రాష్ట్ర ఎన్నికల్లో కీలకం కానున్న మైనారిటీలు !

Dec 23,2023 07:15 #Editorial

మణిపూర్‌లో క్రిస్టియన్లపై దాడులు చేసినా కేంద్రంలోని, ఆ రాష్ట్రంలోని బిజెపి సర్కారు సరిగ్గా స్పందించలేదనే అసంతృప్తి ఎ.పి లోనూ నెలకొని ఉంది. ఈ ఘటనపై పలు క్రిస్టియన్‌ సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. పై పరిణామాలతో ముస్లిం, క్రిస్టియన్‌ సామాజిక వర్గాలు బిజెపి పై ఆగ్రహంతో, ఆ పార్టీతో అంటకాగే పార్టీని కూడా శిక్షించాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాయి. అయితే రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి-జనసేన కూటమి మైనార్టీల భావాలను పట్టించుకోకుండా ముందుకెళ్తే ఎదురుదెబ్బ తప్పదు.

              వేసవి కాలంలో జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు చలికాలంలోనే వేడిని పుట్టిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు తెలుగువారి దృష్టి అంతా ఆంధ్రా ఎన్నికలపైనే ఉంది. సంక్షేమ పథకాలే తమను మళ్లీ అధికారంలోకి తెస్తాయని వైఎస్‌ఆర్‌సిపి ఆశిస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకతతో అధికార మార్పిడి ఖాయమని టిడిపి-జనసేన కూటమి భావిస్తోంది. ఆ పార్టీలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రభుత్వ వ్యతిరేకత వంటి అంశాలపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. అంతకంటే ఎక్కువగా ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారని చెప్పవచ్చు.

మైనార్టీల జనాభా, గత ఎన్నికల్లో వారు అనుసరించిన విధానం అంశాలను పరిశీలించడంతోపాటు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకుంటూ ‘పీపుల్స్‌ పల్స్‌’ శాస్త్రీయంగా అధ్యయనం చేసింది. ఎపి లో సుమారు పది శాతం ముస్లింలు, ఒక శాతం క్రిస్టియన్లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఎస్‌సి, ఎస్‌టి, బిసి లతో పాటు అగ్రవర్ణాలలో కూడా మత మార్పిళ్లు జరగుతున్నాయి (ఇలాంటివి అధికారిక గణాంకాల్లో వ్యక్తం కావు). ఎన్నికల్లో మైనార్టీల ప్రభావం ఉండబోతోంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో పది శాతానికి పైగా, కడప, కర్నూలు జిల్లాలలో పదిహేను శాతానికి పైగా మైనార్టీలున్నారు. ప్రధానంగా ముస్లింలు 64 స్థానాలకు పైగా అసెంబ్లీ నియోజక వర్గాల్లో నిర్ణయాత్మకంగా ఉన్నారని అంచనా.

మైనార్టీల నిర్ణయం రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల కంటే బిజెపి పైనే అధికంగా ఆధారపడి ఉంటోంది. ఇక్కడి పార్టీలు బిజెపి కి అనుకూలంగా, వ్యతిరేకంగా వ్యవహరించే తీరునుబట్టి ముస్లింలు నిర్ణయం తీసుకుంటారని గత ఎన్నికల అనుభవాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి గత ఎన్నికల్లో పొందిన ముస్లిం ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. సిఎస్‌డిఎస్‌-లోక్‌నీతి డేటాను పరిశీలిస్తే బిజెపి తో పొత్తు పెట్టుకోకుండా పోటీ చేయడంతో టిడిపి 1996లో 36.7 శాతం, 1998లో 46.6శాతం, 2009లో 24.8శాతం, 2019లో 46శాతం ముస్లిం ఓట్లు పొందింది. అదే బిజెపి తో కలిసి పోటీ చేసిన 1999లో 28.2శాతం, 2004లో 34శాతం, 2014లో 33శాతం ముస్లిం ఓట్లు పొందింది. బిజెపి తో పొత్తు పెట్టుకొని పోటీ చేసినప్పుడు ముస్లిం మద్దతు కోల్పోతున్న టిడిపి, బిజెపి తో కలవకుండా పోటీ చేసినప్పుడు మాత్రం అధికంగా ముస్లిం ఓట్లను పొందుతోంది. బిజెపి తో పొత్తు లేకుండా 2009లో పోటీ చేసిన టిడిపి కి 24.8 శాతం ఓట్లే రావడానికి ప్రధాన కారణం అప్పుడు జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉండడమే.

రాష్ట్ర విభజన తర్వాత వైఎస్‌ఆర్‌సిపి 2014లో రికార్డు స్థాయిలో 66 శాతం మైనార్టీల మద్దతు పొందింది. అదే 2019 ఎన్నికలొచ్చే సరికి 17 శాతం ఓట్లు కోల్పోయి 49 శాతం ఓట్లే పొందింది. దీనికి ప్రధాన కారణాలు ఆ ఎన్నికలకు ముందు జగన్‌ బిజెపి కేంద్ర నాయకులతో సత్సంబంధాలు కొనసాగించ డంతో పాటు చంద్రబాబు బిజెపి కి వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించడం. ఈ చరిత్రలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఏ మాత్రం ప్రభావం లేని బిజెపి పరోక్షంగా ఇతర పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చు.వైఎస్‌.రాజశేఖర రెడ్డిని తమ ఆరాధ్య దైవంగా భావించే వైఎస్‌ఆర్‌సిపి ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ ప్రధాన ఆశయమైన సెక్యులర్‌ భావాలకు తిలోదకాలిస్తుందనే భావన రాష్ట్రంలోని మైనార్టీలలో నెలకొంది. వైఎస్‌ఆర్‌ ఎప్పుడూ రాజీ పడకుండా బిజెపి, సంఫ్‌ు పరివార్‌ సంస్థలకు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఒకానొక సమయంలో వైఎస్‌ఆర్‌పై ఆర్‌ఎస్‌ఎస్‌ కేసు కూడా పెట్టింది. ఇందుకు భిన్నంగా వైఎస్‌.జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా అనేక కారణాలతో మొదటి నుండి బిజెపి తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సయోధ్యగానే మెలుగుతున్నారు. 2014లో వైఎస్‌ఆర్‌సిపి ఓడిపోయిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయకముందే జగన్‌ కలిశారు. అప్పటి నుండే జగన్‌ బిజెపి పై సాఫ్ట్‌కార్నర్‌గా ఉంటున్నారు. వైఎస్‌ఆర్‌సిపి ఇప్పటి వరకూ బిజెపితో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోకపోయినా, కేంద్రంలో అందరి కంటే ముందే బిజెపి కి మద్దతు ఇస్తుండడంతో రాష్ట్రంలోని మైనార్టీలు జగన్‌ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. వైఎస్‌ఆర్‌సిపి కి రాష్ట్రంలో మొదటి నుండి ముస్లింలు, క్రిస్టియన్లు ఏకపక్షంగా మద్దతిస్తున్నారు. ముస్లింలతోపాటు క్రిస్టియన్లకు కూడా జగన్‌ బిజెపి దోస్తీ నచ్చడం లేదు. క్రిస్టియన్ల ఓటింగ్‌ శాతం తక్కువే అయినా మత మార్పిడితో క్రిస్టియన్లుగా మారుతున్న సామాజిక వర్గాలకు కూడా బిజెపి తో సయోధ్యపై జగన్‌ అంటే గుర్రుగా ఉన్నారు. బిజెపి తో జగన్‌ తీరు ఇలాగే కొనసాగితే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి ముస్లిం ఓట్లను నష్టపోయే అవకాశాలున్నాయని ఆ పార్టీ సానుభూతిపరులు భావిస్తున్నారు.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మొదటి నుండి బిజెపి పట్ల దృఢవైఖరితో లేకుండా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారు. 1998లో చంద్రబాబు బిజెపి ని విమర్శిస్తూ ఆ పార్టీ మసీదులు కూలుస్తుంటే తాము మసీదులు నిర్మిస్తున్నా మంటూ వ్యాఖ్యానించారు. 1999 పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో 13 పార్టీలతో కూడిన యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా ఉన్న చంద్రబాబు కూటమిలోని నేతలకు చెప్పకుండా బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ వైపు మళ్లారు. 2004 ఎన్నికల్లో ముస్లింలు బిజెపి కి వ్యతిరేకంగా ఉండడంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని ఓడిపోయానని, ఇకపై బిజెపి తో కలవనని చంద్రబాబు చెప్పారు. మళ్లీ 2014లో బిజెపి తో జతకట్టిన చంద్రబాబు 2019 ఎన్నికల ముందు బిజెపి కి రాంరాం చెప్పారు. ఇకపై భవిష్యత్తులో ప్రాణం పోయినా బిజెపి తో కలవమని ఆయన చెప్పగా, టిడిపి తో ఇక ముందు పొత్తు పెట్టుకోమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా అన్నారు. ఆ సమయంలో రాష్ట్రానికి వచ్చిన అమిత్‌ షాను టిడిపి శ్రేణులు అడ్డుకొన్నాయి. నిప్పు, నీరుగా సాగిన వీరి తీరులో 2019లో టిడిపి ఓటమి తర్వాత మార్పు వచ్చింది. 2019కి ముందు బిజెపి పై కఠినంగా వ్యవహరించిన చంద్రబాబు వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపించింది.

ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన ప్రత్యేక హోదాతో పాటు ఇతర హామీలపై మోడీ ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని, రాష్ట్రానికి కావాల్సింది పాచిపోయిన లడ్డూలు కావని 2019లో బిజెపి పై తీవ్ర విమర్శలు చేసిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఎన్‌డిఎలో భాగస్వామి అయ్యారు. బిజెపి తో పొత్తు కొనసాగిస్తున్నారు. పొత్తుపై ఆయన అనేక వివరణలు ఇచ్చినా మైనార్టీలకు అన్యాయం జరిగితే మొదటగా తానే స్పందిస్తానని పవన్‌ చెబుతున్నా ప్రస్తుత బిజెపి పోకడలతో ఆయన మాటలను మైనార్టీలు విశ్వసించడం కష్టమే.బిజెపి వ్యవహారాలను వ్యతిరేకించే మైనార్టీలకు ఇతర రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయాలున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌పి, బిఎస్‌పి, కాంగ్రెస్‌, బీహార్‌లో ఆర్‌జెడి, జెడియు, పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి, వామపక్షాలు, కాంగ్రెస్‌, ఒడిస్సాలో బిజెడి, కాంగ్రెస్‌లు ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయి. ఆంధ్రాలో వైఎస్‌ ఆర్‌సిపి, టిడిపి-జనసేన కూటమే ఉండడం ఇబ్బందికరమే !

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను మొదటి నుండి పరిశీలిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా బిజెపి ప్రభావం నామమాత్రమే. రాష్ట్రంలో నోటాతో పోటీ పడుతున్న బిజెపి గురించి మైనార్టీలు పెద్దగా పట్టించుకోలేదు. 2014లో నరేంద్ర మోడీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలతో మైనార్టీలలో అభద్రతా భావం పెరగడంతో పాటు ఆ పార్టీపై ఆగ్రహం కూడా ప్రారంభమైంది. అయోధ్య రామాలయం అంశంపై బిజెపి దూకుడు, కాశ్మీర్‌ 370 ఆర్టికల్‌ రద్దు, సిఎఎ, ఎన్‌ఆర్‌సి, కామన్‌ సివిల్‌ కోడ్‌ ప్రతిపాదన వంటి నిర్ణయాలతో తమ ఉనికికే ప్రమాదం ఏర్పడిందని ముస్లింలు భావిస్తున్నారు.

మణిపూర్‌లో క్రిస్టియన్లపై దాడులు చేసినా కేంద్రంలోని, ఆ రాష్ట్రంలోని బిజెపి సర్కారు సరిగ్గా స్పందించలేదనే అసంతృప్తి ఈ రాష్ట్రంలోనూ నెలకొని ఉంది. ఈ ఘటనపై పలు క్రిస్టియన్‌ సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. పై పరిణామాలతో ముస్లిం, క్రిస్టియన్‌ సామాజిక వర్గాలు బిజెపి పై ఆగ్రహంతో, ఆ పార్టీతో అంటకాగే పార్టీని కూడా శిక్షించాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాయి. అయితే రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి-జనసేన కూటమి మైనార్టీల భావాలను పట్టించుకోకుండా ముందుకెళ్తే ఎదురుదెబ్బ తప్పదు.

బిజెపి పోకడలపై దేశ వ్యాప్తంగా అనేక ప్రజా సంఘాలు, ఎన్‌జీవోలు, మేధావుల సంఘాలు మండిపడుతున్నాయి. వారు కర్ణాటకలో బిజెపి ప్రభుత్వాన్ని పడగొట్టడంలో, తెలంగాణలో బిజెపి ని అడ్డుకోవడంలో విజయవంతమయ్యారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎపి లో వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి-జనసేన కూటమి బిజెపి తో ఎంత దూరం పాటిస్తే అంత మంచిదనే వాస్తవాన్ని గుర్తించి మెలిగితేనే మంచిది.

/వ్యాసకర్త 'పీపుల్స్‌ పల్స్‌' రీసెర్చర్‌/ఐ.వి. మురళీకృష్ణ శర్మ
/వ్యాసకర్త ‘పీపుల్స్‌ పల్స్‌’ రీసెర్చర్‌/ఐ.వి. మురళీకృష్ణ శర్మ
➡️