జాతీయీకరణ నుండి జాతి గర్వించే స్థాయికి …

Jan 19,2024 07:15 #Editorial
  • నేడు జీవిత బీమా జాతీయీకరణ దినోత్సవం

              జనవరి 19, దేశ ఆర్థిక వ్యవస్థలోనూ, మరీ ముఖ్యంగా భారతీయ జీవిత బీమా వ్యాపార రంగంలోను కీలకమైన రోజు. 245 ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలు…ప్రజల నుండి ప్రీమియం రూపంలో వసూలు చేసిన మొత్తాలను తమ స్వంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ పాలసీదారులను మోసం చేస్తున్న నేపథ్యంలో…అన్ని ప్రైవేటు ఇన్సూరెన్సు కంపెనీలను కలిపి భారతీయ జీవిత బీమా వ్యాపారాన్ని జాతీయం చేస్తూ ఆర్డినెన్సును జారీ చేసిన రోజు. భారత దేశ జీవిత బీమా వ్యాపారాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చేలా నిర్ణయం తీసుకున్న రోజు (1956 జనవరి 19) నుండి ఇప్పటి వరకు…ఏ లక్ష్యాలతో అయితే భారతీయ జీవిత బీమా వ్యాపారాన్ని జాతీయం చేసి ”లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా”(ఎల్‌ఐసి)గా ఏర్పాటు చేసుకున్నామో ఆ లక్ష్యాలను సాధించటంలో ఎల్‌ఐసి కృతకృత్యమైంది.

1956 సెప్టెంబర్‌ 1న పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా గత 68 సంవత్సరాలుగా జాతీయీకరణ లక్ష్య సాధన ద్వారా దేశీయ ఆర్థిక రంగానికి వెన్నెముకగా నిలిచింది. 2023 మార్చి 31 నాటికి దేశ ఆర్థిక రంగాభివృద్ధికి, ప్రజల శ్రేయస్సు కోసం రూ. 43,97,204.59 కోట్ల నిధులను పెట్టుబడులుగా ఉంచింది.

1956లో కేవలం రూ.5 కోట్ల పెట్టుబడితో ప్రారంభమై అనంతరం 2011లో ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ నియమాల ప్రకారం రూ.100 కోట్లు పెట్టుబడిగా మార్పు చేసుకుంది. ‘ప్రజల సొమ్ము ప్రజల శ్రేయస్సు’కే అనే లక్ష్యంతో ప్రారంభమైన ఎల్‌ఐసి దేశవ్యాప్తంగా 40 కోట్లకు పైగా వ్యక్తిగత మరియు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ పాలసీదారులు వున్నారు. 95 శాతం సర్‌ప్లస్‌ను పాలసీదారులకు బోనస్‌గా ప్రకటిస్తూ మిగిలిన 5 శాతాన్ని గవర్నమెంట్‌కు డివిడెండ్‌గా ఇస్తూ, పరస్పర సహకార స్ఫూర్తితో 6 దశాబ్దాలకు పైగా ప్రజలకు భరోసాను ఇచ్చింది. ఎల్‌ఐసికి రూ.45,50,571.73 కోట్ల విలువ కలిగిన ఆస్తులు, రూ.40,81,326.41 కోట్ల లైఫ్‌ ఫండ్‌ ఉంది. ఇది అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల జిడిపి కన్నా ఎక్కువ.

ఎల్‌ఐసి ప్రతి సంవత్సరం సుమారు రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులను దేశ ఆర్థికాభివృద్ధికి అందిస్తున్నది. 31.03.2023 నాటికి ఎల్‌ఐసి యాజమాన్యం ఆధీనంలో (ఏయూఎమ్‌) ఉన్న మొత్తం విలువ రూ.43,97,205 కోట్లుగా నమోదు చేసి దేశ జాతీయ ఆదాయంలో సింహభాగంగా నిలిచింది. మొత్తం భారతదేశంలో ఉన్న మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల ఆస్తుల కన్నా ఎక్కువ విలువైన ఆస్తులను ఎల్‌ఐసికి వున్నాయి. ఎల్‌ఐసి ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రూ. 1,831.08 కోట్లను ప్రభుత్వానికి డివిడెండ్‌గా అందించింది.

భారత దేశ బీమా రంగంలో ప్రైవేటు, విదేశీ కంపెనీలను అనుమతించి 2 దశాబ్దాలు దాటిన నేపథ్యంలో కూడా 24 ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలతో పోటీ పడి 62.58 శాతం మొదటి ప్రీమియం ఆదాయాన్ని, 71.76 శాతం మేరకు పాలసీలను కైవసం చేసుకుని ప్రభుత్వ రంగ ఎల్‌ఐసి మార్కెట్‌ లీడర్‌గా నిలిచింది. 2023 ఆర్థిక సంవత్సరంలోనే ఎల్‌ఐసి మొత్తం ఆదాయం రూ.7,88,046.28 కోట్లు సముపార్జించింది. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 225.51 లక్షల మేరకు క్లైయిము లను పరిష్కరించి 2,09,938.63 కోట్ల మొత్తాన్ని చెల్లించింది. 98.6 శాతం డెత్‌ క్లెయిమ్‌లను పరిష్కరించి పాలసీదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. 27.74 కోట్ల పాలసీలకు సేవలనందిస్తూ, ప్రపంచంలోనే ఎక్కువ మంది పట్టాదారులను కలిగి వున్న అతి పెద్ద సంస్థగా ఎల్‌ఐసి ఆవిర్భవించింది.

ప్రభుత్వ, ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ ప్రతికూల విధానాల ఫలితంగా జాతీయ బీమా పరిశ్రమ నేడు అనేక సవాళ్ళను ఎదుర్కొంటోంది. ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్‌ విధానాలలో భాగంగానే, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా, ఎల్‌ఐసి ఐపిఓ ద్వారా స్టాక్‌ మార్కెట్‌లో ప్రభుత్వం తన వాటాలో 3.5 శాతం మేర విక్రయించి జాతీయీకరణ లక్ష్యాలకు తీవ్ర విఘాతం ఏర్పరిచింది. అయినప్పటికీ 5.64 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో ఎస్‌బిఐని దాటి అత్యంత విలువైన ప్రభుత్వ రంగ ఆర్థిక వ్యవస్థగా ఎల్‌ఐసి ఆవిర్భవించింది.

అయితే, అంతటి కీలకమైన ఎల్‌ఐసిలో ప్రభుత్వ వాటాలను ఉపసంహరించి, ప్రభుత్వ లోటు బడ్జెట్‌ను పూడ్చుకునేందుకు వినియోగించుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాలు, లైసెన్సుల జారీ, మూలధన అవసరాల మార్పులు, ఏజెంట్స్‌ పోర్టబిలిటీ నిబంధనలు, బ్యాంక్‌ ఎష్యూరెన్స్‌, కార్పొరేట్‌ ఏజెన్సీ, ఆన్‌లైన్‌, పెట్టుబడుల నిబంధనలు మొదలైన అంశాలపై, మార్పులను తీసుకురావ డానికి ప్రభుత్వం, ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రయత్నిస్తున్నాయి. వీటిని అమలు చేస్తే బీమా పరిశ్రమను జాతీయీకరణ ముందు పరిస్థితులకు తీసుకెళ్ళే ప్రమాదం ఉంది. గత ఆర్థిక సంవత్సరాన్ని పరిశీలించినట్లయితే అన్‌ఫెయిర్‌ బిజినెస్‌ ప్రాక్టీసెస్‌కు సంబంధించి నమోదైన మొత్తం ఫిర్యాదులలో 50.41 శాతం ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు సంబంధించినవనేది గమనార్హం.

అనేక సందర్భాలలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని తన ప్రతిభను, సత్తాను నిరూపించిన ఎల్‌ఐసి ఆఫ్‌ ఇండియా జాతీయీకరణ నాటి నుంచి జాతి గర్వించే స్థాయికి చేరుకోవడం దేశానికే గర్వకారణం. అయితే ప్రస్తుత పోటీ తత్వాన్ని, ప్రైవేటు రంగానికి ఎక్కువ చేయూతను, ప్రోత్సాహాన్ని ఇస్తున్న ప్రభుత్వ విధానాలను సైతం తోసిపుచ్చి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని ఆశిద్దాం.

/వ్యాసకర్త ఎస్‌సిజడ్‌ఐఇఎఫ్‌ జాయింట్‌ సెక్రటరీ (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఎల్‌ఐసి ఉద్యోగ సంఘం),సెల్‌: 9440905501 /జి. కిషోర్‌ కుమార్‌
/వ్యాసకర్త ఎస్‌సిజడ్‌ఐఇఎఫ్‌ జాయింట్‌ సెక్రటరీ (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఎల్‌ఐసి ఉద్యోగ సంఘం),సెల్‌: 9440905501 /జి. కిషోర్‌ కుమార్‌
➡️