హిందూత్వతో సామాజిక న్యాయం సాధ్యం కాదు

Apr 3,2024 05:15 #editpage

ప్రధాని నరేంద్ర మోడీ, ‘సనాతన ధర్మానికి’ తన మద్దతును బహిరంగంగా ప్రకటించినప్పుడే అసలు గుట్టు బయట పడింది. సామాజిక న్యాయాన్ని, సమానత్వ భావనను ‘సనాతన ధర్మం’ తిరస్కరిస్తుందని ఉదయనిధి స్టాలిన్‌ గతేడాది సెప్టెంబరులో చాలా పదునైన, విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసినప్పుడు, మోడీ ఆ సనాతన ధర్మాన్ని గట్టిగా సమర్థించారు. ‘సనాతన ధర్మ’ వినాశనమే లక్ష్యంగా ఓ రహస్య ఎజెండా నడుస్తోందంటూ తమ వ్యతిరేకులను తీవ్రంగా నిందించారు. సనాతన ధర్మ’ విరోధులపై ఎదురుదాడి చేయడానికి హిందూత్వ ప్రచారదళంలో భాగస్వాములయ్యేలా మంత్రుల్ని, తన పార్టీ సభ్యుల్ని సైతం పురిగొల్పారు. ఒకవైపు సామాజిక న్యాయం కోసం, దళితుల గౌరవ ప్రతిష్టల కోసం తాను కట్టుబడి వున్నట్టు పదే పదే మోడీ చేస్తున్న ప్రకటనలు బూటకమని, అంబేద్కర్‌పై ఆయన కురిపిస్తున్న ప్రశంసలు, సంత్‌ రవిదాస్‌ విగ్రహం పట్ల ఆయన చూపిస్తున్న భక్తి యావత్తూ ఒట్టి డొల్ల మాత్రమేనని మోడీ తాజా ప్రకటన తేటతెల్లం చేస్తోంది.
”భారత దేశాన్ని వేల సంవత్సరాల పాటు ఐక్యంగా ఉంచిన ఆలోచనలు, విలువలు, సాంప్రదాయాలు అన్నీ కలిసి ‘సనాతన ధర్మం’గా ఉన్నట్టు మోడీ ప్రకటించారు. అయితే ‘ప్రాచీన’, ‘శాశ్వత’, ‘సార్వత్రిక సత్యాలు లేదా ధర్మాలు’ లాంటి అస్పష్టమైన పదాలను తప్ప, ‘సనాతన ధర్మం’ చెప్పే ఆలోచనలు, విలువలు, సాంప్రదాయాలు ఏమిటి అన్న సంగతిని మోడీగానీ, ఎదుటివారిని తిట్టిపోయడమే పనిగా పెట్టుకున్న అతగాడి అనుచర దళంగాని వివరించలేదు. ‘సనాతన ధర్మం’ యొక్క మౌలికమైన, ప్రత్యేకమైన ‘వర్ణ లేదా కుల వ్యవస్థ’ లక్షణాన్ని మరుగుపరచడం కోసమే ఏ వివరణా ఇవ్వలేదు.
అన్ని హంగులూ కలిగివున్న అతగాడి సేనానులు తమ మాటల గారడీతో సనాతన ధర్మానికి కొమ్ము కాయడానికి తయారయ్యారు. లోకజ్ఞానం, మానవ విలువలు, వ్యక్తిగత విధులు, బాధ్యతలు, ప్రవర్తనా ప్రమాణాలు, నైతిక విలువలు లాంటి మాటల ముసుగులో దాని అసలు సారాంశాన్ని కప్పిపుచ్చుతున్నారు. ‘సనాతన ధర్మం’ యొక్క నిజ స్వభావాన్ని దాచిపెట్టడానికి దాని చుట్టూ కళ్లకు పొరలు కమ్మేలా మాయావాదాన్ని అల్లుతున్నారు. దీనిని సద్గురు వాసుదేవ్‌ లాంటి ప్రముఖులిచ్చిన వివరణల్లో మనం చూడవచ్చు. ”ఈ సనాతన ధర్మం అనే ప్రక్రియ నీలో ప్రశ్నలు రేకెత్తించడం కోసమే ఉంది. ఆ ప్రశ్నల లోతుల్లోకి పోయి దీనంతటికీ మూలం ఏమిటో నువ్వే సహజంగా తెలుసుకుంటావు”. ఇలాంటి మరొక గురువు ‘సనాతన ధర్మం’ ”అందర్నీ ప్రేమించి, అందర్నీ కలుపుకొని పోతుందని” వ్యాఖ్యానించాడు. ఒకవేళ మనం ఈ వాదనలను ‘సనాతన ధర్మం’ యొక్క సారంగా అంగీకరించినా, ఇలాంటి శాశ్వతమైన సత్యాలే మనకు అన్ని మతాల్లో నూ కనిపిస్తాయి. కాని, అమానవీయ కుల, లింగ వివక్షతను ఎదుర్కొంటున్న దళితులు, ఇతర బలహీన కులాల వారి దైనందిన జీవితానుభవాల నుండి తలెత్తే ప్రశ్నలకు ఇటాంటి వాదనలు ఏ సమాధానాన్నీ ఇవ్వగల పరిస్థితి లేదు.
ఇంతకూ సనాతన ధర్యం ప్రత్యేకత ఏమిటి? ఏ మాత్రమూ సమర్థించుకోలేని స్థితిలో ఉన్న హిందూత్వ తత్వవేత్తలు తప్పించుకోవడానికి ఇచ్చే వివరణలు, వ్యక్తం చేసే ధర్మాగ్రహం మాట ఎలా వుందన్నదానితో నిమిత్తం లేకుండా వారు సనాతన ధర్మంలో ఉన్న శాశ్వతమైన సత్యాన్ని కప్పిపుచ్చలేరు. కఠినమైన, అమానవీయ, వారసత్వ, పుట్టుక ఆధారిత, నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను దాచి ఉంచలేరు. అత్యంత నిరంకుశమైన, హానికరమైన ‘వర్ణాశ్రమ ధర్మం’ లేక ‘కుల ధర్మం’ కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశమంతా విస్తరించివున్న ఏకైక ముఖ్యమైన ఆలోచన, విలువ, సాంప్రదాయం అనే వాస్తవాన్ని వారు విస్మరిస్తున్నట్టు భావించాలి. కాబట్టి మోడీ, సంఫ్‌ు పరివార్‌ ప్రత్యేకమైన బుద్ధి మాంద్యంతో బాధపడుతున్నట్లు భావించాలి. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మ సూత్రాలు, గఅహ్య సూత్రాలు (గృహస్థులు ఆచరించాల్సిన ధర్మాలు, సంస్కారాలు), పురాణాలు, భగవద్గీత అన్నీ వర్ణ లేదా కుల వ్యవస్థను సమర్థిస్తాయి. ఈ వాస్తవాన్ని వారు నిరాకరించగలరా? వర్ణ ధర్మం నుండి పక్కకు మళ్ళుతున్నందుకు కఠినమైన శిక్షను విధించడమే కాక, వర్ణ ధర్మ పరిరక్షణ పాలకుల ప్రాథమికమైన బాధ్యత అని చెప్పే మనుస్మృతిని మనం పట్టించుకోకూడదని వారు కోరుకుంటున్నారా?
ఒకవేళ ‘కుల వ్యవస్థ వేరు, సనాతన ధర్మం వేరు’ అని కుల వ్యవస్థను బలపరిచే వాదనలతో విడగొట్టు కోవాలనుకుంటే, మోడీ ఆ విషయాన్ని ముందు స్పష్టం చేయాలి. ఆ తర్వాతనే తన వ్యతిరేకుల మీద విమర్శలకు పూనుకోవాలి.
అది అతనికి కచ్చితంగా తెలియకుంటే శ్రేణీగత, వివక్షాపూరిత ‘వర్ణ లేదా కుల ధర్మం’ వారి పవిత్రమైన గ్రంథాల్లో భాగంగా ఉన్నాయా లేవా అనే విషయంపై వివరణ ఇమ్మనమని వారు సాధువుల్ని, మత ప్రచారకులని, శంకరాచార్యుల్ని వేడుకోవచ్చు. అయితే, మోడీ ఈ పని చేస్తారని ఎలా ఆశించగలం? అలా అది అతని కపటత్వం బైట పడుతుంది కదా?
ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యల నుండి తలెత్తిన వివాదం హిందూత్వ దళం అసలు రంగును ప్రజల ముందు బయటపెట్టింది. మోడీ, ఆయన అనుచర గణం తాము 19వ శతాబ్దానికి చెందిన అభివృద్ధి నిరోధకులైన సనాతనవాదులకు నిజమైన వారసులుగా మన ముందు నిలబడ్డారు. ఆ కాలంలో బ్రహ్మ సమాజం, ఆర్య సమాజ్‌, ప్రార్థనా సమాజ్‌, రామకృష్ణ మిషన్‌ వంటి సంస్థలు హిందూ మతానికి అనేక సంస్కరణలు ప్రతిపాదించాయి. ఆ సంస్కరణలను వ్యతిరేకిస్తూ పలు ఛాందసవాద, సాంప్రదాయ హిందూ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఆ సంస్థల నాయకులే, ‘సనాతన ధర్మానికి’ ప్రాచుర్యం కల్పించారు. ‘హిందూ’ అనే పదం పర్షియన్‌ మూలాలు కలిగి ఉన్నందువల్ల ఈ ‘సనాతన వాద’ సేవా తత్పరులు ‘హిందూ’ పదాన్ని ఇష్టపడక, దానికి బదులుగా ‘సనాతన ధర్మం’ అనే పదానికి ప్రాధాన్యత ఇవ్వడం ఆసక్తికరమైన విషయం.
దళిత గౌరవానికి ప్రతీకగా ఉన్న అంబేద్కర్‌ యొక్క సమానత్వ, ఆత్మగౌరవ దార్శనికతను నెరవేర్చడానికి తాను కృషి చేస్తున్నట్టు మోడీ చెప్పుకునేదంతా ఒట్టి నటనేనని గత దశాబ్దపు మోడీ పాలనా కాలపు అనుభవం స్పష్టం చేస్తోంది. నిజానికి మన దేశంలో పీడితులు, దోపిడీకి గురైన ప్రజలు పోరాటాల ద్వారా సాధించుకున్న కొన్ని అధికారిక హక్కులు, కొద్దిపాటి గౌరవాన్ని అతని పాలన ఒక క్రమపద్ధతిలో ధ్వంసం చేసింది. పెరిగిపోతున్న నేరాల రేటు, కుంచించుకుపోతున్న ఉద్యోగావకాశాలు, పెరిగిపోతున్న ఆర్థిక వివక్షత, దిగజారుతున్న దళితుల, గిరిజనుల జీవన స్థితిగతులు చూస్తే మనకు ఈ సంగతి స్పష్టంగా కనిపిస్తుంది.
మోడీ హిందూత్వ, కార్పోరేట్‌ పాలనలో దళితులపై, గిరిజనులపై సాగుతున్న అత్యాచారాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇది, సమాజం మొత్తంగా మనువాద భావజాల ప్రభావంలో చిక్కుకుపోయిన వైనాన్ని సూచిస్తుంది. 2018 నుండి గడిచిన నాలుగేళ్ల కాలంలో దళితులపై 1.9 లక్షలకు పైగా అత్యాచారాలు జరిగినట్టు కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌ ఈ ఆగడాలకు, దాడులకు (మొత్తం 49,613 కేసులతో) ప్రధాన కేంద్రంగా నిలిచింది. 2022వ సంవత్సరాన్ని 2021తో పోల్చితే షెడ్యూల్డ్‌ కులాల వారిపై 13 శాతం అత్యాచార కేసులు పెరగ్గా, షెడ్యూల్డ్‌ తెగలపై 14.3 శాతం పెరిగాయి. ఎస్సీలపై ఆత్యాచారాల కేసుల్లో ఉత్తరప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. అంటే మొత్తం కేసుల్లో 26 శాతం. రాజస్థాన్‌ 15 శాతం, మధ్యప్రదేశ్‌ 14 శాతంగా ఉంది. ఎస్టీలపై అత్యాచారాల కేసుల విషయం పరిశీలించినట్లయితే మొత్తం కేసుల్లో 30 శాతంతో మధ్యప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉండగా, 24 శాతంతో రాజస్థాన్‌, 7.6 శాతంతో ఒడిశా ఉన్నాయి.
అత్యాచారాల సంఖ్య పెరగడంతోపాటు, ఆ ఘటనలలోని క్రూరత్వం దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఏడుగురు దళిత యువకులను గుజరాత్‌ లోని ఉనాలో బహిరంగంగా కొట్టడం, ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఒక దళిత మహిళపై అత్యంత క్రూరంగా జరిపిన సామూహిక అత్యాచారం ఆమె మరణానికి దారితీయడం, మధ్యప్రదేశ్‌లో సోధీ ఘటనలో ఓ బిజెపి నాయకుడు ఓ గిరిజనుడిపై మూత్ర విసర్జన చేయడం లాంటి సంఘటనలు దేశం అంతరాత్మను కుదిపివేశాయి. సంఫ్‌ు పరివార్‌, హిందూత్వ శక్తుల అండతో బిజెపి ప్రభుత్వాలు సృష్టించిన మనువాద వాతావరణంలో దళితులకు, గిరిజనులకు వ్యతిరేకంగా ఇలాంటి హేయమైన నేరాలు పాల్పడడానికి కులతత్వ శక్తులెలా ప్రోత్సాహం ఇస్తున్నాయో ఈ భయంకరమైన చర్యలు తెలియజేస్తున్నాయి.
ఇవే శక్తులు, సమాజంలోని సామాజిక పీడిత వర్గాలకు సహాయ పడేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుంటూ తీసుకునే చర్యలను సైతం వ్యతిరేకించే శత్రుపూరిత వాతావరణాన్ని ఒక క్రమపద్ధతిలో పెంచి పోషిస్తున్నాయి. బిజెపి పాలనలో బలహీన వర్గాలకు లభించే కొద్దిపాటి ప్రయోజనాలను కాలరాసేందుకు ప్రభుత్వమే ఈ శక్తులతో లాలూచీ పడుతున్నది.
బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పనితీరు చాలా అన్యాయంగా ఉంది. 2022 మార్చి 24న పార్లమెంట్‌లో సమర్పించిన సమాచారం ప్రకారం తొమ్మిది మంత్రిత్వ శాఖలుారైల్వేలు, ఆర్థిక, ఆటమిక్‌ ఎనర్జీ, రక్షణ, గృహ నిర్మాణం, హోం శాఖలతోాసహా కేంద్ర ప్రభుత్వ శాఖలన్నింటిలో మొత్తం 82,022 ఖాళీలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వ్‌ చేయబడిన పోస్టులున్నాయి. కానీ వాటిలో కేవలం 42 శాతం పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. యూనివర్శిటీలు, ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది. ఎస్సీలకు రిజర్వ్‌ చేయబడిన 42 శాతం ఖాళీ పోస్టులు, ఎస్టీలకు రిజర్వ్‌ చేయబడిన 39 శాతం, ఓబీసీ లకు రిజర్వ్‌ చేయబడిన 54 శాతం ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయడంలో 45 సెంట్రల్‌ యూనివర్సిటీలు విఫలమయ్యాయి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఎస్సీలకు రిజర్వ్‌ చేయబడిన 80 శాతం ఖాళీ పోస్టులను ఇంత వరకు భర్తీ చేయకపోవడం ఆ సంస్థలో సామాజిక న్యాయం అత్యంత అధ్వాన్నమైన స్థితిలో వున్నదని తెలియజేస్తోంది.
మోడీ నాయకత్వంలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ సేవలు, ఉన్నత విద్య ప్రైవేటీకరించబడుతున్నాయి. దానికి తోడు ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్ల విధానమే లేదు. ఈ విధంగా ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో రాజ్యాంగ ఆదేశాలను పాటించకపోవడమేగాక ఆ ఆదేశాలనే నీరుగారుస్తోంది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి కేటాయింపుల గణనీయమైన తగ్గింపు, ఖర్చులలో కోతలు విధించడం ద్వారా వివక్షత కొనసాగింపులో మోడీ ప్రభుత్వమే ప్రత్యక్షంగా భాగస్వామి అయ్యింది. 2014-20 మధ్య జనాభా దామాషా ఆధారంగా జరిగిన మొత్తం కేటాయింపుల్లో కేవలం 20.8 శాతం మాత్రమే వారి సంక్షేమానికి ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ పత్రాలు తెలియజేస్తున్నాయి. అంటే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు న్యాయంగా చెల్లించాల్సిన 7.51 లక్షల కోట్ల రూపాయలను నిలిపివేశారన్నమాట. దీనితో పాటు 2017-18లో ఎస్సీ సబ్‌ప్లాన్‌, ఎస్టీ సబ్‌ప్లాన్లను రద్దు చేయడం ద్వారా మోడీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఉద్దేశించబడిన యంత్రాంగాన్ని ధ్వంసం చేసింది.
ఈ మార్పుల ఫలితంగా మోడీ రెండోసారి ప్రధాని పదవి చేపట్టిన 2019-2024 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వ, కేంద్ర రంగ ప్రాయోజిత పథకాల కేటాయింపుల మొత్తం నిధుల్లో ఎస్సీలకు కేవలం 10.6 శాతం మాత్రమే కేటాయించారు. కేటాయింపుల్లో కూడా కేవలం 3.3 శాతం మాత్రమే ఎస్సీల పథకాలకు మళ్ళించారు. మిగిలినవి సాధారణ పథకాలకు కేటాయించారు. ఎస్టీలకు ఉద్దేశించబడిన కేటాయింపుల్లో కూడా ఇదే వైఖరిని ప్రదర్శించారు. ఎస్టీలకు కేటాయించిన మొత్తం నిధుల్లో కేవలం 2.5 శాతం మాత్రమే లక్ష్య పథకాలకు కేటాయించారు. కేటాయించిన నిధుల్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగించలేదు.
స్వాతంత్య్రం సిద్ధించిన ఏడున్నర దశాబ్దాల తర్వాత కూడా సాధారణ దళితుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. 58 శాతం దళితులకు భూమి లేదు. మోడీ పరిపాలనలో ఆదివాసీలను, దళితులను పెద్ద సంఖ్యలో అభివృద్ధి పేరుతో వారి భూముల నుండి బలవంతంగా వెళ్ళగొడుతున్నారు. స్వంత భూములున్న 50 శాతం దళితులకు సాగునీటి సౌకర్యాలు లేవు. సాధారణ జనాభాలో 33.3 శాతం జనాభాతో పోల్చినప్పుడు 65.8 శాతం దళితులు, 81.4 శాతం గిరిజనులు బహు మితీయ (మల్టీ డైమెన్షనల్‌) పేదరికంలో జీవిస్తున్నారు, ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. ఎస్సీలలో అక్షరాస్యతా రేటు కేవలం 66 శాతంగానే ఉండగా, ఎస్టీల్లో అది 59 శాతం కన్నా తక్కువగా ఉంది, అంటే జాతీయ సగటు రేటు 73 శాతం కంటే కూడా తక్కువగా ఉంది. అంతే కాకుండా 2022 నాటికి ఎస్సీలలో నిరుద్యోగ రేటు 8.4 శాతంగా చాలా ఎక్కువగా ఉంది. ఎస్సీలలో అసంఘటిత రంగ కార్మికులు చాలా ఎక్కువగా 84 శాతంగా ఉన్నారు. ఈ గణాంకాలు మోడీ నాయకత్వంలోని మతతత్వ, కార్పోరేట్‌ ప్రభుత్వం యొక్క దళిత వ్యతిరేక, పేద ప్రజల వ్యతిరేక స్వభావాన్ని తెలియజేస్తుంది. మోడీ హిందూత్వ లేక ‘సనాతన ధర్మ’ భావజాలంలో సామాజిక న్యాయాన్ని వెతకడం అంటే ఎండమావిలో నీటిని వెతకడం లాంటిదే.

– బి.వి. రాఘవులు

/ వ్యాసకర్త సిపిఐఎం పొలిట్‌బ్యూరో సభ్యులు /

➡️