ఆలస్యంతో అన్యాయం !

Feb 23,2024 07:10 #Editorial

              దాదాపు ఇరవై ఎనిమిదేళ్ల నాడు తూర్పు గోదావరి జిల్లాలో పెత్తందారీతనం పేట్రేగిపోయి, శిరోముండనం అనే దారుణ అమానుష ఘట్టానికి దారి తీసింది. ఈ అకృత్యంలో బాధితులెవరో, బాధించినవారెవరో లోకానికి స్పష్టంగా తెలుసు. కానీ, ఇన్నేళ్లు గడిచినా నిందితులకు శిక్ష పడలేదు. బాధితులకు న్యాయం జరగలేదు. 1996 డిసెంబరు 29వ తేదీ రాత్రి … రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో నలుగురు దళిత యువకులను బంధించి, చిత్రహింసలకు గురి చేసి, అందులో ఇద్దరికి శిరోముండనం చేశారు. కనుబొమ్మలను గీయించారు. నానా దుర్భాషలాడి, తీవ్రంగా అవమానించారు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన ఈ కేసులో ప్రధాన సాక్షి కోటి రాజు బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. బాధితుల్లో ఒకరు, సాక్షుల్లో ఇంకొందరు గతంలోనే చనిపోయారు. నాడు యువకులుగా ఉన్నవాళ్లు ఇప్పుడు వృద్ధాప్య దశకు దగ్గరయ్యారు. కానీ, న్యాయం మాత్రం అందనంత దూరంలో ఉండిపోయింది!

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నిందిత గణానికి నిరాటంకంగా అండదండలు అందటం ఈ కేసులో తీవ్ర జాప్యానికి ప్రధాన కారణం. అధికార యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని, కేసును ఎన్ని విధాల నీరు గార్చగలరో అన్ని విధాలా నిర్వీర్యం చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసును పక్కదోవ పట్టించటానికి- బాధితులు దళితులు కారని, క్రైస్తవులని నిందితుల తరఫు నుంచి దాఖలైన వ్యాజ్యంతో కేసు విచారణ ఏళ్ల తరబడి ఆగిపోయింది! బాధితులు అధికారులను కదిలించటానికి, తమ కులాన్ని నిరూపించుకోవటానికి దళిత, ప్రజాసంఘాలతో కలిసి పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ఈలోగా ఈ కేసులో ప్రధాన ముద్దాయి నాలుగు పార్టీలు మారారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

శిరోముండన అఘాయిత్యానికి ఏ శిక్షా పడకపోవడంతో అదే జిల్లాలో ఇంకొన్ని అకృత్యాలు అదే పద్ధతిలో కొనసాగాయి. ఒక రోడ్డు ప్రమాదంలో బాధితుడి పక్షాన నిలిచి మాట్లాడినందుకు సీతానగరం మండలం వెదుళ్లపల్లికి చెందిన వరప్రసాద్‌ అనే దళిత యువకుడికి సాక్షాత్తూ పోలీసు స్టేషన్లోనే శిరోముండనం చేశారు. మామిడిపళ్లు దొంగిలించాడనే నెపంతో రంగంపేటలో శ్రీను అనే యువకుడిని పెత్తందారులు తీవ్రంగా హింసించారు. పంచాయతీ కార్యాలయంలో ఫ్యానుకు ఉరితో అతడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. మూడేళ్ల క్రితం అధికార పార్టీ ఎమ్మెల్సీ కారు డ్రైవరు సుబ్రహ్మణ్యం మృతదేహంగా ఇంటికి డెలివరీ కావడం సంచలనం కలిగించింది. రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా దళితులపై సాగిన అనేక దాడుల్లో, దారుణాల్లో బాధితులకు న్యాయం దొరక్కుండానే కాలం గడిచిపోతోంది. విచారణ ఆలస్యం చేసీ చేసి, సాక్ష్యాలన్నిటినీ చెదరగొట్టాక నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన సందర్భాలూ ఉన్నాయి.

‘న్యాయం ఆలస్యమైతే అన్యాయం జరిగినట్టే’ అని ప్రపంచం అంతటా ఆధునిక సమాజం ఘంటాపథంగా ఉద్ఘోషిస్తుంది. ఎందుకంటే- న్యాయం జరగటంలో జాప్యం ఎదురైతే బాధితులు మరింత బాధితులవుతారు. బాధితులం అన్న భావన సమూహ జీవనంలోంచి వారిని మానసికంగా వేరు చేస్తుంది. తమకు తోటి సమాజం నుంచి సంపూర్ణ సంఘీభావం పొందిన సహానుభూతి సత్వర న్యాయం లభించటంతోనే సాధ్యమవుతుంది. కానీ, చాలా సందర్భాల్లో మన న్యాయస్థానాల్లో జరుగుతున్న అసాధారణ జాప్యం తీవ్రమైన ఆవేదననే మిగుల్చుతోంది. అన్యాయానికి గురైన వారు అదే క్షోభను, అదే బాధను ఏళ్ల తరబడి నిస్సహాయంగా మోయాల్సి వస్తోంది. దేశంలో ఏటా షెడ్యూల్డు కులాలపై దాడులూ, దారుణాలకు సంబంధించి సుమారు 2 లక్షల కేసులూ, షెడ్యూల్డు ట్రైబ్‌కి సంబంధించి 25 వేల కేసులూ విచారణకు వస్తే, అందులో 10 శాతానికి మించి తీర్పులు వెలువడడం లేదు. మిగతా అన్నీ పెండింగు అరల్లో పేరుకుపోతున్నాయి. ఏళ్లకు ఏళ్లు ఇదే ధోరణి కొనసాగి, లక్షలాది మంది బాధితులూ న్యాయస్థానాల ముంగిట బాధితులుగానే మిగిలిపోతున్నారు. ఈ అసాధారణ జాప్యాన్ని, కేసుల్లో అధికార పెత్తందారీ పార్టీల ప్రభావాన్ని నివారించి, బాధితులకు సత్వర న్యాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

➡️