బిజెపిని, దాన్ని బలపరుస్తున్న పార్టీలను ఓడిద్దాం

Feb 22,2024 07:14 #Editorial

మతోన్మాద బిజెపి, దానికి మద్దతునిచ్చే టిడిపి-జనసేన కూటమి, నిరంకుశ వైసిపిలకు వ్యతిరేకంగా… సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20న …విజయవాడ యం.బి విజ్ఞానకేంద్రంలో జరిగిన రాష్ట్ర సదస్సు ఆమోదించిన తీర్మానం పూర్తి పాఠం.

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఒకవైపు మతోన్మాద బిజెపి నేతృత్వ ఎన్‌డిఎ, దానికి వ్యతిరేకంగా మరోవైపు ఇండియా బ్లాకు పార్టీలు తలపడనున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రానికి ద్రోహం చేసి ప్రజల తిరస్కారానికి గురైన మతోన్మాద బిజెపి, టిడిపి, జనసేన కూటమి తోడ్పాటుతో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో తిష్టవేయడానికి దుష్టపన్నాగం పన్నుతున్నది. రాష్ట్రంలో బిజెపిని ఓడించడమంటే దానికి కొమ్ముకాస్తున్న టిడిపి-జనసేన కూటమి, నిరంకుశ వైసిపిని ఓడించడమే. రాష్ట్రం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, సామాజిక న్యాయం కోసం, మత సామరస్యం కోసం వామపక్ష లౌకిక శక్తులను బలపర్చాలని ఈ సదస్సు రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నది.

గత 10 ఏళ్లలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తూ, ఇస్రో లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలను కూడా ప్రైవేటుకు అప్పగిస్తున్నది. దీనివల్ల దేశంలో ఆర్థిక స్వావలంబన దెబ్బ తినడమేకాక సామాజిక న్యాయం పూర్తిగా దెబ్బతింటుంది. కార్పొరేట్‌ అనుకూల ఆర్థిక విధానాల వల్ల దేశ సంపదలు అదానీ, అంబానీలకు దోచిపెట్టారు. ధరలు, పన్నులు పెంచి ప్రజలపై భారాలు మోపింది. మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని అమలుపరచకుండా నిరుద్యోగులను వీధుల పాలు చేసింది.

మతాల మధ్య, కులాల మధ్య ఘర్షణలు సృష్టించి మారణహోమం సృష్టిస్తున్నారు. మహిళలను నగంగా ఊరేగించి, ఆపైన మానభంగం, హత్యలు చేసే నీచ సంస్కృతిని పునరావృతం చేయ సంకల్పించారు. మణిపూర్‌ ఘటన దేశ చరిత్రలో మాయని మచ్చగా మిగిలింది. జమ్ము-కాశ్మీర్‌కు రక్షణగా ఉన్న ఆర్టికల్‌ 370 రద్దు ద్వారా అక్కడ నిరంతర ఘర్షణలకు తెరదీశారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణం, కాశీలో జ్ఞానవాపి తదితర అంశాల చుట్టూ ప్రజల మనోభావాలు మళ్లించే దుష్ట ఎత్తుగడలు, కులాలవారీగా, మతాల వారీగా ప్రజలను చీల్చి మోడీ నామస్మరణ చుట్టూ జనాన్ని, దేశ రాజకీయాల్ని తిప్పాలనుకునే కుతంత్రాలకు ఫిబ్రవరి 8న జరిగిన రైతాంగ పోరాటం, 16న సంయుక్త కిసాన్‌ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు జరిపిన గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మెలు మోడీ ప్రభుత్వ అంచనాలను తారుమారు చేసే సంఘటనలే.

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం బిజెపి దారిలోనే ప్రజలపై భారాలు మోపుతున్నది. నిరంకుశంగా ప్రజావ్యతిరేక పాలన చేస్తున్నది. ప్రజా ఉద్యమాలపై నిర్బంధం ప్రయోగిస్తున్నది. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నది. ఇలాంటి వైసిపికి గద్దెపై కూర్చునే హక్కు లేదు. గత టిడిపి పాలన కూడా ఇందుకు భిన్నంగా లేదు.

ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలను (ఆర్‌బిఐ, ఈసి, ఈడి, సిబిఐ కడకు న్యాయ వ్యవస్థతో సహా) తమ ఆధీనంలోకి తెచ్చుకుని సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్న బిజెపిని, దానికి వంతపాడుతున్న పార్టీలను ఓడించాల్సిన అవసరం ఉంది. కేంద్రం గవర్నర్‌ల ద్వారా రాష్ట్రాలపై పెత్తనం చేయడం ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది. ఈ నేపథ్యంలో వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక పార్టీలన్నీ ఐక్యంగా నిలబడి బిజెపితో జతకడుతున్న టిడిపి, జనసేనలను; వైసిపిని ఓడించి, లౌకిక శక్తులను బలపరచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణానికి, పునరావాసానికి నిధులు, విశాఖ రైల్వేజోన్‌, ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, కడప స్టీల్‌ ప్లాంటు నిర్మాణం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, కృష్ణపట్నం, గంగవరం పోర్టుల ప్రైవేటీకరణ ఇలా అన్నింటి విషయంలో ద్రోహం చేసిన బిజెపిని, దాన్ని బలపరుస్తున్న పార్టీలను రాబోవు ఎన్నికల్లో దూరం పెట్టాల్సిన చారిత్రక అవసరం నేడు ఉంది. వీటి సాధనలకు కృషి సల్పుతూనే రాజకీయంగా ఆ పార్టీలను ఎండగట్టాలి.

ఈ కర్తవ్య నిర్వహణలో రాష్ట్ర ప్రజలంతా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజాతంత్ర, లౌకికవాదులు, సంస్థలు ముందుకొచ్చి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడాలని కోరుతున్నాము.

                                                                  బిజెపి హఠావో – దేశ్‌ బచావో

➡️