ఆనాడే హెచ్చరించిన ఫూలే

గత ఆదివారం బీహార్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం చేస్తూ ‘ఇండియా’ బ్లాక్‌ సనాతనానికి వ్యతిరేకమని, తాము సనాతన ధర్మాన్ని పాటించే వారమని సెలవిచ్చారు. సనాతనమంటే శాశ్వతమని అర్థం. అనాదిగా వస్తుందని వ్యవహారిక అర్థం. మోడీ నిజంగానే సనాతన ధర్మాన్ని పాటించే వాడయితే ఢిల్లీ నుండి బీహారుకు పుష్పక విమానమెక్కి రావాలి. సనాతనం పేర ప్రజలను మోసపుచ్చడాన్నే సంస్కృతీకరణ అని చెప్పి 150 ఏళ్ల క్రితమే హెచ్చరించారు మహాత్మా జ్యోతిరావు ఫూలే. సంస్కృతీకరణ లేదా బ్రాహ్మణీకరణ అనే పదాలను ఆయన వాడారు. బ్రాహ్మణీకరణ అంటే బ్రాహ్మణ కులాన్ని ద్వేషిస్తున్నట్లుగా భావించే అవకాశముంది కనుక మనం సంస్కృతీకరణ అన్న మాటనే ఉపయోగిద్దాం. వైదిక మతంలోని చాతుర్వర్ణ వ్యవస్థలో బహుళ సంఖ్యాకులైన శూద్రులకు, అతి శూద్రులకు అన్ని హక్కులకు, అవకాశాలకు దూరం చేసింది. చదువుకు, సొంత ఆస్తికి మాత్రమే కాదు. చేసిన కష్టానికి ప్రతిఫలం అడిగే హక్కు కూడా శూద్రునికి ఇవ్వలేదు. ఈ భూమండలంలోని అన్ని ఆస్తులకు బ్రాహ్మణుడే యజమాని అని మనుస్మృతి చెప్తుంది. కనుక ఏ వస్తువునైనా ఎవరి కష్టాన్నైనా తీసుకొనే అధికారం బ్రాహ్మణుడికి ఉంటుంది. చాతుర్వర్ణాల్లోని మిగతా మూడు వర్ణాలకు సేవ చేయడానికే శూద్రుడ్ని బ్రహ్మ సృష్టించాడు కనుక అతను ఆకలితో చావకుండా వుండేందుకు అవసరమైన డబ్బునే కూలి కింద ఇవ్వాలి. మనుస్మృతి ఈ విషయం కూడా దాపరికం లేకుండా చెప్పింది.
నిజానికి మన దగ్గర శూద్రుల దేవుళ్లు లేరు. ఇళ్లలోకి వైదిక దేవుళ్లు చాలా ఆలస్యంగానే ప్రవేశించారు. ఆ పరిణామం కూడా సంస్కృతీకరణ ఉచ్చులో పడిపోవడం వల్ల ఏర్పడిందే. తమ కష్టంతో సంపదను సృష్టించే శూద్రులు ఈ రోజు గొప్ప చదువులు చదవవచ్చు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయవచ్చు. పెద్ద పెద్ద పదవులను సమర్ధతతో నిర్వహించవచ్చు. అయినప్పటికీ వారి సామాజిక స్పృహ శిశుప్రాయంలోనే ఉంది. పురాణాల్లో, మనుస్మృతిలో తన స్థానం ఏమిటో గమనించలేని స్థితిలో శూద్రులు ఉండిపోవడానికి కారణం కూడా సంస్కృతీకరణపై వారికి పెరిగిన మోజే. తమకు ఆ శాస్త్రాలు చేసే నష్టాన్ని గమనించలేనంత స్థితిలోకి జారిపోవడమే దానికి కారణం. ఇదే విషయాన్ని వివరిస్తూ ఫూలే హెచ్చరిక చేశారు. బిజెపి దగ్గర ఉన్న ప్రధాన ఆయుధమిదే. శూద్రుల ఇళ్లల్లో కర్మకాండ, పుట్టుక, చావులకు బ్రాహ్మణులను పిలిచే వారు కాదు. ఇప్పుడు ఆ స్థితి కొంత వరకు మారింది. ఆ సందర్భాల్లో బ్రాహ్మణులను పిలిపించుకొంటే తమ సామాజిక హోదా పెరుగుతుందన్న భ్రమలో పడ్తారు. అంటే సంస్కృతీకరణ ఉచ్చులో పడటమే గదా?
ప్రముఖ ఉర్దూ, హిందీ రచయిత మున్షీ ప్రేంచంద్‌ స్త్రీ స్వాతంత్య్రంపై ఎంతటి మహత్తర రచనలు చేశారో… రైతులపై కూడా అంతటి మహత్తర రచనలు చేశారు. రైతును ఎన్ని విధాలుగా దోచుకుంటారో చూపెట్టారు. అలాంటి గొప్ప నవల ”గోదాన్‌”. రైతును భూస్వామితో పాటు, గ్రామ పెద్దలు ఆచారాలు, సాంప్రదాయాలు రకరకాలుగా దోచుకొంటాయి. మరణశయ్యకు చేరతాడు. రైతు నోట్లో గంగాజలం పోయమని రైతు భార్య బ్రాహ్మణుడిని అర్థిస్తుంది. ఇంట్లో మిగిలి ఉన్న రూపాయి బిళ్లను తెచ్చి ఇదే మేమిచ్చే గోదానంగా భావించమని ప్రాధేయపడ్తుంది. బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతూ గంగాజలం పోసి రైతును నేరుగా స్వర్గం వెళ్లే సౌకర్యం కల్పిస్తాడు. రైతు భార్య దిక్కు లేనిది అవుతుంది. కమ్యూనిస్టు నాయకుడు ఇ.ఎం.ఎస్‌ నంబూద్రి పాద్‌…బెంగాలీ రచయిత శరత్‌చంద్రతో పోల్చుతూ ప్రేంచంద్‌ గొప్ప రచయిత అని చెప్తారు. ఎందుకంటే శరత్‌లో కన్పించని వర్గ దృక్పధం ప్రేంచంద్‌లో వుందంటారు. పూలు పండించే రైతు కుటుంబం నుండే వచ్చిన ఫూలే కూడా రైతు సమస్యలను వాటికి పరిష్కారాలపై అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. రైతుల స్థితిగతులపై ‘షేత్కారాంచ అసుడ్‌’ (పేర్యగాని చెర్నాకోల) పుస్తకం రాశారు. రైతు గురించి తపన పడిన సంఘసంస్కర్త మనకు ఆ కాలంలో మరొకరు కన్పించరు.
ఆధునిక భారతంలోని సామాజిక సంస్కరణోద్యమాల్లో మొదట కనిపించేది బ్రహ్మ సమాజం. 1828లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఇది ప్రధానంగా బ్రాహ్మణుల్లోని దురాచారాలపై పోరాడింది. అనంతరం 1873లో జ్యోతిరావు ఫూలే సత్యశోధక్‌ సమాజ్‌ నెలకొల్పారు. సత్యశోధక్‌తో శూద్రులను, అతి శూద్రులను చైతన్య పరచాలనే లక్ష్యంతో ఏర్పడిందది. ఆ కృషితో పురోగామి బ్రాహ్మణులు కూడా ఉన్నారు. ఈ సమాజ్‌ స్థాపించే ఆయనలో దేవుడి అస్తిత్వం పట్ల పూర్తి నమ్మకం లేదు. అందుకే తను నెలకొల్పిన సంస్థకు సత్య శోధక్‌ సమాజ్‌ అని పేరు పెట్టారు. ఆయన చేసిన రచనల్లో చాలా ప్రసిద్ధి పొందిన రచన ‘గులాంగిరి’. ఆ పుస్తకం ముగింపులో ఆయన దేవుడి అస్తిత్వంపై సందేహం వ్యక్తం చేశారు. అయితే ఆయన ప్రత్యేకత ఏమిటంటే ఆ సందేహ నివృత్తిపై సమయం వెచ్చించలేదు. తన సమయాన్నంతా ఆయన శూద్రులు అతి శూద్రుల అభ్యున్నతి కోసం, హక్కుల కోసం పోరాడేందుకు వెచ్చించారు. భావజాల రంగంలోనే కాదు, బహుముఖ ప్రత్యక్ష పోరాటాలు చేశారు. బ్రాహ్మణ స్త్రీలు కూడా ఆయన దృష్టిలో శూద్రులే.
తెలుగు నేలలో గొప్ప సంస్కరణ ఉద్యమాన్ని నడిపిన కందుకూరి వీరేశలింగం 1905లో ‘హితకారిణి సమాజం’ స్థాపించారు. ఆ సమాజ స్థాపనకు ముందు నుండే నమ్మకాలపై పోరాడారు. వితంతు వివాహాలను ఒక ఉద్యమంగా జరిపారు. అయితే వీటి కోసం ఆయన శాస్త్ర ప్రమాణాలను వెతికారు. వితంతు వివాహన్ని ఏ శాస్త్రం నిషేధించిందో చెప్పాలని సవాలు చేశారు. కానీ ఫూలే దృక్పథం వేరు. ఆయన వేదాలు, పురాణాలు, మనుస్మృతి వంటి శాస్త్రాలన్నింటినీ తోసిపుచ్చారు. అవన్నీ బ్రాహ్మణులు తమ ఆధిపత్యం కోసం రాసుకున్నవేనన్నారు. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించే ఆయనకు బ్రాహ్మణుల పట్ల ద్వేషం లేదు. వితంతు వివాహాలపై నిషేధం, వారికి జుట్టు గొరిగించడం వంటివి కేవలం బ్రాహ్మణ స్త్రీలకు సంబంధించినవి. శూద్రుల్లో ఆ ఆచారాలు ఎక్కడైనా కనబడితే సంస్కృతీకరణ ప్రభావమే. కాగా వితంతువులకు జుట్టు గొరగబోమంటూ క్షురకుల చేత సమ్మె చేయించిన చరిత్ర మనకు ఫూలే ఉద్యమంలో మాత్రమే కనిపిస్తుంది. వీరేశలింగం కంటే 40 ఏళ్ల ముందు పుట్టిన వాడు ఫూలే. కనుక ఆధునిక చరిత్రలో వితంతు వివాహాలకు ఆద్యుడుగా ఫూలేనే చెప్పుకోవాలి.
ఫూలే పూనా మునిసిపాలిటీకి కొంత కాలం ప్రభుత్వం నియమించిన చైర్మన్‌. అప్పటికి ఎన్నికలు అనేవి మన దేశంలో లేవు. బ్రిటిష్‌ పాలకులు ఇంపీరియళ్ల, లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు అలాగే ప్రావెన్షియల్‌ కౌన్సిళ్లకు మొదటిసారి 1920లో పరిమిత ఓటర్లతో ఎన్నికలు జరిపారు. పెద్ద పెద్ద ఆస్తిపరులు, ఉన్నత విద్యావంతులు వగైరాలు మాత్రమే ఓటర్లు. పేరుకు లెజిస్లేటివ్‌ బాడీలే అయినా వాటి హోదా రచ్చబండలకు మించలేదు ఆనాడు. పూనా మునిసిపాలిటీలో శూద్రులను, అతి శూద్రులను కూడా సభ్యులుగా బ్రిటిష్‌ ప్రభుత్వం నియమించేది. మిలటరి నేపథ్యం వల్ల అతి శూద్రుల్లో కొద్దిపాటి డొక్క శుద్ధి ఉండేది. శూద్రులు వేలి ముద్రకే పరిమితం. చదువుకుంటే తప్ప శూద్రులకు సాధికారత రాదని ఫూలే భావించారు. మహిళలు బానిసలకు బానిసలన్న విషయం ఆయన అర్థం చేసుకున్నారు. కనుకే తన మొట్టమొదటి పాఠశాలను అతి శూద్ర బాలికల కోసం ఆరంభించారు.
దయానంద సరస్వతి 1875లో ఆర్య సమాజం స్థాపించారు. ఫూలే వల్ల వర్ణాశ్రమ ధర్మానికి కలగనున్న ప్రమాదాన్ని ఆయన సరిగ్గానే గ్రహించారు. కులం లేదు అంటూనే వర్ణాశ్రమ ధర్మాన్ని సురక్షితంగా కొనసాగించే ప్రయత్నం చేశారు. ఈ నాలుగు వర్ణాల్లో బ్రాహ్మణ వర్ణానిది అగ్రస్థానం అంటూ మనుస్మృతి చేసిన సూత్రీకరణపై ఆయన యుద్ధం ప్రకటించలేదు. గుణకర్మల చేత ఎవరైనా బ్రాహ్మణుడు కావచ్చని అతుకుబొతుకు లేని సిద్ధాంతం చెప్పారు. తద్వారా బ్రాహ్మణాధిక్యతను కాపాడారు. దళితులు, ఇతర వెనుకబడిన కులాల వారు కూడా ఒక దశలో ఆర్య సమాజం వైపు ఆకర్షితులయ్యారు. ఆర్య సమాజం కుల రహిత సమాజం కోసం పోరాడుతుందని భావించారు. మహాత్మా గాంధీ కూడా కులంతో నిమిత్తం లేని హిందూ మతం కావాలన్నాడు తప్ప కుల వ్యవస్థను సంరక్షించే శాస్త్రాలను ఖండించలేదు. గుడుల్లో బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించాలన్న డిమాండ్‌ వచ్చినప్పుడు… గాంధీజీ దేవాలయాల్లో హరిజనుల ప్రవేశానికి డిమాండ్‌ చేశారు తప్ప బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించా లని చెప్పలేదు గదా? అని పండితులు ప్రశ్నించారు.
దండల పెళ్లిళ్లకు కూడా ఫూలే ఆద్యుడిగా కనిపిస్తాడు. తన దత్తత కుమారుడు డాక్టర్‌ యశ్వంత్‌కు దండల పెళ్లి చేశారు. శూద్రులు, అతిశూద్రులు తమ ఇళ్లల్లో జరిగే శుభ అశుభ కార్యాలకు, బ్రాహ్మణ పురోహితులను రప్పించడమెందుకు? అర్థం గాని సంస్కృత మంత్రాలెందుకు? అని ప్రశ్నించేవారు. వైదిక మతంలోని ఆచారాలు, సాంప్రదాయాలు కష్టజీవులైన శూద్రులను దోచుకోవడానికేనని ఫూలే దృఢ అభిప్రాయం. ఏప్రిల్‌ 11న ఫూలే జయంతి. ఈ దశలో సనాతన ధర్మ సిద్ధాంతం పేరుతో కష్టజీవులను ఏమార్చే రాజకీయాలను ఓడించి, దూరం పెట్టడమే ఫూలేకు సరైన నివాళి అవుతుంది. మహాత్మా ఫూలే హెచ్చరికను ఇప్పుడైనా అర్థం చేసుకొందాం.

 వ్యాసకర్త ‘ప్రజాశక్తి’ పూర్వ సంపాదకులు ఎస్‌. వినయ కుమార్‌

 

➡️