యుద్ధం ఆగితేనే ఉక్రెయిన్‌లో శాంతి

Feb 27,2024 07:15 #Editorial

పశ్చిమ దేశాలు ఈ ప్రాంతంలో ఆధిపత్య భ్రమలను విడనాడి రష్యాను ఆందోళనకు గురిచేస్తున్న అంశాలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటేనే శాంతి లభిస్తుంది. యుద్ధ పిపాసి అమెరికా, దాని మిత్రదేశాలు అందుకు ప్రధాన అడ్డంకిగా వున్నాయి. మితవాద జాత్యహంకార ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లదిమిర్‌ జెలెన్‌స్కీ వారి ఆయుధంగా వున్నాడు.

              రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం శనివారంతో మూడవ సంవత్సరంలోకి ప్రవేశించింది. ఈ యుద్ధం సమీప భవిష్యత్తులో ఆగిపోతుందన్న ఆశ పెట్టుకోలేమని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌ వోల్కర్‌ టర్క్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యర్థులకు భారీ నష్టం వాటిల్లిందని ఇరు వర్గాలు చెబుతున్నాయి. తనకు జరిగిన నష్టాన్ని, తన దేశంలో చోటుచేసుకున్న విధ్వంసాన్ని ఎవరూ వెల్లడించరు. ఇప్పటికే 2,00,000 మంది మరణించారని, వీరిలో చాలా మంది రష్యన్‌ సైనికులు ఉన్నారని పాశ్చాత్య వర్గాలు చెబుతున్నాయి. గత రెండేళ్లలో 14 లక్షలకు పైగా ఉక్రేనియన్లు శరణార్థులుగా మారారని ఐ.రా.స అంచనా వేసింది. జనాభాలో దాదాపు మూడింట ఒక వంతు (65 లక్షల మంది) ఉక్రేనియన్లు ఇప్పటికే 11 తూర్పు యూరోపియన్‌ దేశాలలో శరణార్థులుగా బతుకీడ్చుతున్నారు. ఉక్రెయిన్‌లోని మరిన్ని ప్రాంతాలు రష్యా ఆధీనంలో ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఉక్రేనియన్‌ దళాలు గత వారం తూర్పు పట్టణం అవ్దివ్‌కా నుండి ఉపసంహరించుకోవలసి వచ్చింది. గత మే నెలలో బఖ్‌ముత్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత రష్యా ఇదే అతి పెద్ద విజయంగా భావిస్తోంది.

ఉక్రెయిన్‌లో 2022 ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌లో సైనిక చర్య చేపట్టింది. పశ్చిమ దేశాలు, అమెరికా నేతృత్వంలోని సైనిక కూటమి ‘నాటో’ ఉక్రెయిన్‌కు ఆయుధాలు, డబ్బు ఇచ్చి రష్యాకు వ్యతిరేకంగా ఎగదోయడంతో అది యుద్ధంగా మారింది. మొదటి నుండి, పాశ్చాత్య దేశాలు, వాటి నియంత్రణలో ఉన్న అంతర్జాతీయ మీడియా రష్యాను దురాక్రమణదారుగా చిత్రీకరించడానికి, ఒంటరిని చేయడానికి ప్రయత్నించాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో జరిగిన అతి పెద్ద యుద్ధానికి రష్యాను బాధ్యురాలిని చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. గత ఫిబ్రవరిలో మ్యూనిచ్‌లో జరిగిన భద్రతా సదస్సులో రష్యాకు వ్యతిరేకంగా జరిగే చర్యలకు ప్రపంచ మద్దతు లభించదని వారు విశ్వసించారు. రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ నిర్ణయించాయి. యుద్ధంలో తటస్థంగా ఉన్న చైనాపైనా, యూరోపియన్‌ యూనియన్‌ ఆంక్షల ఆస్త్రాన్ని ప్రయోగించింది. మిలిటరీ టెక్నాలజీని రష్యాకు బదిలీ చేశారన్న ఆరోపణలపై మూడు చైనా కంపెనీలపై ఎగుమతి నిషేధం విధించాలని యూరోపియన్‌ యూనియన్‌ తాజాగా నిర్ణయించింది. మరోవైపు, యునైటెడ్‌ స్టేట్స్‌, ఇతరులు ఉక్రెయిన్‌కు వేల బిలియన్‌ డాలర్ల ఆయుధ సాయం అందిస్తున్నాయి.

యుద్ధం ప్రారంభమై రెండేళ్లుగడిచాయి. జానికి ఉక్రెయిన్‌-రష్యా వివాదం దశాబ్ద కాలంగా కొనసాగుతోంది. ఉక్రెయిన్‌కు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు విక్టర్‌ యనుకోవిచ్‌ పాశ్చాత్య మద్దతుతో జరిగిన తిరుగుబాటులో పదవీచ్యుతుడైనప్పుడు రష్యా-ఉక్రెయిన్‌ సంబంధాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో రిఫరెండం నిర్వహించి క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా తన ఆధీనంలోకి తీసుకుంది. తదనంతరం, రష్యా – ఉక్రెయిన్‌ దేశాలు జర్మనీ-ఫ్రాన్స్‌ మధ్యవర్తిత్వంతో మిన్స్క్‌లో చర్చలు జరిపి రెండు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. అయితే ఉక్రెయిన్‌ ఈ ఒప్పందాలను కూడా ఉల్లంఘించింది. క్రిమియాతో సహా కోల్పోయిన భూభాగాలను తిరిగి పొందేందుకు సైనిక శక్తిని పెంపొందించడానికి ఉక్రెయిన్‌కు సమయం ఇవ్వడానికి ఈ ఒప్పందాలు ఉద్దేశించినట్లు మధ్యవర్తులు తర్వాత వెల్లడించారు. అదనంగా, ‘నాటో’లో ఉక్రెయిన్‌ సభ్యత్వాన్ని అందించడానికి పాశ్చాత్య కూటమి నిరంతర ప్రయత్నాలు రష్యాకు ఆమోదయోగ్యం కాదు. ఈ విధంగా రష్యాను చుట్టుముట్టడానికి ఒక దశాబ్దానికి పైగా అమెరికన్లు కొనసాగించిన రెచ్చగొట్టుడు చర్యలు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి కారణమయ్యాయి.

పశ్చిమ దేశాలు ఈ ప్రాంతంలో ఆధిపత్య భ్రమలను విడనాడి రష్యాను ఆందోళనకు గురిచేస్తున్న అంశాలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటేనే శాంతి లభిస్తుంది. యుద్ధ పిపాసి అమెరికా, దాని మిత్రదేశాలు అందుకు ప్రధాన అడ్డంకిగా వున్నాయి. మితవాద జాత్యహంకార ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లదిమిర్‌ జెలెన్‌స్కీ వారి ఆయుధంగా వున్నాడు. ఉక్రెయిన్‌లో పాశ్చాత్య ఎత్తుగడలను ప్రపంచం అర్థం చేసుకున్నందున ఇక్కడ వారి ఆటలు సాగడంలేదు.

/ ‘దేశాభిమాని’ సంపాదకీయం /

➡️