పరిష్కారం దొరికేనా ?

Nov 28,2023 07:15 #Editorial

ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులు ఆందోళనకరంగా మారుతున్నాయి. అమెజాన్‌ అటవీ ప్రాంతం సైతం కురువు కోరల్లో చిక్కుకోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఒక్క మాటలో చెప్పాలంటే భూగోళం మీద వీటి ప్రభావం పడని ప్రాంతమంటూ లేదు. రానున్న రోజుల్లో ఈ దుస్థితి మరింత ఘోరంగా మారనుందని ఐక్యరాజ్యసమితి (యుఎన్‌ఓ) తాజాగా హెచ్చరించింది. ఇటీవల విడుదల చేసిన ‘విపత్తుల నివేదిక-2023’లో యావత్తు ప్రపంచం ముప్పు వైపు దూసుకుపోతున్న తీరును సోదాహరణంగా వివరించింది. మానవాళితో పాటు సమస్త జీవరాశి అంతానికి దారితీస్తున్న విధానాలను మార్చుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించింది. ఆ సంస్థ నేతృత్వంలోని భాగస్వామ్య దేశాల 28వ వాతావరణ సదస్సు (కాప్‌-28) గురువారం (30వ తేదీ) నుండి దుబారులో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సూచన ప్రాధాన్యత నంతరించుకుంది. అయితే, ఇటువంటి సూచనలను యుఎన్‌ఓ చేయడం ఇదే మొదటిసారి కాదు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు వాటిని బేఖాతరు చేయడమూ కొత్త కాదు. ఆ కారణం చేతనే ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న వాతావరణ సదస్సులు విఫల సదస్సులుగా అపప్రదను మూటకట్టుకున్నాయి. వివిధ దేశాల నుండి ఇప్పటికే అందుతున్న సంకేతాల ప్రకారం గత అనుభవాలే మరోసారి పునరావృతమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ధనిక దేశాలను కట్టడి చేయడంలో యుఎన్‌ఓ నిస్సహాయత మరోమారు బట్టబయలవుతుంది. అదే సమయంలో ముంచుకొచ్చే ముప్పు మానవాళికి మరింత చేరువ అవుతుంది. వాతావరణ మార్పుల కారణంగా చోటుచేసుకునే నష్టాలను పూడ్చేందుకు నిధిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన గత సమావేశంలో వచ్చిన సంగతి తెలిసిందే. దీనినే ఒక ముందడుగుగా కార్పొరేట్‌ మీడియా ఊదరగొట్టింది. అయితే జరిగిందేమిటి? కాలుష్యంలో చారిత్రక బాధ్యతను అనుసరించి దేశాల వాటా ఆ నిధిలో ఉండాలని పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు కోరగా… దానికి తిరస్కరించిన అమెరికా ఆ చర్చల నుండి వాకౌట్‌ చేసింది. నష్టపరిహార నిధి ‘స్వచ్ఛంద’ స్వభావం కలిగి ఉండాలని, ఏ దేశం పైనా వనరుల సమీకరణ కోసం ఒత్తిడి ఉండకూడదని అమెరికా వాదించింది.                                                                                                                                          వాతావరణ మార్పుల కారణంగా చోటుచేసుకుంటున్న విపత్తులతో పేద దేశాల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. ఈ విపత్తులు సృష్టిస్తున్న నష్టాల నుండి బయట పడటానికి రాయితీలు, ఆర్థిక సాయాలే ఆ దేశాలకు ఆధారమవుతున్నాయి. తగినంత నిధులు అందుబాటులో లేకపోతే ఆ దేశాలు, అక్కడి ప్రజలు బతికి బట్టకట్టేదెట్లా? విపత్తుల నష్టపరిహారంగా వివిధ దేశాలకు ప్రస్తుతం అందిస్తున్న ఆర్థికసాయం ఆ దేశాల రుణభారాన్ని పెంచేవిధంగా ఉంది. ఈ పద్ధతి మారాలని ఆ దేశాలు కోరుకుంటున్నాయి. నష్టపరిహారానికి సైతం సంపన్న దేశాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి రావడం ఎంత దారుణం! కాలుష్యానికి, భూతాప పెరుగుదలకు కారణమౌతున్న ధనిక దేశాలు తమ విధానాలను మార్చుకోవడానికి ఏ మాత్రం సిద్ధపడకపోగా, అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలపై ఆ నెపాన్ని నెట్టడానికి ప్రతి సమావేశంలోనూ ప్రయత్నించడం ఎంత దుర్మార్గం! ఎన్నికలు సమీపిస్తుండటంతో అమెరికా వైఖరిలో మార్పు ఉండదన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తమవుతుండటం గమనార్హం.                                                                                                                                                                                             ప్యారిస్‌ ఒప్పందంలో పేర్కొన్న మేరకు ఉష్ణోగ్రతను పరిమితం చేయడంలో ప్రపంచ దేశాలు విఫలమవుతున్నాయని, త్వరలోనే ఆ పరిమితిని దాటేస్తున్నామన్నది తాజా నిర్ధారణ. దుబారులో డిసెంబర్‌ 12 వరకు జరగనున్న కాప్‌-28లో దీనితో పాటు 2030వ సంవత్సరాన్ని ప్రామాణికంగా పెట్టుకుని అనేక విషయాలను చర్చించనున్నారు. 200కు పైగా దేశాల ప్రతినిధులు అధికారికంగా ఈ సమావేశాల్లో భాగస్వాములవుతున్నారు. పెద్ద సంఖ్యలో ఎన్‌జిఓలు, మేధావులు, నిపుణులు కూడా పాలుపంచుకుంటున్నారు. మరోవైపు ప్యారిస్‌ ఒప్పంద పురోగతిలో భాగస్వామ్యంపై (గ్లోబల్‌ స్టాక్‌టేక్‌) వివిధ దేశాల మధ్య తీవ్ర స్థాయిలో అభిప్రాయ భేదాలు చోటుచేసుకున్నాయన్నది తాజా సమాచారం. ఇటువంటి అడ్డంకులను దాటుకుని భూగోళం ఎదుర్కుంటున్న వాతావరణ, పర్యావరణ సమస్యలకు కాప్‌-28 ఒక పరిష్కారం చూపుతుందని ఆశిద్దాం.

➡️