ఇరుగు పొరుగు

Jan 12,2024 07:20 #Editorial

                 ఇప్పటికే సరిహద్దు దేశాలతో భారత ప్రభుత్వానికి సత్సంబంధాలు కొరవడిన నేపథ్యంలో తాజాగా మాల్దీవులతో సరికొత్త వివాదం తలెత్తడం కలవరపరుస్తోంది. హిందూ మహాసముద్రంలో కేవలం ఐదు లక్షల జనాభా కలిగిన ఆ ద్వీప దేశంతో ప్రపంచంలో అతి పెద్ద జనాభా గల ఇండియా వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశ మవుతోంది. మాల్దీవులకు చెందిన ముగ్గురు ఉపమంత్రులు భారత ప్రధాని నరేంద్ర మోడీని టెర్రరిస్ట్‌ గా, విదూషకుడిగా అభివర్ణిస్తూ ఆయన ఇజ్రాయిల్‌ కు తొత్తు అన్న వ్యాఖ్యానాలను తమ వ్యక్తిగత సోషల్‌ మీడియా అకౌంట్లో పోస్ట్‌ చేశారు. అవి తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలనడంలో ఎలాంటి సందేహము లేదు. ప్రతి ఒక్కరూ వాటిని ఖండిస్తారు కూడా! అవి ఆ యా మంత్రుల వ్యక్తిగత వ్యాఖ్యలే తప్ప ప్రభుత్వ వైఖరి కాదు అని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయుజ్జు స్పష్టం చేయడమే గాక తదనంతరం ఆ ముగ్గురిని మంత్రివర్గం నుండి బర్తరఫ్‌ చేశారు. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ పట్ల చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమైనవే తప్ప మాల్దీవుల ప్రభుత్వం లేదా ఆ దేశ ప్రజలందరి అభిప్రాయంగా భావించడానికి ఎంత మాత్రమూ తావులేదు. అయినా మాల్దీవులకు భారత్‌ నుండి యాత్రికులు ఎవరూ వెళ్లరాదని విమాన సర్వీసులను రద్దు చేయడం వంటి తీవ్రమైన చర్యలు చేపట్టడం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వంటివి. మాల్దీవులకు యాత్రికుల ద్వారా లభించేది ప్రధాన ఆదాయం. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం స్థూల ఆదాయంలో మూడవ వంతు యాత్రికుల నుండే లభిస్తోంది. పర్యాటకుల సంఖ్యలో తొలి రెండు స్థానాల్లో భారత్‌, రష్యా ఉన్నాయి. అంటే భారత యాత్రికుల నుండి లభించే ఆదాయం మాల్దీవుల ప్రజల జీవనోపాధికి ఎంతగానో తోడ్పడుతోంది. ముగ్గురు వ్యక్తులు తమ సోషల్‌ మీడియా ఎకౌంట్లలో చేసిన వ్యాఖ్యలకు ఆ దేశంలోని సామాన్య ప్రజానీకం పొట్టకొట్టడం భావ్యం కాదు. ఈ అంశంపై ఇప్పటికే మాల్దీవులలోని మన రాయబారి ఆ ప్రభుత్వానికి తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేశారు. అంతేగాక ఢిల్లీలోని ఆ దేశ రాయబారిని విదేశాంగ శాఖ పిలిపించుకొని మందలించిన విషయం అందరికీ తెలిసిందే. మాల్దీవుల సర్కారు కూడా వెంటనే ఆ దుందుడుకు మంత్రులను బర్తరఫ్‌ చేయడంతో పాటు ఆ వ్యాఖ్యలు ప్రభుత్వానివి కావని స్పష్టం చేయడం దిద్దుబాటు చర్యల్లో ముఖ్యమైన అంశం. ఈ నేపథ్యంలో మాల్దీవులకు వెళ్లే భారత యాత్రికులను నిరుత్సాహపర్చడం, నిరోధించడం ఎవరికీ శోభస్కరం కాదు. అంతేగాక భారత రక్షణ రీత్యా కూడా మాల్దీవులు ఒక మిత్ర దేశంగా ఉండడం ఎంతో అవసరం. ఆ దేశానికి 1965లో స్వాతంత్య్రం వచ్చినప్పటినుండీ భారత్‌కు మిత్ర దేశంగానే ఉందన్న విషయం మరువరాదు. అయితే, ఇటీవలి ఎన్నికల తరువాత కొద్దిగా తేడాలు వచ్చిన మాట నిజం. తమ భూభాగంలో విదేశీ సేనలుండరాదన్న ఆ దేశ ప్రభుత్వ విధానాన్ని ఎవరూ పూర్తిగా తప్పుబట్టలేరు కదా! ఇప్పటికే పాకిస్తాన్‌, చైనా, మయన్మార్‌, నేపాల్‌ తదితర సరిహద్దు దేశాలతో భారత ప్రభుత్వ సంబంధాలు సజావుగా లేవు. ఇంకా చెప్పాలంటే చాలావరకు శత్రు పూరితమైనవే! ఇరుగుపొరుగు దేశాలతో ఇటువంటి పరిస్థితి ఏ దేశానికీ మంచిది కాదు. అందులోనూ విశ్వగురువులమని కితాబిచ్చుకుంటున్న సంఘ పరివార్‌ శక్తుల ప్రాబల్యంలోని ప్రభుత్వానికి అంతకన్నా తగదు. ఒకనాడు అలీన దేశాల కూటమికి నాయకత్వం వహించడం, బంగ్లాదేశ్‌ విముక్తికి అన్ని విధాలా కృషి చేయడం వంటివి భారత చరిత్రలో మరుపురాని ఘట్టాలు. ఆ చరిత్రను చెరిపివేసే విధంగా మోడీ ప్రభుత్వం ఇరుగుపొరుగు దేశాలతో వ్యవహరించడం తగదు. ఇప్పటికైనా మాల్దీవులతో సత్సంబంధాలు నెరపడానికి మోడీ ప్రభుత్వం పూనుకోవాలి. క్రీడాకారులు, సినీ నటులు, ఇతర సెలబ్రిటీలు కూడా జాతీయ దురభిమానానికి గురికాకుండా విశ్వ మానవ సౌభ్రాతత్వాన్ని అలవర్చుకోవడం అవసరం. క్రీడ, నటన విశ్వజనమైనవి. ఆ మాటకొస్తే అంతర్జాతీయ క్రీడా పోటీల ద్వారా, ప్రపంచ బాక్సాఫీస్‌ కలెక్షన్ల ద్వారా భారీ ఆదాయాలను పొందుతున్న విషయాన్ని ఎవరూ మరువ రాదు. ఇరుగుపొరుగు దేశాల ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలు, సత్సంబంధాలు ఎల్లవేళలా కలిగి ఉండడం సర్వశ్రేయోదాయకం.

➡️