లెనిన్‌ బాటలో…అధ్యయనంతో… రెడ్‌ బుక్‌ డే

Feb 21,2024 07:17 #Editorial

శాస్త్రీయ కమ్యూనిజం ఊహాత్మకమైంది కాదని, ఎవరి బుర్ర లోనో పుట్టిన ఊహ కాదనీ, మానవ జ్ఞానం అన్ని పార్శ్యాలకూ చెందిన కచ్చితమైన శాస్త్రీయ వాస్తవాల మీద ఆధారపడి రూపొందిన సమగ్ర దృక్పథం అని నొక్కి చెప్పాడు. మానవ జాతి జ్ఞానాగార ఖజానాలన్నిటి నుంచి నీ ఆలోచనాశక్తిని పరిపుష్టం చేసుకుంటేనే నీవు కమ్యూనిస్టువు కాగలవని స్పష్టం చేశాడు. చదవడం అంటే ఊరికే చదవడం కాదు. కేవలం అక్షరాస్యుడు కావడం కమ్యూనిస్టుకు చాలదన్నాడు లెనిన్‌. ఊరికే విజ్ఞాన శాస్త్రాలు పోగేసుకుని చదివేయడం సరిపోదు. కృషి లేకుండా పోరాటం లేకుండా కమ్యూనిజం గురించిన పుస్తకాల జ్ఞానం అంటూ వుండదన్నాడు. ఆ విధంగానే బోల్షివిక్‌ విప్లవం సాధించాడు. ఇది ఆయన శత వర్థంతి సందర్భం. ఈ సారి ఎంపిక చేసిన పుస్తకం కూడా లెనిన్‌ జీవిత చరిత్రకు సంబంధించినది కావడం విశేషం.

               ఫిబ్రవరి 21. రెడ్‌ బుక్స్‌ డే. ప్రపంచీకరణ ప్రవేశపెట్టిన వాలంటైన్స్‌ డే తర్వాత వారం రోజులకే వస్తుంటుంది. ఇందులో గొప్ప విశేషం వుంది. మహత్తరమైన మానవ ప్రేమ సందేశాన్ని మార్కెట్‌తో ముడిపెట్టే మాయాజాలం అదైతే సమాజాన్ని సమూలంగా మార్చే విజ్ఞాన ప్రస్థానం ఇది. రెడ్‌ బుక్స్‌ డే అని గూగుల్‌లో కొడితే చాలా పేజీలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి.

విజ్ఞానం అనేది జీవన పోరాటంలోనూ రాజకీయ రంగంలోనూ ఒక సాధనం ఒక ఆయుధం. యథాతథ స్థితిని కొనసాగించాలని తమ పాలనను శాశ్వతం చేసుకుని సంపన్న వర్గాల పంట పండించాలని కోరుకునే వారు ప్రజల చైతన్యం పెంచాలనుకోరు. మరింత వెనక్కు వెనక్కు తీసుకుపోవాలని చూస్తారు. ప్రగతిశీల భావజాలంపై దాడి జరుపుతారు. హిట్లర్‌ కూడా మైన్‌ కాంఫ్‌ రాశాడు. ఏ రాజ్యానికైనా కావలసిన చదువు ఒకటుంటుంది. బొత్తిగా నచ్చని చదువు మరొకటి. సౖౖెద్ధాంతికంగా ప్రత్యర్థులను ఢకొీనడం, అందుకు అవసరమైన సాహిత్యం ప్రచురించడం, ఆ అవగాహనతో ప్రజలను కదిలించి పోరాడటం ఒక త్రిముఖ కర్తవ్యం. కమ్యూనిస్టులు మాత్రమే ఈ పని చేస్తారు. విధేయత, ఆర్భాటం వంటి వాటిపై ఆధారపడిన పాలక పార్టీల విధానానికి భిన్నంగా సిద్ధాంతం, అధ్యయనం, విమర్శ, ప్రజా చైతన్యం, ప్రతిఘటనపై ఆధారపడి విప్లవ సాధన వరకూ గమనం సాగించే ప్రజాపక్షం వారిది.

వాస్తవానికి మార్క్స్‌, ఏంగెల్స్‌ లనే కమ్యూనిజానికి లేట్‌ కమర్స్‌ అంటాడు ప్రసిద్ధ చరిత్రకారుడు ఎరిక్‌ హాబ్స్‌వామ్‌. ఈ సూత్రాలన్నీ అప్పటికే వివిధ రూపాల్లో వున్నాయి. కమ్యూనిజం అనే పదం కూడా వుంది. దాని లోతుపాతులు అధ్యయనం చేసి అసలు సంగతి సమాజాన్ని మార్చడం అనీ అందుకు శాస్త్రీయ సిద్ధాంతం అవసరమనీ గుర్తించి కమ్యూనిస్టు ప్రణాళికతో శంఖారావం చేశారు. అహరహం బ్రిటిష్‌ మ్యూజియంలో అధ్యయనం చేసి అమూల్య సిద్ధాంత సంపద సృజించిన మార్క్స్‌ కోసం వారు గొప్ప స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు. ఆయనతోపాటు ఏంగెల్సు, తర్వాత లెనిన్‌ ఈ సిద్ధాంతాన్ని సుసంపన్నం చేసే క్రమంలో ఎన్నో గొప్ప పాఠాలు అందించారు. వాటిని జయప్రదంగా అమలు చేయడం ద్వారా నిజంగా మరో ప్రపంచం ఏర్పడింది. మానవాళి విముక్తికి మార్గం తెలిసింది. ఆ కర్తవ్య సాధనలో అందరికన్నా ముందు విజయం సాధించి తొలి సమసమాజాన్ని స్థాపించిన లెనిన్‌ ఉద్యమ నిర్మాణాన్ని గురించి చెబుతూ విప్లవ సిద్ధాంతాన్ని సృజనాత్మకంగా అధ్యయనం చేయాలని అన్వయించాలనీ పిలుపునిచ్చారు. శాస్త్రీయ కమ్యూనిజం ఊహాత్మకమైంది కాదని, ఎవరి బుర్ర లోనో పుట్టిన ఊహ కాదనీ, మానవ జ్ఞానం అన్ని పార్శ్యాలకూ చెందిన కచ్చితమైన శాస్త్రీయ వాస్తవాల మీద ఆధారపడి రూపొందిన సమగ్ర దృక్పథం అని నొక్కి చెప్పాడు. మానవ జాతి జ్ఞానాగార ఖజానాలన్నిటి నుంచి నీ ఆలోచనాశక్తిని పరిపుష్టం చేసుకుంటేనే నీవు కమ్యూనిస్టువు కాగలవని స్పష్టం చేశాడు. చదవడం అంటే ఊరికే చదవడం కాదు. కేవలం అక్షరాస్యుడు కావడం కమ్యూనిస్టుకు చాలదన్నాడు లెనిన్‌. ఊరికే విజ్ఞాన శాస్త్రాలు పోగేసుకుని చదివేయడం సరిపోదు. కృషి లేకుండా పోరాటం లేకుండా కమ్యూనిజం గురించిన పుస్తకాల జ్ఞానం అంటూ వుండదన్నాడు. ఆ విధంగానే బోల్షివిక్‌ విప్లవం సాధించాడు. ఇది ఆయన శత వర్థంతి సందర్భం. ఈ సారి ఎంపిక చేసిన పుస్తకం కూడా లెనిన్‌ జీవిత చరిత్రకు సంబంధించినది కావడం విశేషం.

ప్రతికూల భావజాలం ఓ సవాలు

                మార్క్స్‌, ఏంగెల్స్‌లు మౌలిక సిద్ధాంత సూత్రాలు అందించారే గాని పిల్లలకు గైడ్‌ రాసిపెట్టినట్టు చేయలేదు. నిర్దిష్ట పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకో వాలన్న ఉద్దేశంతోనే వారు కొన్ని ఖాళీలు అట్టిపెట్టారు. ముందు వారు రాసింది చదివి తర్వాత మన పరిస్థితులను మధించి ఆ సూత్రాల అన్వయం, బాధ్యత మన పైనే వుంటుంది. ఎవరూ పుట్టుకతో చదువరులు కాదు. వందల పుస్తకాలు చదివేవారు కూడా సమకాలీన సమాజ పరిస్థితుల సారం చెప్పే విషయాలు చదువుతున్నారా అనేది ప్రశ్న. ఎవరో ఎందుకు? మహా నాయకుడు సుందరయ్య కూడా దేశబంధు చిత్తరంజన్‌ దాసు మరణించినప్పుడు ఆయనెవరని ప్రశ్న వేసి స్నేహితుడు మందలించాకే మారిపోయారు. అంతకు ముందూ ఆయన పుస్తకాలు విపరీతంగా చదివేవారు. కాని ఏది చదవాలి ఎలా చదవాలన్నది అప్పుడు తెలుసుకున్నారు. సుందరయ్య మద్రాసులో మొదట హెచ్‌.డి రాజా తెచ్చి ఇచ్చిన ‘కమ్యూనిస్టు ప్రణాళిక’తోనే సిద్ధాంత గ్రంథాల అధ్యయనం మొదలెట్టారు. కమ్యూనిస్టు ఉద్యమం నిర్మాణంలో ఇంగ్లీషు పుస్తకాల అనువాదం అందుబాటు ఒక తొలి కర్తవ్యంగా తీసుకున్నారు. అప్పటికి తీవ్ర నిషేధం వున్నా విదేశాల నుంచి పుస్తకాలు రావడం దుస్సాధ్యమైనా ఎంతో పెనుగులాడుతూ నాటి బృందం అనువాదాలు తీసుకొచ్చింది. తెలుగునాట ప్రజాశక్తి తర్వాత విశాలాంధ్ర ప్రచురణాలయాలు అలాగే నెలకొన్నాయి. అవంతీ, ఆదర్శ గ్రంథమండలి వంటివి కూడా అలాంటి సేవలే చేశాయి.. అప్పటితో పోలిస్తే ఇప్పుడు పుస్తకాల అందుబాటు పెరిగింది. కంప్యూటర్ల దెబ్బకు ముద్రణ కొంత తగ్గు ముఖం పట్టినా వివిధ రూపాలలో సమాచారం ప్రవహిస్తున్నది. అదే సమయంలో కమ్యూనిస్టు సూత్రాలకు సంబంధించిన ప్రతి ఒక్క పుస్తకానికి పది వ్యతిరేక ప్రచురణలు కూడా వుండొచ్చు. సోవియట్‌ విచ్ఛిన్నం తర్వాత వర్గ పోరాటానికి భిన్నమైన లేదా వ్యతిరేకమైన భావజాలాలను ప్రోత్సహించడం ప్రచారంలో పెట్టడం బాగా పెరిగింది. ప్రజలకు జరిగేది కనిపిస్తూనే వుంటుంది. కాని వాటిని ఆవరించి వున్న భ్రమలు పటాపంచలు చేయాలంటే మౌలిక విషయాలతో సోదాహరణంగా చెప్పగలగాలి.

అవగాహనతోనే ఆచరణ

                    ఆసక్తితో చదివితేనే అవగాహన కలుగుతుంది. యాంత్రికంగా ఏదో నివేదిక కోసమో పాఠం చెప్పడం కోసమో లేక తప్పనిసరి తంతుగానో చదివితే ప్రయోజనం వుండదు. చదివే వాటిని ఎన్నుకునేప్పుడు వ్యక్తిగత ఆసక్తితో పాటు సమాజ అవసరాలను కూడా ప్రధానంగా గమనంలో వుంచుకోవాలి. తక్షణ సమస్యలకే పరిమితమైపోయినా లేక మక్కికి మక్కిగా మౌలిక సూత్రాలే వల్లెవేస్తున్నా పొరబాటే. రెండింటి మేళవింపు జరగాలి. మన అవగాహన పెంచుకుని జనరాశులకు బోధించడానికి, గందరగోళాలు తొలగించడానికి, శత్రువులను ఖండించడానికి చదవాలి. అవగాహనకూ అవహేళనకూ పొంతన కుదరదు. కొంతమంది సర్వజ్ఞులైన సిద్ధాంత కోవిదులమనుకొని అంతగా చదివే అవకాశం దొరకని వారిని చిన్నబుచ్చుతుంటారు గాని అది పొరబాటు. అజ్ఞానం అవమానించవలసిన విషయం కాదు. చదువనే దీపంతో దాన్ని పోగొట్టాలి, తెలియని వారికి కూడా ఎరుకపర్చేలా చెప్పి అధ్యయనం వైపు ఆకర్షించాలి. పురాణం, చరిత్ర, విజ్ఞానశాస్త్రం, రాజకీయ ఆర్థికాంశాలు సామాజిక శాస్త్రాలు దేనిని ఎలా చూడాలనే స్పష్టత వుండాలి. ఉదాహరణకు రామాయణ భారతాల వంటి వాటిని ఇప్పుడు అవహేళన చేయడం వల్ల ఉపయోగం వుండదు. వాటి నేపథ్యం సమాజ గమనంలో ఎలా ఉద్భవించాయి. అందులో అంతర్గర్భితంగా వున్న సమాజ పరిణామ సంకేతాలేమిటి తెలుసుకోవాలి గాని దేశ కాల పరిస్థితులకు అతీతంగా ఇప్పటి కొలతలతో తము చదివిన పుస్తకాల పరిమితితో హేళన చేయడం ప్రతికూలమే అవుతుంది. నిర్దిష్ట పరిస్థితులలో తీసుకోవాల్సిన నిర్ణయాలుగా మార్స్క్‌, ఏంగెల్సు వంటి వారు వదలిపెట్టిన అంశాలను తలకు ఎక్కించుకుని అప్పటివే తుచ తప్పకుండా వల్లె వేయడం కూడా శాస్త్రీయం కాదు.

అవగాహన పెరిగే కొద్ది కఠినమైన విషయాలను కూడా సరళంగా వివరించే శక్తి పెంచుకోవాలి తప్ప మనకు కలిగిన ప్రాథమిక అవగాహననే అంతిమమన్నట్టు అన్నిటినీ అక్కడకు తీసుకువెళ్లి చెప్పడం మొదలెడితే మనం 2024ను అందుకోవడం అసాధ్యమవుతుంది. ప్రజల తరపున పోరాడే శక్తులతో చేతులు కలపకుండా, కార్యాచరణను గౌరవించకుండా గట్టు మీద కూచుని పాఠాలు చెబితే వాస్తవాలను అర్థం చేసుకోవడం దుస్సాధ్యం. మార్క్స్‌ చెప్పిన కార్మిక శక్తి, దోపిడీ వంటి మాటలకు కాలం చెల్లిందన్నవారు కోవిడ్‌ తర్వాత కోట్లాది మంది శ్రామికులు పనులు కోల్పోవడం, పని గంటల పెంపు వంటి పద్ధతుల పునరావృతం, నిపుణత గలవారే నిస్ప్రహ పాలవడం చూశారు. వ్యవసాయాన్ని తక్కువ చేసి మాట్లాడిన వారే రైతాంగ పోరాటాలకు తల వంచారు. మతతత్వ రాజకీయాల మంటలు మొదట గమనించలేకపోయిన వారు ఇప్పుడు కళ్లు తెరుస్తున్నారు. ఇందులో ప్రతి విషయం మీద ప్రతిఘట్టంలో ప్రజాశక్తి వంటి సంస్థలు పుస్తకాలు ప్రచురించాయి. వ్యాసాలు వేస్తూనే వున్నాయి. వాటిని ప్రచారంలో పెట్టడానికి ప్రయత్నించాయి. ఉద్యమం లోపల బయిటా వాటిని మరింత మందికి చేర్చవలసే వుంటుంది. ఈనాటి రాజకీయ సవాలుతో పోలిస్తే జరుగుతున్న సైద్ధాంతిక కృషి, అధ్యయనం ప్రచారం చాలవు. పైగా ఎదురుదాడి మరింత తీవ్రంగా వుంది. సోషల్‌ మీడియా ఎంత ఉపయోగకరంగా వుందో అంతగానూ ప్రతీప శక్తుల చేతిలో దుర్వినియోగమవుతున్నది. ఇప్పుడు ఎ.ఐ అనే కృత్రిమ మేధతో ముప్పు మరింత పెరగొచ్చు. ఎందుకంటే పాలక వర్గాలు నిస్పందేహంగా ప్రతి సాధనాన్ని దుర్వినియోగపరుస్తాయి. దాని సాంకేతిక ప్రక్రియలను మనం పట్టుకుంటేనే రేపు దాని ద్వారా జరిగే దాడిని తట్టుకోగలం.

కనుక అధ్యయనమే ఆయుధంగా ఆలోచనలకు పదును పెట్టుకోవాలి. ఆచరణకు వేగం పెంచుకోవాలి. అవగాహన విస్తృతపర్చుకోవాలి. చదవడం అంటే మొక్కుబడి కాదు. కట్టుబడి అంతకన్నా కాదు. పుస్తకం హస్త భూషణమో ఇంట్లో కార్యాలయంలో అలంకారమో కాదని కూడా గుర్తించాలి. అది మానవ చైతన్యంలో భాగం. పురోగమనానికి చిహ్నం. ప్రణాళిక కోసం చదవడమే కాదు, చదవడానికీ ప్రణాళిక వుండాలి. దానికి ఈ బుధవారం మరో అడుగు పడాలి. రెడ్‌ బుక్‌ డే అరుణారుణ అక్షర చైతన్యం నింపాలి.

తెలకపల్లి రవి
తెలకపల్లి రవి
➡️