జనరల్‌ బోగీలు పెంచరే…

Jun 15,2024 03:45 #editpage

నిత్యం దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణీకులు రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. జనరల్‌ బోగీల్లో ప్రయాణించే సామాన్యుల పరిస్థితి దయనీయంగా ఉంది. సీట్లు తక్కువగా ఉండటం, స్థలం లేకపోవడం, తొక్కిసలాటలు, సర్వసాధారణం అయిపోయింది. అదే సమయంలో, దూర ప్రాంత ప్రయాణాలకు అనువుగా ఉండే అనేక రైళ్లలో స్లీపర్‌ క్లాస్‌ బోగీల కుదింపు వేగంగా జరుగుతోంది. స్లీపర్‌ బోగీలను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు. స్లీపర్‌ స్థానంలో ఏసీ బోగీల సంఖ్యను పెంచుతున్నారు. విశాఖ, గోదావరి, ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ల తరహాలో, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో స్లీపర్‌ క్లాస్‌ బోగీలకు కోత పడుతోంది. ఫలితంగా సీటు లేదా బెర్త్‌ రిజర్వేషన్‌ దొరక్క ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. ఎంత ముందుగా ప్రయాణం కోసం రిజర్వు చేయించుకోవాలని ఆశించినా సెలవులు, పండుగల సందర్భాల్లో టికెట్లు దొరకట్లేదు. ఫలితంగా జనరల్‌ టికెట్‌ తీసుకుని ప్రయాణించేవారు నిల్చోవడానికి కూడా ఖాళీ దొరక్క స్లీపర్‌ క్లాసు బోగీల్లో ఎక్కేస్తున్నారు. ఇది రిజర్వేషన్‌ లేని వారితో పాటు, రిజర్వేషన్‌ ఉన్న ప్రయాణీకులకు కూడా ఇబ్బందిగా మారుతోంది. జనరల్‌ బోగీలతో సమానంగా ఇప్పుడు రిజర్వుడు స్లీపర్‌ క్లాస్‌ బోగీలు కిక్కిరిసిపోతున్నాయి. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. వేసవిలో దూర ప్రయాణాలకు వెళ్లేవారి సమస్య ఇంకా తీవ్రంగా ఉంది. ఇప్పటికైనా రైల్వే మంత్రిత్వ శాఖవారు సామాన్య ప్రయాణీకుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాధారణ, స్లీపర్‌ క్లాస్‌ బోగీలను పెంచాలి.
– అప్పన్న గొనప,
విశాఖపట్నం.

➡️