కమిటీ రద్దుతోనే కాదు

Dec 26,2023 07:20 #Editorial

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్లుఎఫ్‌ఐ) నూతన కార్యవర్గాన్ని రద్దు చేస్తూ క్రీడల మంత్రిత్వశాఖ ఆదివారం నిర్ణయం తీసుకుంది. ఫెడరేషన్‌ నియంత్రణ, నిర్వహణల కోసం తాత్కాలిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఒఎ)ను కోరింది. మోడీ ప్రభుత్వ ఈ చర్య వెనుక మహిళా రెజ్లర్లు దాదాపు ఏడాది కాలంగా నిర్వహిస్తున్న ఆందోళల ప్రభావం ఉంది. రెజ్లర్ల ఉద్యమానికి వివిధ వర్గాల నుంచి లభిస్తున్న విశాల మద్దతును బిజెపి గ్రహించినట్టుంది. దగ్గరలోనే సార్వత్రిక ఎన్నికలున్న దృష్ట్యా కమిటీ రద్దు నష్ట నివారణ కోసం చేపట్టిన చర్య కింద భావించాలి. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలుండగా, గురువారం నిర్వహించిన ఫెడరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎన్నికల్లో ఆయనకు అత్యంత విధేయుడు, వ్యాపార భాగస్వామి, కరడుగట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడూ అయిన సంజరు సింగ్‌ నూతన అధ్యక్షుడయ్యారు. కమిటీలోని 15 స్థానాల్లో 13 బ్రిజ్‌ భూషణ్‌ సహచరులకే దక్కాయి. ఈ పరిణామంపై స్టార్‌ రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ మీడియాముఖంగా కన్నీరు పెట్టుకున్నారు. ప్రముఖ రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ రెజ్లింగ్‌ నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించారు. బజరంగ్‌ పునియా, రవీందర్‌ సింగ్‌ యాదవ్‌ తమకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ అవార్డులను తిరిగి ఇచ్చేస్తామన్నారు. బహుశా, ఈ ఇబ్బందికర పరిస్థితుల వల్లనే కేంద్రం నూతన కమిటీని రద్దు చేసి ఉంటుంది. కమిటీ రద్దుకు క్రీడల మంత్రిత్వశాఖ ఉదహరించిన కారణాలు నామమాత్రమే.

బిజెపి ఎం.పి., డబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షునిగా ఉన్న బ్రిజ్‌ భూషణ్‌, కోచ్‌లు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఒలింపిక్‌ పతక విజేతలైన సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా, ఫోగట్‌లు నిరసించారు. 2023 జనవరి 18 నుంచి ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద అథ్లెట్లతో కలిసి నెలల పర్యంతం బైఠాయించి ఆందోళన చేశారు. అయినప్పటికీ మోడీ ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదు. మే 28న నూతన పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవం వద్దకు వెళ్లి తమ గోడు వినిపించేందుకు ప్రయత్నించగా మోడీ ప్రభుత్వం నిర్ధాక్షిణంగా పోలీసులతో అడ్డుకుంది. పతకాలు సాధించి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన క్రీడాకారులపట్ల మోడీ సర్కారు వ్యవహరించిన కాఠిన్యం ఇది. దీన్నిబట్టి మహిళలను చెరబట్టిన తమ పార్టీ ఎం.పి.ని ఎంతగా వెనకేసుకొచ్చారో అర్థం చేసుకోవచ్చు. చివరికి సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్న తర్వాతనే ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌భూషణ్‌పై అభియోగాలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేసి నెలలవుతున్నా సరైన దర్యాప్తూ లేదు, చర్యలూ లేవు. ఈ లోపే బ్రిజ్‌ భూషణ్‌ విధేయుడైన సంజరు సింగ్‌, డబ్ల్యుఎఫ్‌ఐ కొత్త అధ్యక్షుడు కావడం ఆందోళన చేస్తున్న రెజ్లర్లు ఎంతమాత్రమూ తట్టుకోలేకపోయారు. వాస్తవానికి రెజ్లర్ల ఆందోళన సుదీర్ఘంగా సాగింది. తాము సాధించిన పతకాలను గంగానదిలో కలుపుతామనే వరకూ వెళ్లింది. బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకుంటామని మోడీ సర్కారు హామీ ఇవ్వడంతో ఆందోళనలను తాత్కాలికంగా విరమించారు. కాగా 2021 నుంచి డబ్ల్యుఎఫ్‌ఐ ఎన్నికలు పలు వివాదాల కారణంగా జరగలేదు. మొన్న ఎన్నికైందంటున్న కమిటీ రద్దయింది. కమిటీ రద్దుతోనే లైంగిక వేధింపుల ఆరోపణలు సమసిపోవు. నిందితులు పునీతులూ కారు. డబ్ల్యుఎఫ్‌ఐని సమూలంగా సంస్కరించి పునర్నిర్మించాలి. అసోసియేషన్లకు కీలక పదవుల్లో ఉన్న వారు, తమ స్థానాలను పదిలపర్చుకునేందుకు రాజకీయ నాయకుల ప్రాపకం కోసం వెంపర్లాడి తోటి క్రీడాకారులకు అన్యాయం తలపెట్టే దుశ్చర్యలు చోటు చేసుకోవడం విచారకరం. రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఐఒఎ అధ్యక్షురాలు పి.టి. ఉష, దిగ్గజ అథ్లెట్ల కమిషన్‌ స్పందన ప్రారంభంలో పేలవంగా ఉంది. కమిటీ రద్దుతోనే కేంద్ర ప్రభుత్వ పాత్ర ముగిసిపోలేదు. లైంగిక వేధింపుల ఆరోపణలెదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌, ఇతరులపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే మహిళా క్రీడాకారులకు కాస్తంత భరోసా.

➡️