వైఫల్యాల మోడీ పదేళ్ళ పాలన

Feb 23,2024 07:13 #Editorial

మైనారిటీ మతస్థులపై ఆటవిక బుల్డోజర్‌ న్యాయాన్ని మోడీ, ఆయన శిష్య బృందం అమలు చేస్తున్నది. గో సంరక్షణ పేరుతో జరిగిన 66 హింసాత్మక సంఘటనల్లో 64 ముస్లింలను లక్ష్యంగా చేసుకుని జరిగాయి. ఇందులో 53 శాతం సంఘటనలు బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే జరిగాయి. దేవాలయాల పేరుతో మైనారిటీ మతస్థుల ప్రార్థనా మందిరాలపై దాడులు పెరిగాయి. అయోధ్యలో రామమందిర విగ్రహ ప్రతిష్ట, పార్లమెంట్‌ భవనం ప్రారంభం రాజుల కాలం నాటి ఆచారాలతో, మనుధర్మ భావజాలంతో జరిగాయి. ‘బేటీ బచావో’ అని చెప్పే ప్రధానమంత్రి ఏలుబడిలో లింగ వివక్ష తీవ్రంగా పాటిస్తున్న 156 దేశాల్లో మన దేశం 140వ స్థానం.అంటే మనకంటే కేవలం 16 దేశాలే కింద ఉన్నాయి.

రేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి దాదాపు పదేళ్ళు పూర్తవుతున్నాయి. మరోసారి తనకే అధికారమని, ప్రపంచమంతా మనవైపే చూస్తుందని ఆయన ప్రకటించు కుంటున్నారు. ఏ ప్రయోజనాల కోసం ఎవరు ఏం మాట్లాడినా ఈ పదేళ్ళల్లో జరిగింది, జరుగుతున్నది ఏమిటో విజ్ఞత వున్న ప్రతి ఒక్కరికీ అర్థమయింది. అత్యధికమంది ప్రజలు ఎదుర్కొంటున్న ఆకలి, నిరుద్యోగం, దారిద్య్రం, పన్నుల భారం, సామాజిక స్థితి గురించి వివిధ నివేదికలు వెలుగులోకి తెస్తూనే ఉన్నాయి. తాజాగా ‘ఫ్యాన్‌’ ఇండియా (ఫైనాన్షియల్‌ అకౌంటబులిటీ నెట్‌వర్క్‌ ఇండియా) బ్లాక్‌ పేపర్‌ పేరుతో నరేంద్ర మోడీ పాలనా వైఫల్యాలను విడుదల చేసింది.

అదుపులేని నిరుద్యోగం

                  మోడీ అధికారంలోకి వచ్చే ముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ లెక్కన ఈ పదేళ్ళలో దేశ యువతకు 20 కోట్ల ఉద్యోగాలు వచ్చి వుండాలి. అలాగే తయారీ రంగంలో పది కోట్ల మందికి ఉపాధి కలిపించి దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో ఈ రంగం వాటాను 17 శాతం నుండి 25 శాతానికి పెంచుతామన్నారు. ఉపాధి రంగంలో మహిళా కార్మికుల భాగస్వామ్యాన్ని పెంచి వారిని సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధిలోకి తెస్తామన్నారు. కాని జరిగింది ఏమిటీ? సిఎంఇ (సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకనామి) రిపోర్టు ప్రకారం గత ఐదు సంవత్సరాలుగా దేశ శ్రామికుల సంఖ్య 40 కోట్ల దగ్గరే నిలిచిపోయింది. 2012లో నిరుద్యోగుల సంఖ్య కోటి. 2018 నాటికి మూడు రెట్లు పెరిగి మూడు కోట్లకు, 2023 అక్టోబర్‌ నాటికి 4.20 కోట్లకు చేరింది. ఇండియా స్కిల్స్‌ రిపోర్టు ప్రకారం దేశంలోని నూతన గ్రాడ్యుయేట్లలో (25 సంవత్సరాలలోపు ఉన్నవారిలో) దాదాపు సగం మంది నిరుద్యోగులుగా వున్నారు.

తయారీ రంగంలో 2012లో 12.8 శాతం మంది ఉపాధి పొందుతుండగా 2018 నాటికి 11.5 శాతానికి పడిపోయి, మోడీ లెక్కల మ్యాజిక్‌ చేసినా ఇప్పటికీ 12.8 శాతాన్ని దాటలేకపోయింది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు 25 శాతానికి పెంచుతామన్న మోడీ హామీ ఒట్టిమాటేనని రుజువైంది. వ్యవసాయంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో 1983లో 61 శాతం మంది పురుషులు ఉపాధి పొందుతుండగా 2021 నాటికి అది 37 శాతానికి, మహిళలు 75.5 శాతం నుండి 59 శాతానికి పడిపోయింది. మరో విషాదం కోవిడ్‌ కాలం. 2020 ఏప్రిల్‌ నుండి 2023 జూన్‌ మధ్య ఆరు కోట్ల మంది వలస కార్మికులు తిరిగి గ్రామీణ ప్రాంతాలకు చేరారు. మొత్తంగా 46 శాతం మంది ఆధారపడిన వ్యవసాయరంగం దేశ స్థూల ఉత్పత్తికి అందిస్తున్న వాటా కేవలం 15 శాతం మాత్రమే, ఇది వ్యవసాయ సంక్షోభ తీవ్రతకు నిదర్శనం. మోడీ పాలనా కాలంలో నిర్మాణ రంగం, వ్యవసాయ రంగాల్లో 10.5 నుండి 12 శాతం వేతనాలు పెరగగా, నిత్యావసర సరుకుల ధరలు మాత్రం 2021 ఏప్రిల్‌ 2023 మార్చి మధ్య 22 శాతం పెరిగాయి. అంటే ఈ కాలంలో గతంలో పొందుతున్న వేతనాల్లో పది శాతం నిజవేతనాలు తగ్గాయి.

తీవ్ర సంక్షోభంలో వ్యవసాయం

             2016 ఫిబ్రవరి 28న ప్రధాని నరేంద్ర మోడీ బడ్జెట్‌పై పార్లమెంట్‌లో మాట్లాడుతూ 2022 నాటికి (అప్పటికి దేశ స్వాతంత్య్రానికి 75 సంవత్సరాలు పూర్తవుతుంది) ‘రైతుల ఆదాయాన్ని రెండింతలు’ (డబ్లింగ్‌ ఫార్మర్స్‌ ఇన్‌కమ్‌) చేస్తానన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారస్సుల కంటే మరింత మెరుగ్గా రైతులను ఆదుకుంటామన్నారు. ఆశోక్‌ ధాల్వారు కమిటీ వేశారు. 2016 నాటికి రైతులకు నెలకు అందుతున్న ఆదాయం రూ.8,058 నుండి 2022 నాటికి రూ. 22,610కు పెరిగేటట్లు ప్రతి సంవత్సరం రైతుల ఆదాయాన్ని 10.4 శాతం పెంచుతామని హామీ ఇచ్చారు. వివిధ కారణాలతో పంటలు నష్టపోతున్న రైతులను లాభదాయకమైన ఇన్సూరెన్స్‌ విధానం తెస్తామన్నారు. ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు.

వ్యవసాయ కుటుంబాల సర్వే వివరాలను 2021 తర్వాత మోడీ ప్రభుత్వం ప్రకటించడం మానేసింది. 2021 సర్వే నివేదిక ఆధారంగా రైతు కుటుంబాలకు నెలకు అందుతున్న ఆదాయం రూ.10,218 మాత్రమే. 2022 నాటికి రూ.22,610 ఆదాయం పెంచుతామన్న మాటేమిటి? మోడీ పాలించిన 2014-2022 మధ్య నేషనల్‌ క్రైమ్‌ రిపోర్టు ప్రకారం 1,00,474 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే గత తొమ్మిది సంవత్సరాల్లో ప్రతి రోజు 30 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. బిజెపి పాలనా కాలంలో పంటల పెట్టుబడి ఖర్చులు భారీగా పెరగడం, గిట్టుబాటు ధరలు అందకపోవడం, బ్యాంకుల రుణపరపతి పెద్ద ఎత్తున తగ్గిపోవడం ప్రధాన కారణాలు. రైతు వ్యవసాయాన్ని కార్పొరేట్‌ వ్యవసాయంగా మార్చాలన్నది బిజెపి లక్ష్యం. వ్యవసాయాన్ని కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా రైతులు పోరు బాట పట్టారు. అందులో భాగంగా ఢిల్లీ పరిసరాల్లో గతంలో, ఇప్పుడు రైతులు సమరశీలంగా ఉద్యమిస్తున్నారు. అన్నదాతలను పరాయి పాలకుల కంటే ఘోరంగా మోడీ పాలన అణచివేస్తున్నది.

ప్రజలపై భారాలు – సంపన్నులకు వరాలు

                విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని బయటకు తెచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తానని పదేళ్ళ క్రితం మోడీ దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. పన్నులు పెరగవని, మధ్యతరగతి వారి అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రాల్లో వసూలు అవుతున్న పన్నుల్లో 50 శాతం రాష్ట్రాలకు ఇవ్వాలని 2013 అక్టోబర్‌ నెలలో గుజరాత్‌లో జరిగిన 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ సమావేశంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోడీ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. జిఎస్‌టి విధానం వల్ల దేశవ్యాప్తంగా ఒకే పన్ను అమలై పన్నుల భారం పెరగదన్నారు.

అదానీ ప్రత్యేక విమానంలో మోడీ ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన వెంటనేే సంపదపై పన్నును రద్దు చేశారు. 2012-13 నాటికి 119 రకాల సరుకులపై పన్నుల విధానం వుండగా మోడీ పాలనా కాలంలో పన్నులు లేని సరుకులు చివరకు శ్మశానాల్లోని కట్టెలపై, చిన్న పిల్లలు వాడే పెన్సిళ్ల మీద కూడా పన్నుల భారం వేశారు. మరోవైపు సంపన్నుల కోసం 2014-15 కస్టమ్స్‌ డ్యూటీ పన్ను (విదేశాల నుండి దిగుమతి చేసుకునే సరుకులపై వేసే పన్ను) 15.1 శాతం నుండి 6 శాతానికి, కార్పొరేట్‌ పన్ను 34.5 శాతం నుండి 27.2 శాతానికి తగ్గించారు. మధ్యతరగతి ఉద్యోగులు, వ్యాపారులు చెల్లించే ఆదాయ పన్నును మాత్రం 20.8 శాతం నుండి 30.2 శాతానికి పెంచారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాలు ఇవ్వకుండా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా మోడీ పెత్తందారీ పాలన సాగిస్తున్నారు.

బడా సంపన్నులు బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు సకాలంలో చెల్లించకుండా ఎగవేసేదానికి ముద్దు పేరు ‘నిరర్థక ఆస్తులు’ (నాన్‌ పెర్ఫార్మింగ్‌ ఎసెట్స్‌). మోడీ పదేళ్ళ పాలనలో ఈ నిర్థరక ఆస్తుల విలువ రూ.54 లక్షల కోట్లకు పెరగడాన్ని బట్టి ఈ ప్రభుత్వానికి కార్పొరేట్‌ శక్తులతో ఎంత బలమైన సంబంధాలు ఉన్నాయో తెలుస్తుంది. దీనివల్ల జాతీయ ప్రభుత్వ బ్యాంకులను దివాళా తీయించి మూతవేయడం లేదా విలీనం లేదా ప్రైవేటీకరించడం జరిగింది. కార్పొరేట్‌ దిగ్గజాలకు 2014 నుండి 2023 వరకు అన్ని బ్యాంకులు కలిపి రూ. 15.23 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసాయి. ఉద్దేశ్యపూర్వకంగా 50 మంది సంపన్నులు రూ. 87 వేల కోట్ల సొమ్మును బ్యాంకులకు ఎగ్గొట్టారు.

ఈ మొత్తంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆధారపడిన కోట్ల మందికి రెండు సంవత్సరాలు పనులు కల్పించవచ్చు. 2018లో (రెండవసారి మోడీ అధికారంలోకి వచ్చేందుకు కొద్ది ముందుగా) విజరు మాల్య, నీరవ్‌ మోడీ లాంటి పదిమంది రూ.40 వేల కోట్ల దేశ సంపదను లూటీ చేసి విదేశాల్లో దర్జాగా జల్సా చేస్తున్నారు. నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఆరు లక్షల కోట్ల విలువైన ఆస్థులను అపర కుబేరులకు అతి చౌకగా మోడీ ప్రభుత్వం అప్పగించింది. ఉదా: 26,700 కి.మీటర్ల జాతీయ రహదారి (మొత్తం దేశంలోని జాతీయ రహదారుల్లో ఇది 22 శాతం)ని చౌకగా ప్రైవేటీకరిస్తున్నారు. ఈ నేషనల్‌ రోడ్డు వాస్తవ విలువ ఎనిమిది లక్షల కోట్లకు పైగా ఉండగా రూ.1.6 లక్షల కోట్ల అంచనాతో ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాలని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇదే పద్ధతుల్లో రైల్వేలో 25 శాతం, రోడ్లలో 27 శాతాన్ని ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. ఇప్పటికే బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసి లను దివాళా తీయించారు. ఈ విధానాలను దేశభక్తి చాటున అమలు చేస్తూ దేశభద్రతకు తీరని ప్రమాదాన్ని తెస్తున్నారు.

తీవ్రమవుతున్న సామాజిక వివక్ష

మైనారిటీ మతస్థులపై ఆటవిక బుల్డోజర్‌ న్యాయాన్ని మోడీ, ఆయన శిష్య బృందం అమలు చేస్తున్నది. గో సంరక్షణ పేరుతో జరిగిన 66 హింసాత్మక సంఘటనల్లో 64 ముస్లింలను లక్ష్యంగా చేసుకుని జరిగాయి. ఇందులో 53 శాతం సంఘటనలు బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే జరిగాయి. దేవాలయాల పేరుతో మైనారిటీ మతస్థుల ప్రార్థనా మందిరాలపై దాడులు పెరిగాయి. అయోధ్యలో రామమందిర విగ్రహ ప్రతిష్ట, పార్లమెంట్‌ భవనం ప్రారంభం రాజుల కాలం నాటి ఆచారాలతో, మనుధర్మ భావజాలంతో జరిగాయి. ‘బేటీ బచావో’ అని చెప్పే ప్రధానమంత్రి ఏలుబడిలో లింగ వివక్ష తీవ్రంగా పాటిస్తున్న 156 దేశాల్లో మన దేశం 140వ స్థానం. అంటే మనకంటే కేవలం 16 దేశాలే కింద ఉన్నాయి. భరతమాత జపం చేస్తున్న బిజెపి పాలనలో ప్రపంచంలో మహిళలపై జరుగుతున్న హింసలో మన దేశానిదే అగ్రస్థానం కావడం సిగ్గుచేటు. దళితులపై కుల వివక్ష దాడులు, హింస పెరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో 25.82, రాజస్థాన్‌లో 14.7, మధ్యప్రదేశ్‌లో 14.1 శాతం పెరిగాయి.అన్ని రంగాల్లో విఫలమైన మోడీ ప్రభుత్వం మరోసారి రావడమంటే…దేశం మరింతగా వెనక్కు వెళ్లడమే. వ్యక్తిగతమైన మత విశ్వాసాలను, మత ఘర్షణలవైపు మళ్ళిస్తున్న మోడీని గద్దె దించకుండా ప్రజల మధ్య ఐక్యతను కాపాడుకోలేం. లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతుంటే ఉపాధి, సామాజిక న్యాయం ఎలా అమలవుతుంది? వినాశకర బిజెపిని, అందుకు మద్దతు ఇస్తున్న పార్టీలను ఓడించడమే నిజమైన దేశభక్తుల నేటి కర్తవ్యం.

( వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు )వి. రాంభూపాల్‌
( వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు )వి. రాంభూపాల్‌
➡️