ప్రమాదంలో భారత ఫెడరల్‌ వ్యవస్థ

గత పదేళ్లుగా 2014 నుంచి 2024 వరకు భారత ఫెడరల్‌ వ్యవస్థ (సమాఖ్య విధానం)పై దాడులు జరుగుతున్నాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించటం, గవర్నర్లను రాష్ట్ర ప్రభుత్వాలపై ఉసిగొల్పడం, రాష్ట్రాలలో తమకు నచ్చని పార్టీలు అధికారంలో వున్న చోట, ఆ పార్టీలను చీల్చటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయత్నించటం మొదలగు చర్యలన్నీ ఫెడరలిజంపై దాడులుగానే భావించాలి. మార్చి 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.వి.నాగరత్న హైదరాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో కొన్ని రాష్ట్రాలలో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, పంజాబ్‌ రాష్ట్రాల గవర్నర్లు తీసుకున్న నిర్ణయాలను జస్టిస్‌ నాగరత్న తన ప్రసంగంలో ప్రస్తావించారు. అదే ప్రసంగంలో పెద్ద నోట్ల రద్దుపై ఏ స్థాయిలో సంప్రదింపులు జరగలేదని, పెద్ద నోట్ల రద్దు సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించాయన్నారు. ఆమె ప్రస్తావించిన అంశాలు కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష ధోరణిని ధ్రువపరుస్తున్నాయి.

భారత ఫెడరలిజం – రాజ్యాంగం
భారతదేశానికి గల భిన్నత్వం దృష్ట్యా ఫెడరల్‌ రాజ్యాంగం అవసరమని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. రాజ్యాంగంలో ఫెడరల్‌ అనే పదం ప్రత్యక్షంగా ఉపయోగించకపోయినప్పటికి, రాజ్యాంగంలోని ఒకటవ నిబంధనలో ‘యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ అనే వాక్యాన్ని ఉపయోగించారు. అనగా కేంద్రం, రాష్ట్రాలు రెండూ బలంగా వుండాలని భావించారు. ప్రఖ్యాత రాజనీతి శాస్త్రవేత్త ఎ.వి. డైసీ ఫెడరలిజానికి నాలుగు లక్షణాలు ప్రతిపాదించాడు. అవి కేంద్ర-రాష్ట్రాల మధ్య అధికార విభజన, లిఖిత రాజ్యాంగం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ద్విసభా విధానం. ఈ నాలుగు లక్షణాలు భారత రాజ్యాంగంలో వున్నాయి. రాజ్యాంగం 7వ షెడ్యూల్‌లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా అధికార విభజన జరిగింది. కేంద్ర జాబితాలో 97 అంశాలు, రాష్ట్ర జాబితాలో 66 అంశాలు, ఉమ్మడి జాబితాలో 47 అంశాలు వుంచారు. సాధారణ సమయాలలో భారత రాజ్యాంగం ఫెడరల్‌ రాజ్యాంగంగా వుంటుందని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ స్పష్టంగా పేర్కొన్నాడు.

రాష్ట్రాల హక్కులపై దాడి
గత పదేళ్లుగా రాష్ట్రాల హక్కులు, ఆర్థిక వనరులపై తీవ్రమైన దాడి జరుగుతున్నది. రాష్ట్రాలతో సంప్రదించకుండానే చేపట్టిన పెద్ద నోట్ల రద్దు చర్య వలన ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. వేలాది చిన్న పరిశ్రమలు మూతబడటమేకాక, లక్షలాది మంది అసంఘటిత రంగ కార్మికులు ఉపాధి కోల్పోయారు. రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టిన జి.యస్‌.టి వలన రాష్ట్రాలు ఆర్థిక వనరులు నష్టపోయాయి. రాష్ట్రాలు సుమారు రూ.3 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ రూ.30 వేల కోట్లు జి.యస్‌.టి వలన నష్టపోయాయని ఆర్థికవేత్తలు అంచనా వేశారు.
మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ చట్టాలు రాజ్యాంగానికి, సమాఖ్యకు పూర్తి విరుద్ధం. వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉండగా, కేంద్రం రాష్ట్రాలతో సంప్రదించకుండానే పార్లమెంట్‌లో వ్యవసాయ చట్టాలు చేసింది. వీటికి వ్యతిరేకంగా లక్షలాది మంది రైతులు 400 రోజులపాటు ఢిల్లీలో ఆందోళన చేశారు. సుమారు 700 మందికి పైగా రైతులు ఈ ఆందోళన సందర్భంగా మరణించారు. చివరకు మోడీ ప్రభుత్వం రైతు ఉద్యమానికి తల వంచి చట్టాలను ఉపసంహరించుకోక తప్పలేదు. 2020లో కేంద్రం ఆమోదించిన నూతన ‘జాతీయ విద్యావిధానం-2020’ కూడా ఫెడరలిజానికి విరుద్ధమే. విద్య ఉమ్మడి జాబితాలో వుండగా, కేంద్రం రాష్ట్రాలతో సంప్రదించకుండానే ‘ఎన్‌ఇపి-2020’ ప్రకటించింది. కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాలు ఎన్‌ఇపి-2020 అమలు జరపమని స్పష్టంగా ప్రకటించాయి. ఆర్థిక వనరుల పంపిణీకి 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటామని కేంద్రం ప్రకటించడం కూడా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు.

కేంద్ర ఏజెంట్లుగా గవర్నర్లు
గవర్నర్లు కేంద్ర-రాష్ట్రాల మధ్య సంధానకర్తలుగా వ్యవహరించాలని రాజ్యాంగం భావించింది. కానీ, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నియమించిన గవర్నర్లు బిజెపి యేతర పార్టీల పాలిత రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను, రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతూ, కేంద్ర ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్‌ మొదలగు రాష్ట్రాలలో గవర్నర్ల వ్యవహార శైలి పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నది. కేరళ శాసనసభ ఆమోదించిన అనేక బిల్లులను గవర్నర్‌ ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపితే, రాష్ట్రపతి కూడా ఆమోదించకపోవటంతో కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. కేరళ, తమిళనాడు అసెంబ్లీ సమావేశాలలో గవర్నర్లు తమ ప్రసంగాన్ని చదవకుండానే పోడియం దిగిపోవటం తీవ్ర అభ్యంతరకరమైన విషయం. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సిఫార్సు చేసిన ఒక మంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయించటానికి గవర్నర్‌ అంగీకరించలేదు. సుప్రీంకోర్టు ఆదేశించిన తరువాత ప్రమాణ స్వీకారం చేయించారు. మహారాష్ట్రలో శివసేన పార్టీ చీలినప్పుడు, గవర్నర్‌ చీలిక వర్గంవైపు పక్షపాత ధోరణి ప్రదర్శించి సహాయం చేశారు. గవర్నర్ల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టటం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం.

జమిలి ఎన్నికలు
‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ పేరుతో 2029 నాటికి జమిలి ఎన్నికలు నిర్వహించాలని మోడీ ప్రభుత్వం భావిస్తున్నది. దీని కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నాయకత్వంలో నియమించిన కమిటీ ఇటీవల 18 వేల పేజీల నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. ఈ కమిటీ 2029 నాటికి రాజ్యాంగంలోని 5 ఆర్టికల్స్‌ను సవరించి జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని, 47 రాజకీయ పార్టీలలో 32 పార్టీలు జమిలి ఎన్నికలకు అనుకూలంగా వున్నాయని తెలిపి, సిఫార్సు చేసింది. జమిలి ఎన్నికలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, బహు పార్టీ విధానం వున్న భారతదేశంలో సాధ్యమయ్యే విషయం కాదు. జమిలి ఎన్నికలు సమాఖ్య విధానానికి పూర్తి విరుద్ధం.

రాష్ట్రాలపై రాజకీయ దాడి
నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక రాష్ట్రాలలో ఇతర పార్టీల ప్రభుత్వాలు అధికారంలో వుండటం సహించలేకపోతున్నది. అన్ని రాష్ట్రాలలో తమ బిజెపి ప్రభుత్వాలు గాని, తమకు అనుకూలమైన ప్రభుత్వాలు గాని (ఆంధ్రప్రదేశ్‌లో లాగా) వుండాలని భావిస్తున్నది. ఇతర పార్టీల నాయకులను, రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెట్టడానికి కేంద్ర సంస్థలను వినియోగిస్తున్నది. సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఎన్‌.ఐ.ఏ, ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ మొదలగు సంస్థలను ఉసిగొల్పి తమ దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించటం పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఇప్పటికే బహుజన సమాజ్‌ పార్టీ నాయకురాలు మాయావతిపై అనేక కేసులు పెట్టారు. అఖిలేష్‌ యాదవ్‌ను ఇరికించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి జైలులో పెట్టటం దీనికి పరాకాష్టగా భావించవచ్చు. బిజెపికి వ్యతిరేకంగా ‘ఇండియా’ కూటమి ఏర్పడటం, దానిలో కేజ్రీవాల్‌ క్రియాశీల పాత్ర పోషించటమే ప్రధాన కారణం. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీలను పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకున్నది. ఫెడరల్‌ విధానంలో భిన్నమైన రాజకీయ పార్టీలు గెలుపొందటం, అధికారంలో ఉండటం చాలా సహజమైన విషయాలు. కాని బిజెపికి తనకు వ్యతిరేకంగా ఉండే భిన్నమైన రాజకీయ పార్టీలు అధికారంలో ఉండటం నచ్చటం లేదు. ఇది ఫెడరల్‌ విధానానికి పూర్తి విరుద్ధం.

ఆంధ్రప్రదేశ్‌ హక్కులు
భారత సమాఖ్యలో భాగమైన ఆంధ్రప్రదేశ్‌ హక్కులు 2014 తరువాత పూర్తిగా కాలరాయబడ్డాయి. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదా ఇవ్వలేదు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన ప్రధాన హామీలు వేటినీ అమలు చేయలేదు. కడపలో ఉక్కు కర్మాగారం, రామయపట్నం ఓడరేవు, విశాఖలో రైల్వేజోన్‌, గ్రీన్‌ఫీల్డ్‌ ఆయిల్‌ రిఫైనరీ, జాతీయ విద్యాసంస్థలు అన్నింటిలో కేంద్రం ఆంధ్రులకు అన్యాయం చేసింది. రాజధాని విషయంలో కూడా బిజెపి వంచించింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు పూనుకున్నది. ఆంధ్రుల హక్కులను కాపాడటంలో తెలుగుదేశం, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, జనసేన పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయి. మూడు పార్టీలూ మోడీ ప్రభుత్వం పై ఒత్తిడికి ప్రయత్నించకపోగా అంటకాగుతున్నాయి.

జాతీయ సమగ్రత
భిన్నత్వం కలిగిన భారతదేశంలో ఫెడరల్‌ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తేనే జాతీయ సమైక్యత కొనసాగుతుంది. లేనట్లయితే వేర్పాటువాద ధోరణలు ప్రారంభమౌతాయి. గతంలో పంజాబ్‌, అస్సాం మొదలగు రాష్ట్రాలలో వేర్పాటువాద ధోరణులు విచ్ఛిన్నకర ఉద్యమాలకు దారితీశాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫెడరల్‌ వ్యవస్థపై చేస్తున్న దాడులను రాష్ట్రాలు సమైక్యంగా ఎదుర్కోవాలి. బిజెపి ఆలోచనా విధానం కేంద్రం బలంగా వుండే ‘ఏక కేంద్ర’ విధానాన్ని తీసుకురావటమే. దీనిని రాజకీయ పార్టీలు, రాష్ట్రాలు, ప్రజాస్వామ్యవాదులు, పౌరసమాజం సమైక్యంగా ఎదుర్కోవాలి.

 వ్యాసకర్త శాసనమండలి సభ్యులు కెఎస్‌. లక్ష్మణరావు, సెల్‌ : 8309965083 

➡️