అక్రమ వలసలు – విఫల అభివృద్ధి నమూనా

Jan 31,2024 07:16 #Editorial

యువకుల్లో నిరుద్యోగిత తారా స్థాయికి చేరింది. వియత్నాం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లేబర్‌ పార్టిసిపేషన్‌ 70 శాతం నుండి 80 శాతం ఉంటే, మన దేశంలో అది గరిష్టంగా 58 శాతం మాత్రమే. మహిళా కార్మికులలో ఇది 37 శాతం ఉంది. కోట్లాది కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదు. గుజరాత్‌లో కనీస వేతనం కేవలం రూ 220.30 మాత్రమే. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఉన్న కేరళ రాష్ట్రంలో అది రూ. 726.80. నేడు గ్రామీణ భారతంలో 65 శాతం ప్రజలు ఆధారపడే వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. పెద్దనోట్ల రద్దు, జి.ఎస్‌.టి అసమగ్ర అమలు వంటి వాటి కారణంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. దీని మూలంగా లక్షలాది మంది కార్మికులు దేశంలో అంతర్గతంగా వలస బాట పట్టారు.

                ఈ మధ్య షారూఖ్‌ ఖాన్‌ నటించిన బాలీవుడ్‌ మూవీ ”డంకీ” విడుదల అయింది. నలుగురు స్నేహితులు లీగల్‌గా ఇంగ్లండ్‌ వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. దీంతో దేశ సరిహద్దుల గుండా అక్రమంగా ప్రయాణించి లండన్‌ వెళ్లాలనుకుంటారు. ఆ క్రమంలో వీళ్లు పడిన కష్టాలేంటనేది సినిమా ఇతివృత్తం.

దేశ సరిహద్దులగుండా అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ ట్రావెల్‌ అంటారు. పంజాబ్‌లో దాన్ని డంకీ అని పిలుస్తారు. గుజరాత్‌, హరియాణా, పంజాబ్‌కు చెందిన చాలా మంది అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, యూరప్‌కు వెళ్ళేందుకు ఈ ప్రమాదకరమైన వలస మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ మార్గంలో మానవ అక్రమ రవాణాకు సంబంధించి అంతర్జాతీయ నెట్‌వర్క్‌ పనిచేస్తుంటుంది. చాలా దేశాలు ఈ వ్యవస్థను నిర్మూలించినట్లు ప్రకటించుకున్నాయి కానీ, ఈ నెట్‌వర్క్‌ కొనసాగుతూనే ఉంది. అనేక మంది యువకులు అమెరికాకు వెళ్ళాలనే ఆశతో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ”డంకీ ట్రావెల్‌” (అక్రమ రవాణా) సమస్య ఎంత తీవ్రంగా వుందనేది దీన్నిబట్టి అర్థమౌతుంది. సరిగ్గా ఈ సినిమాలో చూపించిన విధంగా ఫ్రాన్స్‌లో ఈ మధ్య ఒక సంఘటన జరగడం గమనార్హం. ఇటీవల ఫ్రాన్స్‌లో ఒక విమానాన్ని అక్రమ రవాణా అనే అను మానంతో ఫ్రాన్స్‌ అధికారులు వారం రోజులు నిలిపివేశారు. దుబాయ్ నుండి బయల్దేరే ఈ విమానంలో 303 మంది భారత్‌ ప్రయాణీకులు మెక్సికోకు, అక్కడ నుండి అక్రమంగా అమెరికా వెళ్ళడానికి దళారీలకు భారీగా ముట్టచెప్పారు. విషయం తెలుసుకున్న ఫ్రాన్స్‌ అధికారులు ఆ విమానాన్ని తిరిగి ముంబైకి పంపివేశారు. గత కొన్నేళ్లుగా ఇలాంటి సంఘటనలు అడపా దడపా జరుగుతూనే ఉన్నాయి.

మేధో వలసలు

             మేధో వలసలు ఎన్నో దశాబ్దాల కాలం నుంచీ ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలకు పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన యువకులు విద్యాభ్యాసం కోసమో, ఉద్యోగాల కోసమో వలసలు వెళ్తుండడం మనం చూస్తున్నాం. దీన్నే బ్రెయిన్‌ డ్రైన్‌ (మేధో వలసలు)గా పరిగణిస్తారు. మన ప్రధాని ఈ మధ్య దీనిని బ్రెయిన్‌ గైన్‌ (మేధో బ్యాంక్‌)గా పరిగణించాలన్నారు. అయితే, ఇప్పుడు ఈ వలసలు అక్రమ మార్గాలలో కూడా కోనసాగుతుండటం ఆందోళనకరం. మన దేశానికి చెందిన సుమారు 1.8 కోట్ల మంది ప్రవాస భారతీయులు ప్రపంచం లోని అనేక దేశాల్లో నివసిస్తున్నారు. అయితే, వీరిలో చాలా మంది అక్రమ మార్గాలలో ఆయా దేశాలకు రవాణా అవుతుండడం శోచనీయం. తాజాగా ‘పూ’ రీసెర్చ్‌ సెంటర్‌ నిర్వహించిన ఓ అధ్యయనంలో అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారుల జనాభాలో భారతీయులు మూడో స్థానంలో ఉన్నట్లు తేలింది. వాషింగ్టన్‌కు చెందిన థింక్‌ ట్యాంక్‌ నిర్వహించిన అధ్యయనం ప్రకారం అమెరికాలో ప్రస్తుతం 7.25 లక్షల మంది భారతీయలు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నివసిస్తున్నారని తేలింది.

2022 అక్టోబరు 1 నుంచి 2023 సెప్టెంబరు 30 మధ్య అమెరికాకు 96,917 మంది భారతీయులు ఎలాంటి అనుమతులు లేకుండా సరిహద్దు దాటేందుకు ప్రయత్నించి దొరికిపోయారని, వారిని అరెస్టు చేశామని అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ 97 వేల మందిలో 30 వేల మంది కెనడా సరిహద్దు దగ్గర దాదాపు 42 వేల మంది మెక్సికో సరిహద్దుల్లో పట్టుబడినట్లు తెలి పింది. జనవరి 2022లో అమెరికా-కెనడా సరిహద్దుల దగ్గర భారత దేశానికి చెందిన నలుగురు సభ్యులు మంచుకి గడ్డకట్టి చనిపోయారని, అమెరికా కెనడా బోర్డర్‌ దగ్గర నలుగురు కుటుంబ సభ్యులు బోటు మునిగిపోవడం కారణంగా చనిపోయారని వార్తలు కూడా వచ్చాయి. అలాగే బ్రిటన్‌లో దాదాపు లక్ష మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నారు. మన దేశ ప్రజల అక్రమ రవాణాతో సంబంధం ఉన్న 2925 ట్రావెల్‌ ఏజెంట్లను గుర్తించామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, వారిపై కఠిన చర్యలు లేవు.

వలసలు ఎందుకు పెరుగుతున్నాయి ?

               గతంలో మన దేశం నుంచి విదేశాలకు వెళ్లే ప్రవాస భారతీయులలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉండేవారు. వీరు మన దేశంలో రీసెర్చ్‌, ఇతర సదుపాయాలు లేని కారణంగా ఇతర దేశాల్లో చదువుకోడానికి లేదా పరిశోధన చేయడానికి వెళ్లేవారు. ఇప్పుడు వీరితో పాటుగా, మంచి ఉద్యోగాల కోసం, మెరుగైన జీవన ప్రమాణాల కోసం పెద్ద ఎత్తున మన దేశం నుండి ఇతర దేశాలకు వలసలు వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.

విదేశాలకు అక్రమ వలసలు వెళ్లే వారిలో గుజరాత్‌, హరియాణా, పంజాబ్‌లకు చెందిన వారు ఉండడం గమనిస్తే గుజరాత్‌ అభివృద్ధి నమూనా డొల్లతనం మనకు అర్ధం అవుతుంది. ఉద్యోగాల లేమి, కనీస జీతాలు లేకపోవడం, కఠిన ఆర్థిక పరిస్థితులు, సామాజిక అణిచివేత కారణంగా కూడా వలసలు పెరుగుతున్నాయి. ఇదిలా వుండగా 2023 హాండ్లీ ప్రైవేట్‌ వెల్త్‌ మైగ్రేషన్‌ రిపోర్ట్‌ వారి నివేదిక ప్రకారం 6,500 మంది ధనికులు (హెచ్‌.ఎన్‌.ఐ) మన దేశం నుండి విదేశాలకు తమ మకాం మార్చారు. ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం ప్రవాస భారతీయులు 2023లో 125 బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని మన దేశానికి పంపించారు. ప్రభుత్వాలు అనేక పథకాల ద్వారా ప్రవాస భారతీయులను ఆకర్షించే పని చేపట్టాయి. వారికి కొన్ని ప్రత్యేకమైన రాయితీలు కూడా ప్రకటించాయి. అయితే, అక్రమ వలసలు పెద్ద ఎత్తున పెరుగుతుండడం ఆందోళనకరం.

మన దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య క్రమేపీ తగ్గుతోందని ప్రభుత్వం చెబుతుండగా, కార్మికులు అక్రమ వలసలకు పాల్పడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కరోనా కారణంగా దెబ్బతిన్న మన దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా గాడిలో పడలేదు. ఆర్థికవేత్తలు మన దేశ ఆర్థిక వ్యవస్థలో నమూనా రికవరీ (ధనికులకు భారీ వృద్ధి వుండగా, కింది స్థాయి వారి పరిస్థితి దిగజారుతోందని) ఉందని చెప్తున్నారు. ప్రపంచ అసమానతల నివేదిక 2022 ప్రకారం భారతదేశంలో ఆదాయ, సంపద అసమానతలు తీవ్రతరం అయ్యాయి.

ఆక్స్‌ఫాం నివేదిక ప్రకారం కరోనా కాలంలో భారత దేశంలోని ధనికుల సంఖ్య 102 నుంచి 142 కు పెరిగింది. అది నేడు దాదాపు 170 కు చేరుకుంది. గౌతం అదానీ సగటు దినసరి ఆదాయం రూ. 1600 కోట్లు కాగా, మన దేశంలో 22 కోట్ల కష్ట జీవుల రోజువారీ ఆదాయం కేవలం రూ.375 మాత్రమే. భారత దేశంలో ఆదాయాల వ్యత్యాసం మునుపెన్నడూ చూడని దారుణ స్థితిలో ఉంది. పైస్థాయిలోని పది శాతం మంది 77 శాతం దేశ సంపదను కలిగి ఉన్నారు. జనాభాలో కింది సగానికి పైగా ఉన్న అట్టడుగు పేదలందరూ దేశ సంపదలో 3 శాతం వాటాను మాత్రమే కలిగి ఉన్నారు. మరో పక్క భారత దేశంలో ఉన్న 86 శాతం కుటుంబాల నికర ఆదాయం పడిపోయింది. 80 కోట్ల మంది ప్రభుత్వం ఇస్తున్న 5 కేజీల తిండి గింజలు కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంటే, వారు పేదరికం నుంచి ఎలా బయటబడినట్లు? ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా దేశంలో 21 శాతం పైబడి (34.6 కోట్ల) పేదలు ఉండడం గమనార్హం!! ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కోసం దరఖా స్తు చేసుకున్న వారిలో 14 శాతం మందికి సంవత్సరకాలంలో సగటు పని దినాల్లో పని చేసే అవకాశం లేకుండా పోయింది.

నిరుద్యోగ సమస్య నేడు చాలా జఠిలంగా మారింది. యువకుల్లో నిరుద్యోగిత తారా స్థాయికి చేరింది. వియత్నాం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లేబర్‌ పార్టిసిపేషన్‌ 70 శాతం నుండి 80 శాతం ఉంటే, మన దేశంలో అది గరిష్టంగా 58 శాతం మాత్రమే. మహిళా కార్మికులలో ఇది 37 శాతం ఉంది. కోట్లాది కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదు. గుజరాత్‌లో కనీస వేతనం కేవలం రూ. 220.30 మాత్రమే. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఉన్న కేరళ రాష్ట్రంలో అది రూ. 726.80. నేడు గ్రామీణ భారతంలో 65 శాతం ప్రజలు ఆధారపడే వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. పెద్దనోట్ల రద్దు, జి.ఎస్‌.టి అసమగ్ర అమలు వంటి వాటి కారణంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. దీని మూలంగా లక్షలాది మంది కార్మికులు దేశంలో అంతర్గతంగా వలస బాట పట్టారు.

ఇకనైనా ప్రభుత్వం ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టాలి. ఆదా య, సంపద అసమానతలు తగ్గించాలి. కార్పొరేట్లపై పన్నులు వేసి, సామాన్యులకు ధరాభారం నుంచి ఉపశమనం కల్గించాలి. గ్రామీణ భారతంలో నెలకొని ఉన్న సంక్షోభాన్ని రూపు మాపేందుకు చర్యలు తీసుకోవాలి. పంటలకు కనీస మద్దతు ధర చెల్లించాలి. కార్మికులకు, వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించాలి. విదేశాలకు అక్రమ రవాణా చేసే ట్రావెల్‌ ఏజెన్సీలను, దళారీలను కఠినంగా శిక్షించాలి. అప్పుడు అక్రమ వలసలను నియంత్రించేందుకు అవకాశం ఉంది.

/ వ్యాసకర్త ఎల్‌.ఐ.సి ఉద్యోగ సంఘ నాయకులు, సెల్‌ : 9441797900 / పి. సతీష్‌
/ వ్యాసకర్త ఎల్‌.ఐ.సి ఉద్యోగ సంఘ నాయకులు, సెల్‌ : 9441797900 / పి. సతీష్‌
➡️