ప్రాణాలు తీసేవాడిని ప్రజలు క్షమించరు

May 24,2024 04:45 #editpage

ప్రజలు వాస్తవమైన ఆనందం ఏమిటో గ్రహించిన రోజున, ఆ ఆనందాన్ని పొందడం సాధ్యమేనని తెలుసుకున్న రోజున, మతం అదృశ్యమౌతుంది- అయితే, పాలకవర్గాలు తమ ప్రయోజనాల రీత్యా- ప్రజలు అసలు విషయం తెలుసుకోకుండా అడ్డుపడుతుంటారు. తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి మతాన్ని ఉపయోగించుకుంటారు.
– ఆగస్ట్‌ బెబెల్‌,
రచయిత, వక్త, జర్మన్‌ సోషలిస్ట్‌ రాజకీయవేత్త.
తెలివిగలవాడికైతే వాడి మెదడు పని చేస్తుంది. తెలివి లేనివాడికైతే వాడి నాలుక పని చేస్తుంది-అనే మాట ఉంది. తెలివిగల నాయకుడే కదా సకారాత్మకమైన నిర్ణయాలు తీసుకుని, ఒకవైపు ప్రజా సంక్షేమం మీద, మరో వైపు అభివృద్ధి మీద దృష్టి పెడతాడూ? అవి చేయలేని నాయకుడు మన్‌కీ బాత్‌ పేరిట నాలుకను తెగ ఉపయోగిస్తాడు. కోతల పురాణం వినిపిస్తాడు. అది పదేళ్ల పాటు విన్న ఈ దేశ ప్రజలు తమకు రవ్వంతైనా లాభం చేకూరిందా?-అని ఆలోచనలో పడ్డారు!
ఒక సంప్రదాయవాదుల ఇంట్లో నామకరణ మహోత్సవం జరుగుతూ ఉంది. పురోహితుడు పిల్లవాడికి ‘నరేంద్ర’ అనే పేరు పెట్టమని సూచించాడు. పక్కన ఓ మూల కూర్చున్న పిల్లవాడి నానమ్మకు దు:ఖం ఆగలేదు. బోరున ఏడ్చింది. ”ఏంటమ్మా? ఏమైందీ?”-అని అందరూ ఆత్రంగా అడిగారు. ”నా మనవడు ఇక ఎప్పుడూ నిజం మాట్లాడలేడు కదా? అని ఏడుపొచ్చింది!”-అని చెప్పింది. పురోహితుడు తల వంచుకున్నాడు. బంధువులంతా పగలబడి నవ్వారు.
ఒక బఫూన్‌ (హాస్యగాడు) రాజమందిరంలోకి ప్రవేశించినంత మాత్రాన అతను రాజు కాలేడు. కానీ, రాజ మందిరమే సర్కస్‌ అవుతుంది-అనేది ఒక టర్కిష్‌ సామెత. ఇది మన దేశంలో ఎవరికి వర్తిస్తుందో ఈ దేశ ప్రజలకు తెలుసు. చిత్ర విచిత్ర వేషధారణలతో జనాన్ని ఆకర్షించాలనుకునే వాడు-ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీనే! ఆయన పరిపాలన మీద దృష్టి పెట్టలేదు. ఎలా పెట్టగలడూ? నిజాయితీ, నిబద్దతా లేని వాడు కదా? ఆయన కాలంలో విదేశాల్లో దేశానికి ఉన్న పరువు పోయింది. దేశంలో కరువు పెరిగింది. ధర్మ వ్యాధిగ్రస్తుడయిన అధర్మ పాలకుడుగా ఆయన చరిత్రలో మిగిలిపోయాడు. పెద్ద నోట్ల రద్దు కాలంలో ఒక పెద్దాయన ఇలా అన్నాడు. ‘మాటిమాటికీ నోట్లు మార్చుకునే బదులు, ఒక్కసారే ప్రభుత్వాన్ని మార్చుకోవడం మేలు’ అని! ఈ దేశ ప్రజలు ఎప్పటినుండో అనుకుంటున్నారు. ఇక ఇప్పుడు మార్చుకునే సమయం రానే వచ్చింది.
కాంగ్రెస్‌ పాలనలో ప్రధాని ఒక రూపాయి విడుదల చేస్తే లబ్ధిదారులకు పదిహేను పైసలే అందుతు న్నాయని-ఒక విమర్శ ఉండేది. నిజమే కావచ్చు. కానీ, ఇప్పుడు ఈ బిజెపి ప్రధాని ప్రజల నుండి పదిహేను రూపాయలు లాగుతూ లబ్ధిదారులను ఒట్టి చేతులే చూపుతున్నాడు. కదా? ఆయన ‘భాయియో..’ అని మెత్తగా సంభోదించాడంటే, ‘రండిరా రండి మీ గొంతులు కోయడానికే నేనొచ్చానన్నంత’-ప్రేమ వొలికిపోతుంది కదా? ఇటీవల ఈ దేశ ప్రధాని తాను విలేకరుల సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేయడో దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో బట్టబయలు చేశాడు. సోషల్‌ మీడియాలో అబద్దపు వార్తలు ప్రచారమవుతున్నాయనీ, అందుకని తాను ప్రెస్‌ మీట్లు పెట్టడం లేదని సెలవిచ్చారు. వంద ఎలుకల్ని మింగిన పిల్లి సత్య వచనాలు ప్రవచించినట్టుగా ఉందా వివరణ. పైగా ఆయన ఈ దేశ ప్రజల్ని కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. తప్పుడు వార్తల్ని నమ్మొద్దన్నాడు. బాగానే ఉంది కానీ, నాలుగు వేల ఐటి ఉద్యోగులతో ఐటీసెల్‌ ఏర్పాటు చేసి తప్పుడు వార్తలు, మార్ఫింగ్‌ చేసిన ఫొటోలు రోజూ వేలకు వేలు దేశ వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న పార్టీ ఏది తండ్రీ? ముందా విషయం చెప్పు అని అడిగేవాడు లేకనే కదా? ఇలాంటి పనికి మాలిన వివరణలూ? సరే, ఆ విషయం అలా ఉండనివ్వడి. ”బిజెపి- ఆవు- రాముడు-మధుర-కాశీ-కబ్రస్థాన్‌-పాకిస్థాన్‌-శ్మశాన్‌-తాలిబన్‌ల మీద ఆధారపడి ఇంకా ఎంతకాలం ఎలక్షన్లు గెలుస్తుందీ? అసలు ఎప్పటికైనా తమ స్వంత బలం మీద గెలుస్తుందా?”- అని ప్రశ్నించాడు ప్రసిద్ధ జర్నలిస్ట్‌ అశోక్‌ వాంఖ్‌డే.
భారత సైన్యంలో మూడు వేల అగ్నివీర్‌లను నియుక్తం చేయడానికి అప్లికేషన్లు ఆహ్వానిస్తే తొమ్మిది లక్షల యాబై అయిదు వేల నిరుద్యోగులు అప్లికేషన్‌ పెట్టుకున్నారు. దేశం ఎంత ప్రమాదకర స్థితిలో ఉందో ఎంత దయనీయమైన స్థితిలో ఉందో చెప్పుకోవాలంటే మన ముందు ఇలాంటి ఎన్నో సంఘటనలున్నాయి. ఇలాంటి విషయాలేవీ పట్టించుకోకుండా. ”మనమంతా కలిసి అమృత్‌ మహోత్సవంలో పాల్గొందాం!” అని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే బిజెపి ప్రభుత్వ పెద్దలకు, బాధ్యులకు కళ్లు మూసుకుపోయాయా? దేశ పరిస్థితులేవీ కనిపించడం లేదా? అని ఈ దేశ ప్రజలు ఆందోళన పడుతున్నారు.
”జ్ఞానవంతుడు తన శత్రువులను ప్రేమించడమే కాకుండా తన స్నేహితులను ద్వేషించనూ గలడు” అన్నాడు జర్మన్‌ తత్వవేత్త ఫ్రెడరిక్‌ నీషే. ఆ మాట అర్థం చేసుకోగలిగే స్థాయి ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి లకు ఎక్కడుందీ? ప్రశ్నించిన వారిని జైల్లో తోయడమో లేక చంపేయడమో చేస్తున్న మోడీ ప్రభుత్వానికి అంతకన్నా లేదు. పదేళ్లుగా చూస్తూనే ఉన్నాం కదా? ”మనిషి అత్యంత క్రూర జంతువు’ – అని కూడా అన్నాడు మరో సందర్భంలో ఫ్రెడరిక్‌ నీషే. గుజరాత్‌, మణిపూర్‌ మారణకాండలు జరిపించిన మోడీ-షాల గురించే చెప్పాడా నీషే? కాదు. ఆయనెప్పుడో ఒక యూనివర్సల్‌ ట్రూత్‌ చెప్పాడు. ఇక్కడ మన దేశ నాయకులు దాన్ని నిజం చేసి చూపారు. ఇటీవల ఒక లోక్‌సభ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ దేశ ప్రధాని ఇలా అన్నారు. ”కాంగ్రెస్‌ గనక అధికారంలోకి వస్తే అయోధ్య రామాలయంపైకి బుల్డోజర్లు పంపి కూలగొడతా-అని! గతంలో ఆలయాలను కూల్చిన రికార్డు ఆ పార్టీకి లేదు. కానీ, ఉత్తరప్రదేశ్‌లో పేద ముస్లింల ఇళ్ల పైకి బుల్డోజర్లు పంపిన గొప్ప సంప్రదాయం బిజెపి-యోగి ప్రభుత్వానికి ఉందని ఈ దేశ ప్రజలకు తెలియదా? ప్రజల చెవుల్లో బిజెపి వారు కమలం పూలు ఏనాటికీ పెట్టలేరు. వాళ్లు పెడతామన్నా ప్రజలు పెట్టించుకోరు. ముస్లిం మహిళలు చేపట్టిన షహీన్‌బాగ్‌ ఉద్యమం తక్కువదా? ఒక్కసారి గుర్తు చేసుకోండి! వంట చేసి టిఫిన్‌ బాక్స్‌లు పెట్టి పిల్లల్ని స్కూలుకు పంపే మహిళలు, భర్తల్ని ఆఫీసులకు పంపే మహిళలు, రాజకీయాలు అంతగా తెలియని మహిళలు రోడ్డెక్కి షహీన్‌బాగ్‌లై విస్తరించారు. నిరసన గళాల్ని బలంగా వినిపించారు. నియంతలమని అనుకున్న వాళ్లంతా ఊడిపోయే ‘ఖాకీ నిక్కర్లు’ పట్టుకుని పరుగులు తీశారుకదా?
అది అలా ఉండనిచ్చి, రైతుల నల్ల చట్టాల్ని ఈ దేశంలో రైతులు ఎలా తిప్పికొట్టారో చూశాం. వృద్ధులు, యువకులు పొలం పనులు మానుకుని, నిద్రాహారాలు మానుకుని నిరసన నినాదాలు చేస్తే-అవి ఢిల్లీ దాకానే కాదు. ప్రపంచ దేశాలన్నిటికీ వినిపించాయి. బిజెపి ప్రభుత్వం తోక ముడిచి నల్లచట్టాల్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. దేశానికి తిండి పెట్టే రైతుల మీద మోడీ ప్రభుత్వం బుల్లెట్లు కురిపిస్తుందా? వారి దారిలో మేకులు కొట్టిస్తుందా? ఏడు వందల మంది రైతుల ప్రాణాలు తీసిన మోడీ ప్రభుత్వాన్ని ఈ దేశ ప్రజలు ఇప్పుడే కాదు, ఇక ఎప్పటికీ క్షమించరు. గుజరాత్‌, మణిపూర్‌ మారణకాండలు జరిపించిన మోడీ-షాలు తమ గొయ్యి తామే తవ్వుకున్నారు. మనుషులుగా కూడా మిగిలి లేరు. అయినా, జడ్జిని చంపించిన వాడిని దేశ హోంమంత్రిగా చేసుకోవడమా? ఎంత అమానవీయం? ఎంత అమానుషం? రచయితల్ని, ఆలోచనాపరుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని చంపించి, లేదా జైళ్లలోకి తోయించి రాజ్యమేలుతామనుకుంటే ఎలా? ప్రశ్నను ఎవడూ అణిచివేయలేడని తెలుసుకోలేని బుద్దిహీనులు అహంకారంతో ప్రవర్తిస్తే ఏమవుతుందీ? ఆలస్యం అవుతుందేమోగానీ, చివరికి మట్టి కరవాల్సిందే. తప్పదు!

డా|| దేవరాజు మహారాజు

(వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త – మెల్బోర్న్‌ నుంచి)

➡️