గాజా : అంతులేని యుద్ధం !

Jan 6,2024 07:18 #Editorial

ప్రభుత్వ ఆదేశాలతో జరిగే మారణకాండ, జాతి ప్రక్షాళన చర్యలతో ఇజ్రాయిల్‌ ముందుకు సాగగలుగుతోందంటే దానికి ప్రధాన కారణం అమెరికా సామ్రాజ్యవాదం ఇందుకు పూర్తి మద్దతును అందించడమే. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ జరగాలని ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో 150 దేశాలు ఓటు వేసినా, ఈ దిశగా అస్సలు ఎలాంటి కదలికా లేదు. భద్రతా మండలిలో ఇటువంటి తీర్మానాలన్నింటినీ అమెరికా వీటో చేయడమే ఇందుకు ప్రధాన కారణం. మూకుమ్మడి హత్యాకాండను సాగించడానికి ఒకపక్క ఇజ్రాయిల్‌కు మారణాయుధాలను, మందుగుండు సామగ్రిని అందిస్తూ, మరోపక్క గాజాలో పౌర మరణాలను తగ్గించడం గురించి అమెరికా నయవంచనతో మోసపూరితంగా మాట్లాడుతోంది.

కొత్త సంవత్సరం 2024లోనూ గాజాలో సైనిక ఆపరేషన్‌ కొనసాగుతుందని ఇజ్రాయిల్‌ రక్షణ బలగాలు (ఐడిఎఫ్‌) ప్రకటించాయి. హమాస్‌ను పూర్తిగా నిర్మూలించేవరకు గాజాలో యుద్ధం కొనసాగి తీరుతుందని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు పదే పదే చెబుతూ వస్తున్నారు. ఈజిప్ట్‌తో వున్న గాజా సరిహద్దును ఇజ్రాయిల్‌ నియంత్రిస్తుందని కూడా ఆయన చెప్పారు. అంటే మొత్తంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్‌కు పూర్తి నియంత్రణ వుంటుంది. గాజా స్ట్రిప్‌లో మూడు మాసాల పాటు వైమానిక, పదాతి, నావికా దళ ఆపరేషన్లు కొనసాగిన తర్వాత కూడా హమాస్‌ను ఇజ్రాయిల్‌ సాయుధ బలగాలు నిర్మూలించలేక పోయాయి. లేదా హమాస్‌ కార్యకర్తలు ప్రదర్శించే ప్రతిఘటనను అంతం చేయలేకపోయాయి. అంటే హమాస్‌ను సైనిక బలగాలు నిర్మూలించలేవన్నది వాస్తవం. ఒకవేళ సైనికపరంగా ఓడించినా, ఏదో ఒక రూపంలో మళ్లీ తలెత్తడం ఖాయం.

గాజాలో పూర్తిగా జాతి ప్రక్షాళన జరిగేలా చూడాలన్నదే ఇజ్రాయిల్‌ సాగిస్తున్న ఈ అంతులేని యుద్ధం వెనుక గల అసలు లక్ష్యం. ఇరుకుగా వుండే ఈ సన్నని ప్రాంతంలో ఎవరూ నివసించకుండా చూడాలని భావిస్తోంది. గాజా నుండి పాలస్తీనియన్లందరినీ తరిమికొట్టి, ఆకలితో మాడ్చి చంపాలని చూస్తోంది. పాలస్తీనా ప్రజల వరకు, ఈ విపత్తు 1948 లోనే ప్రారంభమైంది. ఇంకా కొనసాగుతునే వుంది.

అక్టోబరు 7 నుండి, ఇప్పటివరకు (డిసెంబరు మూడో వారం వరకు) గాజాపై ఇజ్రాయిల్‌ దాదాపు 29 వేల బాంబులతో దాడులు జరిపింది. ఇరాక్‌లో అమెరికా బాంబు దాడులతో దీన్ని పోల్చి చూసినట్లైతే…ఇరాక్‌లో 2004-2010 మధ్య కాలంలో 3678 బాంబులను మాత్రమే వేశారు. 85 శాతం మంది ప్రజలు ఇప్పటికే నిర్వాసితులయ్యారు. డిసెంబరు 12న ప్రపంచ బ్యాంక్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, 77 శాతం ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, పార్కులు, కోర్టులు, లైబ్రరీలతో సహా 72 శాతం పౌర భవనాలు, 68 శాతం కమ్యూనికేషన్‌ వసతులు, గాజాలోని పారిశ్రామిక జోన్‌ యావత్తూ ఇజ్రాయిల్‌ దురాక్రమణలో తుడిచి పెట్టుకుపోయాయి.

గత 88 రోజులుగా సాగుతున్న ఈ మారణహోమంలో 22 వేల మందికి పైగా మరణించారు. అంటే ప్రతి రోజూ దాదాపుగా 250 మంది చనిపోయారన్నమాట. వీరిలో దాదాపు 90 మంది వరకు చిన్నారులే వున్నారు.

గాజా నుండి పాలస్తీనా ప్రజలను సమూలంగా నిర్మూలించాలన్న ప్రకటిత లక్ష్యంతో ఇజ్రాయిల్‌ సాయుధ బలగాలు ఒక పద్ధతి ప్రకారం సాగిస్తున్న ఊచకోతకు యావత్‌ ప్రపంచం సాక్షీభూతంగా నిలిచింది. ఇదేమీ అతిశయోక్తితో చెబుతున్నది కాదు, మితవాద ప్రభుత్వంలోని మంత్రులు దీని గురించి బహిరంగంగానే ప్రకటించారు. ఈ ఘర్షణకు పరిష్కారంగా పాలస్తీనా పౌరులందరూ వలస వెళ్ళిపోవాలని యూదు తీవ్రవాద జాతీయ భద్రతా మంత్రి బెన్‌-గివిర్‌, ఆర్థిక మంత్రి స్మాట్రిచ్‌లు పిలుపిచ్చారు.

గాజా ప్రజలు వలస వెళ్లిపోవడాన్ని ప్రోత్సహించడంపై దృష్టి కేంద్రీకరించేందుకు ఈ యుద్ధం ఒక అవకాశాన్ని కల్పించిందని బెన్‌-గివిర్‌ వ్యాఖ్యానించారు. స్మాట్రిచ్‌ కూడా దీన్ని సమర్ధించారు. గాజా ప్రజలు స్వచ్ఛందంగా వలస వెళ్ళేలా ప్రోత్సహించాల్సి వుందంటూ ఆయన కూడా మాట్లాడారు. సెటిల్‌మెంట్లను ఏర్పాటు చేయడంతో పాటు గాజా స్ట్రిప్‌ భూభాగాన్ని ఇజ్రాయిల్‌ శాశ్వతంగా తన అదుపులో వుంచుకుంటుందని జోస్యం చెప్పారు. ఉత్తర సినారు ప్రాంతం (ఈజిప్ట్‌కు సమీపాన గల) పాలస్తీనియన్లకు ఆశ్రయం పొందడానికి ఎంత మంచి ప్రాంతమో అంటూ ఇజ్రాయిల్‌ మీడియాలో చర్చలు కూడా జరుగుతున్నాయి.

పాలస్తీనా వ్యతిరేక ఆపరేషన్‌ను విస్తృతంగా చేపట్టడానికి నెతన్యాహు మితవాద ప్రభుత్వం, అక్టోబరు 7న హమాస్‌ జరిపిన దాడిని అవకాశంగా తీసుకుంది. వెస్ట్‌ బ్యాంక్‌, తూర్పు జెరూసలేంలో పాలస్తీనియన్లపై దాడులను ఉధృతం చేసిన తీరు చూస్తే ఇది స్పష్టమవుతోంది. ఇజ్రాయిల్‌ ఆర్మీ దాడుల్లో, సెటిలర్లు జరిపిన దాడిలో వెస్ట్‌ బ్యాంక్‌లో 300 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. 4,700 మందికి పైగా అరెస్టయ్యారు, నిర్బంధించబడ్డారు. పాలస్తీనా రైతులు వ్యవసాయ కార్యకలాపాలు చేపట్టకుండా నిలువరించారు. వారి ఆలివ్‌ చెట్ల దిగుబడులను కోసుకోనివ్వకుండా అడ్డగించారు. వారి భూములను, ఇళ్ళను లాక్కున్నారు. వెస్ట్‌ బ్యాంక్‌ అంతటా 7 లక్షల మంది ఇజ్రాయిలీ సెటిలర్లు అక్రమంగా నివాసాలను ఏర్పరచుకున్నారు. అక్కడి పాలస్తీనీయులను బంటుస్థాన్‌ తరహా ప్రాంతాలకు బలవంతంగా తరిమేస్తున్నారు. ‘బంటుస్థాన్‌’ లనేవి దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష ప్రభుత్వం పెత్తనం చేసినప్పుడు ఉనికిలో వుండేవి. ఈ ప్రాంతాలు కటిక దారిద్య్రానికి, వెనుకబాటుతనానికి, వర్ణవివక్షకు నిలువెత్తు సాక్ష్యంగా వుండేవి. ఇప్పుడు పాలస్తీనీ యులు అటువంటి దుర్భర స్థితికి నెట్టబడ్డారు.

ప్రభుత్వ ఆదేశాలతో జరిగే మారణకాండ, జాతి ప్రక్షాళన చర్యలతో ఇజ్రాయిల్‌ ముందుకు సాగగలుగుతోందంటే దానికి ప్రధాన కారణం అమెరికా సామ్రాజ్యవాదం ఇందుకు పూర్తి మద్దతును అందించడమే. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ జరగాలని ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో 150 దేశాలు ఓటు వేసినా, ఈ దిశగా అస్సలు ఎలాంటి కదలికా లేదు. భద్రతా మండలిలో ఇటువంటి తీర్మానాలన్నింటినీ అమెరికా వీటో చేయడమే ఇందుకు ప్రధాన కారణం. మూకుమ్మడి హత్యాకాండను సాగించడానికి ఒకపక్క ఇజ్రాయిల్‌కు మారణాయుధాలను, మందుగుండు సామగ్రిని అందిస్తూ, మరోపక్క గాజాలో పౌర మరణాలను తగ్గించడం గురించి అమెరికా నయవంచనతో మోసపూరితంగా మాట్లాడుతోంది.

ఇజ్రాయిల్‌, ఉక్రెయిన్‌లకు అందచేయాల్సిన 10.6 కోట్ల డాలర్ల సహాయ ప్యాకేజీ అమెరికన్‌ కాంగ్రెస్‌లో స్తంభించిన నేపథ్యంలో బైడెన్‌ ప్రభుత్వం డిసెంబరు మాసంలోనే రెండుసార్లు ఇజ్రాయిల్‌కు అత్యవసర ఆయుధాల అమ్మకాలను ఆమోదించింది. 10.6 కోట్ల డాలర్లకు పైగా మొత్తం విలువ చేసే 14 వేల రౌండ్ల ట్యాంక్‌ మందుగుండు అమ్మకాలను మొదటిసారిగా ఆమోదించారు. దాని తర్వాత రెండోసారి అత్యవసరంగా 14.75 కోట్ల డాలర్ల విలువ చేసే పరికరాల అమ్మకాలను ఆమోదించారు. వీటిలో ఇజ్రాయిల్‌ అప్పటికే కొనుగోలు చేసిన 150 ఎంఎం షెల్స్‌ను ఉపయోగించడానికి అవసరమైన పరికరాలు ఫ్యూజులు, చార్జర్లు, ప్రైమర్లు వంటివి వున్నాయి. ఐక్యరాజ్య సమితి నిర్వహించే పాఠశాలలు, ఆస్పత్రుల్లో ఆశ్రయం పొందుతున్న మహిళలు, పిల్లలు, ఆరోగ్య సిబ్బందిని చంపడానికి ఈ షెల్స్‌ను ఉపయోగిస్తున్నారు. గాజాలో సాగుతున్న మారణకాండ, ఊచకోత పట్ల అమెరికా పూర్తి ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఇజ్రాయిల్‌, అమెరికా సామ్రాజ్యవాదం మధ్యగల సంబంధాన్ని అర్ధం చేసుకోలేకపోతే పాలస్తీనియన్ల జాతి ప్రక్షాళన ప్రక్రియ గురించి అర్ధం చేసుకోలేం. సెటిలర్‌, వలసవాద దేశంగా ఇజ్రాయిల్‌ మనుగడ సాగిస్తోంది. అమెరికా సామ్రాజ్యవాదం పూర్తి స్థాయి మద్దతుతో దశాబ్దాలుగా అది మరింతగా బలపడుతోంది. ఇజ్రాయిల్‌ మాదిరిగా మరే ఇతర దేశానికి కూడా అమెరికా ఇంతలా ఆయుధాలను అందచేస్తూ, ఆర్థికంగా మద్దతివ్వలేదు. కేవలం అమెరికా జోక్యం కారణంగానే ఈజిప్ట్‌తో మొదలుపెడితే, ఒకదాని తర్వాత మరొకటిగా అరబ్‌ దేశాలన్నీ పాలస్తీనా ప్రయోజనాలను మోసగించడం ద్వారా ఇజ్రాయిల్‌తో శాంతి, సహకారానికి ప్రయత్నిస్తూ వచ్చాయి.

లౌకిక అరబ్‌ జాతీయవాద శక్తులను ఎదుర్కొనడానికి, ఇజ్రాయిల్‌తో దౌత్య సంబంధాలకు వెసులుబాటు కల్పిస్తూ, రాజకీయ, సామాజిక మార్పును వ్యతిరేకించే రాజ్యాలు (రియాక్షనరీ కింగ్‌డమ్‌), షేక్‌లకు అమెరికా ఆసరాగా నిలిచింది. వీటిలో తాజాది అబ్రహమ్‌ ఒప్పందాలు. అరబ్‌ దేశాల పాలకులు పాలస్తీనియన్లను కించపరిచినప్పటికీ అరబ్‌ దేశాల ప్రజలు మాత్రం ఎన్నడూ పాలస్తీనాకు తమ మద్దతును, సంఘీభావాన్ని వీడలేదు. మొత్తంగా అరబ్‌ ప్రాంతంలో గాజా ప్రజలకు పెద్ద ఎత్తున మద్దతును అందిస్తూ ప్రస్తుతం తలెత్తిన ఈ తిరుగుబాటు, ఆందోళనలు అమెరికా-ఇజ్రాయిల్‌ కూటమి ఏం చేసినా, పాలస్తీనా ప్రజల పోరాటం ఎన్నడూ కూడా ఏకాకి కాదు, అణచివేతకు గురవదని స్పష్టం చేస్తున్నాయి. లెబనాన్‌ సరిహద్దుల్లో ఇజ్రాయిల్‌ బలగాలు, హిజ్బుల్లా మధ్య ఘర్షణలు, ఎర్ర సముద్రంలో ఆత్మాహుతి దాడులు ఉధృతం కావడంతో ప్రాంతీయ ఘర్షణలు మరింత విస్తరిస్తున్నాయనడానికి ఇవి కొన్ని సంకేతాలు. ఈ చర్యల ఫలితంగా తలెత్తే పర్యవసానాలు ప్రస్తుతమున్న భౌగోళిక, రాజకీయ సమతుల్యతను దెబ్బతీయవచ్చు.

( ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

➡️