విద్వేష విధ్వంసం

Feb 13,2024 07:20 #Editorial

                కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక బిజెపి పాలిత రాష్ట్రాల్లో ముస్లిం మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని వారి నివాసాల, దుకాణాల, ప్రార్ధనా మందిరాల కూల్చివేతలు యథేచ్ఛగా సాగుతున్నాయని ఇంతకాలం ప్రతిపక్షాలు, ప్రధానంగా వామపక్షాలు ఆందోళన చెందాయి. కాగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో మత ప్రాతిపదికన బుల్డోజర్‌, జెసిబిలతో నిర్మాణాల కూల్చివేత దురాగతాలపై ఇంటర్నేషనల్‌ సంస్థ ఆమ్నెస్టీ సాక్ష్యాధారాలతో దేశం కళ్లకు కట్టింది. కూల్చివేతలపై ఆమ్నెస్టీ తయారు చేసిన రెండు నివేదికల్లోనూ బిజెపి ప్రభుత్వాల ఆటవిక న్యాయాన్ని తూర్పారబట్టింది. ‘బుల్డోజర్‌ రాజ్‌’ను తీవ్రంగా నిరసించింది. తప్పుబట్టింది. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేసింది. ఆమ్నెస్టీ ఉత్తినే ఎక్కడో కూర్చొని నివేదికలు తయారు చేయలేదు. సంఘటనా ప్రదేశాలను సందర్శించింది. ప్రభుత్వ బుల్డోజర్ల కింద ఆస్తులను కోల్పోయిన వందలాది బాధితుల, న్యాయ నిపుణుల, మత పెద్దల, పాత్రికేయుల నుంచి సమాచారం సేకరించింది. వీడియోలను, ఫొటోలను పరిశీలించింది. దేశం వెలిగిపోతోందని, విశ్వగురు అని ప్రచారం లంకించుకున్న బిజెపి, మోడీ ఆమ్నెస్టీ చేసిన నిర్ధారణలపై ఏం సమాధానం చెబుతారు?

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై దేశ వ్యాప్తంగా నిరసనలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో రాజధాని ఢిల్లీలో ఆందోళనలు మిన్నంటాయి. వాటిలో పాల్గొన్న ముస్లింలు, మద్దతుదారుల ఆస్తులను బుల్డోజర్లు, జెసిబిలు, ఇతర యంత్రాలతో కూలగొట్టిన హృదయవిదారక దృశ్యాలు నేటికీ ప్రజలు మర్చిపోలేదు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగికి ‘బుల్డోజర్‌ బాబా’ పేరు సార్ధకమైందంటే ఆ రాష్ట్రంలో విద్వేష విధ్వంస పర్వం ఎంత భయానకమో అర్థం చేసుకోవచ్చు. ఏదైనా కేసులో నేరం ఆరోపించబడిన వారి ఆస్తులను నేలమట్టం చేసి రోడ్డున పడేయడం నిత్యకృత్యమైంది. బిజెపి ఏలుబడిలోని అసోం, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లు యు.పి దారే పట్టాయి. ప్రభుత్వాలే చట్టాలను తుంగలో తొక్కుతున్నాయి. బాధితులకు కనీసం నోటీసులివ్వట్లేదు. కూల్చివేతల వేళ కనీసం వస్తువులను సైతం తీసుకెళ్లనీకుండా అధికారులు బలప్రయోగంతో అడ్డుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులను రోడ్డున పడేస్తున్నారు. రాజ్యం దాడిలో వందలాది కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాయి. అవమానాలకు గురవుతున్నాయి. ఈ అమానుషాలకు ప్రభుత్వంలోని ముఖ్యుల ప్రోద్బలం ఉందని ఆమ్నెస్టీ తన విచారణలో కుండబద్దలు కొట్టింది. అందుకు తగ్గట్టుగానే బిజెపి నాయకులు తమ అరాచకాలను ‘బుల్డోజర్‌ న్యాయం’ అని సమర్ధించుకుంటున్నారు.

ఉత్తరాఖండ్‌లో వాల్ద్వానీ నగరంలో ప్రస్తుతం చెలరేగిన అల్లర్లకు అక్కడి బిజెపి సర్కారే కారణం. రెండ్రోజుల క్రితం బల్‌భూల్‌పురాలో ప్రభుత్వ స్థలంలో కట్టారనే సాకుతో మసీదు, మదర్సాలను అధికారులు నేలమట్టం చేశారు. బాధితులు హైకోర్టును ఆశ్రయించగా, విచారణను 14కు వాయిదా వేసింది. స్టే ఇవ్వలేదన్న తప్పుడు వాదనలతో సర్కారు మసీదు, మదర్సాలపై జెసిబిలు పోనిచ్చి కూల్చిపడేసింది. అందుకు నిరసనగా లేచిన ఘర్షణలలో ఐదుగురు చనిపోయారు. నగరంలో కర్ఫ్యూ విధించారు. బుల్డోజర్లతో ఇళ్లను కూల్చడం అధికారులకు ఫ్యాషనై పోయిందని సోమవారం మధ్యప్రదేశ్‌ హైకోర్టు వ్యాఖ్యలు అక్కడి బిజెపి ప్రభుత్వ విధ్వంసానికి తిరుగులేని ఉదాహరణ. మొన్నటికిమొన్న అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట తర్వాత ముంబయిలోని మహ్మద్‌ అలీ రోడ్డులో అల్లర్లు లేచాయి. అక్కడి 40 నిర్మాణాలను మహారాష్ట్ర సర్కారు కూల్చేసింది. రాజ్యాంగ మూల స్తంభాలలో లౌకికత్వం ప్రధానమైనది. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రభుత్వాలే రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడటం ఆందోళనకరం. అంతర్జాతీయ మానవహక్కుల చట్టం, అంతర్జాతీయ ఒప్పందం (ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులు) బలవంతపు, ఏకపక్ష, కక్షపూరిత, విద్వేష కూల్చివేతలకు వ్యతిరేకం. ఆ చట్టాలనూ బిజెపి ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి. ఆమ్నెస్టీ పెట్టిన గడ్డితోనైనా పాలకులు బుద్ధి తెచ్చుకుంటారా? ప్రజా ప్రతిఘటనోద్యమాలే వారిని దారికి తేవాలి.

➡️