కర్కశ దాడి

Jan 23,2024 07:15 #Editorial

                  తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టిన అంగన్‌వాడీ మహిళలపై ప్రభుత్వం దుర్మార్గంగా దమనకాండకు పాల్పడింది. గడచిన 41 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా సర్కారులో చలనం లేదు. కోటి సంతకాలు సేకరించి ‘జగనన్నకు చెప్పుకుందాం’ అంటూ సోమవారం చేపట్టిన కార్యక్రమంపై పోలీస్‌ పాశవిక నిర్బంధం ప్రభుత్వంలో గూడుకట్టుకున్న కర్కశత్వానికి నిలువుటద్దం. రాజధానికి పయనమైన వేలాది మంది అంగన్‌వాడీలను, వారి పోరాటానికి సంఘీభావం తెలుపుతున్న ప్రజాసంఘాల నేతలను, కార్యకర్తలను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డగించి అరెస్టులు చేసి బలవంతంగా ఠాణాలకు తరలించారు. రాత్రంతా చలిలో వ్యాన్లలో తిప్పారు. పోలీసుల అడ్డంగింతలను దాటుకొని బెజవాడ చేరుకున్న వేలాది మందినీ ఆదివారం అర్థరాత్రి నుంచే అరెస్టులు చేసి కదలనీకుండా చేశారు. అరెస్టుల పర్వం సోమవారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. సమ్మెపై ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా విజయవాడ ధర్నా చౌక్‌లో బుధవారం నుంచి కొనసాగిస్తున్న అంగన్‌వాడీ సంఘాల నేతల నిరవధిక నిరాహార దీక్షా శిబిరంపై సోమవారం రాత్రి మూడు గంటలకు భారీ ఫోర్స్‌తో పోలీసులు దాడి చేసి టెంట్‌ను కూల్చేశారు. దీక్షలో ఉన్న వారిని బలవంతంగా ఎత్తేశారు. నిరాహార దీక్షలో ఉన్న ఒక నాయకురాలిని ఆస్పత్రికి కాకుండా కొన్ని గంటల పాటు వ్యాన్‌లో తిప్పడంతో సీరియస్‌ అయింది. ఈ ఉదంతంతో ప్రభుత్వం అంగన్‌వాడీలపై ఎంతగా శత్రుత్వం పెంచుకుందో అర్థమవుతుంది.

అంగన్‌వాడీలు చేసిన తప్పేంటి? జీతభత్యాల కోసం, పని భారం తగ్గించాలని, వేధింపులు ఆపాలని కోరుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను, చట్టాలను, కోర్టు తీర్పులను అమలు చేయమని వేడుకుంటున్నారు. దీనినిసైతం ప్రభుత్వం సహించలేకపోతోంది. తెలంగాణ కంటే వెయ్యి ఎక్కువ పెంచుతామని వాగ్దానం చేశారు కదా అని గుర్తు చేయడమే సర్కారుకు నేరంగా కనిపిస్తోంది. నాలుగున్నరేళ్లు దాటి మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అన్ని హామీలూ అమలు చేశామని ప్రభుత్వం వల్లిస్తుండగా, తమ సంగతేంటని అంగన్‌వాడీలు ప్రశ్నించడం నేరమా? వారి ఆందోళనలు ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినవి కాదు. ఫిబ్రవరి నుంచే దశలవారీగా జరుగుతున్నాయి. చట్టబద్ధంగా సమ్మె నోటీసిచ్చారు. సర్కారు స్పందించకపోవడంతో డిసెంబర్‌ 12 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. ప్రజాస్వామ్యంలో తమ ఉద్యోగులు సమ్మె చేస్తే చర్చించి పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత. తన బాధ్యత నిర్వర్తించడంలో సర్కారు ఘోరంగా విఫలమైంది. చర్చలను తంతుగా మార్చి బెదిరింపులకు దిగింది. సమ్మెతో మూతబడ్డ అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టించింది. ఎస్మా వరకు వెళ్లింది. టెర్మినేషన్‌ ఆర్డర్స్‌, ఉద్యోగాల భర్తీకి సిద్ధం చేయడం ప్రభుత్వ నిరంకుశానికి పరాకాష్ట.                 ప్రభుత్వ నిరంకుశ చర్యలకు అదరకుండా బెదరకుండా వీరోచితంగా పోరాడుతున్న అంగన్‌వాడీల తెగువ అభినందనీయమైనది. ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకం. రోజు రోజుకూ ఉధృతమైన సమ్మె, సమ్మెకు వివిధ పార్టీల, ప్రజాసంఘాల, మేధావుల నుంచి, ముఖ్యంగా నిరుపేద మహిళల నుంచి పెరుగుతున్న విశాల మద్దతు సర్కారుకు కంటగింపైంది. ఎలాగైనా సరే సమ్మెను భగం చేయాలన్న ప్రభుత్వ ఎత్తులు పారకపోవడంతో ఎంతటి నిర్బంధానికైనా వెనుకాడట్లేదు. చట్టాలను తుంగలో తొక్కి అంగన్‌వాడీ మహిళలపై మగ పోలీసుల విచక్షణా రహిత దాడులు, అరెస్టులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. అంగన్‌వాడీల చలోపై ప్రభుత్వ నిర్బంధానికి నిరసనగా వామపక్ష పార్టీల నేతలు నిరాహార దీక్షకు దిగారు. ప్రభుత్వం స్పందించకుంటే నిరవధిక నిరాహార దీక్షలుగా మారుస్తామని హెచ్చరించారు. ట్రేడ్‌ యూనియన్లు ఈ నెల 24న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టుదల విడనాడి అంగన్‌వాడీ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలి. అంగన్‌వాడీల పోరాటానికి ప్రజలందరూ బాసటగా నిలవాలి. ప్రభుత్వ నిర్బంధాన్ని ఎలుగెత్తి ఖండించాలి.

➡️