మోడీ ప్రభుత్వ వంచన

Feb 20,2024 07:00 #Editorial

                   ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి ఏలుబడిలో నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా వెలువడ్డ లక్నో ఐఐఎం నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. జాతీయ శాంపిల్‌ సర్వే, ఉద్యోగ – నిరుద్యోగ సర్వే, పీరియాడిక్‌ లేబర్‌ నివేదికల గణాంకాలను మధించి, ఉద్యోగ కల్పనలో మోడీ ప్రభుత్వం చేతులెత్తేసిన వైనాన్ని ఈ పరిశోధన తేటతెల్లం చేసింది. దేశంలో 1987 నుంచి 2005 వరకూ ఎంతోకొంత ఉద్యోగ కల్పన ఉందని, ఆ తరువాత తిరోగమనం మొదలైందని ఈ నివేదిక పేర్కొంది. ఈ రిపోర్టు లెక్కల ప్రకారం… 2021 నాటికి దేశంలో 55.61 కోట్ల మంది ఉద్యోగులు ఉండగా, అందులో 30 కోట్ల 52 లక్షల మంది (54.9 శాతం) – అంటే సగానికి పైగా తమకు తాము సొంతంగా బతుకు తెరువు వెతుక్కున్న వారే! వ్యాపారం చేస్తున్నవారు, చిన్నదో పెద్దదో స్వయం ఉపాధి ఉన్నవారూ ఈ ఉద్యోగ లెక్కల్లో ఉన్నారు. మిగతా వారిలో 12. 67 కోట్ల (22.8 శాతం) మంది మాత్రమే రెగ్యులర్‌ ఉద్యోగులు. మిగతా 12.5 కోట్ల మందీ (22.3 శాతం) ఏ భద్రతా లేని క్యాజువల్‌ ఉద్యోగులు! దేశంలో ప్రతిఏటా పట్టభద్రులు పెరుగుతున్నా అందుకు తగ్గట్టు ఉద్యోగ కల్పన జరగలేదని, పైగా అది నానాటికీ తీసికట్టుగా తయారవుతుందని ఈ నివేదిక పేర్కొంది.

ఈ తాజా అధ్యయనం ఒక్కటే కాదు; గత కొన్నేళ్లుగా దేశంలో ఏ గణాంక సంస్థ సర్వే చూసినా పాలకుల ‘అభివృద్ధి’ కబుర్లలోని డొల్లతనం బట్టబయలు అవుతుంది. ఉద్యోగం అంటే ఒక కుటుంబానికి శాశ్వతమైన భరోసా. పౌరుల యొక్క, తద్వారా దేశం యొక్క స్థిరమైన భవిష్యత్తుకు బాసట. కానీ, ఉదార ఆర్థిక విధానాలు ముమ్మరంగా అమలవ్వటం మొదలయ్యాక ఈ నమ్మకానికి గండి పడింది. కార్పొరేట్లకు మాత్రమే సూపర్‌ లాభాలను గ్యారంటీ చేసి, కోట్లాది మంది సామాన్యులూ అరకొర వేతనాలతో, భద్రత లేని కొలువులతో దినదిన గండంగా బతుకునీడ్చే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వరంగంలోనూ, ప్రయివేటురంగంలోనూ తీవ్రమైన ఉద్యోగ అభద్రత నెలకొంది. పాలకులు పెద్ద పెద్ద కార్పొరేట్ల కంపెనీలకు వేల కోట్ల రాయితీలను కట్టబెట్టి, స్థానికంగా ఎక్కువ ఉపాధిని కల్పించే చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఎండగట్టారు. పేరుకు మేకిన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా అంటూ అట్టహాసం చేసినప్పటికీ- గత నలభై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం పెరిగింది. 20 – 34 ఏళ్ల వయసు గల యువతలో నిరుద్యోగిత పెరగటంపై నెల క్రితం వెల్లడైన సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సిఎంఐఇ) నివేదిక కూడా ఆందోళన వ్యక్తం చేసింది.                                          2019తో పోలిస్తే మన జిడిపి 2023 నాటికి 16 శాతం పెరిగింది. కానీ, ఆ మేరకు ఉద్యోగ కల్పన పెరగలేదు. సంపద కొంతమంది దగ్గరే పోగు పడుతూ ఉండడం వల్ల, అన్ని రంగాల్లోనూ గుత్తాధిపత్యం చోటు చేసుకుంటూ ఉండడం వల్లా- దేశం ఎదుర్కొంటున్న వైపరీత్యం ఇది. ఒకపక్క ఆర్థిక వృద్ధి కనపడుతున్నా, మరోపక్క అది ఉద్యోగ సృష్టికి దోహదపడకపోవడం ఈ ఉదార ఆర్థిక విధానాల తాత్వర్యం. ఉద్యోగ కల్పన పేరుతో బడా పెట్టుబడిదారులకు బిజెపి ప్రభుత్వం అనేక రాయితీలూ, ప్రోత్సాహకాలూ కల్పిస్తోంది. కానీ, ఆ మేరకు వారు ఉపాధి అవకాశాలను సృష్టించటం లేదు. ప్రభుత్వం వివిధ రంగాల్లో ఖాళీగా ఉన్న లక్షలాది పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా, ఆ పనికి ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేసింది. పైగా వేలాదిమందికి ఉద్యోగ భద్రతను కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను నీరుగార్చటం, కార్పొరేట్లకు కట్టబెట్టటం వంటి దుర్మార్గ చర్యలకు పాల్పడుతోంది. ఉన్న ఉద్యోగాలకు దారుణంగా కోత పెడుతోంది. ఈ వాస్తవాలను ప్రజలూ, నిరుద్యోగ యువతీ యువకులూ గ్రహించకుండా అయోధ్య, ఎన్‌ఆర్సీ, ఉమ్మడి పౌరస్మ ృతి అంటూ మతతత్వ ఉద్వేగ రాజకీయాలను నడుపుతోంది. గ్రామీణ భారతంలో పనిదినాలను కల్పించే ఉపాధి హామీ చట్టాన్ని కూడా నానాటికీ నిర్వీర్యం చేస్తోంది. ప్రజలకు స్థిరమైన ఉద్యోగ ఉపాధులు సమకూరినప్పుడే కొనుగోలు శక్తి పెరుగుతుంది. కానీ, మోడీ ప్రభుత్వం ఆ దిశగా ఒక్క అడుగూ వేయకుండానే యువతను వంచిస్తోంది. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు ఎంత త్వరగా వదిలించుకుంటే దేశానికి అంత మంచిది.

➡️