నిర్బంధంతో ప్రజా ఉద్యమాలను అణచలేరు

Jan 9,2024 07:15 #Editorial
  • సంఘీభావంగా ‘జైల్‌ భరో’ నేడే

అంగన్‌వాడీ కార్మికుల కడుపులు మాడ్చితే కాళ్ల దగ్గరకు వస్తారని జగన్‌ ప్రభుత్వం భ్రమించవచ్చు. కాని అంగన్‌వాడీలు ఎన్ని రోజులైనా పోరాడి విజయం సాధించి సగర్వంగా తలెత్తుకుని మాత్రమే పనిలోకి వెళతారు. దీనికి సంఘీభావంగా రాష్ట్రంలో ఉన్న కార్మికులంతా జనవరి 9న జైల్‌ భరోను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలన్నీ పిలుపునిచ్చాయి. జైల్‌ భరోను జయప్రదం చేయాలని యావత్‌ కార్మికవర్గాన్ని కోరుతున్నాం.

             రాష్ట్రవ్యాప్తంగా లక్షా ఐదు వేల మంది అంగన్‌వాడీలు 28 రోజుల నుంచి నిరవధిక సమ్మె సాగిస్తున్నారు. ఈ సమ్మెను ఉక్కుపాదంతో అణచాలని రాష్ట్ర ప్రభుత్వం ఎస్మాను కూడా ప్రయోగించింది. అంగన్‌వాడీ సెంటర్లు తెరుస్తాం. తాళాలు పగలగొడతాం. ఉద్యోగాల నుంచి తొలగిస్తాం. ఎస్మాను ఉపయోగించి వారెంట్‌ లేకుండా అరెస్టులు చేసి మూడు నెలలు జైల్లో ఉంచుతామని రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపుల పర్వానికి దిగింది. మరో వైపున జీతాలు రూపాయి కూడా పెంచం. గ్రాట్యూటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా వినం అని రాష్ట్ర ప్రభుత్వం మొండి వాదనలను చేస్తున్నది. కొవ్వెక్కి సమ్మె చేస్తున్నారని పాలకపక్ష ఎమ్మెల్యేలు కొందరు నోరు పారేసుకుంటున్నారు. జనవరి 3న కలెక్టర్‌ ఆఫీసుల వద్ద బైఠాయింపు సందర్భంగా విజయవాడలో 1200 మంది అంగన్‌వాడీలను అక్రమంగా అరెస్టులు చేసి మహిళా నాయకులపై తీవ్ర నిర్బంధం ప్రయోగించారు. అత్యధిక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఒంటరి మహిళలైన అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వ క్రూరత్వం నగంగా కన్పిస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించి అంగన్‌వాడీ సమ్మెను నిషేధించడమంటే ప్రజాతంత్ర హక్కులపై దాడి చేయడమే. రాష్ట్ర ప్రభుత్వం యావత్తు కార్మికవర్గాన్ని రెచ్చగొట్టే చర్య ఇది. విద్యుత్‌, ఆర్టీసీ లాంటి అత్యవసర రంగాలపై విధించే ఎస్మాను అన్ని రంగాలకు విస్తరించేందుకు మార్గమే అంగన్‌వాడీలపై ప్రయోగం. ఎస్మా అమలు ఉండగానే విద్యుత్తు, ఆర్టీసీలలో అనేక సార్లు సమ్మెలు సాగాయి. ఎస్మా ప్రయోగిస్తే సమ్మెలు జరగవని ప్రభుత్వం భ్రమపడవచ్చు. ఇప్పుడు అంగన్‌వాడీలు గానీ, గతంలో అనేక రంగాల్లో గాని సమ్మెలు కొనసాగాయి. అసలు సమస్యలు పరిష్కరించకుంటే ఎస్మా లాంటి నిర్బంధ బ్రహ్మస్త్రాలు ప్రయోగించినా కార్మికవర్గం అదరదు, బెదరదు అని పాలకులు గుర్తించాలి.

సమ్మె కార్మికుల ప్రాథమిక హక్కు. సమ్మెలు జరగడమంటేనే పాలకుల వైఫల్యాలకు తార్కాణం. కార్మికవర్గం ఊరికే సమ్మెలకు సిద్ధం కాదు. సమ్మెల్లో ఉండే కష్టాలు కార్మికులకు తెలుసు. పట్టుదలగా జరుగుతున్న అంగన్‌వాడీ సమ్మెను విఫలం చేసేందుకు పాలకులు పోటీ కార్మికులను ఉపయోగించడం చట్ట వ్యతిరేకం. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చేయడం కంటే సమ్మెను విఫలం చేయాలని పాలకులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పిల్లలను అంగన్‌వాడీలకు తేవాలనే ప్రభుత్వ ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయి. ‘మా టీచరు, ఆయా లేకుండా మేం అంగన్‌వాడీ స్కూలుకు రాం’ అని పిల్లలు, వారి తల్లిదండ్రులు తెగేసి చెప్పారు. అంగన్‌వాడీ పిల్లలను స్కూలుకు తెచ్చి, వారికి అన్నం వండించి పెట్టాలని ప్రభుత్వ టీచర్లపై ఒత్తిడి చేశారు. అంగన్‌వాడీలు లేకుండా పాలకులు ఎక్కడా ఒక్క పిల్లవాడిని కూడా సెంటరుకు తేలేకపోయారు. ఫ్యాప్టో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు ప్రత్యేకంగా యు.టి.ఎఫ్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. మధ్యాహ్న భోజన కార్మికులు, వి.ఆర్‌.ఏ, ఐ.కె.పి సంఘాలన్నీ అంగన్‌వాడీల వెనుక నిలబడ్డాయి. కార్మిక ఐక్యత అంటే ఇదే. సమ్మె చేస్తే కార్మికులను తొలగిస్తామని చరిత్రలో కార్మికులను బెదిరించిన వారంతా కాల గర్భంలో కలిసిపోయారు. ఇది చట్ట వ్యతిరేకం. అంగన్‌వాడీలు జీతాలు పెంచమంటే కార్మికులపై పాలకులు కక్ష కడతారా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ చార్జీలు, రవాణా చార్జీలు, బియ్యం, పప్పులు, నూనెలు ఒక్కటేమిటి అన్ని ధరలు ఎందుకు పెంచారు? పెరిగిన ధరలు కరువు భత్యం కూడా చెల్లించరా? పక్క రాష్ట్రం కంటే వెయ్యి రూపాయలు నెలకు అదనంగా చెల్లిస్తానన్న సి.యం వాగ్ధానం ఎందుకు అమలు చేయరు? ఎన్నికల ముందు చేసిన వాగ్ధానం ఎన్నికల తర్వాత ”…ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న” చందంగా మారింది.

పాలకులు కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరుతో వారికి ఊడిగం చేస్తున్నారు. ఆ భారాలు కార్మికులు, ప్రజలపై వేస్తున్నారు. మన రాష్ట్రంలో ఫార్మా, ఆక్వా, సిమెంట్‌ కంపెనీల లాభాల్లో 5 శాతం పన్ను వేస్తే రాష్ట్రంలో కార్మికులందరికీ వేల రూపాయల జీతాలు పెంచవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికులపై ఏమాత్రం అభిమానం ఉన్నా ఆ చర్యలు చేపట్టాలి. పాలకులు కార్పొరేట్ల భజన చేస్తున్నంత కాలం కార్మికవర్గం పాలకులపై పోరాడక తప్పదు. అంగన్‌వాడీ కార్మికుల కడుపులు మాడ్చితే కాళ్ల దగ్గరకు వస్తారని జగన్‌ ప్రభుత్వం భ్రమించవచ్చు. కాని అంగన్‌వాడీలు ఎన్ని రోజులైనా పోరాడి విజయం సాధించి సగర్వంగా తలెత్తుకుని మాత్రమే పనిలోకి వెళతారు. దీనికి సంఘీభావంగా రాష్ట్రంలో ఉన్న కార్మికులందరూ జనవరి 9న జైల్‌ భరోను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలన్నీ పిలుపునిచ్చాయి. జైల్‌ భరోను జయప్రదం చేయాలని యావత్‌ కార్మికవర్గాన్ని కోరుతున్నాం.

( వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ) సిహెచ్‌. నర్సింగరావు
( వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ) సిహెచ్‌. నర్సింగరావు
➡️