హత్రాస్‌ : మనువాద ఘోరాల మచ్చుతునక

Feb 3,2024 07:17 #Editorial

కుల సమీకరణలు తారుమారై, ఒకవేళ బాధితురాలు అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి అయి, నేరం చేసిన వారు దళితులు లేదా ఇతర మైనార్టీలు అయిఉంటే, ఒకవేళ ఆ అమ్మాయి హత్రాస్‌ బాధితురాలి లాగా మరణ వాంగ్మూలం ఇచ్చినట్లయితే, ఎలాంటి వాదనల్లేకుండా దాన్ని అంగీకరించి వుండేవారు. నేరస్థులకు జీవిత ఖైదు విధించి ఉండేవారు. మరణ వాంగ్మూలానికి కోర్టు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుంది. కానీ హత్రాస్‌లో బాధితురాలు వాల్మీకి కులానికి చెందిన బాలిక. రాజీ చేసి, తీర్పును అంగీకరించడానికి ఆ కుటుంబంపై ఒత్తిడి తెచ్చారు. ఇలాంటి అన్యాయమైన తీర్పుపై ప్రభుత్వం అప్పీలు చేస్తుందనుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. యు.పి ప్రభుత్వం అప్పీల్‌ చేయడానికి నిరాకరించింది.

”మా చెల్లెలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేసినవారు స్వేచ్ఛగా ఉన్నారు. వారు ఊళ్ళో విజేతల్లాగా తిరుగుతున్నారు. కానీ మేమే, నేరస్తులం. మేం మా ఇంటి బయటికి అడుగు వెయ్యలేకపోతున్నాం” అని హత్రాస్‌ బాధితురాలి 33 ఏళ్ల సోదరుడు సతీందర్‌ కుమార్‌ మాతో అన్నాడు. వారి క్షేమ సమాచారం తెలుసుకుందామని జనవరి 17న సుభాషిణి అలీ, నేను వారి గ్రామం బుల్‌ గర్హీ వెళ్లాం. న్యాయాన్ని అణచివేయడాన్ని, కుల నియమాలను పాటించడాన్ని గమనించాం. ఉత్తరప్రదేశ్‌లో నేడు ఒక దళితుడికి న్యాయం జరగాలని పోరాడటం చాలా కష్టమనే వాస్తవం మాకు అర్థమైంది. మనువాద కుల నియమావళి అమలులో నాలుగు దశలున్నాయని తెలిసింది.

మొదటి దశ – నేరం

                  మొదటిది, సెప్టెంబర్‌ 2020లో జరిగిన నేరం-ఒక పేద దళిత కుటుంబానికి చెందిన 19 ఏళ్ళ అమ్మాయిపై అగ్ర వర్ణానికి చెందిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం, ఆ పైన హత్య చేశారు. ఈ ఉదంతం మొత్తంలో కుల, వర్గ, పితృస్వామిక దోపిడీ, అణచివేత కనిపిస్తాయి. ఇదొక కుల నేరం. పేద మహిళపై బలమైన గ్రామీణ ఉన్నత శ్రేణులు జరిపిన వర్గ నేరం. వారు మాత్రం దీనిని నేరంగా పరిగణించరు.

రెండవ దశ – ప్రభుత్వ పక్షపాతం

                 రెండో దశలో పాలనా విభాగం, యు.పి ప్రభుత్వం ద్వారా నేరాన్ని కులంతో కప్పివేశారు. సెప్టెంబర్‌ 2020లో నేరం జరిగింది. పాలనా విభాగం, ప్రభుత్వం, విచారణను సాధ్యమైనంతగా బలహీన పర్చడానికి ప్రయత్నించాయి. మొదటి నుండి కూడా అత్యాచారం అసలు జరగలేదనీ, ఏది జరిగినా అంగీకారంతోనే జరిగిందనే అబద్ధాన్ని చెప్పుకొచ్చారు. ఐదు రోజులపాటు అసలు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. వైద్య పరీక్షలు ఆలస్యంగా చేసి, ముఖ్యమైన రుజువు లేకుండా చేసేశారు. అత్యవసర వైద్యాన్ని అందించక పోవడంతో ఆ అమ్మాయి ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఆలస్యంగా ఆమెను ఢిల్లీ ఆసుపత్రికి తరలించారు. ఆమె మరణం తరువాత పోలీసులే మృతదేహాన్ని బలవంతంగా తీసుకెళ్ళి, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే రాత్రికి రాత్రే అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు నిర్వహించడం ద్వారా రెండో పోస్ట్‌ మార్టం చెయ్యాలనే డిమాండ్‌ లేకుండా పోలీసులు అడ్డుకున్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు, ఆగ్రహజ్వాలలతో కేసును సిబిఐకి అప్పగించారు.

మూడవ దశ – న్యాయ పోరాటం

                  న్యాయ ప్రక్రియలో, ప్రభుత్వ పక్షపాత ధోరణి కొనసాగింపులో మనువాద కుల నియమావళి మూడవ దశగా ఉంటూ వచ్చింది. ఆ యువతిపై జరిగిన అఘాయిత్యాల వివరాలన్నీ సిబిఐ చార్జిషీట్‌లో ఉన్నాయి. గ్యాంగ్‌ రేప్‌, హత్య, కుట్ర సంబంధిత నిబంధనల కింద అభియోగాలు మోపారు. బాధితురాలి మరణ వాంగ్మూలం పైన చార్జిషీట్‌ ఆధారపడింది. తీవ్రంగా బాధపడుతున్న కూతుర్ని దగ్గరగా గమనించిన తల్లి కూడా ఈ విషయాలను తెలిపింది. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ నిరోధక చట్టం కింద ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దుర్మార్గాలపై విచారించేందుకు నియమించబడిన ప్రత్యేక కోర్టు ఈ కేసును చేపట్టింది. ఎలాంటి కారణాల్లేకుండా కోర్టు, బాధితురాలి మరణ వాంగ్మూలాన్ని కొట్టివేసి, తల్లి చెప్పిన విషయాల్ని పక్కన పెట్టింది. ఆ అమ్మాయి పేర్కొన్న నలుగురిలో ముగ్గుర్ని నిర్దోషులుగా విడుదల చేసి, సెక్షన్‌ 304 కింద తక్కువ నేరం చేశాడని నాల్గవ వ్యక్తికి శిక్ష వేశారు. వాస్తవానికిది నేరపూరిత హత్య.

యు.పి లో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ కులానికి చెందిన సోదర సభ్యులు శిక్ష మినహాయింపులు అనుభవిస్తున్నారు. కుల సమీకరణలు తారుమారై, ఒకవేళ బాధితురాలు అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి అయి, నేరం చేసిన వారు దళితులు లేదా ఇతర మైనార్టీలు అయి ఉంటే, ఒకవేళ ఆ అమ్మాయి హత్రాస్‌ బాధితురాలి లాగా మరణ వాంగ్మూలం ఇచ్చినట్లయితే, ఎలాంటి వాదనల్లేకుండా దాన్ని అంగీకరించి వుండేవారు. నేరస్థులకు జీవిత ఖైదు విధించి ఉండేవారు. మరణ వాంగ్మూలానికి కోర్టు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుంది. కానీ హత్రాస్‌లో బాధితురాలు వాల్మీకి కులానికి చెందిన బాలిక. రాజీ చేసి, తీర్పును అంగీకరించడానికి ఆ కుటుంబంపై ఒత్తిడి తెచ్చారు. ఇలాంటి అన్యాయమైన తీర్పుపై ప్రభుత్వం అప్పీలు చేస్తుందనుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. యు.పి ప్రభుత్వం అప్పీల్‌ చేయడానికి నిరాకరించింది. ఇలాంటి ఉదాహరణలు గతంలో ఏమైనా ఉన్నాయా? అప్పీలు చేయకూడదనే నిర్ణయం వెనుక హోంశాఖ, మంత్రి అమిత్‌ షా అంగీకారం తప్పక ఉంటుంది. అప్పీల్‌ చేయడానికి ప్రభుత్వం, సిబిఐ నిరాకరించడంతో, దాన్ని సవాల్‌ చేస్తూ బాధిత కుటుంబం అలహాబాద్‌ హైకోర్టులో అప్పీలు చేసింది. ఆ కేసు ఇప్పుడు పెండింగ్‌లో ఉంది.

రెండో కేసు లక్నో బెంచ్‌కి సంబంధించింది. సెప్టెంబర్‌ 2020లో ఘోరమైన నేరం జరిగిన తర్వాత లక్నో బెంచ్‌ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. అక్టోబర్‌ 2020లో బాధిత కుటుంబాన్ని కోర్టుకు పిలిపించింది. ప్రభుత్వం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, ఆ కుటుంబానికి భద్రత కల్పించి, సురక్షిత ప్రాంతానికి తరలించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిందితుల్ని నిర్దోషులుగా విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ అప్పీలు చేయడానికి నిరాకరించి, లక్నో కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి, కుటుంబానికి ప్రత్యామ్నాయంగా గృహ వసతి ఏర్పాటుకు వ్యతిరేకంగా యు.పి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసింది. బాధిత కుటుంబం ఆ కేసును సుప్రీంకోర్టులో ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. ఏప్రిల్‌ 2023లో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం, లక్నో కోర్టు తీర్పుపై స్టే కోరుతూ దాఖలైన ప్రభుత్వ అప్పీల్‌ను తిరస్కరించింది. అయితే ప్రభుత్వం ఆ తీర్పును అమలు చేయకుండా నిరాకరించింది. సుప్రీంకోర్టులో తదుపరి విచారణ జనవరి 2024 తరువాత జరుగుతుంది. ఈ రెండు కేసుల్లో కూడా భారం, ఆందోళన, న్యాయ ప్రక్రియకు అయ్యే ఖర్చును ఆ కుటుంబమే భరించాలి. రెండు కేసుల్లోనూ వారు ప్రభుత్వంతోనే పోరాడాల్సి వస్తుంది.

నాల్గవ దశ – బతుకు పోరాటం

                ప్రస్తుతం నాల్గవ దశలో, గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వరకూ ఉన్న అధికార శక్తులతో రోజువారీ బతుకు పోరాటం జరుగుతోంది. గత సంవత్సరం నిందితులు విడుదలైనప్పటి దృశ్యాల గురించి సోదరులు సతీందర్‌, సందీప్‌ మాకు చెప్పారు. బిల్కిస్‌ బానో కేసులో రేపిస్టులు, హంతకులు విడుదలైనప్పుడు విహెచ్‌పి ఉత్సవాలు చేసుకున్న తీరును ఇది, మనకు గుర్తుకు తెస్తుంది. 2023 మార్చి 3న తీర్పు వెలువడిన వెంటనే వారిని విడుదల చేశారు. హోళీ పండుగకు కొద్ది రోజుల ముందు ఇది జరిగింది. వారిని మేళతాళాలతో, పూలవర్షం కురిపిస్తూ, వారి సంఘ సభ్యులు పూలదండలు వేసి ప్రదర్శనగా స్వాగతం పలికారని వారన్నారు. బుల్‌గర్హి గ్రామంలో ఆరు దళిత కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఆ గ్రామంలో మెజారిటీ కుటుంబాలు ఠాకూర్లు. నిందితులంతా ఈ కులానికి చెందిన వారే. బ్రాహ్మణ కుటుంబాల సంఖ్య చాలా ఎక్కువ. తమను భయపెట్టి, ఒంటరిని చేస్తున్నారని బాధితులు తెలిపారు.

మొదట్లో ఆ కుటుంబానికి నష్టపరిహారంగా ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఇచ్చింది. కుటుంబానికి 24 గంటలు భద్రత ఏర్పాటు చేయాలన్న కోర్టు ఆజ్ఞల్ని అమలు చేసింది. మేం ఆ కుటుంబాన్ని కలవడానికి వెళ్ళేసరికి, వారి ఇంటి ఆవరణలోని ఒక భాగంలో కేంద్ర బలగాల క్యాంపు కనిపించింది. కుటుంబ రక్షణ కోసం, వారి భద్రత కోసం 15 మంది సిబ్బందిని కేటాయించారని చెప్పారు. తామక్కడ లేకుంటే, మొత్తం కుటుంబాన్ని చంపి ఉండేవారని ఓ కానిస్టేబుల్‌ మాతో అన్నాడు. ఈ కుటుంబం కోర్టులో పోరాటం చేస్తున్నదని, వీరిమీద గ్రామస్తులకు చాలా కోపం ఉందని పోలీసులు అన్నారు.

అయితే భద్రత కూడా రెండువైపులా పదునైన కత్తి లాంటిదని రుజువైంది. ఇద్దరు సోదరులూ వారి ఉద్యోగాలు కోల్పోయారు. సతీందర్‌ నోయిడా లోని ఒక మాన్యుఫాక్చరింగ్‌ ఫ్యాక్టరీలో, అతని తమ్ముడు సందీప్‌ ఘజియాబాద్‌లోని ఒక మొబైల్‌ కంపెనీలో పని చేసేవారు. వారి తల్లిదండ్రుల సంరక్షణ కోసం గ్రామంలో వున్న ఇంటికి రావాల్సి వచ్చేది. భద్రతా సిబ్బంది లేకుండా ఇప్పుడు వారు ఇల్లు విడిచి బయటికి వెళ్లలేరు. వారి వెంట సాయుధ పోలీసులుంటారు. కాబట్టి వారికెవరూ ఉద్యోగాలివ్వడానికి ఇష్టపడ్డం లేదు. కొన్ని దశాబ్దాల క్రితం దళితుల భూపంపిణీ కార్యక్రమంలో వారికి ఐదు భిగాల భూమినిచ్చారు. రెండు భిగాల భూమిని అగ్ర వర్ణాలవారు చట్టవ్యతిరేకంగా ఆక్రమించుకున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే సమయంలో కూడా పోలీసులు వెంట ఉంటున్నారనీ, ఆఖరికి కూరగాయలు కొనేందుకు కూడా వారు ఇంటి నుండి బయటకి అడుగుపెట్టలేకపోతున్నామనీ, మార్కెట్‌కు వెళ్ళేటప్పుడు ముందు ఇద్దరు, వెనుక ఇద్దరు పోలీసులు ఉండడం వల్ల అందరి దృష్టి మా పైనే వుండడంతో మమ్ముల్ని ”హత్రాస్‌ కేసు” కుటుంబంగా గుర్తిస్తున్నారు. ఆ కుటుంబంలో శాంతీదేవి అనే 80 ఏళ్ల నాయనమ్మ, బాధితురాలి తల్లిదండ్రులు ఓం ప్రకాష్‌, రమాదేవి ఉంటారు. ఓం ప్రకాష్‌ దశాబ్దాలుగా అసన్సోల్‌లో కార్మికునిగా పనిచేస్తున్నాడు. అతనికి ఎర్రజెండాతో అనుబంధం ఉంది. జ్యోతిబసు నాయకత్వం లోని బెంగాల్‌లో ఇలాంటి అన్యాయం ఎప్పుడూ జరగలేదని ఆయన అన్నాడు. ఇంకా సతీందర్‌ భార్య సంధ్య, వారి ముగ్గురు పిల్లలు, 23 ఏళ్ల వారి తమ్ముడు సందీప్‌ ఉన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా వారి పిల్లలు స్కూల్‌కు వెళ్ళడం లేదు. పెద్ద పాపను సంధ్య తల్లిదండ్రుల దగ్గరకు పంపించారు. మిగిలిన ఇద్దరు పిల్లలకు చదువుకునే హక్కును ఈ పరిస్థితులు ఆటంకపరిచాయి. కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈ మూడేళ్ల కాలంలో నష్టపరిహారంగా ఇచ్చిన డబ్బును కేసు కోసం ఖర్చు చేస్తున్నారు. వీరిపట్ల సానుభూతితో ఉన్న న్యాయవాదులు ఫీజు తీసుకోకపోయినప్పటికీ కోర్టుకు వెళ్లిన ప్రతిసారీ రూ.15 వేల నుండి రూ.20 వేలు ఖర్చవుతాయి. వారు కుటుంబ సభ్యుల కోసమే కాక భద్రతా సిబ్బందికి కూడా వాహనాన్ని అద్దెకు తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా తొలి రోజుల్లో వారు వివిధ కోర్టులకు వెళ్ళాల్సి వచ్చేది. లక్నో, అలహాబాద్‌లకు నెలలో చాలాసార్లు వెళ్ళాల్సి వచ్చింది. ప్రతి సందర్భంలో కుటుంబం సామాజిక కార్యక్రమాలకు వెళ్ళాలి. అప్పుడు కూడా ఇలాంటి ఖర్చులే. ప్రయాణపు ఏర్పాట్లన్నింటినీ కుటుంబమే చూసుకోవాలి. ఫలితంగా అసలు కుటుంబం బయటకు వెళ్లడమే మానేసింది. గత సంవత్సరం సంధ్య తీవ్ర అనారోగ్యం పాలైంది. ఆమెను ఆగ్రాలోని ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఆమె వైద్య ఖర్చులే కాక, భద్రతా సిబ్బందికి ఖర్చుతో కూడిన ప్రత్యేక గదిని కూడా కుటుంబం ఏర్పాటు చేయాల్సివచ్చింది. మాతో మాట్లాడుతున్నప్పుడు రమాదేవి చాలాసార్లు విరుచుకొని పడిపోయింది. తనకు తన కూతురిపై క్రూరమైన హింసకు పాల్పడిన వారిని విడుదల చేస్తూ, మాకు చేసిన అన్యాయాన్ని అంగీకరించడం కష్టంగా ఉందని చెప్పింది. ఇది కేవలం తన కూతుర్ని మాత్రమే కాక, మొత్తం కుటుంబాన్ని కూడా నాశనం చేసిందని విలపిస్తూ చెప్పింది. తన కొడుకుల వైపు చూపిస్తూ, వారేమి నేరం చేశారని, సాధారణ జీవితాలకు దూరమయ్యారు? వారికి ఏ ఉద్యోగం లేకుండా మేమెలా బతకాలని ఆమె అంటోంది. నష్ట పరిహారంగా ఇచ్చిన డబ్బు దాదాపు అయిపోయిందని సతీందర్‌ అన్నాడు. కొంత డబ్బును కేసు ఖర్చుల కోసం పక్కకు పెట్టి, ఇతర ఖర్చుల్ని తగ్గించు కోడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నాడు. మా తిండికి, కనీస ఖర్చులకు నెలకు కనీసం 15 వేల రూపాయలు అవసరమని, అయితే ఆదాయం లేకుండా పరిస్థితి దారుణంగా ఉంటుందని అతడన్నాడు. తాను ధరించిన దుస్తులను చూపిస్తూ, ఇవి తమ బంధువులు ఇచ్చారని, తమ కష్టాల గురించి మాట్లాడటం సిగ్గనిపిస్తుందని అన్నాడు.

ఇక్కడి లోక్‌సభ స్థానం ఎస్సీలకు రిజర్వ్‌ చేయబడింది. ప్రస్తుత ఎంపీ, బిజెపి కి చెందిన రజ్వీర్‌ దిలర్‌. ఆయన ఒక్కసారి కూడా బాధిత కుటుంబాన్ని సందర్శించలేదు. వారి బాధల గురించి అడిగితే, ప్రభుత్వం రూ.25 లక్షలు ఇచ్చింది. ఇంకా ప్రభుత్వం ఏమిస్తుందని అన్నారు. తమ ఇళ్ళల్లో టీ తాగడానికి ఉపయోగించే గ్లాసుల్లో దళితులకు టీ ఇవ్వని అగ్రవర్ణాల వారి ఇళ్లకు ఆ ఎంపీ వెళితే, తనతోపాటు స్వంత టీ గ్లాసు తీసుకొని, ఆ గ్లాసు లోనే టీ తాగుతాననే కథనాన్ని మాకు చెప్పారు. ఇవే నియమాల్ని దళితులంతా అనుసరించాలని కోరుకుంటున్నారు.ఈ దారుణమైన పరిస్థితి ఒక దళిత కుటుంబానికి పడిన శిక్ష. తమ చెల్లెలిపై అత్యాచారం చేసి, హత్య చేసిన వారితో రాజీకి నిరాకరించిన కారణంగానే వారికి ఈ శిక్ష పడింది. దళితులు, మహిళలకు వ్యతిరేకంగా బిజెపి డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వ క్రూరత్వానికి, మనువాద అన్యాయానికి హత్రాస్‌ ఒక మచ్చుతునక.

/ వ్యాసకర్త సిపి(ఐ)ఎం పొలిట్‌బ్యూరో సభ్యులు /బృందా కరత్‌
/ వ్యాసకర్త సిపి(ఐ)ఎం పొలిట్‌బ్యూరో సభ్యులు /బృందా కరత్‌
➡️