వ్యాధుల కాలం…

Jul 2,2024 05:20 #Articles, #edit page

ఆరోగ్యం బాగా క్షీణిస్తోంది యాద్‌గిరి.
ఏమైంది బాగానే కనిపిస్తున్నావు కదా నర్సింగ్‌.
నా ఆరోగ్యం గురించి కాదు యాద్‌గిరీ…
మరి….
ప్రజల ఆరోగ్యం..
అంతే కదా, ఇప్పుడు సీజన్‌ మారింది. దోమలు పెరుగుతాయి. మలేరియాలు అవీ వస్తాయి. ఇది వ్యాధుల కాలం నర్సింగన్నా.
మనమేమీ చేయలేమా
ఎందుకు చేయలేము? ఎక్కడికక్కడ ప్రజల్ని జాగ్రత్తగా ఉండమని, దోమలు ఎక్కువ కాకుండా చూసుకొమ్మని సైన్సును ప్రచారం చేసే సంస్థలు చెప్తున్నాయి కదా. అందులో కలిస్తే సరి.
అంతేనా
అంతేగాక…. ఎవరో వస్తారని చూడొద్దు బ్రో. మనమూ కలుద్దాం వాళ్లతో.
పద మరి.
రరర
నర్సింగన్న చెప్పినట్టే ఇది వ్యాధుల కాలం. ముఖ్యంగా అంటువ్యాధుల కాలం. వర్షాలు పడి, కాలువల్లో, గుంతల్లో దోమలు పెరిగి, ఎక్కడెక్కడున్న కాలుష్యమంతా నీళ్లలో కొట్టుకొచ్చి, అవి మంచి నీటిలో కలిసి, వైరల్‌ జ్వరాలు, మలేరియాలు, వాంతులు, విరేచనాలు ఇలా ఒకటేమిటి అన్నీ మనిషిని ఒక్కసారిగా చుట్టు ముట్టే కాలం. ఇప్పుడొచ్చేవే కాక ఈ పాటికే ఉన్న వ్యాధులు అలాగే ఉంటాయి. వాటితో పోరాడుతూనే కొత్తవాటినీ పారదోలే క్రమంలో ఉండాలి మనమంతా. ఇలా ప్రజల్ని పట్టి పీడిస్తున్న రోగాలేమిటో ఒక్కసారి తెలుసుకుందామన్న ప్రయత్నంలో చాలా చాలా వ్యాధులు బయటపడ్డాయి మనసులోంచి. అవన్నీ జాగ్రత్తగా చూద్దాం. సమాజంలో ప్రజల మనసులను అనారోగ్యం పాలు చేసి వాళ్లను కులాలు, మతాల పేరు మీద విడగొట్టి సామాజిక వర్గం అన్న ఆరోగ్యకరంగా కనిపించే పేర్లు పెట్టి మరీ అనారోగ్యాన్ని మనసుల్లోకి పంపుతున్నారు. అలా విడగొట్టి ఏకం చేసినవాళ్లతో ఓట్లు వేయించుకొని తమ ఆరోగ్యాలు బాగా చూసుకుంటున్నారు రాజకీయ నేతలు. ఇక చదువులు, చరిత్ర, సంస్కృతికి చెందినవాటిలో కూడా వైరసు ప్రవహిస్తోంది. వాటిని మార్చి విద్యార్థుల పాఠ్యాంశాల్లో పెట్టి…మన చరిత్ర ఇది కాదు అది అని…మెల్లమెల్లగా ఆ వైరస్‌ను ఎక్కించాలని చూస్తున్నారు. వేమన చెప్పినట్టు వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును, చీడ పురుగు చేరి చెట్టు జెరచు, కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా అన్నట్లు వేరుపురుగులు, చీడపురుగులు విజృంభిస్తున్న కాలమిది. అందరం జాగ్రత్తగా ఉండాలి.
మనుషులుగా మనం రోజూ సమాజంలో తిరుగుతూ ఉంటాము. ఎందరినో కలు స్తుంటాము. వాళ్లలో మిత్రులు, బంధువులు, తెలిసినోళ్లు, సాటి ఉద్యోగులు, టీచర్లు, సాటి మనుషులకు వైద్యం చేసే డాక్టర్లు, రోడ్లు, బ్రిడ్జీలు వేసే ఇంజనీర్లు, వాళ్ల చేతి కింద కూలీలు, బస్సు డ్రైవరన్నలు, కండక్టర్లు, వ్యాపారం చేసుకునే వాళ్ల్లు, సినిమా హాళ్లలో పనిచేవాళ్లు ఇలా రకరకాలుగా సేవలు చేసేవాళ్లు ఉన్నారు. మొన్ననే ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రుల్లో గదులు సరిగా లేవని, బాత్‌ రూములు, టాయిలెట్లు సరిగా లేవని, పై కప్పు పేషెంట్లపై పడేలా ఉందని, ఒక్కో మంచంపై నలుగురు రోగులు పడుకోవడంతో ఒకరి రోగాలు ఒకరికొస్తున్నాయని, వీళ్లందరికీ సేవలు చేసే జూనియర్‌ డాక్టర్లు తమ సమస్యను కూడా తీసుకొని సమ్మె చేసి కొన్ని సాధించుకున్నారు. చెప్పకుండానే చూసుకోవలసిన ప్రభుత్వాలు ఎంత అనారోగ్యంతో ఉంటే ఇంత అలసత్వంగా ఉంటాయి చెప్పండి.
నిజంగా మనిషి ఆరోగ్యం బాగాలేకపోతే అన్నీ ఉన్నా లేనట్టే అని మనకు రోజూ శుభోదయం సందేశాల్లో వస్తూ ఉంటాయి. మనిషి మొదట తన ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం చూసుకుంటాడు. అది కామన్‌. కొందరు ప్రజల ఆరోగ్యం కూడా చూసుకుంటారు. అది అసాధారణం, వారి గురించి తెలియని వారికి. తెలిసినోళ్లకు ఆశ్చర్యమేమీ లేదు. ఈ మధ్య బొర్రా గోవర్ధన్‌ పుస్తకమొకటి చదుతుంటే అందులో రాశారు. మెదడువాపు వ్యాధి పంది వల్ల వస్తుంది, అందుకే పందులను చంపేయండి అనే మేధావులున్నారు. కానీ…పంది, గుర్రం, పశువులు ఇలా అన్నింటిలోకీ దోమలు వైరసు గుడ్లను పెట్టి పొదిగిస్తాయి. మళ్లీ వాటి నుండి మనుషుల్లోకి వైరసు ఎక్కించి, తమ నోట్లోని లాలాజలంలో పెట్టుకొని వ్యాపించేలా చేస్తాయి దోమలు. మొత్తం మీద రకరకాల జంతువులను కుట్టినా ముఖ్య కారణం దోమ వల్లే ఆ వైరసు వ్యాపిస్తుంది తప్ప ఆ జంతువులు సీదాగా వచ్చి మనుషులకు వ్యాధి తెప్పించవు. అందుకే దోమల్ని నివారించడం ముఖ్యం. అప్పుడు అందరి మెదళ్ల ఆరోగ్యం బాగుంటుంది. రోగమెలా వస్తుందో, దానికి సరైన కారణమేమిటో కనుక్కోవడం ఇక్కడ ముఖ్యం.
అలా రకరకాల చోట్ల పని చేస్తున్న వాళ్లు తమ సమస్యలతో పోరాడుతున్నారు. వాళ్లందరూ కులం, మతం అని చూసుకోవడం లేదు. అంతా ఒక వర్గం అనుకొని పోరాడుతున్నారు. అందుకే వాళ్లంతా కలిసి వాళ్లు పని చేసే చోట ఉన్న రోగాల్ని వాళ్లే నయం చేసువాలనుకుంటున్నారు. అక్కడ వాళ్ల కులం, మతం ఏదైనా…డాక్టర్లు, ఇంజనీర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, కూలీలు, టీచర్లు, మునిసిపాలిటీ ఉద్యోగులు ఇలా అందరూ ఒక్కటే. అది అసలైన వర్గం, వాళ్లు అంతా కలిసి సమ్మె చేస్తున్నది అసలైన మార్గం. ఏ రోగాలూ వాళ్ల మెదళ్లలో ప్రవేశించవు అలాంటి సమయాల్లో. తరువాత కూడా వాటి నుండి జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే నిజమైన ఆరోగ్యం. కాకపోతే కొత్త కొత్త రోగాలొస్తుంటాయి. ఇంకా కొత్త కొత్త మందుల్ని మనం కనిపెడుతూ ఉండాలి. ఇది ముందే వ్యాధుల కాలం మరి.

– రచయిత జంధ్యాల రఘుబాబు.. సెల్‌ : 9849753298 

➡️