పెట్రోల్‌, డీజిల్‌ ధర రు.2 తగ్గింపు.. మోడీ కుడుములేస్తున్నారు.. పండగ చేసుకుందామా!

Mar 19,2024 06:07 #Articles, #edite page, #petrol price

త్వరలో ప్రపంచ జిడిపిలో జపాన్‌, జర్మనీలను వెనక్కు నెట్టి మూడవ స్థానం ఆక్రమించే ధనిక దేశంగా మనలను నరేంద్రమోడీ ముందుకు తీసుకుపోతున్నారు. టీవీలు చూడండి రోజూ ఎన్ని గ్యారంటీలను ప్రకటిస్తున్నారో, రామరాజ్యాన్ని తెచ్చారు, రామాలయాన్ని నిర్మించారు, ప్రపంచంలో తలెత్తుకొనేట్లు చేశారు. ఓట్ల కోసం మోడీ ఏమీ చేయరని బరాబర్‌ చెబుతున్నాం అంటూ భక్తులు ఊరూరా తిరుగుతున్నారు. అదే నిజమైతే ”ధనికులైన” మన జనాలకు ముష్టి విదిల్చినట్లుగా తాజాగా పెట్రోలు, డీజిలు మీద లీటరుకు రు.2 తగ్గించటం అవమానించటం కాదా ? ఈ చర్యతో జనం పండగ చేసుకుంటున్నారని బిజెపి నేతలు చెబుతున్నారు. పూర్వం గ్రామాల్లో వృత్తుల వారికి పండుగల సందర్భంగా రైతులు తాము చేసుకున్న పిండివంటలు ఇస్తే ఎంతో సంతోషించేవారు(దీని అర్ధం వృత్తుల వారిని కించపరచటం కాదు, అలాంటి పరిస్థితి గతంలో ఉందని చెప్పటమే.ఇప్పుడు ఇంకా ఎక్కడైనా అలా ఉందేమో తెలియదు). దాన్నుంచి వచ్చిందే కుడుమేస్తే పండగ అనే లోకోక్తి. ఇప్పుడు ముష్టివిదిల్చినట్లుగా రెండు రూపాయలు , గ్యాస్‌ సిలిండర్‌కు వంద ఇచ్చి బిజెపి వారు జనాలను డూ ఫెస్టివల్‌ (పండగ చేస్కో) అంటున్నారు.2022 ఏప్రిల్‌ ఆరు నుంచి చమురు ధరలను స్థిరంగా ఉంచిన పెద్దలు ఓట్లు కొల్లగొట్టాలని తప్ప ఇప్పుడు ఇంత స్వల్పంగా తగ్గించటానికి ప్రాతిపదిక ఏమిటి ? ఈ మాత్రానికే పండగ చేసుకొని ఓట్లు వేస్తామని ఎవరైనా అంటే అది వారిష్టం.
అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే పెంచుతాం, తగ్గితే తగ్గించే విధానం అమలు జరుపుతున్నట్లు ప్రతి రోజూ సుప్రభాతం మాదిరి ధరలను ప్రకటించే వారు. రెండు సంవత్సరాలుగా ఎందుకు నిలిపివేసినట్లు ? ఎన్నికల్లో మీట నొక్కిన తరువాత తిరిగి పెంచరనే గ్యారంటీ ఏముంది ? కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ ఎనాలసిస్‌ సెల్‌(పిపిఏసి) వెబ్‌సైట్‌లోని తాజా సమాచారం ప్రకారం పదేళ్ల యుపిఏ పాలనా కాలంలో 2004-05 నుంచి 2013-14 వరకు కేంద్ర ప్రభుత్వం లేదా చమురు ఉత్పత్తుల మార్కెటింగ్‌ కంపెనీలు వినియోగదారులకు ఇచ్చిన సబ్సిడీల మొత్తం రు.8,88,024 కోట్లు. అంటే సగటున ఏటా 88.8వేల కోట్లు అన్నమాట. నరేంద్రమోడీ పదేళ్ల పాలనలో ఈ మొత్తం రు.2,82653 కోట్లు మాత్రమే. అంటే ఏడాదికి సగటున 30.1వేల కోట్లు అన్న మాట. వీటిలో ప్రజాపంపిణీ కిరోసిన్‌, ఉజ్వల గ్యాస్‌ సబ్సిడీ ఉన్నాయి. ఒక వైపు సబ్సిడీలపై ఎడాపెడా కోత పెట్టిన మోడీ ప్రభుత్వం మరో వైపు చమురు రంగంలో జనంపై మోపిన భారమెంతో చూడండి. తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో మోడీ సర్కార్‌ పెంచిన పన్నులు, సెస్సులు,చమురు కంపెనీల నుంచి వచ్చిన రాబడుల మొత్తం రు.34,53,930 కోట్లు. అంటే సగటున రు.3.45లక్షల కోట్లు పిండుకుంది. అధికారానికి వచ్చిన తొలి ఏడాది అంటే అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ విధించిన పన్నులు, ఇతర రాబడి రు.1.72లక్షల కోట్లు మాత్రమే. అది 2021-22కి వచ్చేసరికి గరిష్టంగా రు.4.92లక్షల కోట్లకు పెరిగింది.
2020లో మనదేశంలో 88.2 బిలియన్‌ లీటర్ల డీజిల్‌,37.2 బిలియన్‌ లీటర్ల పెట్రోలు(స్టాటిస్టా సమాచారం) వినియోగం మొత్తం 125.4బిలియన్‌ లీటర్లు. ఇప్పుడు రెండు రూపాయల చొప్పున తగ్గించారు గనుక ఏడాది పాటు అమలు చేస్తే 250.8బిలియన్లు అంటే 25వేల కోట్లు జనానికి విదిల్చి ఓట్లు కొల్లగొట్టాలని పథకం వేశారు.మోపిన భారం ఎంత ? తగ్గించిన ధర ఎంత ? తరువాత వినియోగం పెరిగి ఉంటే ప్రభుత్వానికి పన్ను ఆదాయం పెరిగినట్లే తగ్గింపు మొత్తం కూడా అదే దామాషాలో పెరుగుతుంది. జనం మరీ ఇంత అమాయకంగా ఉన్నారని, కుడుమేస్తే పండగ చేసుకొనే వారి మాదిరి కనిపిస్తున్నారా? పది సంవత్సరాల కాలంలో రాష్ట్రాలకు చమురు ఉత్పత్తుల మీద వచ్చిన పన్ను, ఇతర రాబడి రు.22,19,558 కోట్లు అంటే సగటున 2.3 లక్షల కోట్లు. పదేళ్ల క్రితం వార్షిక రాబడి 1.6లక్షల కోట్ల నుంచి 2.3లక్షల కోట్లకు తప్ప కేంద్రం మాదిరి రు.1.72లక్షల నుంచి 3.45లక్షల కోట్లకు పెరగలేదు. కేంద్రం నుంచి పన్నుల్లో రాష్ట్రానికి వచ్చే వాటా సంగతేమిటని కొందరు ప్రశ్నించవచ్చు. ఎక్సైజ్‌, ఇతర పన్నులో రాష్ట్రాలకు వాటా ఉంటుంది తప్ప సెస్సుల పేరుతో మోపిన దానిలో ఒక్క పైసా కూడా రాదు. మోడీ మోపిందంతా సెస్సుల పేరుతోనే. ఈ విధంగా ప్రజల జేబులు కొల్లగొట్టారు.దానిలో ఓట్ల కోసం ఇప్పుడు నామమాత్రంగా తగ్గించి పండగ చేస్కోమనడం ప్రజలను హేళన చేయడం కాదా?
యుపిఏ పాలనలో 112 డాలర్లకు బ్యారెల్‌ ముడి చమురును దిగుమతి చేసుకుంటే వినియోగదారుల నుంచి వసూలు చేసింది పెట్రోలు రు.64.71, డీజిల్‌కు రు.40.26 మాత్రమే. ఇప్పుడు బ్యారెల్‌ ముడి చమురు ధర 82.41 డాలర్లు ఉంటే ఢిల్లీలో 96.67, 89.62గా ఎందుకు ఉన్నట్లు? తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు రేటు రు.109, 111 వంతున ఉన్నాయి, మరికొన్ని చోట్ల ఇంకా ఎక్కువ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినా వినియోగదారుల నుంచి ఇంతగా ధర వసూలుకు కారణమేమిటి అంటే విపరీతంగా సెస్సులను వడ్డించటం, రూపాయి మారకపు విలువ పతనాన్ని అరికట్టలేని అసమర్ధతే తప్ప మరొక కాదు. వీటి గురించి నరేంద్రమోడీ దేశానికి ఇస్తున్న గ్యారంటీలు ఏమిటి అన్నది ప్రశ్న.
మోడీ సర్కార్‌ అసమర్థ నిర్వాకానికి ఇప్పుడు దేశ ప్రజలందరూ మూల్యం చెల్లించాల్సి వస్తోంది.ఎంతో కీలకమైన ఈ రంగంలోనే మన ప్రతిభ ఇలా ఉంటే దేశాన్ని ముందుకు తీసుకుపోతాం, అగ్రస్థానానికి చేరుస్తాం అంటే ఉట్టికి ఎగరలేని వారు స్వర్గానికి ఎగురుతాం అన్నట్లుగా ఉంది.
కరోనా సంక్షోభంలో కార్పొరేట్‌ శక్తులను నరేంద్రమోడీ సర్కార్‌ ఎలా ఆదుకున్నదో, జనం అప్పులపాలై దివాలా తీస్తే ధనికుల దగ్గర సంపద ఎలా పోగుపడిందో చూశాము.ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో రష్యా నుంచి చౌకగా దిగుమతి చేసుకున్న ముడిచమురును శుద్ది చేసి ఐరోపా దేశాల కోసం ఎగుమతి చేస్తూ కార్పొరేట్‌ కంపెనీలు లాభాలు నొల్లుకొంటున్నాయి. జనానికి ఎలాంటి ఉపశమనమూ లేదు. రష్యా నుంచి దిగుమతుల వలన మన జనానికి కలిగిన-కలుగుతున్న మేలు ఇదీ అని బిజెపిని చెప్పమనండి!

ఎం కోటేశ్వరరావు

➡️