిగింది. దానికి తగ్గ ప్రతిఫలం సంగతి అలా ఉంచితే, పని ప్రదేశాల్లో రక్షణ, మౌలిక వసతులు దాదాపు శూన్యం. ప్రభుత్వ పథకాలు వీరి దాకా రావు!
డెబ్బయ్యవ దశకంలో ఇలా….!
‘రోల్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఇన్‌ స్మాల్‌ స్కేల్‌ ఫిషరీస్‌ ఆఫ్‌ ది బే ఆఫ్‌ బెంగాల్‌’ పేరిట 1980 సంవత్సరంలో స్వీడిష్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ది యునైటెడ్‌ నేషన్స్‌ సంస్థలు ఒక పుస్తకాన్ని ప్రచురించాయి. ఈ పుస్తకంలో 1970వ దశకంలో రాష్ట్రంలోని మత్స్యకార మహిళల స్థితి గతుల గురించి క్షేత్ర స్థాయిలో పరిశీలించి కొన్ని అంశాలు పేర్కొన్నారు. ‘మత్స్యకార మహిళలు నిరక్షరాస్యులు (ఇప్పటికీ అధిక శాతం మందిది అదే స్థితి). సముద్రంపై వేటకు వెళ్లకపోయినప్పటికీ, అనంతర కార్యక్రమాల్లో వీరిది కీలక పాత్ర. చేపలను ఎండబెట్టడం, క్యూరింగ్‌ చేయడం, మార్కెటింగ్‌, వలలు తయారు చేయడం వంటి రంగాల్లో మత్స్యకార మహిళలు నిమగమయ్యారు. ఇప్పుడప్పుడే ఏర్పాటవుతున్న రొయ్యల పెంపకంలో భాగస్వాములవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార మహిళలు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. వీటికి శ్రీకాకుళంలోని కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు ఆర్థిక సహాయం చేస్తోంది. పని ప్రదేశాల్లో మహిళలకు అవసరమైన మౌలిక వసతులను కూడా ఈ సంఘాలే చూస్తున్నాయి. విశాఖపట్నంలోనూ ఈ తరహా సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు’ అని పేర్కొన్నారు. 1978లో మత్స్యశాఖ ముగ్గురు మహిళా ఇన్‌స్పెక్టర్లను నియమించిందని, వీరు తీర ప్రాంతానికి సంబంధించి ఎనిమిది జిల్లాల్లో పర్యటించి మత్స్యకార మహిళల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారని, సాంఘిక సంక్షేమశాఖ నుండి ఒక అధికారి కూడా ఇదే పని చేసేవారని పుస్తకంలో పేర్కొన్నారు.
ఇప్పుడిలా….
సహకార సంఘాలను 1970వ దశకంలోనే ఏర్పాటు చేసుకున్న శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకార మహిళలు ఇప్పుడు పని ప్రదేశాల్లో కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. రెండు నెలల క్రితం ఈ ప్రాంతంలో పర్యటించిన జాతీయ మీడియా ప్రతినిధులతో వారు మాట్లాడుతూ ఎన్ని సార్లు విజ్ఞప్తులు చేసినా తమకు ప్రత్యేకంగా మరుగు దొడ్లను ఏర్పాటు చేయడం లేదని చెప్పారు. తాము మగవారితో సమానంగా పని చేస్తున్నామని అయినా, అన్ని చోట్లా వివక్ష చూపుతున్నారని అన్నారు. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే స్థితి. మత్స్యకార మహిళల్లో అధిక శాతం ఇప్పటికీ నిరక్షరాస్యులుగానే ఉన్నారు. పౌష్టికాహార లోపం కారణంగా అనేక అరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు. పురుషులు తరుచుగా సముద్రంపై వేటకు పోతుండటంతో పిల్లల పెంపకం, కుటుంబ నిర్వహణ భారం వీరిదే! అయినప్పటికీ మత్స్య పరిశ్రమ పురోగతిలో వీరిది అత్యంత ముఖ్యమైన పాత్ర. వేలం నిర్వహించడం, చేపలను ప్రాసెస్‌ చేయడం, రిటైల్‌ వ్యాపారం, ఎండు చేపల తయారీ-విక్రయం, వలల్లో మిగిలిన వ్యర్థాలను సేకరించి కోళ్ల పరిశ్రమకు ఆహారాన్ని తయారు చేయడం వంటి పనుల్లో వీరు పెద్ద సంఖ్యలో నిమగమైనారు. మార్కెట్లలోకి వీరికి నేరుగా ప్రవేశం దొరకకపోవడంతో అనివార్యంగా మధ్యవర్తుల మీద ఆధారపడక తప్పడం లేదు.
ఎంత శ్రమ చేసినా, ఆదాయం చాలకపోవడంతో ఆర్థిక అవసరాల కోసం పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నారు. పలువురు ‘కాల్‌ మనీ’ బారిన పడుతున్నారు. 2015 లోనే మత్స్యకార పల్లెల్లో ఈ తరహా సంఘటనలు 60 శాతం పెరిగినట్లు అధికారులు గుర్తించారు. అయితే, ప్రత్యామ్నాయ చర్యలు మాత్రం శూన్యం! బోట్ల నుండి సమీప మార్కెట్‌ ప్రాంతాలకు చేపలను తల మీద పెట్టుకొని మోసుకుంటూ తీసుకుపోతారు. ఇది వారి శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. పెద్ద సంఖ్యలో మత్స్యకార మహిళలు చిన్న వయసులోనే వెన్ను నొప్పి బారిన పడుతున్నారు. జ్వరం, కలరా, అతిసార వంటివి వీరికి అతి సాధారణ విషయాలు. సముద్రం మీద వెళ్లిన మగవారు గల్లంతు కావడం సహజమే! వీరిలో కొందరు క్షేమంగా ఇళ్లకు తిరిగివస్తారు. మరికొందరు సంవత్సరాలు గడిచినా తిరిగి రారు. వారి మృత దేహాలు కూడా దొరకవు. అటవంటి వారి జీవిత భాగస్వాములను మత్స్యకార సమాజం వితంతువులుగా పరిగణిస్తుంది. ప్రభుత్వం నుండి మాత్రం వారికి ఎటువంటి సాయం లభించదు. కారణం, ఎవిడెన్స్‌ చట్టంలోని సెక్షన్‌ 108 ప్రకారం కనీసం ఏడు సంవత్సరాల సమయం కావాలి! దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ఇక నిరక్షరాస్యత కారణంగా ప్రభుత్వ పథకాల గురించిన సమాచారం వారికి తెలిసింది నామమాత్రమే. ఇటీవల విశాఖపట్నం, తూర్పు గోదావరిలో నిర్వహించిన ఒక సర్వేలో పి.ఎం మత్స్య సంపద యోజన వంటి కేంద్ర పథకాలు 25 శాతం మందికి కూడా తెలియవని, తెలిసిన వారిలో సగం మంది కూడా వాటిని వినియోగించుకోలేక పోయారని తేలింది. వైఎస్‌ఆర్‌ మత్స్యకార నేస్తం, వైఎస్‌ఆర్‌ మత్య్చకార భరోసా వంటి పథకాల గురించి 95 శాతం మందికి పైగా తెలిసినప్ప టికీ వినియోగించుకున్నది మాత్రం 55 శాతం లోపే!
ఏం చేయాలి….?
మత్స్యకార మహిళల్లో అక్షరాస్యతను పెంచాలి. ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి అసవరమైన చర్యలు తీసుకోవాలి. వైద్య సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు, పౌష్టికాహారాన్ని అందచేయాలి. చేపల వ్యాపారంలో మధ్యవర్తులను నిర్మూలించాలి. మత్య్పకార మహిళలకు నేరుగా మార్కెట్లలోకి ప్రవేశం కల్పించాలి. మహిళల నేతృత్వంలో సహకార సంఘాలను ఏర్పాటు చేయాలి. ఆ సంఘాలు నిలదొక్కుకునేందుకు అవసరమైన ఆర్థిక సహకారాలను అందించాలి. మత్స్య రంగంలో పెరుగుతున్న సాంకేతికతపై ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. కోల్డ్‌ స్టోరేజిలు, ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటులో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభుత్వ పథకాలు పొందడానికి వీలుగా అవసరమైన గుర్తింపు కార్డులు ఇవ్వాలి. పథకాలపై అవగాహనను పెంపొందించాలి. పని ప్రదేశాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు, లైంగిక వేధింపుల నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలి. మత్స్యకార మహిళలను దృష్టిలో ఉంచుకుని వారి బాగోగులను పర్యవేక్షించేందుకు అవసరమైన అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.

-పొగడ దొరువు

➡️