చూపుడు వేలు

Apr 21,2024 05:55 #2004 Elections, #artical, #edit page

చూపుడు వేలు పైకి చూపడం బోధనా అధికారానికి సంకేతం. ఇది రాఫెల్‌ రచించిన ‘ఏథెన్స్‌ పాఠశాల’లో ప్లేటో చిత్రణలో కనిపిస్తుంది. ‘అంబేద్కర్‌ చూపుడువేలు/ భారతదేశ ఆత్మగౌరవానికి/ చెరగని చారిత్రక గుర్తు/ పార్లమెంటును ప్రశ్నిస్తున్న/ అంబేద్కర్‌ చూపుడువేలు/ చరిత్ర చెరిగిపోయే/ చాక్‌పీస్‌ రాత కాదు’ అంటారు రచయిత కత్తి పద్మారావు. చూపుడు వేలు దేశ భవిష్యత్‌కు దిక్సూచి. ఇది దేశ భవిత దిశను నిర్ణయిస్తుంది. లోక్‌సభ ఎన్నికలు-2024 ప్రారంభానికి గుర్తుగా గూగుల్‌ సైతం చూపుడు వేలుపై సిరా గుర్తు వేసిన చిహ్నంతో వున్న డూడుల్‌ను ఏప్రిల్‌ 19న విడుదల చేసింది. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఎడమచేతి చూపుడు వేలుకు సిరా చుక్క పెడతారు.
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల పండగ ప్రారంభమైంది. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 97 కోట్ల మంది ఓటర్లు తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఎన్నికలివి. 18వ లోక్‌సభ కోసం దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు ఏడు దశల్లో 543 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓటు వేసిన ప్రతి ఒక్కరూ ‘నేను ఓటు వేశానోచ్‌’ అన్నట్టుగా చూపుడు వేలు సగర్వంగా చూపుతారు. కానీ, మన ఓటు సద్వినియోగం అయిందా అన్నదే ప్రశ్న. అంతేకాదు, ఓటు హక్కు వినియోగించుకోడానికి చాలామంది ఆసక్తి చూపరు. కొందరు ప్రలోభాలకు లొంగిపోతారు. మరికొందరిలో దీనివల్ల ఉపయోగం ఏముందిలే అన్న ఉదాసీనత. కానీ, ఇవి దేశ భవితను నిర్ణయించే ఎన్నికలు. గత ఐదేళ్లుగా పాలకులు చెప్పింది విన్నాం. చేసింది చూశాం. ఇప్పుడు మన వంతు. ‘మన భవిష్యత్‌కు మనమే రూపురేఖలు దిద్దుకోవాలి’ అంటాడు షేక్‌స్పియర్‌. చూపుడు వేలితో సరైన తీర్పు చెప్పాల్సిన సమయం ఇది. మైనారిటీలపై విద్వేష రాజకీయాలను క్రమపద్ధతిలో వ్యాప్తి చేయడం ద్వారా భారతదేశ వైవిధ్యాన్ని నాశనం చేసేందుకు తెగబడింది మోడీ ప్రభుత్వం. ‘అజ్ఞానాన్ని కడుక్కోమన్న ప్రతిసారి/ అంధకారపుగెవుల్లో తోయడానికే ఎత్తులేస్తాడు గాని/ ఇదిగో మరకని వేలెత్తి చూపనిస్తాడా?!/ చూపుడు వేలుపై ప్రశ్నను మొలవనిస్తాడా??’ అంటారు కవి పల్లిపట్టు నాగరాజు. వారి తప్పులు ఎత్తి చూపకూడదు. వారిని ప్రశ్నించకూడదు, విమర్శించకూడదు. అందుకే మనకు ‘చూపుడు వేలు’ వుండకూడదని మోడీ పరివారం కోరుకుంటోంది.
‘సిరా చుక్క మౌనం పాటిస్తే/ సార చుక్క రాజ్యమేలుతుంది/ మేధావులు మౌనంగా ఉంటే/ మూర్ఖులు రాజ్యమేలుతారు’ అంటాడో కవి. ఎందరెందరో మహామహుల త్యాగాల పునాదులపై ఏర్పడిన ఆధునిక భారత గణతంత్రం మనుగడ సాగిస్తుందా? జమిలి ఎన్నికలు, ఒకే దేశం-ఒకే ఎన్నిక వంటి నినాదాలు, విధానాల మాటున అధ్యక్ష తరహా పాలనకు, ఆ తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి కోరుకునే ఫాసిస్ట్‌ హిందూ దేశంగా మారబోతుందా? అన్నది ఈ దేశ ప్రజల ముందున్న ప్రశ్న. మోడీ తిరిగి గద్దెనెక్కితే, ఇవే చివరి ఎన్నికలైనా ఆశ్చర్యపోనక్కర్లేదన్న పలువురి మాటనూ కొట్టిపారేయలేం. ‘నీ చూపుడువేలు/ ఇంకా మావైపునకే చూపిస్తోంది/ నడకలో, నడతలో/ ఏదో అపసవ్యం/ పసిగడుతోంది’ అంటాడు కవి ఆనంద. మన నడకలో, నడతలో నవ్యతను సంతరించుకోవాలి. పదేళ్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల ఒంటివేలు విప్లవానికి ఇది నాంది. ‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అంటాడు కాళోజీ. మన చూపుడువేలుపై వేయించుకునే సిరా చుక్క కోట్లాది జనానికి దిక్సూచి కావాలి. ఇదే స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగిస్తే… ఆధునిక భారతదేశం కాపాడబడుతుంది. ‘ప్రతి ముప్పై సంవత్సరాలకి బతుకు తాలూకా ఆలోచన మారుతూ ఉంటుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్‌ అంటారు. వ్యాపారవేత్తలు ఫ్యాషన్‌ అంటారు. రాజకీయ నాయకులు తరం అంటారు. మామూలు జనం జనరేషన్‌ అంటారు. కాని ప్రతి జనరేషన్‌లోనూ ఓ కొత్త థాట్‌ని ముందుకు తీసుకువెళ్లే వాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడే టార్చ్‌ బేరర్‌’ అని ఓ సినిమా డైలాగ్‌. ప్రజా సమస్యలు చట్టసభల్లో ప్రతిధ్వనించాలి. ప్రజా సమస్యలను వినిపించే వేల గొంతుకలు కావాలి. ఇలాంటి గొంతుకలే ఈ దేశాన్ని ముందుకు నడిపించే నిజమైన టార్చ్‌ బేరర్స్‌. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, భిన్నత్వంలో ఏకత్వం యొక్క గాయపడిన విలువలకు ఇదే ఔషధం. భారత్‌ను గెలిపిద్దాం… మనమూ గెలుద్దాం!!

➡️