పార్లమెంటుకే భద్రత కరువు !

Dec 15,2023 07:15 #Editorial

             దేశ అత్యున్నత చట్టసభయైన పార్లమెంటు భద్రతకే పెనుముప్పు కలగడం దారుణం. సరిగ్గా 22 ఏళ్ల క్రితం పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగిన డిసెంబర్‌ 13వ తేదీనే లోక్‌సభ విజిటర్స్‌ గ్యాలరీ నుండి ఇద్దరు ఆగంతకులు సభలోకి దూకి రంగు పొగను వదలి నానా బీభత్సం సృష్టించడం ఎవ్వరూ ఊహించలేనిది. జాతీయత, దేశ భద్రత గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పే బిజెపి పాలనలో పార్లమెంటుకే భద్రత లేదని రుజువైంది. దేశ భవితవ్యానికి సంబంధించిన చట్టాలను, విధానాలను రూపొందించవలసిన పార్లమెంటు సభ్యులు ఆగంతకులను నిర్బంధించడానికి స్వయంగా పూనుకోవలసిరావడం విచారకరం. ఏది ఏమైనా పార్లమెంటు భద్రతా ఏర్పాట్లు చేసే ఢిల్లీ పోలీసు సాక్షాత్తూ కేంద్ర హౌం మంత్రి పర్యవేక్షణలోనే ఉంటుంది కనుక ఇది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే! ప్రపంచంలో అత్యంత భద్రత గల భవనాల్లో భారత కొత్త పార్లమెంటు ఒకటని మన పాలకులు గొప్పలు చెప్పిన చోటనే ఇంతటి భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడాన్ని ఏమనుకోవాలి? ఒకవైపు కోవిడ్‌ మహమ్మారి దేశాన్ని ఆవహించిన సమయంలోనే అతివేగంగా పార్లమెంటు కొత్త భవనాన్ని ఆగమేఘాలపై నిర్మించిన విషయం గమనార్హం.

‘ప్రజాస్వామ్య దేవాలయం’ అని ప్రస్తుతించి పార్లమెంటు భవన సోపానాలను ముద్దాడిన పెద్దమనిషి పాలనలోనే ఆ చట్టసభకు ఇలాంటి దుస్థితి దాపురించింది. భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి బృందాన్ని నియమించారు. ఆగంతకులిద్దరూ కర్ణాటకలోని కొడగు నియోజకవర్గ ఎంపి ప్రతాప్‌ సింహ ద్వారా విజిటర్స్‌ గ్యాలరీకి పాస్‌లు సంపాదించారన్న ప్రాథమిక సమాచారం అధికార పార్టీ వైపే వేలు చూపిస్తోంది. దుండగుల పూర్వాపరాలు, ఘటనకు ముందు, ఆ తరువాత వారు ఎవరి ఆదేశాలు పాటించారు, ఎవరిని సంప్రదించారు, ఎటువంటి సందేశాలు ఎవరికి పంపారు వంటి అంశాలన్నిటినీ పరిశీలించాలి. త్వరితగతిన అన్ని కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు చేసి ఇంతటి తీవ్ర భద్రతా వైఫల్యానికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలి. ఆగంతకులిద్దరు సభలోకి దూకినా మొత్తం ఆరుగురు నిందితులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని సమాచారం. వారిలో నలుగురిని అరెస్టు చేయగా మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆరుగురు దుండగులు పక్కా ప్రణాళికతో పూర్తి సమన్వయంతో ఈ దుస్సాహసానికి ఒడిగట్టారని పోలీసులు వెల్లడించారు. ఒకరికొకరు ఆరేళ్లుగా తెలుసునని, కొద్ది రోజుల క్రితం పథకం పన్నారని పోలీసులు తెలిపారు. ఆరుగురూ పార్లమెంట్‌లోకి ప్రవేశించాలని అనుకున్నారు. కానీ ఇద్దరికి మాత్రమే విజిటర్స్‌ పాస్‌ లభించడంతో లోపలికి వెళ్లారంటున్నారు. సభలోకి దూకిన ఆగంతకులు ‘నియంతృత్వం నశించాలి’, ‘నల్ల చట్టాలు రద్దు చెయ్యాలి’, ‘గణతంత్రాన్ని కాపాడాలి’ అని నినదించారు. ”మాకు ఏ సంఘంతోనూ సంబంధం లేదు. ప్రభుత్వం పౌరులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నందున ఈ చర్యకు పాల్పడ్డాం” అని నిందితులు మీడియాతో అన్నారు. పార్లమెంటుపై ఉగ్ర దాడి జరిగి 22 ఏళ్లు అయిన నేపథ్యంలో బుధవారంనాడు భద్రత ఎంతో కట్టుదిట్టంగా ఉండడం సహజం. అయినా, నాలుగైదు చోట్ల ఒళ్లంతా తడిమి పరీక్షించే పటిష్టమైన భద్రతా వలయాలను దుండగులెలా అధిగమించారన్నది పెద్ద ప్రశ్నగానే ఉంది. ఇందుకు వ్యూహం రూపొందించినవారెవరు? పథకం అమలుకు సహకరించిన వారెవరు? ఎందరు? అసలు వారి లక్ష్యం ఏంటో, ఎందుకిలా చేశారో సంపూర్ణంగా తెలియాలి.

ఇంతటి ఘోర భద్రతా వైఫల్యానికి కారణాలను ప్రాథమికంగానైనా రాజకీయ పార్టీలకు వివరించడం ప్రభుత్వ బాధ్యత. తద్వారా ఈ దేశ ప్రజలకు వాస్తవాలు విదితమవుతాయి. కానీ ఆ పని చేయకుండా పార్లమెంటులో ఇతరేతర అంశాలపై చర్చ సాగించడం ద్వారా భద్రతా వైఫల్యాన్ని చిన్నదిగా చూపించడానికి సర్కారు యత్నిస్తోందని స్పష్టమవుతోంది. దుండగుల ప్రవేశానికి వీలు కల్పించిన కర్ణాటక బిజెపి ఎంపితో సహా బాధ్యులందరిపైనా సమగ్రంగా, వేగంగా దర్యాప్తు చేయాలి. ఈ ఘటన నేపథ్యంలో కొత్త పార్లమెంటు భవనంలో భద్రతాపరమైన అంశాలన్నిటినీ సంపూర్ణంగా సమీక్షించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం అవశ్యం.

➡️